Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, ఏప్రిల్ 20, 2016

మద్విరచిత హరి శతకము

నేను అయుత కవితా యజ్ఞమునఁ బ్రకటించిన 
హరి శతకము


ఓం నమో భగవతే వాసుదేవాయ



శ్రీకైవల్య పదముఁ గొన
నీకయి విరచించి నాదు ♦ నేరుపు మీఱన్
శ్రీకర శుభకర గురు కరు
ణాకర వర కంద శతము ♦ నర్పింతు హరీ! (01)


శ్రీలక్ష్మీశా! వినుమయ!
నీ లీలలు కనఁగ వినఁగ ♦ నెద పొంగునయా!
నాలోని మోహ మార్చియు;
నీలో ననుఁ గలుపుకొనియు ♦ నెమ్మి నిడు హరీ! (02)


నిరతము నీధ్యానమ్మే;
సరగున ననుఁ బ్రోచి, నేను ♦ సంబరపడఁగన్,
విరివిగ జ్ఞానము నీయుము!
హరియించుము మనములోని ♦ యజ్ఞతను హరీ! (03)


నిను ధ్యానించెడు పట్టునఁ
బెను యోచన లెపుడు ముసర, ♦ వెఱచు మనమునున్
గనియునుఁ, జిత్త స్థైర్య
మ్మునుఁ బెంచుము, దేవదేవ! ♦ ముదమునను హరీ! (04)


పూజలు సేయఁగ, పలువిధ
పూజాద్రవ్యమ్ములేవి ♦ పొనరించియు నే
నీఁ జాలనయ్య! మనమను
పూజాకుసుమమ్ముఁ గొనుము! ♦ పురుషవర! హరీ! (05)


దేవాధిదేవ! నిన్నును
నా వాఁడ వటంచు నమ్మి, ♦ నా మనమున నిన్
భావించి కొలుతునయ్యా!
దీవన లీయంగ రమ్ము! ♦ ద్విజశకట! హరీ! (06)


స్తోత్ర మ్మిడ మంత్రము లే
మాత్ర మ్మే నెఱుఁగనయ్య ♦ మాధవ! కరుణన్
బాత్రత నెఱిఁగియు, నన్నున్
బుత్రునిగా నెంచి, వేగఁ ♦ బ్రోవుమయ హరీ! (07)


సన్మాన్యము లే మిడుదునొ,
చిన్మూర్తీ! యెఱుఁగు దీవు ♦ సేవింపఁగ నిన్!
మన్మనమున నిలుపుకొనుటె
సన్మాన్యము కాదె! యీశ! ♦ చక్రధర! హరీ! (08)


చేతను గవ్వయు లేదయ!
చూత మనఁ, బవిత్ర ధనము ♦ చోద్యమ్మె, భువిన్
జూతుమె? పవిత్రమగు నా
చేతమ్మునుఁ గొనుము వేగ ♦ శ్రీనాథ హరీ! (09)


కుల గోత్ర వంశ ఘనతనుఁ
దెలుపఁగ నున్నతుఁడఁ గాను! ♦ దీనుఁడ నయ్యా!
విలువలఁ జూడఁగ నెందునఁ
గలవో నీ వెఱుఁగ లేవె? ♦ కమలాక్ష హరీ! (10)


చదువుల సారము నెఱుఁగను
గదయా! వేదమున నిన్నుఁ ♦ గను మంత్రములన్
జదువఁగ లేనయ! సార
మ్మిదె కొనుమయ నా పలుకుల ♦ నెంచుచును హరీ! (11)


నీ లీల లద్భుతమ్ములు!
బాలుఁడ నీ ముందు నేను! ♦ వరదుఁడ వీవే!
లీలా మానుష విగ్రహ!
నాలోఁ గల వెతల డుల్చి ♦ ననుఁ గావు హరీ! (12)


కరి మొఱ విని కాచితివఁట,
"పరమేశా! కావు" మంచుఁ ♦ బ్రార్థింపంగన్;
పరిపరి విధముల నుతు లిడఁ,
గరివరదా! వేగ నన్నుఁ ♦ గావు మయ హరీ! (13)


ఓపిక నే పుణ్యములను
గోపిక లటఁ జేసినారొ? ♦ గొబ్బున వారిన్
దాపముఁ దీరిచి యెదలో
దీపించుచు నర్తనములఁ ♦ దేల్చితివి హరీ! (14)


మాయలఁ దెలియని బేలయు
నా యమ్మ యశోద కట్టె ♦ నా ఱోట నినున్!
మాయలఁ దెలియని నా మది
నో యయ బంధితుఁడ వగుమ! ♦ యురగశయ! హరీ! (15)


యుక్తియె లేదయ; నినుఁ గన
శక్తియు లేదయ్య; చేరఁ ♦ జాలను రక్తిన్;
భక్తసులభ నినుఁ గొలిచెద
భక్తిని! ముక్తి నిడు మయ్య ♦ పరమేశ! హరీ! (16)


దైత్యాంతక! నిను నే సా
హిత్యాత్మక పద్యము లిడి ♦ హితమతిఁ గొలువన్;
సత్యాత్మ నిడియుఁ బ్రోచుచు
నిత్యము మద్దురిత కృతుల ♦ నిర్జించు హరీ! (17)


లోకమ్మునఁ బాపమ్ములు
చేకొని యొనరించుచుండ్రి ♦ శిక్షాభయమున్
లేకయె! వారల మనమున
నే కపటము దొరలకుండ ♦ నియమించు హరీ! (18)


కడలినిఁ గడఁచి, సురస మద
మడఁచియు, లంకిణినిఁ గూల్చి, ♦ మైథిలిఁ గనియున్
దొడ విడి, లంకనుఁ గాలిచి
యడరిన హనుమయ్య భక్తి ♦ నందించు హరీ! (19)


బాలునిఁ గని దయ లేకయె
కాలుండయె కనక కశిప ♦ కల్మాషుఁడు తాన్!
బాలునిఁ గాఁచెడి నృహరివె!
యేలయ ననుఁ గావ రావు ♦ హిత మిడియు హరీ! (20)


కమలేక్షణ! హృదయేశ్వరి
కమలను హృత్కమలమందు ♦ కాంక్ష నిడియు నీ
విమలాత్మనుఁ బ్రకటించితి!
రమేశ! నా హృదయమందు ♦ రంజిలుము హరీ! (21)


నినుఁ దలఁచిన శ్రమ తొలఁగును;
నినుఁ దలఁచిన పనులు జరుగు; ♦ నిధులును గలుగున్;
నినుఁ దలఁప ముదము; కావున,
నినుఁ దలఁచెడు మనము నిమ్ము ♦ నిత్యమును హరీ! (22)


రవి చంద్రులు నేత్రములై
యవిరళముగ వెలుఁగఁ జేయు♦నయ లోకములన్!
కవిలోక వంద్య! నా మది
నవిరళముగ వెలుఁగఁ జేయు♦మయ వరద! హరీ! (23)


గురు పదముల ధ్యానించినఁ
దొలఁగును నజ్ఞాన తిమిర ♦ దోషమ్ము వెసన్!
గురువులకే గురుఁడవయా!
సరగున జ్ఞానమ్ము నిమ్ము ♦ సత్కృపను హరీ! (24)


సురలనుఁ గాఁచి, యసురులనుఁ
బరిమార్చియు, వేగ లోక ♦ పరితోష మిడన్
బరికీర్తితుండ వీవే!
సురేశ వాణీశ వంద్య! ♦ శుభకారి హరీ! (25)


బల ముడిగి నృపులుఁ గన, హరు
విలు విఱిచియు, జనక సుతనుఁ ♦ బెండ్లాడ, వెసన్
బలవంతుఁడవని లోకము
పలుమఱుఁ బొగడెఁ గద! నాకు ♦ బలమీవె హరీ! (26)


వశ ముడిగి నిన్నుఁ దెగడిన
శిశుపాలుని దోష శతము ♦ సీమను దాఁటన్
భృశమే ఖండించితివయ
శిశుపాలుని శిరము! చక్రి! ♦ చిద్రూప! హరీ! (27)


పాపి దశాస్యుఁడు సీతను
పాపముఁ దలఁపక హరించి ♦ బంధించఁగ నా
పాపినిఁ ద్రుంచితి! లోకులఁ
బాపాత్ముల వశము నుండి ♦ పాలింపు హరీ! (28)


ధనమున్నవారలందఱు
ధనగర్వముచేత రేఁగి, ♦ ధనహీనులనున్
"దీనులు, హీను" లనుచు నవ
మాన మిడఁగ, వేగ వారి ♦ మద ముడుపు హరీ! (29)


నీ పాద ధూళి చేతనె
శాపావధిఁ గనె నహల్య! ♦ సరి యా పదముల్
కాపాడఁ గడిగె గుహుఁ! డా
నీ పదముఁ గడిగెద నేత్ర ♦ నీరమిడి హరీ! (30)


వచ్చితి వ్రేపల్లెకు; నటఁ
జొచ్చితి గోపకుల యింటఁ ♦ జుఱ్ఱఁగఁ బాలన్;
గ్రుచ్చితి దనుజుల నెల్లను;
మెచ్చితి పదునారు వేల ♦ మెలఁతుకల హరీ! (31)


శ్రుతులం గాఁచితి; గిరి మో
సితి; కనకాక్షుని కనక క♦శిపు నొంచి; బలిన్
క్షితి నడఁచి; నృపుల వంచి; ప
దితలల దొరఁ ద్రుంచి; గీతఁ ♦ దెల్పితివి హరీ! (32)


శూలి ధను ర్భేదక! వన
పాల దనుజ నాశక! నయ♦బాహ్య దశాస్యో
న్మూలక! సవిధ స్థిత భూ
పాలక! కృత రామరాజ్య! ♦ పద్మాక్ష! హరీ! (33)


పుట్టితివి దేవకికి; మఱి,
మెట్టితివి యశోద యింట ♦ మేలుం గూర్పన్;
గొట్టితివి రక్కసుల నిల;
మొట్టితివయ ఖలునిఁ గంసు ♦ మోదమున హరీ!(34)


తాపసులనుఁ దాపసివయి;
భూపతులను నృపుఁడవయి; ఋ♦భువుల ఋభుఁడవై;
గోపాలక! భూగోవును
నేపారఁగఁ గాఁచి తీవు! ♦ హేమాంగ! హరీ! (35)


దేవముని నారదుం డొక
దేవ విరిని నిడఁగ, నీవు ♦ దేవేరి కిడన్,
దేవా! సత్యయె యలుఁగన్,
దేవేంద్రు గెలిచి, కుజమునె ♦ తెచ్చితివి హరీ! (36)


సుర లసురు లమృతమునకయి
ధరాధరము పాలకడలిఁ ♦ ద్రచ్చఁగ మునుఁగన్
ద్వర కూర్మమవై నీవటఁ
గరుణను మంధరము మోసి, ♦ గతి నిడితి హరీ! (37)


భువి నసురుం డడవికిఁ జని,
భవునిఁ గూర్చి తపము సేసి, ♦ భస్మాసురుఁడై,
శివునే పరీక్ష సేయఁగ,
నువు మోహినివయ్యు వాని ♦ నొంచితివి హరీ! (38)


అమృతము సురాసురులు గొని,
తముఁ దామే పోరుచుండఁ, ♦ దగ మోహినివై
యమృతముఁ బంచితి సురలకు!
విమతుల మృతి కెఱఁగఁ జేయ ♦ వినయాన హరీ! (39)


నిరతము నిన్నును నందఱు
"సరసిజనయనా! ముకుంద! ♦ సర్వేశ! యతీ!
స్మరగురు! మధుసూదన! జిన!
మురహర!" యనుచును స్మరింత్రు ♦ మోక్ష మిడ హరీ! (40)


"వినఁ డితఁ" డని మాత యపుడు
నినుఁ ఱోటికిఁ గట్టివేయ, ♦ నీడ్చుచు, మద్దుల్
గని, నడుమన నునిచి, తిగువ
ను, ననిమిషులు శాపము విడ, ♦ నుతు లిడిరి హరీ! (41)


ఎంగిలి పండ్లను నీకిడి
వంగిన మనమునను నిన్ను ♦ భక్తి నుతింపన్
బొంగియుఁ గాఁచితి శబరిని
హంగుగ మోక్షమ్ము నిడియు ♦ యజ్ఞేశ హరీ! (42)


పిడికెడు నటుకుల రుచిఁ గొని,
యిడియును నైశ్వర్యములను; ♦ హితునిఁ గుచేలున్
విడిపోని బంధమునఁ బ్రే
ముడిచే సేవల నొనర్చి ♦ మురిసితివి హరీ! (43)


భువనేశ! దైత్యనాశా!
భవ నాశక! పద్మనాభ! వరద! పరేశా!
స్తవనీయ! హృషీకేశా!
త్రివిక్రమా! శ్రీశ! నాకు ♦ దిక్కీవె హరీ! (44)


అరమరిక లేలనయ్యా
కరుణాకర! నన్నుఁ గావ? ♦ కైమోడ్చితి; నా
పరదైవ మీవె యంటిని;
పరమాత్మా! వేగ రమ్ము ♦ వరమిడఁగ హరీ! (45)


త్రికరణ శుద్ధిగ నీ గుణ
నికర పదచ్ఛాయలోన ♦ నివసించినచో
నకళంక జీవనస్థితి
సుకరమ్మై చేరు సకల ♦ శుభములును హరీ! (46)


ఒకఁడుండు లేమిఁ గుములుచు;
నొకఁడుండును కలిమియందు ♦ నొందుచు సుఖముల్;
సుకరముగఁ దెలియ నీ స్థితి
ప్రకటితమగుఁ బూర్వజన్మ ♦ వాసనల హరీ! (47)


నీ లీలఁ దెలియలేకయె
కూలి వెతల; జతనములనుఁ ♦ గొనమయ నిచ్చల్;
గాలిని దీపము నిడెదము;
మేలు నిడెడి నిన్నుఁ దలఁప ♦ మిఁక నోమ హరీ! (48)


నినుఁ గొల్వ గుడినిఁ గట్టఁగ
ధనమునుఁ గూర్చుకొనియు, సర♦దారుని సుంక
మ్మునుఁ గొని, వెఱవక, భద్రా
ద్రిని గోపన్నయె సృజించెఁ ♦ దిరముగను హరీ! (49)


త్యాగయ్య హృదయమందున
రాగమ్మునఁ గీర్తనమున ♦ రాముని వయ్యున్
దాగి గెలిపించితయ్యా
త్యాగమునకు నిలయునిగను ♦ ధరలోన హరీ! (50)


ధరఁ బ్రహ్లాదునిఁ గావఁగ
వర కరుణా వీక్షణములఁ ♦ బ్రసరింపంగన్
గరము విలంబముఁ జేసియు;
నరసింహుఁడవయ్యుఁ గాచి♦నాఁడవయ హరీ! (51)


లక్షించి కౌరవులు ఘన
శిక్షను నిడఁ బాండవులనుఁ ♦ జేరంగనుఁ గో
పాక్షుని దుర్వాసుఁ బనుప
నక్షయపాత్ర మెతుకుఁ దిని ♦ యరసితివి హరీ! (52)


త్రిపురాసుర సంహార
మ్మపుడా శివునకును నీవు ♦ నస్త్రమ్ముగనై
త్రిపురములఁ గాల్చినాఁడవు
విపుల యుద్ధమందు నిలిచి ♦ వెలుఁగొంది హరీ! (53)


ముని కృతమున సిరి కోప
మ్మునుఁ గొని వెడలఁగను నీవు ♦ పుట్టం జొరఁగన్
గని, హర చతురానను లట
వనమున గో వత్సము లయి ♦ పాలిడిరి హరీ! (54)


నిను మనమున నిలుపుకొనియు
వినుతింతునుఁ బద్దెములను ♦ విశ్వేశ్వర నన్
గనుమయ కటాక్షముల వే
గను ననుఁ బ్రోవుమ రమేశ! ♦ కరుణాత్మ! హరీ! (55)


దండమయా జగదీశ్వర!
దండమయా నీరజాక్ష! ♦ దండము శౌరీ!
దండమయా దనుజాంతక!
దండమయా వేదవేద్య! ♦ దండ మిదె హరీ! (56)


నా కష్టములనుఁ బాపుచు
లోకేశా! శాంతి నిడుము! ♦ లోకము నందున్
నా కిష్టమైన దైవమ!
నా కిలఁ బరమార్థ మిమ్ము ♦ ననుఁ గనుచు హరీ! (57)


లోకమ్మును సృజియించుచు;
లోకముఁ బాలింప జనుల♦లో వెలుఁగుచు; నీ
లోకమును లయ మొనర్చుచు;
లోక మ్మీ వగుదు గాదె ♦ లోకేశ! హరీ! (58)


ఆ రంతిదేవుఁ డెప్పుడు
కోరిన యాచకుల కెపుడు ♦ కూరిమి నిడుచున్
ధీరుండై మోక్షముఁ గొనె!
నారాయణ! ధర్మబుద్ధి ♦ నా కిడుము హరీ! (59)


జనకుని యానతిఁ దాల్చియు
జననిం బరిమార్చి తండ్రి ♦ సంతోషపడన్
జననిం బ్రతికించితి వయ
ఘనకుఠార! పరశురామ! ♦ కావుమయ హరీ! (60)


నీ మహిమలఁ గనుఁగొనఁగను
బ్రేముడి మన మంత నిండు ♦ శ్రీలక్ష్మీశా!
నేమమున నిన్నుఁ గొల్చితి
నా మనమున నిలువు మయ్య ♦ ననుఁ గావ హరీ! (61)


భవ సాగరమున మునిఁగియు
నవయుచు మే ముంటి మయ్య ♦ నరక మ్మిదియే!
నవనీత హృదయ! నన్నిఁక
భువినిం దప్పించి దివికిఁ ♦ బో విడుము హరీ! (62)


చేసెడిది తామె యనుచును
జేసెడి కర్మముల గొప్పఁ ♦ జేఁజేతఁ బ్రజల్
వాసిగఁ జెప్పుచు నుందురు!
చేసెద వీ వంచుఁ దెలివిఁ ♦ జేకొనరు హరీ! (63)


శివునాజ్ఞ లేక చీమయె
భువిఁ గుట్ట దటంచు నెఱిఁగి ♦ ముఱియుదుము! కనన్
భువి నీ యానతి నన్ని, య
భవ! నడువఁగఁ, బాపపుణ్య♦పరు లెవరు హరీ? (64)


పుట్టించితి మనుజునిగను
మెట్టించితి మనుజులందు ♦ మిన్నగ నన్నున్
గిట్టించఁగానుఁ దృప్తిగఁ
గట్టెదుటనుఁ గానుపించి ♦ కావుమయ హరీ! (65)


జీవాంతర్హృదయమ్మునఁ
దావక ప్రేమామృత మిడఁ ♦ దరితీపేలా?
జీవాత్మనుఁ బరమాత్మయె
కావఁగ వలెఁ గాదె, చూపి ♦ కనికరము, హరీ! (66)


నా దైవమ! నా ప్రాణమ!
వేదాదుల యందు నీవె ♦ విదితుఁడ వనఁగన్;
వేదాంత వేద్య! నేనే
వేద మ్మెది యెఱుఁగ నయ్య ♦ ప్రియ వరద హరీ! (67)


నే నింతవాఁడ నంచును
దానయి చెప్పుకొనుచుండుఁ ♦ దఱచియు నరుఁడున్!
తానెట్లు గొప్పవాఁడో
తానెఱుఁగునె, నీ మహిమలఁ ♦ దలఁపకయె, హరీ? (68)


పలు మతములఁ; బలు కులములఁ;
బలు భాషల, దేశములనుఁ; ♦ బలు వ్యవహృతులన్;
బలు మనముల దీపించుచు
నిలిచియు దైవ మ్మొకండె ♦ నివసించు హరీ! (69)


గోవింద! నీదు నామము
భావింప మనమ్మునందు ♦ భాసిలుచు వెసన్
బావన మొనరించును రా
జీవము పరిమళముఁ జిమ్ము ♦ చెన్నుగను హరీ! (70)


పిలిచినఁ బలుకఁగ లేదని
కలవర మందుచును జనులు ♦ గడఁగియు నెంతే
నలిఁగియు దైవమె లేఁడని
పలు విధములఁ బలుకకుండ ♦ పలుకుమయ హరీ! (71)


నాలోని పద్య విద్యకు
నాలంబన మీవె దేవ! ♦ నా మనమున నీ
జాలము లలిత గతుల పద
జాలము నర్తింపఁ జేసె! ♦ సత్య మిది హరీ! (72)


సర్వముఁ గాంతువు నీవే;
సర్వలోక వినుత! నిన్ను ♦ శరణంటినయా!
సర్వాంతర్యామీ! నా
గర్వమ్మునుఁ బరిహరింపఁ ♦ గనుమయ్య హరీ! (73)


మోసముఁ జేసెడు వారల
దోసములను బయటపెట్టి ♦ దుర్జన కృతమున్
వేసమ్ము తోడఁ దెలిపియు
దాసోఽహమ్మనెడు నటులఁ ♦ దరువిడుము హరీ! (74)


పొత్తముల వెలుఁగు విద్యయుఁ
జిత్తమునను వెలుఁగు జ్ఞాన ♦ శేషము త్వద్వా
గ్దత్తము కాదే! యిఁక నే
నిత్తును నా హృదయ కుసుమ ♦ మిదె కొనుము హరీ! (75)


మనుజులలో మనుజుఁడవై;
దనుజుల నిల రూపుమాపి, ♦ దశరథ రాముం
డను పేరఁ బరఁగి, కపికుల
ఘనుఁ గాఁచితి వాలిఁ జంపి ♦ కరుణాఢ్య హరీ! (76)


ఖగపతిని వాహనముగ; భు
జగపతి నొక తల్పముగను ♦ సరగునఁ గొనియున్
జగముల నేలెడి పతివై
యుగయుగముల వెలుఁగుచుంటి♦వోయయ్య హరీ! (77)


దుష్టులఁ దునుమాడి ధరను
శిష్టుల రక్షించి శమము ♦ స్థిరపఱచి వెసన్
గష్టమ్ములఁ దొలఁగించియు
నిష్టమ్ములఁ గూర్తువయ్య ♦ నేమమున హరీ! (78)


ఉత్కృష్ట చరిత! నిన్నిఁక
సత్కృతులం దొనరఁజేయు ♦ సన్నుతి, గుణ సం
పత్కర వర కరుణాది ర
సోత్కరమై వెలుఁగఁ జేయు ♦ సుగుణుఁడవు హరీ! (79)


నారదునకు సంసారపుఁ
గోరిక నిడఁ దానె తెలిసి♦కొనియునుఁ దా సం
సారము వ్యర్థమ్మను వ్యా
హారమ్మును మాను మహిమ ♦ యది నీదె హరీ! (80)


పదునాఱువేల గోపిక
లొదవిరి శృంగార భక్తి♦లోన మునిఁగియున్
సదయన్ నీ సహచరులుగ
మెదలుట నీ మహిమ కాదె ♦ మితముగను హరీ! (81)


నీరేజ పత్రములపై
నీరపుఁ గణ మెవ్విధమున ♦ నిలువదొ, ఘన సం
సారపు సాగరమున న
న్నారీతిని నంటకుండ ♦ నడిపించు హరీ! (82)


బాల్యమున మహిమఁ జూపియు
మాల్యమ్మునుఁ గొంటివయ్య ♦ మాన్య హితుల సౌ
శీల్యపు టటుకులఁ గొని కై
వల్య మిడితి నన్ను నటులె ♦ పాలింపు హరీ! (83)


అజ్ఞానము కనుఁ గప్పఁగ
విజ్ఞతతో నిన్నుఁ జూచు ♦ వెరవుఁ గనక నా
ప్రజ్ఞయె యడుగంటెను నీ
యాజ్ఞ నిడియుఁ బ్రోవుమయ్య ♦ హర్షమున హరీ! (84)


ఈ మనుజుల యాచింపఁగ
నీమము విడి చులకనఁ గని ♦ నిరసింతురనన్;
వామన! యా బలి నడిగితి
వేమయ్యా చులకనైతి♦వే యచట హరీ? (85)


హరి నామ స్మరణముచే
హరియింతువు దురితములను ♦ నర్థిఁ దలంపన్
సిరులనుఁ గోరను; మోక్షపు
సిరుల నిడియుఁ బ్రోవుమయ్య ♦ శీఘ్రముగ హరీ! (86)


అండజ వాహన! పాపపుఁ
గొండల గూల్చియును మాకుఁ ♦ గూరిమితో నా
ఖండల వైభవ మిడఁగను
దండ మిడెద నయ్య నీకు ♦ దయఁ గనఁగ హరీ! (87)


మత్స్యావతారము:
సోమకుఁడు వేదములఁ గొని
తామసియై సంద్రమందు ♦ దాచఁగ ఝషమై
సోమకునిఁ ద్రుంచి వేదము
లోమియు నబ్జజున కిడిన ♦ ప్రోడవయ హరీ! (88)


కూర్మావతారము:
అమృతముఁ గొనఁగను రాక్షసు
లమరులుఁ ద్రచ్చంగ మంధ♦రము మునుఁగఁగఁ గూ
ర్మమవై గిరిని ధరించియు
నమృతము నిడితివయ నీవు ♦ నమరులకు హరీ! (89)


వరాహావతారము:
భూమినిఁ గనకాక్షుండే
తామసమునఁ జాపఁ జుట్టి ♦ దభ్రమున నిడన్
నేమమున ఘృష్టివై యా
హేమాక్షుం జంపి కాఁచి ♦ తీ భువిని హరీ! (90)


నృసింహావతారము:
బాల ప్రహ్లాదుం డటఁ
గ్రాలుచు నిను భక్తిఁ జూపఁ♦గాను కశిపుఁడే
తాళక కంబముఁ గొట్టఁగ
లీల నృహరివయ్యుఁ గశిపుఁ ♦ ద్రెంచితివి హరీ! (91)


వామనావతారము:
పదములు రెంటిని భువి దివిఁ
బదరి కొనియు బలిని మఱొక ♦ పాదమ్ము నెటన్
గదియింతన; బలి యిడఁ దల;
సదయ నిడితి నిమ్నలోక ♦ స్వామ్యమును హరీ! (92)


పరశురామావతారము:
ధర నిరువదియొక మాఱును
బఱఁగ నృప తతిఁ బరిమార్చి ♦ వసుధ ననృపగాన్
వర పితృతర్పణ మిడితివి
పరశుధరా పరశురామ ♦ పరమేశ హరీ! (93)


శ్రీరామావతారము:
యతిఁ గావఁగఁ దాటకఁ జం
పితి; ఱాతిని నాతిఁ జేసి, ♦ వే హరువిలుఁ ద్రుం
చితి; కీశుఁ బ్రోచి, రావణు
హతమార్చియు సీతఁ గొంటి♦వయ రామ! హరీ! (94)


శ్రీకృష్ణావతారము:
చెఱసాలఁ బుట్టి, గోకుల
మురుగతిఁ జని, రక్కసులనుఁ ♦ బొరిగొని, గిరినిన్
ధరియించి, కంసుఁ జంపియు,
దరుణులఁ బదునాఱువేలఁ ♦ దగఁ గొంటి హరీ! (95)


(పౌరాణిక) బుద్ధావతారము:
బుద్ధుఁడవయి త్రిపురాసుర
శుద్ధ సతుల గురుఁడవయ్యుఁ ♦ జూడఁగ మాయా
బద్ధ రతికేళిఁ దేల్చిన
తద్ధర్మోజ్ఝితులఁ గాల్చు ♦ దహనాస్త్ర హరీ! (96)


(లౌకిక) బుద్ధావతారము:
క్షితి సుఖములు నరుల కశా
శ్వతము లటం చెఱిఁగి లోక ♦ పరమార్థద శా
శ్వత వర సత్య జ్ఞానో
ర్జిత బుద్ధుఁడవై సుబోధ ♦ లిడితివయ హరీ! (97)


కల్క్యవతారము:
నరజాతి సంకరమ్మును
బరిమార్పఁగ గుఱ్ఱ మెక్కి ♦ పాపము డుల్పన్
ద్వర దుష్టుల శిక్షించుచుఁ
బఱఁగను శిష్టులనుఁ బ్రోతు♦వయ కల్కి! హరీ! (98)


తొడఁగియు వారధిఁ గట్టఁగ
సడిచేఁ గపివరులుఁ గొండ♦చఱియలు వేయన్
వడి భక్తి నుడుత సాయ
మ్మిడి రామాంగుళిఁ ద్రిరేఖ ♦ నిలఁ గొనెను హరీ! (99)


లక్ష్మీశ! కరుణచే నిట
సూక్ష్మమ్మగు మోక్ష మెంచి ♦ చూడుము మము నీ
లక్ష్మకృత వీక్షచేతను
నీ క్ష్మాతలి కన్న మిన్న ♦ నిడఁగాను హరీ! (100)


దగ్గఱి చుట్టమె శబరియు
నిగ్గగు నెంగిలి ఫలముల ♦ నిడె భుజియింపన్?
దగ్గఱి బంధువె గుహుఁడును
డగ్గఱి నీ పాదములనుఁ ♦ దగఁ గడిగె హరీ? (101)

ఓం నమో భగవతే వాసుదేవాయ


స్వస్తి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి