Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, మే 03, 2016

గిజిగాఁడు...






చం.
తగఁ జని తుమ్మకొమ్మలకొ తాళ కుజాలకొ యీఁత చెట్లకో
తగులఁగఁ జేసి గూండ్లు ఘనతం బ్రకటింపఁగ నేర్పు మీఱఁగన్
బగఁ గొని పాములో యితర వైరులొ దాడినిఁ జేయకుంటకై
గగనముఁ దాఁకునట్లు గిజిగాఁడు రచించుటఁ జూడఁ జిత్రమౌ!! 1


తే.గీ.
అద్భుతమ్ముగఁ గూఁడుఁ దా నాస్థఁ గట్టు
నేర్పుఁ జూడంగఁ జిత్రమౌ నిర్మిత! మది
తరుల శాఖల వ్రేలెడి తాజమహలొ?
గగనసీమను విహరించు గౌరగృహమొ?? 2


ఆ.వె.
సాక్ష్య మిచ్చు నెట్టి సాంకేతిక జ్ఞాన
మో యదంచు జనులు మోహమంద!
నందమైన యట్టి యానంద నిలయమ్ము
కాదె చూడ నదియు కాంక్ష మీఱ? 3


తే.గీ.
అదియ గూఁటి నల్లెడి తీరు; లందముగనుఁ
బిల్లలకుఁ దిండి నోఁటనుఁ బెట్టు విధము;
శత్రుతతుల నెదుర్కొను సరణి; దాని
యాటపాటల వైఖరి యచ్చెరు విడు! 4

తే.గీ.
గూండ్లఁ జిన్ని పిట్టలు తమ గోల లెగయ;
భూనభోఽంతరాందోళికా భోగ సహిత
సూక్ష్మ గేహాంతర స్థిత శోభ వెలయ
నూఁగులాడుచుండును తూఁగుటూయలట్లు! 5


శా.
ఏదేనొక్క పృదాకు వేఁగఁ గని తా మెంతెంతయో నార్చుచున్
బో దాఁకన్ ఘనమైన రీతిగను శబ్దోచ్చారణమ్ముల్ దగన్
నాదౌద్ధత్యముఁ జూపి తత్తఱలఁ బెంచంగానె యా సర్పమున్
నాదారెద్దియటంచుఁ బర్వులిడు నా నైపుణ్యముం గాంచితే? 6

ఆ.వె.
శిరసు పైన స్వర్ణ శీర్షకమ్మున్నట్లు
పసుపు వన్నె మిగుల బంగరువయి,
చిబుక చూచుకములు చిక్కనౌ నలుపయి,
నీలి గోధుమ బరి నెఱక లొలయు! 7


తే.గీ.
బిడ్డలకుఁ దిండిఁ బెట్టెడి పెద్దఱికమె
యింతులకు బాధ్యతగఁ దగ నిడియు; గూఁడు
నేర్పుగాఁ గట్టు బాధ్యత నెలమి మగఁడు
కొనియు మెలఁగు చుండును భార్య మనము నెఱిఁగి! 8

ఆ.వె.
వరియు గడ్డి యాకు వంటి పీచునుఁ గొని
నేసి కొంత, యదియె నెచ్చెలువకుఁ
జూపి, ముదము గొనఁగనే, పూర్తిగాఁ దాను
నేయు; లేదొ, పర కులాయ మల్లు! 9


కం.
గేహముఁ బూర్తిగ నేసియు
గేహినిఁ బిలువంగ మివులఁ గేరింతలతో
స్నేహము నెఱపుచుఁ దిరుగుచు
మోహపరవశ యయి చేరు మురిపెమునఁ జెలున్! 10


ఉ.
నేలకు నింగికిన్ సరిగ నేస్తము లల్లిన గూఁటి వన్నియల్;
మాలిమి తోడ వర్తిలెడి మంజుమనోహర నాట్యరీతి; రా
గాలసమైన పాట; కవులాదరమున్ వెలిఁబుచ్చుచుండఁ దాఁ
గాలముఁ బుచ్చుచుండు గిజిగాఁ డట హాయినిఁ జిల్కరించుచున్! 11




-:శుభం భూయాత్:-


ఆదివారం, మే 01, 2016

పరమపద సోపాన పటము...





కం.
నిముసమునఁ బాము దిను, మఱు
నిముసము నిచ్చెనల నెక్కు నిక్కపుఁ గ్రీడన్,
శ్రమపడి యాడుచు నుండఁ, బ
రమపద సోపాన పటము  రాగిలుచుండున్! (1)


కం.
సుమతులకు నాట యందున
సమమగు నిశ్శ్రేణితతులు,  సర్ప కబళముల్!
కుమతులనుఁ బాము మ్రింగును;
గమనింపఁగ నిచ్చెనలు 'న'కారమ్మె యగున్! (2)


తే.గీ.
హితుల 'వైకుంఠ పాళి' సహిష్ణుతఁ గని,
యాడ, వైకుంఠుఁ డెప్పుడు  నైక్య మంద
నీయఁ, డెంతయును ఘన పరీక్ష సేసి,
పిదప నెగ్గించి, తన దరిన్  వేగఁ జేర్చు! (3)


ఆ.వె.
పిల్ల లాడు నాట,  పెద్ద లాడెడి యాట,
నిచ్చెనలును పాము  లిచ్చి పుచ్చు!
వారి వారి కర్మ  పరిపాకమునుఁ బట్టి
ముందు వెనుకలుగను  మోక్ష మొదవు!! (4)



-:శుభం భూయాత్:-


గురువారం, ఏప్రిల్ 28, 2016

దైవాన్వేషణం...



[నా చిన్నతనంలో నేను దేవుణ్ణి చూపించమంటూ మారాం చేస్తుంటే... నాన్న నన్ను తన భుజంపై కెక్కించుకొని ఆకాశంలోకి చూపించాడు. నేను దేనినో చూచి దేవుడని భ్రమించి అప్పటికి మారాం ఆపాను. కాని, ఆ దేవుని భుజాలపైననే నేనున్నానని ఆనాడు తెలుసుకోలేకపోయాను. తెలుసుకొనేసరికి ఆ దేవుడే నాకు దూరమయ్యాడు]

కం.
"దేవుండెచ్చట నుండెను?
దేవునిఁ జూపింపు" మనఁగ, దివముం జూపన్;
దేవునిఁ గన భుజమెక్కియు
దేవుండగు నా జనకుని  దిగువఁ గననహో!

ఇదియే భావము తేటగీతిలో...

తే.గీ.
దేవుఁ డెక్కడ నుండెనో  తెలియఁ జెప్పు
మనఁగ నా తండ్రి దివిఁ జూపె;  నపుడు చూడ,
నాదు తండ్రి భుజ మ్మెక్కినట్టి నేను
తండ్రియే దేవుఁడని నాఁడు  తలఁచనైతి!



-:శుభం భూయాత్:-


మంగళవారం, ఏప్రిల్ 26, 2016

సమస్య:- యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్

శుభోదయం మిత్రులారా!

25-04-2016 నాఁడు "శంకరాభరణం" లో ఈయబడిన...

సమస్య:-
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్


దీనికి నా పూరణములు....


నా మొదటి పూరణము:

చెమటలు గ్రక్కుచు వేఁడిమి
నమితముగా నుక్కపోయ
నడలి జలము కో
సము గగనమున జలద నిచ
యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్! 1


నా రెండవ పూరణము:

సముచిత పాత్రా సుపరిచ
యము సేయఁగఁ దొడఁగినట్టి 
 దౌ నటి వేదిన్
బ్రముదిత యయి యిడు నంకా
స్యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్! 2


ఈ పూరణమే చిన్న సవరణలతో...
సముచిత పాత్రాదుల నిల
యము సేయఁగఁ దొడఁగినట్టి  యా నటియు నటున్
బ్రముఖాంకాస్యాఖ్య పరిచ
యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్!


నా మూఁడవ పూరణము:

రమణీయ దృశ్య వర్ణిత
సముచిత పాత్రానుగుణ్య  సత్కథను ప్రకా
శమిడు సుగుణైక యుత కా
వ్యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్! 3

ఈ పూరణమే చిన్న సవరణలతో...

రమణీయ దృశ్య వర్ణిత
సముచిత పాత్రానుగుణ్య  సత్కథను ప్రకా
శమిడెడి సన్మధుర కవీ
యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్!


నా నాలుఁగవ పూరణము:

అమృతమును జిందు భావన
మమృతాక్షర మౌక్తిక నిభమౌ పదయుతమై
సుమశోభిత దీపిత ప
ద్యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్! 4


ఈ పూరణమే చిన్న సవరణలతో...


అమృతమును జిందు భావన
మమృతాక్షర మౌక్తిక నిభమౌ పదవాక్యో
ద్యమ శోభిత కావ్య శ్రే
యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్!


నా యైదవ పూరణము:

భ్రమలఁ గలిగించు సంసా
ర మను భుజగ దంష్ట్రులకును  భ్రమ డుల్పను శ
క్యమగు తిరుమలేశుని గ
ద్యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్! 5


ఈ పూరణమే చిన్న సవరణలతో...
భ్రమలఁ గలిగించు సంసా
ర మను భుజగ దంష్ట్రులకును  భ్రమ డుల్పను శ
క్యము తిరుమల విభు పద తో
యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్!


నా యాఱవ పూరణము:

గమకిత మనోజ్ఞ సంగీ
తముచే నలరారఁ జేయు  తత్రత్యుల వే
దము గోపాలుని దౌ గే
యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్! 6



-శుభం భూయాత్-



సోమవారం, ఏప్రిల్ 25, 2016

పద్య పరివర్తనము: చేతులారంగ శివుని....పద్యం...ఉత్పలమాలలో...



దత్త పద్యము:

చేతులారంగ శివునిఁ బూజింపఁడేని
నోరునొవ్వంగ హరికీర్తి  నుడువఁడేని
దయయు సత్యంబు లోనుగాఁ  దలఁపడేని
గలుగనేటికిఁ దల్లుల  కడుపుచేటు!

[పై పద్యభావము నుత్పలమాలా వృత్తమందు]

పరివర్తనము:

ఉ.
పూనియుఁ జేతులారఁగ శివుం దగఁ బూజలు సేయఁడేని; వా
గ్లీనత నోరు నొవ్వ హరి  కీర్తి వచింపక యుండునేని; వి
శ్వాన నరుండు తా దయయు  సత్యము లోనఁ దలంపఁడేని; నా
హీనుఁడు తల్లికిం గలుగ  నేటికిఁ? దల్లుల కడ్పు చేటగున్!

-:శుభం భూయాత్:-


ఆదివారం, ఏప్రిల్ 24, 2016

దత్తపది: ఆవు-మేక-కుక్క-పిల్లి...కురుసభలో ద్రౌపది...తేటగీతిలో...


కురుసభలో ద్రౌపది



దత్తపది:-
ఆవు-మేక-కుక్క-పిల్లి...పదముల నుపయోగించి భారతార్థమునం జెప్పిన తేటగీతి పద్యము...



తే.గీ.
ఆవురుమని ద్రోవది కృష్ణు నపుడు పిలువ;
శీఘ్రమే కన్నఁ డత్తఱిఁ  జీర లిచ్చె!
కౌరవుల కుక్కడంపఁగ  గాడ్పుపట్టి
"ప్రతిన" ఱంపిల్లినది యా సభాంతరమున!!



-:శుభం భూయాత్:-



శనివారం, ఏప్రిల్ 23, 2016

నిండు మనమ్ము....!


ఉ.
“నిండుమనంబు నవ్యనవనీతసమానము పల్కు దారుణా
ఖండలశస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్క మీ
రెండును రాజులందు విపరీతము గావున విప్రుఁ డోపు నో
పం డతిశాంతుఁ డయ్యు నరపాలుఁడు శాపము గ్రమ్మఱింపఁగన్”

>>>నన్నయ గారి పై పద్యము యొక్క భావమే...
.......నేను రచించిన తేటగీతిలో...

తే.గీ.
భూసురుని యెద మిసిమియౌ! బాస కఱకు!
కాన, శాప మిడియుఁ ద్రిప్పఁ  గలఁ డతండు!
భూవరున కిది విపరీతము నగుఁ గాన,
శాప మిడియునుఁ ద్రిప్పంగఁ  జాలఁ డితఁడు!!

-:శుభం భూయాత్:-


శుక్రవారం, ఏప్రిల్ 22, 2016

క్షీరసాగర మథన వృత్తాంతము




ఆ.వె.
దేవ దానవులును ♦ దీవ్రమౌ యుద్ధాన
మరణ మందుచుండ; ♦ మాధవునకు
విన్నవించఁగాను ♦ విష్ణుండు "క్షీర సా
గర మథనము సేయఁ♦గా వలె" ననె! (1)

తే.గీ.
పాల సంద్రాన మంథర ♦ పర్వత మిడి,
వాసుకినిఁ గవ్వమునుగ దే♦వతలు దాన
వులుఁ జిలుకఁగఁ బూన; మునిఁగి♦పోవ నదియుఁ;
గలఁతఁ జెంది, హరినిఁ జేరి, ♦ తెలుపఁ గాను; (2)

కం.
చిఱు నగవున విష్ణు వపుడు
కరుణను దాఁబేటి మేటి♦గా మాఱియు, మం
ధరమును వీపున మోయఁగఁ;
దరచిరి యా పాలకడలిఁ ♦ ద్వరితోత్సుకతన్! (3)

తే.గీ.
కలశ పాధోధిఁ ద్రచ్చఁగఁ ♦ దొలుతఁ బుట్టె
హాలహల; మది దహియింప; ♦ నందఱు హరు
శరణ మర్థించి; రప్పుడు ♦ శంకరుండు
గరళముం ద్రాగి, యంత శ్రీ♦కంఠుఁ డయ్యె! (4)

తే.గీ.(పంచపాది)
ముదముతో వారుఁ ద్రచ్చంగ ♦ మొదట కామ
ధేను వుదయించఁగ వశిష్ఠుఁ ♦ డెలమిఁ గొనియెఁ;
ద్రచ్చ నుచ్చైశ్శ్ర వైరావ♦తములు, కల్ప
వృక్ష మప్సరసల నింద్రుఁ ♦ డా క్షణమ్మె
కొనఁగ; లక్ష్మిఁ గౌస్తుభమునుఁ ♦ గొనియె హరియు! (5)

కం.
చివరకు సురాసురులు వెను
దవులఁగఁ గోరిన యమృతము ♦ ధన్వంతరియే
ధవళ రుచులుఁ బ్రసరించఁగ
నవు మోమున విష్ణు మ్రోల ♦ నప్పుడ యుంచెన్! (6)

ఆ.వె.
దేవ దానవులును ♦ దీవ్రమౌ తమితోడ
"మాకు మాక"టంచు ♦ మత్సరించి,
వాదు లాడుచుండ ♦ వైకుంఠుఁ డప్పుడు
మోహినిగను మాఱి ♦ ముందు నిలిచె! (7)

తే.గీ.
వారి కప్పుడు మోహిని ♦ పలికె నిట్లు,
"వినుఁడు! నే నీ యమృతమునుఁ ♦ బ్రేమ మీఱ
మీకు నందఱకును వంచి, ♦ మిమ్ము నమరు
లనుగఁ జేసెద! నాసీను ♦ లగుఁడు నిచట!" (8)

కం.
ఇది విన్న దేవ దానవు
"లదియే వర"మనుచు నటులె ♦ నటఁ గూర్చుండన్;
సుదతి యమృతము సురల కిడె;
నిది రాహువుఁ గేతువునుఁ గ♦నిరి సురల కిడన్! (9)

ఆ.వె.
కనియు సురల చివరఁ ♦ జని, వారు కూర్చుండ;
మోహినియును వంపె ♦ మోద మలర!
సూర్య చంద్రు లిదియు ♦ సూచించ నా చక్రి,
గొంతు దిగక మునుపె, ♦ గొంతుఁ ద్రెంచె! (10)

ఆ.వె.
కంఠమం దమృతము ♦ గల రాహు కేతుల
తలలు బ్రతికె! మొండె ♦ మిలనుఁ జచ్చె!
గ్రహణమందుచుంద్రు ♦ రాహు కేతువు లెప్డు
శశిని, రవినిఁ! గాని, ♦ వశులు కారు! (11)

తే.గీ.
ఇటుల దేవత లమరులై ♦ హితము నెంచి,
రాక్షసులతోడ యుద్ధమ్ము ♦ ప్రబలముగనుఁ
జేసి, దనుజుల నిర్జించి, ♦ జేత లైరి;
క్షీర సాగర మథనమ్ము ♦ క్షేమ మిడఁగ!! (12)



(ఇది క్షీరసాగరమథన వృత్తాంతము)

-:శుభం భూయాత్:-


గురువారం, ఏప్రిల్ 21, 2016

హనుమద్విజయము!



చంపకమాలిక:
జలధిని దాఁటి, యా సురసఁ  జప్పునఁ దాఁ దెగటార్చి, లంకిణిన్
బొలియిడి, లంకఁ జొచ్చి, భువిపుత్రినిఁ గాంచియు, నుంగ్ర మా సుకో
మలి కిడి, వృక్షవాటికను  మాపి, దశాస్యసుతద్వయమ్ముఁ ద్రె
క్కలిగొని, బమ్మయమ్ము తనుఁ  గట్టఁగ బంధితుఁడయ్యు, రావణున్
గలిసి, రఘూత్తమున్ బొగడి,  కాల్చియు లంకనుఁ, జేరి రామునిన్,
నెలతుక వర్తమానమిడి,  నెయ్యపుఁ గాన్కను ముట్టఁజెప్పి, ధీ
బలుఁడగు రామమూర్తికిఁ గృపాళునకుం గలిగించి తృప్తినిన్,
వలచె మహత్త్వమా యెడను  వాయుసుతుం డట రామబంటుగన్!

*శుభంభూయాత్*

బుధవారం, ఏప్రిల్ 20, 2016

మద్విరచిత హరి శతకము

నేను అయుత కవితా యజ్ఞమునఁ బ్రకటించిన 
హరి శతకము


ఓం నమో భగవతే వాసుదేవాయ



శ్రీకైవల్య పదముఁ గొన
నీకయి విరచించి నాదు ♦ నేరుపు మీఱన్
శ్రీకర శుభకర గురు కరు
ణాకర వర కంద శతము ♦ నర్పింతు హరీ! (01)


శ్రీలక్ష్మీశా! వినుమయ!
నీ లీలలు కనఁగ వినఁగ ♦ నెద పొంగునయా!
నాలోని మోహ మార్చియు;
నీలో ననుఁ గలుపుకొనియు ♦ నెమ్మి నిడు హరీ! (02)


నిరతము నీధ్యానమ్మే;
సరగున ననుఁ బ్రోచి, నేను ♦ సంబరపడఁగన్,
విరివిగ జ్ఞానము నీయుము!
హరియించుము మనములోని ♦ యజ్ఞతను హరీ! (03)


నిను ధ్యానించెడు పట్టునఁ
బెను యోచన లెపుడు ముసర, ♦ వెఱచు మనమునున్
గనియునుఁ, జిత్త స్థైర్య
మ్మునుఁ బెంచుము, దేవదేవ! ♦ ముదమునను హరీ! (04)


పూజలు సేయఁగ, పలువిధ
పూజాద్రవ్యమ్ములేవి ♦ పొనరించియు నే
నీఁ జాలనయ్య! మనమను
పూజాకుసుమమ్ముఁ గొనుము! ♦ పురుషవర! హరీ! (05)


దేవాధిదేవ! నిన్నును
నా వాఁడ వటంచు నమ్మి, ♦ నా మనమున నిన్
భావించి కొలుతునయ్యా!
దీవన లీయంగ రమ్ము! ♦ ద్విజశకట! హరీ! (06)


స్తోత్ర మ్మిడ మంత్రము లే
మాత్ర మ్మే నెఱుఁగనయ్య ♦ మాధవ! కరుణన్
బాత్రత నెఱిఁగియు, నన్నున్
బుత్రునిగా నెంచి, వేగఁ ♦ బ్రోవుమయ హరీ! (07)


సన్మాన్యము లే మిడుదునొ,
చిన్మూర్తీ! యెఱుఁగు దీవు ♦ సేవింపఁగ నిన్!
మన్మనమున నిలుపుకొనుటె
సన్మాన్యము కాదె! యీశ! ♦ చక్రధర! హరీ! (08)


చేతను గవ్వయు లేదయ!
చూత మనఁ, బవిత్ర ధనము ♦ చోద్యమ్మె, భువిన్
జూతుమె? పవిత్రమగు నా
చేతమ్మునుఁ గొనుము వేగ ♦ శ్రీనాథ హరీ! (09)


కుల గోత్ర వంశ ఘనతనుఁ
దెలుపఁగ నున్నతుఁడఁ గాను! ♦ దీనుఁడ నయ్యా!
విలువలఁ జూడఁగ నెందునఁ
గలవో నీ వెఱుఁగ లేవె? ♦ కమలాక్ష హరీ! (10)


చదువుల సారము నెఱుఁగను
గదయా! వేదమున నిన్నుఁ ♦ గను మంత్రములన్
జదువఁగ లేనయ! సార
మ్మిదె కొనుమయ నా పలుకుల ♦ నెంచుచును హరీ! (11)


నీ లీల లద్భుతమ్ములు!
బాలుఁడ నీ ముందు నేను! ♦ వరదుఁడ వీవే!
లీలా మానుష విగ్రహ!
నాలోఁ గల వెతల డుల్చి ♦ ననుఁ గావు హరీ! (12)


కరి మొఱ విని కాచితివఁట,
"పరమేశా! కావు" మంచుఁ ♦ బ్రార్థింపంగన్;
పరిపరి విధముల నుతు లిడఁ,
గరివరదా! వేగ నన్నుఁ ♦ గావు మయ హరీ! (13)


ఓపిక నే పుణ్యములను
గోపిక లటఁ జేసినారొ? ♦ గొబ్బున వారిన్
దాపముఁ దీరిచి యెదలో
దీపించుచు నర్తనములఁ ♦ దేల్చితివి హరీ! (14)


మాయలఁ దెలియని బేలయు
నా యమ్మ యశోద కట్టె ♦ నా ఱోట నినున్!
మాయలఁ దెలియని నా మది
నో యయ బంధితుఁడ వగుమ! ♦ యురగశయ! హరీ! (15)


యుక్తియె లేదయ; నినుఁ గన
శక్తియు లేదయ్య; చేరఁ ♦ జాలను రక్తిన్;
భక్తసులభ నినుఁ గొలిచెద
భక్తిని! ముక్తి నిడు మయ్య ♦ పరమేశ! హరీ! (16)


దైత్యాంతక! నిను నే సా
హిత్యాత్మక పద్యము లిడి ♦ హితమతిఁ గొలువన్;
సత్యాత్మ నిడియుఁ బ్రోచుచు
నిత్యము మద్దురిత కృతుల ♦ నిర్జించు హరీ! (17)


లోకమ్మునఁ బాపమ్ములు
చేకొని యొనరించుచుండ్రి ♦ శిక్షాభయమున్
లేకయె! వారల మనమున
నే కపటము దొరలకుండ ♦ నియమించు హరీ! (18)


కడలినిఁ గడఁచి, సురస మద
మడఁచియు, లంకిణినిఁ గూల్చి, ♦ మైథిలిఁ గనియున్
దొడ విడి, లంకనుఁ గాలిచి
యడరిన హనుమయ్య భక్తి ♦ నందించు హరీ! (19)


బాలునిఁ గని దయ లేకయె
కాలుండయె కనక కశిప ♦ కల్మాషుఁడు తాన్!
బాలునిఁ గాఁచెడి నృహరివె!
యేలయ ననుఁ గావ రావు ♦ హిత మిడియు హరీ! (20)


కమలేక్షణ! హృదయేశ్వరి
కమలను హృత్కమలమందు ♦ కాంక్ష నిడియు నీ
విమలాత్మనుఁ బ్రకటించితి!
రమేశ! నా హృదయమందు ♦ రంజిలుము హరీ! (21)


నినుఁ దలఁచిన శ్రమ తొలఁగును;
నినుఁ దలఁచిన పనులు జరుగు; ♦ నిధులును గలుగున్;
నినుఁ దలఁప ముదము; కావున,
నినుఁ దలఁచెడు మనము నిమ్ము ♦ నిత్యమును హరీ! (22)


రవి చంద్రులు నేత్రములై
యవిరళముగ వెలుఁగఁ జేయు♦నయ లోకములన్!
కవిలోక వంద్య! నా మది
నవిరళముగ వెలుఁగఁ జేయు♦మయ వరద! హరీ! (23)


గురు పదముల ధ్యానించినఁ
దొలఁగును నజ్ఞాన తిమిర ♦ దోషమ్ము వెసన్!
గురువులకే గురుఁడవయా!
సరగున జ్ఞానమ్ము నిమ్ము ♦ సత్కృపను హరీ! (24)


సురలనుఁ గాఁచి, యసురులనుఁ
బరిమార్చియు, వేగ లోక ♦ పరితోష మిడన్
బరికీర్తితుండ వీవే!
సురేశ వాణీశ వంద్య! ♦ శుభకారి హరీ! (25)


బల ముడిగి నృపులుఁ గన, హరు
విలు విఱిచియు, జనక సుతనుఁ ♦ బెండ్లాడ, వెసన్
బలవంతుఁడవని లోకము
పలుమఱుఁ బొగడెఁ గద! నాకు ♦ బలమీవె హరీ! (26)


వశ ముడిగి నిన్నుఁ దెగడిన
శిశుపాలుని దోష శతము ♦ సీమను దాఁటన్
భృశమే ఖండించితివయ
శిశుపాలుని శిరము! చక్రి! ♦ చిద్రూప! హరీ! (27)


పాపి దశాస్యుఁడు సీతను
పాపముఁ దలఁపక హరించి ♦ బంధించఁగ నా
పాపినిఁ ద్రుంచితి! లోకులఁ
బాపాత్ముల వశము నుండి ♦ పాలింపు హరీ! (28)


ధనమున్నవారలందఱు
ధనగర్వముచేత రేఁగి, ♦ ధనహీనులనున్
"దీనులు, హీను" లనుచు నవ
మాన మిడఁగ, వేగ వారి ♦ మద ముడుపు హరీ! (29)


నీ పాద ధూళి చేతనె
శాపావధిఁ గనె నహల్య! ♦ సరి యా పదముల్
కాపాడఁ గడిగె గుహుఁ! డా
నీ పదముఁ గడిగెద నేత్ర ♦ నీరమిడి హరీ! (30)


వచ్చితి వ్రేపల్లెకు; నటఁ
జొచ్చితి గోపకుల యింటఁ ♦ జుఱ్ఱఁగఁ బాలన్;
గ్రుచ్చితి దనుజుల నెల్లను;
మెచ్చితి పదునారు వేల ♦ మెలఁతుకల హరీ! (31)


శ్రుతులం గాఁచితి; గిరి మో
సితి; కనకాక్షుని కనక క♦శిపు నొంచి; బలిన్
క్షితి నడఁచి; నృపుల వంచి; ప
దితలల దొరఁ ద్రుంచి; గీతఁ ♦ దెల్పితివి హరీ! (32)


శూలి ధను ర్భేదక! వన
పాల దనుజ నాశక! నయ♦బాహ్య దశాస్యో
న్మూలక! సవిధ స్థిత భూ
పాలక! కృత రామరాజ్య! ♦ పద్మాక్ష! హరీ! (33)


పుట్టితివి దేవకికి; మఱి,
మెట్టితివి యశోద యింట ♦ మేలుం గూర్పన్;
గొట్టితివి రక్కసుల నిల;
మొట్టితివయ ఖలునిఁ గంసు ♦ మోదమున హరీ!(34)


తాపసులనుఁ దాపసివయి;
భూపతులను నృపుఁడవయి; ఋ♦భువుల ఋభుఁడవై;
గోపాలక! భూగోవును
నేపారఁగఁ గాఁచి తీవు! ♦ హేమాంగ! హరీ! (35)


దేవముని నారదుం డొక
దేవ విరిని నిడఁగ, నీవు ♦ దేవేరి కిడన్,
దేవా! సత్యయె యలుఁగన్,
దేవేంద్రు గెలిచి, కుజమునె ♦ తెచ్చితివి హరీ! (36)


సుర లసురు లమృతమునకయి
ధరాధరము పాలకడలిఁ ♦ ద్రచ్చఁగ మునుఁగన్
ద్వర కూర్మమవై నీవటఁ
గరుణను మంధరము మోసి, ♦ గతి నిడితి హరీ! (37)


భువి నసురుం డడవికిఁ జని,
భవునిఁ గూర్చి తపము సేసి, ♦ భస్మాసురుఁడై,
శివునే పరీక్ష సేయఁగ,
నువు మోహినివయ్యు వాని ♦ నొంచితివి హరీ! (38)


అమృతము సురాసురులు గొని,
తముఁ దామే పోరుచుండఁ, ♦ దగ మోహినివై
యమృతముఁ బంచితి సురలకు!
విమతుల మృతి కెఱఁగఁ జేయ ♦ వినయాన హరీ! (39)


నిరతము నిన్నును నందఱు
"సరసిజనయనా! ముకుంద! ♦ సర్వేశ! యతీ!
స్మరగురు! మధుసూదన! జిన!
మురహర!" యనుచును స్మరింత్రు ♦ మోక్ష మిడ హరీ! (40)


"వినఁ డితఁ" డని మాత యపుడు
నినుఁ ఱోటికిఁ గట్టివేయ, ♦ నీడ్చుచు, మద్దుల్
గని, నడుమన నునిచి, తిగువ
ను, ననిమిషులు శాపము విడ, ♦ నుతు లిడిరి హరీ! (41)


ఎంగిలి పండ్లను నీకిడి
వంగిన మనమునను నిన్ను ♦ భక్తి నుతింపన్
బొంగియుఁ గాఁచితి శబరిని
హంగుగ మోక్షమ్ము నిడియు ♦ యజ్ఞేశ హరీ! (42)


పిడికెడు నటుకుల రుచిఁ గొని,
యిడియును నైశ్వర్యములను; ♦ హితునిఁ గుచేలున్
విడిపోని బంధమునఁ బ్రే
ముడిచే సేవల నొనర్చి ♦ మురిసితివి హరీ! (43)


భువనేశ! దైత్యనాశా!
భవ నాశక! పద్మనాభ! వరద! పరేశా!
స్తవనీయ! హృషీకేశా!
త్రివిక్రమా! శ్రీశ! నాకు ♦ దిక్కీవె హరీ! (44)


అరమరిక లేలనయ్యా
కరుణాకర! నన్నుఁ గావ? ♦ కైమోడ్చితి; నా
పరదైవ మీవె యంటిని;
పరమాత్మా! వేగ రమ్ము ♦ వరమిడఁగ హరీ! (45)


త్రికరణ శుద్ధిగ నీ గుణ
నికర పదచ్ఛాయలోన ♦ నివసించినచో
నకళంక జీవనస్థితి
సుకరమ్మై చేరు సకల ♦ శుభములును హరీ! (46)


ఒకఁడుండు లేమిఁ గుములుచు;
నొకఁడుండును కలిమియందు ♦ నొందుచు సుఖముల్;
సుకరముగఁ దెలియ నీ స్థితి
ప్రకటితమగుఁ బూర్వజన్మ ♦ వాసనల హరీ! (47)


నీ లీలఁ దెలియలేకయె
కూలి వెతల; జతనములనుఁ ♦ గొనమయ నిచ్చల్;
గాలిని దీపము నిడెదము;
మేలు నిడెడి నిన్నుఁ దలఁప ♦ మిఁక నోమ హరీ! (48)


నినుఁ గొల్వ గుడినిఁ గట్టఁగ
ధనమునుఁ గూర్చుకొనియు, సర♦దారుని సుంక
మ్మునుఁ గొని, వెఱవక, భద్రా
ద్రిని గోపన్నయె సృజించెఁ ♦ దిరముగను హరీ! (49)


త్యాగయ్య హృదయమందున
రాగమ్మునఁ గీర్తనమున ♦ రాముని వయ్యున్
దాగి గెలిపించితయ్యా
త్యాగమునకు నిలయునిగను ♦ ధరలోన హరీ! (50)


ధరఁ బ్రహ్లాదునిఁ గావఁగ
వర కరుణా వీక్షణములఁ ♦ బ్రసరింపంగన్
గరము విలంబముఁ జేసియు;
నరసింహుఁడవయ్యుఁ గాచి♦నాఁడవయ హరీ! (51)


లక్షించి కౌరవులు ఘన
శిక్షను నిడఁ బాండవులనుఁ ♦ జేరంగనుఁ గో
పాక్షుని దుర్వాసుఁ బనుప
నక్షయపాత్ర మెతుకుఁ దిని ♦ యరసితివి హరీ! (52)


త్రిపురాసుర సంహార
మ్మపుడా శివునకును నీవు ♦ నస్త్రమ్ముగనై
త్రిపురములఁ గాల్చినాఁడవు
విపుల యుద్ధమందు నిలిచి ♦ వెలుఁగొంది హరీ! (53)


ముని కృతమున సిరి కోప
మ్మునుఁ గొని వెడలఁగను నీవు ♦ పుట్టం జొరఁగన్
గని, హర చతురానను లట
వనమున గో వత్సము లయి ♦ పాలిడిరి హరీ! (54)


నిను మనమున నిలుపుకొనియు
వినుతింతునుఁ బద్దెములను ♦ విశ్వేశ్వర నన్
గనుమయ కటాక్షముల వే
గను ననుఁ బ్రోవుమ రమేశ! ♦ కరుణాత్మ! హరీ! (55)


దండమయా జగదీశ్వర!
దండమయా నీరజాక్ష! ♦ దండము శౌరీ!
దండమయా దనుజాంతక!
దండమయా వేదవేద్య! ♦ దండ మిదె హరీ! (56)


నా కష్టములనుఁ బాపుచు
లోకేశా! శాంతి నిడుము! ♦ లోకము నందున్
నా కిష్టమైన దైవమ!
నా కిలఁ బరమార్థ మిమ్ము ♦ ననుఁ గనుచు హరీ! (57)


లోకమ్మును సృజియించుచు;
లోకముఁ బాలింప జనుల♦లో వెలుఁగుచు; నీ
లోకమును లయ మొనర్చుచు;
లోక మ్మీ వగుదు గాదె ♦ లోకేశ! హరీ! (58)


ఆ రంతిదేవుఁ డెప్పుడు
కోరిన యాచకుల కెపుడు ♦ కూరిమి నిడుచున్
ధీరుండై మోక్షముఁ గొనె!
నారాయణ! ధర్మబుద్ధి ♦ నా కిడుము హరీ! (59)


జనకుని యానతిఁ దాల్చియు
జననిం బరిమార్చి తండ్రి ♦ సంతోషపడన్
జననిం బ్రతికించితి వయ
ఘనకుఠార! పరశురామ! ♦ కావుమయ హరీ! (60)


నీ మహిమలఁ గనుఁగొనఁగను
బ్రేముడి మన మంత నిండు ♦ శ్రీలక్ష్మీశా!
నేమమున నిన్నుఁ గొల్చితి
నా మనమున నిలువు మయ్య ♦ ననుఁ గావ హరీ! (61)


భవ సాగరమున మునిఁగియు
నవయుచు మే ముంటి మయ్య ♦ నరక మ్మిదియే!
నవనీత హృదయ! నన్నిఁక
భువినిం దప్పించి దివికిఁ ♦ బో విడుము హరీ! (62)


చేసెడిది తామె యనుచును
జేసెడి కర్మముల గొప్పఁ ♦ జేఁజేతఁ బ్రజల్
వాసిగఁ జెప్పుచు నుందురు!
చేసెద వీ వంచుఁ దెలివిఁ ♦ జేకొనరు హరీ! (63)


శివునాజ్ఞ లేక చీమయె
భువిఁ గుట్ట దటంచు నెఱిఁగి ♦ ముఱియుదుము! కనన్
భువి నీ యానతి నన్ని, య
భవ! నడువఁగఁ, బాపపుణ్య♦పరు లెవరు హరీ? (64)


పుట్టించితి మనుజునిగను
మెట్టించితి మనుజులందు ♦ మిన్నగ నన్నున్
గిట్టించఁగానుఁ దృప్తిగఁ
గట్టెదుటనుఁ గానుపించి ♦ కావుమయ హరీ! (65)


జీవాంతర్హృదయమ్మునఁ
దావక ప్రేమామృత మిడఁ ♦ దరితీపేలా?
జీవాత్మనుఁ బరమాత్మయె
కావఁగ వలెఁ గాదె, చూపి ♦ కనికరము, హరీ! (66)


నా దైవమ! నా ప్రాణమ!
వేదాదుల యందు నీవె ♦ విదితుఁడ వనఁగన్;
వేదాంత వేద్య! నేనే
వేద మ్మెది యెఱుఁగ నయ్య ♦ ప్రియ వరద హరీ! (67)


నే నింతవాఁడ నంచును
దానయి చెప్పుకొనుచుండుఁ ♦ దఱచియు నరుఁడున్!
తానెట్లు గొప్పవాఁడో
తానెఱుఁగునె, నీ మహిమలఁ ♦ దలఁపకయె, హరీ? (68)


పలు మతములఁ; బలు కులములఁ;
బలు భాషల, దేశములనుఁ; ♦ బలు వ్యవహృతులన్;
బలు మనముల దీపించుచు
నిలిచియు దైవ మ్మొకండె ♦ నివసించు హరీ! (69)


గోవింద! నీదు నామము
భావింప మనమ్మునందు ♦ భాసిలుచు వెసన్
బావన మొనరించును రా
జీవము పరిమళముఁ జిమ్ము ♦ చెన్నుగను హరీ! (70)


పిలిచినఁ బలుకఁగ లేదని
కలవర మందుచును జనులు ♦ గడఁగియు నెంతే
నలిఁగియు దైవమె లేఁడని
పలు విధములఁ బలుకకుండ ♦ పలుకుమయ హరీ! (71)


నాలోని పద్య విద్యకు
నాలంబన మీవె దేవ! ♦ నా మనమున నీ
జాలము లలిత గతుల పద
జాలము నర్తింపఁ జేసె! ♦ సత్య మిది హరీ! (72)


సర్వముఁ గాంతువు నీవే;
సర్వలోక వినుత! నిన్ను ♦ శరణంటినయా!
సర్వాంతర్యామీ! నా
గర్వమ్మునుఁ బరిహరింపఁ ♦ గనుమయ్య హరీ! (73)


మోసముఁ జేసెడు వారల
దోసములను బయటపెట్టి ♦ దుర్జన కృతమున్
వేసమ్ము తోడఁ దెలిపియు
దాసోఽహమ్మనెడు నటులఁ ♦ దరువిడుము హరీ! (74)


పొత్తముల వెలుఁగు విద్యయుఁ
జిత్తమునను వెలుఁగు జ్ఞాన ♦ శేషము త్వద్వా
గ్దత్తము కాదే! యిఁక నే
నిత్తును నా హృదయ కుసుమ ♦ మిదె కొనుము హరీ! (75)


మనుజులలో మనుజుఁడవై;
దనుజుల నిల రూపుమాపి, ♦ దశరథ రాముం
డను పేరఁ బరఁగి, కపికుల
ఘనుఁ గాఁచితి వాలిఁ జంపి ♦ కరుణాఢ్య హరీ! (76)


ఖగపతిని వాహనముగ; భు
జగపతి నొక తల్పముగను ♦ సరగునఁ గొనియున్
జగముల నేలెడి పతివై
యుగయుగముల వెలుఁగుచుంటి♦వోయయ్య హరీ! (77)


దుష్టులఁ దునుమాడి ధరను
శిష్టుల రక్షించి శమము ♦ స్థిరపఱచి వెసన్
గష్టమ్ములఁ దొలఁగించియు
నిష్టమ్ములఁ గూర్తువయ్య ♦ నేమమున హరీ! (78)


ఉత్కృష్ట చరిత! నిన్నిఁక
సత్కృతులం దొనరఁజేయు ♦ సన్నుతి, గుణ సం
పత్కర వర కరుణాది ర
సోత్కరమై వెలుఁగఁ జేయు ♦ సుగుణుఁడవు హరీ! (79)


నారదునకు సంసారపుఁ
గోరిక నిడఁ దానె తెలిసి♦కొనియునుఁ దా సం
సారము వ్యర్థమ్మను వ్యా
హారమ్మును మాను మహిమ ♦ యది నీదె హరీ! (80)


పదునాఱువేల గోపిక
లొదవిరి శృంగార భక్తి♦లోన మునిఁగియున్
సదయన్ నీ సహచరులుగ
మెదలుట నీ మహిమ కాదె ♦ మితముగను హరీ! (81)


నీరేజ పత్రములపై
నీరపుఁ గణ మెవ్విధమున ♦ నిలువదొ, ఘన సం
సారపు సాగరమున న
న్నారీతిని నంటకుండ ♦ నడిపించు హరీ! (82)


బాల్యమున మహిమఁ జూపియు
మాల్యమ్మునుఁ గొంటివయ్య ♦ మాన్య హితుల సౌ
శీల్యపు టటుకులఁ గొని కై
వల్య మిడితి నన్ను నటులె ♦ పాలింపు హరీ! (83)


అజ్ఞానము కనుఁ గప్పఁగ
విజ్ఞతతో నిన్నుఁ జూచు ♦ వెరవుఁ గనక నా
ప్రజ్ఞయె యడుగంటెను నీ
యాజ్ఞ నిడియుఁ బ్రోవుమయ్య ♦ హర్షమున హరీ! (84)


ఈ మనుజుల యాచింపఁగ
నీమము విడి చులకనఁ గని ♦ నిరసింతురనన్;
వామన! యా బలి నడిగితి
వేమయ్యా చులకనైతి♦వే యచట హరీ? (85)


హరి నామ స్మరణముచే
హరియింతువు దురితములను ♦ నర్థిఁ దలంపన్
సిరులనుఁ గోరను; మోక్షపు
సిరుల నిడియుఁ బ్రోవుమయ్య ♦ శీఘ్రముగ హరీ! (86)


అండజ వాహన! పాపపుఁ
గొండల గూల్చియును మాకుఁ ♦ గూరిమితో నా
ఖండల వైభవ మిడఁగను
దండ మిడెద నయ్య నీకు ♦ దయఁ గనఁగ హరీ! (87)


మత్స్యావతారము:
సోమకుఁడు వేదములఁ గొని
తామసియై సంద్రమందు ♦ దాచఁగ ఝషమై
సోమకునిఁ ద్రుంచి వేదము
లోమియు నబ్జజున కిడిన ♦ ప్రోడవయ హరీ! (88)


కూర్మావతారము:
అమృతముఁ గొనఁగను రాక్షసు
లమరులుఁ ద్రచ్చంగ మంధ♦రము మునుఁగఁగఁ గూ
ర్మమవై గిరిని ధరించియు
నమృతము నిడితివయ నీవు ♦ నమరులకు హరీ! (89)


వరాహావతారము:
భూమినిఁ గనకాక్షుండే
తామసమునఁ జాపఁ జుట్టి ♦ దభ్రమున నిడన్
నేమమున ఘృష్టివై యా
హేమాక్షుం జంపి కాఁచి ♦ తీ భువిని హరీ! (90)


నృసింహావతారము:
బాల ప్రహ్లాదుం డటఁ
గ్రాలుచు నిను భక్తిఁ జూపఁ♦గాను కశిపుఁడే
తాళక కంబముఁ గొట్టఁగ
లీల నృహరివయ్యుఁ గశిపుఁ ♦ ద్రెంచితివి హరీ! (91)


వామనావతారము:
పదములు రెంటిని భువి దివిఁ
బదరి కొనియు బలిని మఱొక ♦ పాదమ్ము నెటన్
గదియింతన; బలి యిడఁ దల;
సదయ నిడితి నిమ్నలోక ♦ స్వామ్యమును హరీ! (92)


పరశురామావతారము:
ధర నిరువదియొక మాఱును
బఱఁగ నృప తతిఁ బరిమార్చి ♦ వసుధ ననృపగాన్
వర పితృతర్పణ మిడితివి
పరశుధరా పరశురామ ♦ పరమేశ హరీ! (93)


శ్రీరామావతారము:
యతిఁ గావఁగఁ దాటకఁ జం
పితి; ఱాతిని నాతిఁ జేసి, ♦ వే హరువిలుఁ ద్రుం
చితి; కీశుఁ బ్రోచి, రావణు
హతమార్చియు సీతఁ గొంటి♦వయ రామ! హరీ! (94)


శ్రీకృష్ణావతారము:
చెఱసాలఁ బుట్టి, గోకుల
మురుగతిఁ జని, రక్కసులనుఁ ♦ బొరిగొని, గిరినిన్
ధరియించి, కంసుఁ జంపియు,
దరుణులఁ బదునాఱువేలఁ ♦ దగఁ గొంటి హరీ! (95)


(పౌరాణిక) బుద్ధావతారము:
బుద్ధుఁడవయి త్రిపురాసుర
శుద్ధ సతుల గురుఁడవయ్యుఁ ♦ జూడఁగ మాయా
బద్ధ రతికేళిఁ దేల్చిన
తద్ధర్మోజ్ఝితులఁ గాల్చు ♦ దహనాస్త్ర హరీ! (96)


(లౌకిక) బుద్ధావతారము:
క్షితి సుఖములు నరుల కశా
శ్వతము లటం చెఱిఁగి లోక ♦ పరమార్థద శా
శ్వత వర సత్య జ్ఞానో
ర్జిత బుద్ధుఁడవై సుబోధ ♦ లిడితివయ హరీ! (97)


కల్క్యవతారము:
నరజాతి సంకరమ్మును
బరిమార్పఁగ గుఱ్ఱ మెక్కి ♦ పాపము డుల్పన్
ద్వర దుష్టుల శిక్షించుచుఁ
బఱఁగను శిష్టులనుఁ బ్రోతు♦వయ కల్కి! హరీ! (98)


తొడఁగియు వారధిఁ గట్టఁగ
సడిచేఁ గపివరులుఁ గొండ♦చఱియలు వేయన్
వడి భక్తి నుడుత సాయ
మ్మిడి రామాంగుళిఁ ద్రిరేఖ ♦ నిలఁ గొనెను హరీ! (99)


లక్ష్మీశ! కరుణచే నిట
సూక్ష్మమ్మగు మోక్ష మెంచి ♦ చూడుము మము నీ
లక్ష్మకృత వీక్షచేతను
నీ క్ష్మాతలి కన్న మిన్న ♦ నిడఁగాను హరీ! (100)


దగ్గఱి చుట్టమె శబరియు
నిగ్గగు నెంగిలి ఫలముల ♦ నిడె భుజియింపన్?
దగ్గఱి బంధువె గుహుఁడును
డగ్గఱి నీ పాదములనుఁ ♦ దగఁ గడిగె హరీ? (101)

ఓం నమో భగవతే వాసుదేవాయ


స్వస్తి

శుక్రవారం, ఏప్రిల్ 08, 2016

నవ యుగాదీ...దుర్ముఖీ...స్వాగతం...!!!

మిత్రులందఱకు నవ్య త్రిలింగ వత్సరాది శుభాకాంక్షలు!!!



శార్దూలము (పంచపాది):
స్వస్తిశ్రీ నవ దుర్ముఖీ! శుభద! సత్సంపత్కరీ! వత్సరీ!
అస్తోకోజ్జ్వల దివ్య నవ్య భవితాహార్య ప్రభావోదరీ!
ప్రస్తుత్యాధిక ముఖ్య కావ్య లహరీ!  వాణీ శివానీ రమో
పాస్తిత్యంకిత ధాత శంభు బలివిధ్వం సీద్ధ భద్రంకరీ!
ప్రస్తావింతును నేఁడు మా కొసఁగు మీ  పర్వాన సర్వోన్నతుల్!! 1

తే.గీ.
ఈ యుగాది దినాన నేనేమి వ్రాఁతు?
పర్వమన మది మెదలు నింబామ్రతరులు;
శుకపికమ్ముల రవము; కింశుక సుమాలు;
కొదమ తేఁటుల నృత్యాలు,  పదములన్ని!! 2



తే.గీ.
జనము పెరిఁగియు, వనము  భోజనము సేసి,
ప్రకృతి శోభలఁ గసితీఱ  వికృతపఱచి,
నగరములఁ బెంచి, నవయుగ  నాగరకులయి,
యెదిగి పోయితి మందు రిదేమి మాయొ? 3



తే.గీ.
కుహుకుహూ రావముల తోడఁ  గోకిలమ్మ
చిగురుటాకుల ముక్కునఁ  జేర్చుకొనుచు,
"రార, వాసంతుఁడా, రార,  రమ్ము రమ్మ"
టంచు ముదముతోఁ బిలిచెనే  యంగలార్చి? 4



తే.గీ.
కిలకిలా రావముల తోడఁ  గీరములును
దోర పండ్లను దినుచునుఁ  దోరముగనుఁ
జెట్ల పుట్టల గుట్టలఁ  జేరఁ బిలిచి
మాటలాడెనే సంతస  మంది నేఁడు? 5



తే.గీ.
దూరముగ నున్న కొండపైఁ  దోచి, నిత్య
మగ్ని కీలలఁ దలఁపించు  నట్టి వైన
మోదుగుల పూఁత లీనాఁడు  మోము దాచి,
పాఱిపోసాఁగె వేగాన  వనము విడచి!! 6



తే.గీ.
పూవుఁ దోటలఁ దిరుగాడి,  పుప్పొడులను
మేనికినిఁ బూసికొనుచును  మేలమాడి,
యాడి పాడెడి తుమ్మెద  లేడఁ బోయె?
నవియె పూఁ దేనె లేకయే  యలిగెనేమొ!! 7



తే.గీ.
పూర్వ మున్నట్టి ప్రకృతి యబ్బురముగాను
మాయమాయెను; మనిషియు  మాఱిపోయె;
మాయమాయెను సంస్కృతి;  మాయమాయెఁ
బండుగల తీరు తెన్నులు  భారతమున! 8



తే.గీ.
మార్పు రావలె నేఁడైన  మనిషిలోన;
సంస్కృతుల్ సంప్రదాయాల  సంస్కరించి,
ప్రకృతిఁ బూజించి, మనమునఁ  బరవశించు
దినము దుర్ముఖీ యీయవే  ఘనముగాను! 9

ఉత్పలమాల:
జీవులకెల్ల సౌఖ్యములు,  క్షేమము శాంతి శుభాది వైభవాల్,
జీవన మిచ్చి, ప్రోచి, విరచించిన ధాన్య ధనాది సంపదల్
దీవన తోడుతన్ మనిచి,  తృప్తియు, తోషణ సమ్ముదమ్ము, ప
ర్యావరణమ్ముఁ గూడ కడు  రమ్యత నీయవె మాకు దుర్ముఖీ! 10





-:శుభం భూయాత్:-

ఆదివారం, ఫిబ్రవరి 21, 2016

మాతృభాష [తెలుఁగు] వెలుఁగు (గర్భకవిత్వము)

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 21-02-2016
కవిత సంఖ్య: 324

శీర్షిక:- మాతృభాష [తెలుఁగు] వెలుఁగు (గర్భకవిత్వము)

ద్విపద, మత్తకోకిల, కంద గర్భిత సీసము:

సీసము:
చేతు జోతలు, చేర్చి  శ్రేష్ఠద చిత్తమున్
…..మహి భారతీ! చనె  మాతృభాష
మాత! యాంగ్లమె నేఁడు  మాధ్యమ  మంచు దా
,,,,,నినె నేర్చుచున్ దెలుఁ  గని యనఁగను
రోఁత యంచును దెల్గు  రీతుల రోయుచుం
…..డ్రిట హెచ్చుగా నదె  మృతిఁ గొనెనని
చేత మందున నుల్లసిల్లుట సిగ్గు సి
…..గ్గయ సోదరా యనకయ పలువలు

తే.గీ.
తెనుఁగు తొలగగ విడచి; రిదె వినసొంపు
గఁ జనెడి తెనుఁగు విడుతురె  కట్ట! యింక
మారుఁడోయయ్య! మనదైన  మాతృభాష
తెలుఁగు వెలుఁగులు లోకాన  నిలుపుఁడయ్య!


ఈ పైన రచించిన సీసమందును…తేటగీతియందును గర్భితమైన పద్యములు ఇవి:

1. ద్విపద
2. మత్తకోకిల
3. కందము

వాటిని వరుసగఁ గ్రింద నిచ్చుచున్నాఁడను. చూడుఁడు:

1. గర్భిత ద్విపద

చేతు జోతలు చేర్చి  శ్రేష్ఠద చిత్త
మాత! యాంగ్లమె నేఁడు  మాధ్యమ మంచు
రోఁత యంచును దెల్గు  రీతుల రోయు
చేత మందున నుల్లసిల్లుట సిగ్గు


2. గర్భిత మత్తకోకిల

చేతు జోతలు చేర్చి శ్రేష్ఠద  చిత్తమున్ మహి భారతీ
మాత! యాంగ్లమె నేఁడు మాధ్యమ  మంచు దానినె నేర్చుచున్
రోఁత యంచును దెల్గు రీతుల  రోయుచుం డ్రిట హెచ్చుగా
చేత మందున నుల్లసిల్లుట  సిగ్గు సిగ్గయ సోదరా


3. గర్భిత కందము

చనె మాతృభాష తెలుఁగని
యనఁగను నదె మృతిఁ గొనె నని  యనకయ పలువల్
తెనుఁగుఁ దొలగగ విడచి; రిదె
వినసొంపుగఁ జనెడి తెనుఁగు  విడుతురె కట్టా!

(మిత్రులందఱకు మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో)

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్


శనివారం, ఫిబ్రవరి 20, 2016

విష్ణుస్తుతి (గర్భకవిత్వము)



అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 20-02-2016
కవిత సంఖ్య: 323

శీర్షిక:- విష్ణుస్తుతి (గర్భకవిత్వము)

*

నవాక్షర సమవృత్త, కంద త్రయ, మణిగణనికర(శశికళా)వృత్త గర్భిత సరసిజ వృత్తము:

*

సరసిజ వృత్తము:

శ్రీవత్సాంకా! చేతును సేవల్!  శివసఖ! మమతల  సిరు లిడితి వయా
దేవాధీశా! దివ్య గతీవే!  దివికినిఁ జనఁగను  దెసనిడితివయా!
దైవమ్మీవే! ధర్మువు తావై  ధవళిత యశ మిడి  దయను సురవరా!
రావే యీశా! ప్రోవఁగ రావా!  ప్రవిమల చరితను  రయముగ నిడుమా!

[లక్షణము: మ-త-య-న-న-న-న-స...గణములుండును...
యతిమైత్రి:1-10-18 యక్షరములకు...
ప్రాసపాటింపఁబడును]


పై సరసిజ వృత్తమునందు....

ఒక నవాక్షర వృత్తము
మూఁడు కందపద్యములు
ఒక మణిగణనికర (శశికళా) వృత్తము

మొత్తము ఐదు పద్యములు ఇమిడియున్నవి....

అవి వరుసగా....


గర్భిత
నవాక్షర వృత్తము:

శ్రీవత్సాంకా! చేతును సేవల్! 
దేవాధీశా! దివ్య గతీవే! 
దైవమ్మీవే! ధర్మువు తావై
రావే యీశా! రక్షగ రావా!
*

గర్భిత
కందము(1)

శ్రీవత్సాంకా! చేతును
సేవల్! శివసఖ! మమతల  సిరు లిడితి వయా!
దేవాధీశా! దివ్య గ
తీవే! దివికినిఁ జనఁగను  దెసనిడితివయా!
*

గర్భిత
కందము(2)

దైవమ్మీవే! ధర్మువు
తావై ధవళిత యశ మిడి  దయను సురవరా!
రావే యీశా! ప్రోవఁగ
రావా! ప్రవిమల చరితను  రయమున నిడుమా!
*

గర్భిత
కందము(3)

శివసఖ! మమతల సిరు లిడి
తివయా! దివికినిఁ జనఁగను  దెసనిడితివయా!
ధవళిత యశ మిడి దయను సు
రవరా! ప్రవిమల చరితను  రయమున నిడుమా!
*

గర్భిత
మణిగణనికర (శశికళా) వృత్తము:

శివసఖ! మమతల  సిరు లిడితి వయా
దివికినిఁ జనఁగను  దెసనిడితివయా!
ధవళిత యశ మిడి  దయను సురవరా!
ప్రవిమల చరితను  రయమున నిడుమా!

[లక్షణము: న-న-న-న-స...గణములుండును.
యతిమైత్రి:1-9 అక్షరములకు.
ప్రాసపాటింపఁబడును]

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్



శుక్రవారం, ఫిబ్రవరి 19, 2016

శివస్తుతి! (గర్భకవిత్వము)



అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 19-02-2016
కవిత సంఖ్య: 322

శీర్షిక:- శివస్తుతి! (గర్భకవిత్వము)

కంద, మధ్యాక్కఱ, తేటగీతి, ద్రుతవిలంబిత వృత్త గర్భిత చంపకమాలా వృత్తము:

హర! శివ! శంకరా! త్రిపుర  హంత! విధిస్తుత! లింగ! ధీర! తత్
స్మరహర! సంయతా! విపుల!  శాస్త! కవీశ్వర విశ్వ! గోత్రజా
వర! భవ నాశకా! విపది  భంగ! వివేకద! విశ్వపాలకా!
వరద! మృడా! ప్రభో! జప తపః పరిశాంతిత! శార్ఙ్గి! జేత జే!


ఈ చంకపమాల యందు ఇమిడి యున్న పద్యములు:


గర్భిత కందము:

శివ! శంకరా! త్రిపుర హం
త! విధిస్తుత! లింగ! ధీర!తత్ స్మరహర! సం
భవ నాశకా! విపది భం
గ! వివేకద!  విశ్వపాలకా! వరద! మృడా!


గర్భిత మధ్యాక్కర:

హర! శివ! శంకరా! త్రిపుర  హంత! విధిస్తుత! లింగ!
స్మరహర! సంయతా! విపుల!  శాస్త! కవీశ్వర విశ్వ!
వర! భవ నాశకా! విపది  భంగ! వివేకద! విశ్వ!
వరద! మృడా! ప్రభో! జప తపః పరిశాంతిత! శార్ఙ్గి!


గర్భిత తేటగీతి:

త్రిపురహంత! విధిస్తుత! ♦ లింగ! ధీర!
విపుల! శాస్త! కవీశ్వర  విశ్వ! గోత్ర!
విపది భంగ! వివేకద! ♦ విశ్వపాల!
జప తపః పరిశాంతిత!  శార్ఙ్గి! జేత!


గర్భిత ద్రుతవిలంబిత వృత్తము:

త్రిపురహంత! విధిస్తుత! లింగ! ధీ!
విపుల! శాస్త! కవీశ్వర విశ్వ! గో
విపది భంగ! వివేకద! విశ్వపా!
జప తపః పరిశాంతిత! శార్ఙ్గి! జే!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్

మిత్రులారా! పై "చంపక మాలా వృత్తము"నందు....నాలుగు పద్యములు దాగియున్నవి. అవి: కందము, మధ్యాక్కఱ, తేటగీతి మఱియు ద్రుతవిలంబిత వృత్తము. ఈ నాలుగింటిని చంపకమాల యందు నిమిడ్చి చేయు పద్య రచనమును "గర్భకవిత్వ"మందురు. ఇది చతుర్విధ కవిత్వములలో నొకటి. నేఁడిది స్వల్ప ప్రచారమున నున్నది. దీనిని సంపూర్ణముగ చదివి మీ యభిప్రాయమునుం దప్పక తెలుపఁగలరు.

-గుండు మధుసూదన్

శనివారం, జనవరి 09, 2016

దత్తపద్యారంభము: కవివర నీ కవిత్వమునఁ గాంతుము...

తేది: సెప్టెంబర్ 28, 2015 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన దత్తవాక్యమునకు నా పద్యము


కవివర నీ కవిత్వమునఁ గాంతుము స్వచ్ఛ వియన్నదీ ప్రవా
హ వర మనోజ్ఞ తైర్థ్యము! విహాయస వీథ్యుపవిష్ట వాత్యమున్!
నవక వచోఽమృతార్థక నినాహ్యము! శబ్ద విశేష భూషితో
ద్భవ యమకాది వేష్యము! సువాక్య రసార్ణవ నవ్య కావ్యమున్!


మంగళవారం, జనవరి 05, 2016

సమస్య: వినాయకుని సాఁగనంప విచ్చేసె రహీమ్!

తేది: సెప్టెంబర్ 27, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

Maulvi Allauddin.jpg

(స్వాతంత్య్ర సంగ్రామ తొలి ఖైదీ మౌల్వీ సయ్యద్ అల్లాఉద్దీన్‍ను నాంగ్లేయులు కారాగారమున నుంచుటకుం దీసుకొని వెడలుచుండ, నతనిని సాఁగనంపుటకై యతని యనుచరుఁడు రహీమ్ విచ్చేసిన సందర్భము)



ఘనముగ స్వాతంత్ర్యమ్మునుఁ
గొన, సమరము సేయ, దొరలు కోరి చెఱనిడన్
మునుకొన, వెడలెడు నా మౌ
ల్వి నాయకుని సాఁగనంప విచ్చేసె రహీమ్!


సోమవారం, జనవరి 04, 2016

సమస్య: పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే!

తేది: సెప్టెంబర్ 26, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణములు



నా మొదటి పూరణము:
ఇదె యష్టాదశ వర్ణన,
మిదె తత్సంఖ్యా పురాణ, మిదె స్మృతి సంఖ్య,
మ్మిది ధాన్య, జాతి, విద్యయుఁ
బదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే!


(ఈ పూరణమున ద్వితీయ పాదాంతమందు "సంఖ్యమ్ము" సంఖ్యగాఁ గాక, "యుద్ధ"మను నర్థము నిచ్చుచున్నదని డా. విష్ణునందన్ గారు...
[సుకవి శ్రీ గుండు మధుసూదన్ గారి మధురమైన పూరణల్లో ఒకానొక పూరణలో ఒక చోట సంఖ్యా శబ్దాన్ని సంఖ్యమని అకారాంత నపుంసక లింగముగా అని వాడినట్లున్నారు, ' లెక్క ' అనే అర్థంలో సంఖ్యా శబ్దం నిరంతరాకారాంత స్త్రీ లింగమే ! అకారాంత నపుంసకమైతే యుద్ధమనే రూఢి !]
...అని తెలిపినందున, సవరించిన పూరణము నీ దిగువన నిచ్చుచున్నాను)


సవరించిన నా పూరణము:
ఇదె యష్టాదశ వర్ణన,
మిదె తత్సంఖ్యా పురాణ, మిదె స్మృతి గణణ,
మ్మిది ధాన్య, జాతి, విద్యయుఁ
బదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే!




నా రెండవ పూరణము:
(శ్రీ కంది శంకరయ్యగారిచ్చిన సమస్యల సంఖ్య దీనితో పదునెనిమిది వందల సంఖ్య యైనందున)
పదునౌ సమస్య లివియుం
బదునెనిమిది వందలయ్యెఁ బరిశీలింపన్
బదుగు రివి మెచ్చు వందలు
పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే!


నా మూఁడవ పూరణము:
పదపడి చేయంబోకుఁడు
పది యేఁడుల పాపల కిల వైవాహికముల్
సుదతులకుఁ బెండ్లి వయసది
పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే!

శుక్రవారం, జనవరి 01, 2016

దత్త పద్యారంభము: ఎక్కడి కేఁగువాఁడ? నిపు డెవ్వని వేడుదు?



తేది: సెప్టెంబర్ 26, 2015 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన దత్తవాక్యమునకు నేను రాసిన పద్యము


(హరిభక్తుఁడగు నంబరీషునిపైఁ గినిసిన దుర్వాసమహర్షి కృత్యనుం బ్రయోగింపఁగఁ, గోపించిన శ్రీహరి, దుర్వాసునిపైఁ జక్రాయుధమునుం బ్రయోగింపఁగ, దానినుండి తప్పించుకొను నుపాయ మెఱుంగక తనలోఁ దా నిట్లనుకొని చింతించిన వైనము నిట ననుసంధానించుకొనునది)



ఎక్కడి కేఁగువాఁడ? నిపు డెవ్వని వేడుదుఁ? జక్ర మీ విధిన్
జక్కఁగ నాదు వెంటఁబడె! శంభుఁ డజుండును బ్రోవ మందురే!
నిక్కపు విష్ణుభక్తునకు నేనిటు చేసితిఁ గీడు! పక్కి రా
జక్కిదొరా! బిరాన ననుఁ జక్రము బారిని నుండి కావరా!!