అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 19-02-2016
కవిత సంఖ్య: 322
శీర్షిక:- శివస్తుతి! (గర్భకవిత్వము)
కంద, మధ్యాక్కఱ, తేటగీతి, ద్రుతవిలంబిత వృత్త గర్భిత చంపకమాలా వృత్తము:
హర! శివ! శంకరా! త్రిపుర ♦ హంత! విధిస్తుత! లింగ! ధీర! తత్
స్మరహర! సంయతా! విపుల! ♦ శాస్త! కవీశ్వర విశ్వ! గోత్రజా
వర! భవ నాశకా! విపది ♦ భంగ! వివేకద! విశ్వపాలకా!
వరద! మృడా! ప్రభో! జప త♦పః పరిశాంతిత! శార్ఙ్గి! జేత జే!
ఈ చంకపమాల యందు ఇమిడి యున్న పద్యములు:
గర్భిత కందము:
శివ! శంకరా! త్రిపుర హం
త! విధిస్తుత! లింగ! ధీర!♦తత్ స్మరహర! సం
భవ నాశకా! విపది భం
గ! వివేకద! విశ్వపాల♦కా! వరద! మృడా!
గర్భిత మధ్యాక్కర:
హర! శివ! శంకరా! త్రిపుర ♦ హంత! విధిస్తుత! లింగ!
స్మరహర! సంయతా! విపుల! ♦ శాస్త! కవీశ్వర విశ్వ!
వర! భవ నాశకా! విపది ♦ భంగ! వివేకద! విశ్వ!
వరద! మృడా! ప్రభో! జప త♦పః పరిశాంతిత! శార్ఙ్గి!
గర్భిత తేటగీతి:
త్రిపురహంత! విధిస్తుత! ♦ లింగ! ధీర!
విపుల! శాస్త! కవీశ్వర ♦ విశ్వ! గోత్ర!
విపది భంగ! వివేకద! ♦ విశ్వపాల!
జప తపః పరిశాంతిత! ♦ శార్ఙ్గి! జేత!
గర్భిత ద్రుతవిలంబిత వృత్తము:
త్రిపురహంత! వి♦ధిస్తుత! లింగ! ధీ!
విపుల! శాస్త! క♦వీశ్వర విశ్వ! గో
విపది భంగ! వి♦వేకద! విశ్వపా!
జప తపః పరి♦శాంతిత! శార్ఙ్గి! జే!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
మిత్రులారా! పై "చంపక మాలా వృత్తము"నందు....నాలుగు పద్యములు దాగియున్నవి. అవి: కందము, మధ్యాక్కఱ, తేటగీతి మఱియు ద్రుతవిలంబిత వృత్తము. ఈ నాలుగింటిని చంపకమాల యందు నిమిడ్చి చేయు పద్య రచనమును "గర్భకవిత్వ"మందురు. ఇది చతుర్విధ కవిత్వములలో నొకటి. నేఁడిది స్వల్ప ప్రచారమున నున్నది. దీనిని సంపూర్ణముగ చదివి మీ యభిప్రాయమునుం దప్పక తెలుపఁగలరు.
-గుండు మధుసూదన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి