Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, మే 16, 2016

బాలల నీతి పద్య కథలు: గొప్పలు తెచ్చిన కీడు...




ఒక్క యూరి చెఱువులోన  నుండు కప్ప
చాలఁ బెద్దది యౌటచేఁ,  జాల గర్వ
మున ’ఘనుఁడ’ నంచునుం గప్పలనుఁ గదిసియు,
"నన్ను మించు జీవి జగాన  నున్నదె?" యనె! 1


పిల్ల కప్పలు మదిలోన  నుల్లసిలుచు,
’నిజమె కాఁబోలు’ నంచును  నెయ్యముఁ గొని,
దానిఁ దమ రాజుగాఁ, దాము  దాసులుగను
సేవఁ జేయఁ దొడఁగినవి  స్థిరముగాను! 2


ఒక్కనాఁ డొక్క యెద్దు, పేరుక్కు గలది,
మందనుం దప్పి, దప్పిక  నంది, చెఱువు
చెంతకునుఁ జేరఁ, గప్పలుఁ  జిత్రముగనుఁ
జూడ మొదలిడినవి మున్నుఁ  జూడకునికి! 3


పిల్ల కప్పలు వెంటనే  పెద్ద కప్పఁ
జేరి, యిట్టుల నడిగెను  శీఘ్రముగను;
"రాజ! నాఁడు ’నా కన్న వర్ణమ్మునందు,
దేహమందు గొప్పదియగు  దేహి లేదు; 4


నన్ను మించు వారు జగమునను గలారె?’
యనుచుఁ జెప్పితిరయ మీరు!  వినుఁడు, నేఁడు
మేము నీకన్న పెద్దదౌ,  మేఘము వలె
నివ్వటిల్లు జంతువునుఁ గంటిమి తటమున!" 5


అనుచుఁ బలుకుచుండిన కప్పలను గనుచును,
బెద్ద కప్పయు నెంతయో  విస్మిత యయి,
"శీఘ్రమే నన్నుఁ గొనిపొండు!  చేరఁ జనియు,
దాని వీక్షింతు నేనిప్పు"  డనుచుఁ బలికె! 6


పిల్ల కప్పలు సనుచుండ,  వేగముగను
వెంబడించియుఁ, దీరాన  పెద్ద దైన
జంతువగు నెద్దునుం జూచి,  సంభ్రమమునఁ,
దననుఁ బిల్ల కప్పలు నమ్మఁగ, నిటు పలికె! 7


"దానిఁ జూచి యాశ్చర్యపడంగ వలదు!
దాని ’నె’ ద్దని యందురు!  వీను లలర
వినుఁడు! చిన్నదౌ చెఱువు నోపెడునె యనుచు,
నేను పెరుగంగ లేదోయి  నిక్కముగను! 8


నిజముగా నాదు రూపమ్ము  నిపుడు పెంచి,
నాదు గొప్పనుఁ జూపింతు"  ననుచుఁ బలుకఁ
జప్పటులఁ గప్ప లన్నియుఁ  జఱచుచుండ;
వెంటనే పెద్ద కప్ప తాఁ  బెరుఁగఁ దివిరె! 9


ఊపిరిని బిగఁబట్టియు,  నొప్పునటులు
గాలిఁ బీల్చఁగఁ, గడుపుబ్బెఁ!  గప్పలన్ని
చేరి, ’యె ద్దంతఁ గ’ మ్మనఁ,  జేయునదియు
లేక, యింకను గాలిఁ బీల్చెను రయమున! 10


ఘనతఁ జాటంగ నెంచియుఁ  గరము గాలిఁ
బీల్చు కొలఁదియు జఠరమ్ము  పెరిఁగి పెరిఁగి,
ప్రేలి, మరణించె, బింకంపు  పెంపు కతన!
గొప్పలకుఁ బోయి యాపదం  గూల వలదు!! 11



స్వస్తి


గమనిక: మిత్రులారా ఈ దిగువ మీరు పెట్టే ప్రోత్సాహక వ్యాఖ్యలే నన్ను ద్విగుణీకృత ఉత్సాహవంతుణ్ణి చేసి మరిన్ని కథలు రాయడానికి పురికొల్పుతాయి. ఈ దిగువ వ్యాఖ్య రాయడం మరువ వలదు అని మనవి.

ఆదివారం, మే 15, 2016

బాలల నీతి పద్య కథలు: ఐకమత్యమే మహాబలము...



ఒక్క పట్టణ మందుండె  నొక్క శ్రేష్ఠి;
యతఁడు వర్తకమ్మును జేసి,  యమితమైన
ధనము, కీర్తి ప్రతిష్ఠలు  ఘనముగాను
గడన సేసియు, విభవాన  నడరుచుండె!  1


అతని కొడుకులు నల్వుర  నతి ప్రియమునఁ
బెంచు కతమున, వారలుఁ  బెంకెలు నయి,
చదువు సంధ్యలు లేని యజ్ఞానులు నయి,
యెపుడు నొండొరులునుఁ గలహించుచుంద్రు!  2

అన్నదమ్ముల నడుమ నెయ్యమ్ము లేదు;
వర్తకమ్ము నేర్పునఁ జేయు  ప్రజ్ఞ లేదు;
సోమరులు నయి, వ్యర్థులై,  జూదరు లయి,
కాల మంత వినోదాలఁ  దేలుచుంద్రు!  3

వర్తకున కొక్క దినమున  వ్యాధి సోఁకి,
మంచమునఁ బడి, 'తనయులు  మంచి దారి
మఱలకుండిరే' యనుచును  మనమునందుఁ
దీవ్ర వేదన రగులఁగ,  దీనుఁ డయ్యె!  4

'వార లెట్లైన దారికి  వచ్చునటుల
నెద్దియో యొక మార్గమ్ము  నెంచి, వారి
నిపుడు సన్మార్గమునకునుం  ద్రిప్పవలయు'
ననుచు యోచించి, వారఁ జెంతకునుఁ బిలిచి;  5

"కొడుకులార! నే వ్యాధితోఁ  గొలఁది దినము
లుండి, మరణింతుఁ గాన, నీ  లోపున నొక
నిజముఁ దెల్పెద వినుఁ డిది  నెమ్మి తోడఁ;
బిదప మీరలు నన్ను మెప్పింపుఁ" డనుచు;  6

నల్వురనుఁ గొన్ని కట్టెలు  నటకుఁ గొనియుఁ
దెమ్మనఁగ, వార లట్టులే  తెచ్చి యిడఁగ;
వేరు వేరుగ నొక్కొక్క  బెత్తము నిడి,
విఱువుఁ డనఁగాను, సులువుగ  విఱిచి రపుడు!  7

రెండు రెండు కట్టెల నిడి  త్రెంచుఁ డనఁగఁ;
గొంత శ్రమతోడ విఱిచిరి!  యంత నాల్గు
బెత్తము లొకటఁ జేకొని  విఱువుఁ డనఁగ;
విఱువలేకపోయిరి వారు  బెత్తములను!  8

అపుడు తండ్రి, "చూచితిరె మీ  రంత దీని!
నొక్క కట్టెను విఱిచి, రెండున్నఁ గొలఁది
శ్రమమున విఱిచి, నాల్గుండ  శ్రమము వ్యర్థ
మైనను విఱువ లేకుంటి  రయ్య మీరు!  9

మీర లిట్టులే వేఱుగ  మెలఁగుచుండ,
నెవ్వరైనను మిముఁ గూల్ప  నేర్తు రయ్య!
నల్వు రైకమత్యమ్మున  నడువఁగాను
మిమ్ము నెవ్వరుం గూల్ప లే  రిమ్ముగాను!  10

కాన, నాయనలార! యైక్యమ్ముగాను
మీరు మెలఁగంగ వలయు సుమ్మింక మీద!
దాన ధనధాన్య సమృద్ధి;  దాన యశము,
సౌఖ్య సంతోషములు నబ్బు  సక్రమమున!"  11

అనిన తండ్రి మాటలు వినినంత, వారు
మాట యిచ్చిరి "మే మైకమత్యముగను
నుందు" మంచును! తండ్రియు  నొందెఁ దృప్తి!
నైకమత్యమే యిడును మహాబలమ్ము!!  12


స్వస్తి


శనివారం, మే 14, 2016

బాలల నీతి పద్య కథలు: మూర్ఖునితో ప్రయాణం...



ఒక్కనాఁ డొక్క వణిజుండు ప్రక్క యూర
సరుకుఁ గొనితేరఁ జనుచును, సఖులు తోడు
లేక, యొక మూర్ఖుఁ దోడుగా స్వీకరించి,
కలసి పయనింపసాఁగెను గడు ముదమున! 1


అట్లు పయనించుచుండఁ జీఁకట్లు ముసిరెఁ
గాని, చేరఁగాఁ జనునట్టి గమ్య మింక
రాకపోవుట; యదియె యరణ్య మౌట;
వణిజుఁ డెంతయు భయపడెఁ బథమునఁ జన! 2


’అడవి దారినిఁ జోర భయమ్ము చేత,
ముందు కేఁగుట మేలు కానందు వలన,
నేదొ యొకచోట వసియింత మిపు’ డని, మునుఁ
గాంచఁ బ్రాఁతదౌ నొక గుడి కానుపించె! 3


ఇద్ద ఱా గుడి లోనికి నేఁగ; మొఱకు
మండపమ్మున నిద్రించుచుండ; వణిజుఁ
డంత ప్రతిమ వెన్కకుఁ జని, యటనె తాను
నిద్ర పో సాఁగె నలసట నింగి కెగయ! 4


కొలఁది రాత్రాన దొంగలు గుడికి వచ్చి,
తాము దోచిన సొమ్ము నంతయునుఁ బంచు
కొనఁగఁ బూనియు, మండపమునకుఁ జనఁగ,
మూర్ఖుఁ డచ్చటఁ గనిపించె మ్రుచ్చులకును! 5


వాని దరిఁ జేరి వారలు పలికి రిట్లు,
"వీఁడు నిరుపేద కాఁబోలు; తోడు లేక
యిచట నిద్రించె!" ననఁగ, వాఁ "డేమి, నేను
బీదవాఁడనె? నా యొద్ద లేదె ధనము? 6


చూడుఁ డిద్దియ!" యనుచునుఁ జూపెఁ దాను
నొక్క వరహాను తన రొండి నుండి తీసి!
దానిఁ జూచియు వారలు తక్కలి గొని,
పూని పరికించి చూడంగ, మూర్ఖుఁ డపుడు; 7


"నిక్క మైనట్టి వరహాయె! తక్క౯మేల?
దీనిఁ దెలుపంగ వలెనన్న ది క్కతండె!
యదివొ! నిద్రించుచున్నట్టి యాపణికుని
నిద్ర లేపి యడుగుఁ డయ్య! నిజమొ, కాదొ!!" 8


అనిన మూర్ఖుని మాటల నాలకించి,
సంతసమ్మున వణిజుని సరసకుఁ జని,
లేపి, ధనమంతయును మ్రుచ్చిలించి, చనిరి;
తమ యదృష్టమ్ము బాగున్న దనుచు వారు! 9


వర్తకుఁడు తాను మునుకొన్న పని నిలువఁగ;
ధనము నంతయుఁ జోరులు తస్కరింప;
నేడ్చుచుం దన యింటికి నేఁగ మఱలె!
కాన, మూర్ఖుని తోడ్పాటు నూనఁ దగదు!! 10



స్వస్తి


మంగళవారం, మే 10, 2016

బాలల నీతి పద్య కథలు: నాయనా... పులివచ్చె!





ఒక్క యూర రామయ యను బక్క రైతు
తాను వ్యవసాయముం జేసి, తనదు గృహము
నడుపుకొనుచుండు; నతనికి నందుఁ డనెడి
కొమరుఁ, డల్లరి పనులతోఁ బ్రమద మందు! 1


తండ్రి యొకట గొఱ్ఱెల మేపఁ దనయుఁ బనుపఁ,
దండ్రి కున్నట్టి గొఱ్ఱెల తండముఁ గొని,
యా పొలము ప్రక్క మేపుచు, నల్లరి పనిఁ
జేయఁ దొడఁగియు నిట్టులఁ జీరసాఁగె! 2


"నాయనా పులివచ్చెను! నన్నుఁ గావు"
మనుచుఁ బిలువఁ దండ్రియు, నటఁ బనులు సేయు
వార లందఱుఁ బఱుగున వచ్చి చూడఁ,
బులియు లేదాయె నచ్చటి స్థలమునందు! 3


"ఏదిరా పులి?" యనఁగాను "నిహిహి" యంచు
నగుచుఁ "బులి లేదు, గిలి లేదు! నడువుఁ" డనెను!
తండ్రి "మఱియొక్క తఱి నిట్లు తఱచి పిలువ
వలద" టంచుఁ బేర్కొని, తానుఁ బనికిఁ జనెను! 4


కొలఁది సేపైన పిమ్మటఁ గుఱ్ఱఁ డపుడు
మఱల నిట్లు పిల్వఁగ సాఁగెఁ దఱచి తఱచి,
"నాయనా, పులి! పులి!!" యంచు; నదియ వినియుఁ
దండ్రి, పనివాండ్రు బాలునిఁ ద్వరఁగఁ జేరి; 5


"ఏది పులి?" యని యడుగఁగ "నేది లేద"
టంచు నికిలించఁ, దండ్రియు నతనిఁ జూచి,
"యల్లరిం దగఁ జేయంగఁ జెల్ల దిచట!
మఱలఁ బిల్చుచో దండింతు" మనియు వెడలె! 6


పిల్లఁ డానందపడుచును నుల్లమందు,
గొఱ్ఱియల మేపు చుండఁగఁ గొంత వడికిఁ
బులియె నిజముగా వచ్చెను! బుడుతఁ డపుడు
"నాయనా, వచ్చెఁ బులి!" యంచు నఱవఁ దొడఁగె! 7


తండ్రి యా యఱపుల విని, ’తనదు కొడుకె
యల్లఱిం జేయుచుండెన’ టంచుఁ దలఁచి,
రాక యుండెను గాని, ’తాఁ బోక యున్నఁ
దనయుఁ డాపదఁ బడు’ నంచుఁ దలఁప కుండె! 8


పులియు నొక గొఱ్ఱెఁ దన నోటఁ బొదవుకొనియుఁ
జనుచు నుండఁగ, బాలుండు తనదు తండ్రిఁ
బిల్చుచుండిన, వారలు వేగ నటకు
రాక యుండిరి బాలు నల్లరి యదంచు! 9


బాలుఁ డఱపుల నాపక పలవరించఁ,
దండ్రి యాపద శంకించి, తనయు కడకుఁ
జనఁగ, జరుగంగఁ దగనిదియు నట జరిగెఁ;
గాన, బాల లట్టులఁ జేయఁగాఁ దగదయ! 10



స్వస్తి


ఆదివారం, మే 08, 2016

మాతృవందన ఫలం


మిత్రులందఱకు "మాతృదినోత్సవ శుభాకాంక్షలు"


భూప్రదక్షిణ షట్కానఁ బొందు ఫలము;
కాశి యాత్రాచరణ మిడు ఘనఫలమ్ము;
సింధువునఁ జేయు స్నాన సంస్థిత ఫలమ్ము;
మాతృ వందన మాచరింపఁగనె కలుగు!


స్వస్తి





మంగళవారం, మే 03, 2016

గిజిగాఁడు...






చం.
తగఁ జని తుమ్మకొమ్మలకొ తాళ కుజాలకొ యీఁత చెట్లకో
తగులఁగఁ జేసి గూండ్లు ఘనతం బ్రకటింపఁగ నేర్పు మీఱఁగన్
బగఁ గొని పాములో యితర వైరులొ దాడినిఁ జేయకుంటకై
గగనముఁ దాఁకునట్లు గిజిగాఁడు రచించుటఁ జూడఁ జిత్రమౌ!! 1


తే.గీ.
అద్భుతమ్ముగఁ గూఁడుఁ దా నాస్థఁ గట్టు
నేర్పుఁ జూడంగఁ జిత్రమౌ నిర్మిత! మది
తరుల శాఖల వ్రేలెడి తాజమహలొ?
గగనసీమను విహరించు గౌరగృహమొ?? 2


ఆ.వె.
సాక్ష్య మిచ్చు నెట్టి సాంకేతిక జ్ఞాన
మో యదంచు జనులు మోహమంద!
నందమైన యట్టి యానంద నిలయమ్ము
కాదె చూడ నదియు కాంక్ష మీఱ? 3


తే.గీ.
అదియ గూఁటి నల్లెడి తీరు; లందముగనుఁ
బిల్లలకుఁ దిండి నోఁటనుఁ బెట్టు విధము;
శత్రుతతుల నెదుర్కొను సరణి; దాని
యాటపాటల వైఖరి యచ్చెరు విడు! 4

తే.గీ.
గూండ్లఁ జిన్ని పిట్టలు తమ గోల లెగయ;
భూనభోఽంతరాందోళికా భోగ సహిత
సూక్ష్మ గేహాంతర స్థిత శోభ వెలయ
నూఁగులాడుచుండును తూఁగుటూయలట్లు! 5


శా.
ఏదేనొక్క పృదాకు వేఁగఁ గని తా మెంతెంతయో నార్చుచున్
బో దాఁకన్ ఘనమైన రీతిగను శబ్దోచ్చారణమ్ముల్ దగన్
నాదౌద్ధత్యముఁ జూపి తత్తఱలఁ బెంచంగానె యా సర్పమున్
నాదారెద్దియటంచుఁ బర్వులిడు నా నైపుణ్యముం గాంచితే? 6

ఆ.వె.
శిరసు పైన స్వర్ణ శీర్షకమ్మున్నట్లు
పసుపు వన్నె మిగుల బంగరువయి,
చిబుక చూచుకములు చిక్కనౌ నలుపయి,
నీలి గోధుమ బరి నెఱక లొలయు! 7


తే.గీ.
బిడ్డలకుఁ దిండిఁ బెట్టెడి పెద్దఱికమె
యింతులకు బాధ్యతగఁ దగ నిడియు; గూఁడు
నేర్పుగాఁ గట్టు బాధ్యత నెలమి మగఁడు
కొనియు మెలఁగు చుండును భార్య మనము నెఱిఁగి! 8

ఆ.వె.
వరియు గడ్డి యాకు వంటి పీచునుఁ గొని
నేసి కొంత, యదియె నెచ్చెలువకుఁ
జూపి, ముదము గొనఁగనే, పూర్తిగాఁ దాను
నేయు; లేదొ, పర కులాయ మల్లు! 9


కం.
గేహముఁ బూర్తిగ నేసియు
గేహినిఁ బిలువంగ మివులఁ గేరింతలతో
స్నేహము నెఱపుచుఁ దిరుగుచు
మోహపరవశ యయి చేరు మురిపెమునఁ జెలున్! 10


ఉ.
నేలకు నింగికిన్ సరిగ నేస్తము లల్లిన గూఁటి వన్నియల్;
మాలిమి తోడ వర్తిలెడి మంజుమనోహర నాట్యరీతి; రా
గాలసమైన పాట; కవులాదరమున్ వెలిఁబుచ్చుచుండఁ దాఁ
గాలముఁ బుచ్చుచుండు గిజిగాఁ డట హాయినిఁ జిల్కరించుచున్! 11




-:శుభం భూయాత్:-


ఆదివారం, మే 01, 2016

పరమపద సోపాన పటము...





కం.
నిముసమునఁ బాము దిను, మఱు
నిముసము నిచ్చెనల నెక్కు నిక్కపుఁ గ్రీడన్,
శ్రమపడి యాడుచు నుండఁ, బ
రమపద సోపాన పటము  రాగిలుచుండున్! (1)


కం.
సుమతులకు నాట యందున
సమమగు నిశ్శ్రేణితతులు,  సర్ప కబళముల్!
కుమతులనుఁ బాము మ్రింగును;
గమనింపఁగ నిచ్చెనలు 'న'కారమ్మె యగున్! (2)


తే.గీ.
హితుల 'వైకుంఠ పాళి' సహిష్ణుతఁ గని,
యాడ, వైకుంఠుఁ డెప్పుడు  నైక్య మంద
నీయఁ, డెంతయును ఘన పరీక్ష సేసి,
పిదప నెగ్గించి, తన దరిన్  వేగఁ జేర్చు! (3)


ఆ.వె.
పిల్ల లాడు నాట,  పెద్ద లాడెడి యాట,
నిచ్చెనలును పాము  లిచ్చి పుచ్చు!
వారి వారి కర్మ  పరిపాకమునుఁ బట్టి
ముందు వెనుకలుగను  మోక్ష మొదవు!! (4)



-:శుభం భూయాత్:-


గురువారం, ఏప్రిల్ 28, 2016

దైవాన్వేషణం...



[నా చిన్నతనంలో నేను దేవుణ్ణి చూపించమంటూ మారాం చేస్తుంటే... నాన్న నన్ను తన భుజంపై కెక్కించుకొని ఆకాశంలోకి చూపించాడు. నేను దేనినో చూచి దేవుడని భ్రమించి అప్పటికి మారాం ఆపాను. కాని, ఆ దేవుని భుజాలపైననే నేనున్నానని ఆనాడు తెలుసుకోలేకపోయాను. తెలుసుకొనేసరికి ఆ దేవుడే నాకు దూరమయ్యాడు]

కం.
"దేవుండెచ్చట నుండెను?
దేవునిఁ జూపింపు" మనఁగ, దివముం జూపన్;
దేవునిఁ గన భుజమెక్కియు
దేవుండగు నా జనకుని  దిగువఁ గననహో!

ఇదియే భావము తేటగీతిలో...

తే.గీ.
దేవుఁ డెక్కడ నుండెనో  తెలియఁ జెప్పు
మనఁగ నా తండ్రి దివిఁ జూపె;  నపుడు చూడ,
నాదు తండ్రి భుజ మ్మెక్కినట్టి నేను
తండ్రియే దేవుఁడని నాఁడు  తలఁచనైతి!



-:శుభం భూయాత్:-


మంగళవారం, ఏప్రిల్ 26, 2016

సమస్య:- యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్

శుభోదయం మిత్రులారా!

25-04-2016 నాఁడు "శంకరాభరణం" లో ఈయబడిన...

సమస్య:-
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్


దీనికి నా పూరణములు....


నా మొదటి పూరణము:

చెమటలు గ్రక్కుచు వేఁడిమి
నమితముగా నుక్కపోయ
నడలి జలము కో
సము గగనమున జలద నిచ
యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్! 1


నా రెండవ పూరణము:

సముచిత పాత్రా సుపరిచ
యము సేయఁగఁ దొడఁగినట్టి 
 దౌ నటి వేదిన్
బ్రముదిత యయి యిడు నంకా
స్యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్! 2


ఈ పూరణమే చిన్న సవరణలతో...
సముచిత పాత్రాదుల నిల
యము సేయఁగఁ దొడఁగినట్టి  యా నటియు నటున్
బ్రముఖాంకాస్యాఖ్య పరిచ
యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్!


నా మూఁడవ పూరణము:

రమణీయ దృశ్య వర్ణిత
సముచిత పాత్రానుగుణ్య  సత్కథను ప్రకా
శమిడు సుగుణైక యుత కా
వ్యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్! 3

ఈ పూరణమే చిన్న సవరణలతో...

రమణీయ దృశ్య వర్ణిత
సముచిత పాత్రానుగుణ్య  సత్కథను ప్రకా
శమిడెడి సన్మధుర కవీ
యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్!


నా నాలుఁగవ పూరణము:

అమృతమును జిందు భావన
మమృతాక్షర మౌక్తిక నిభమౌ పదయుతమై
సుమశోభిత దీపిత ప
ద్యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్! 4


ఈ పూరణమే చిన్న సవరణలతో...


అమృతమును జిందు భావన
మమృతాక్షర మౌక్తిక నిభమౌ పదవాక్యో
ద్యమ శోభిత కావ్య శ్రే
యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్!


నా యైదవ పూరణము:

భ్రమలఁ గలిగించు సంసా
ర మను భుజగ దంష్ట్రులకును  భ్రమ డుల్పను శ
క్యమగు తిరుమలేశుని గ
ద్యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్! 5


ఈ పూరణమే చిన్న సవరణలతో...
భ్రమలఁ గలిగించు సంసా
ర మను భుజగ దంష్ట్రులకును  భ్రమ డుల్పను శ
క్యము తిరుమల విభు పద తో
యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్!


నా యాఱవ పూరణము:

గమకిత మనోజ్ఞ సంగీ
తముచే నలరారఁ జేయు  తత్రత్యుల వే
దము గోపాలుని దౌ గే
యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్! 6



-శుభం భూయాత్-



సోమవారం, ఏప్రిల్ 25, 2016

పద్య పరివర్తనము: చేతులారంగ శివుని....పద్యం...ఉత్పలమాలలో...



దత్త పద్యము:

చేతులారంగ శివునిఁ బూజింపఁడేని
నోరునొవ్వంగ హరికీర్తి  నుడువఁడేని
దయయు సత్యంబు లోనుగాఁ  దలఁపడేని
గలుగనేటికిఁ దల్లుల  కడుపుచేటు!

[పై పద్యభావము నుత్పలమాలా వృత్తమందు]

పరివర్తనము:

ఉ.
పూనియుఁ జేతులారఁగ శివుం దగఁ బూజలు సేయఁడేని; వా
గ్లీనత నోరు నొవ్వ హరి  కీర్తి వచింపక యుండునేని; వి
శ్వాన నరుండు తా దయయు  సత్యము లోనఁ దలంపఁడేని; నా
హీనుఁడు తల్లికిం గలుగ  నేటికిఁ? దల్లుల కడ్పు చేటగున్!

-:శుభం భూయాత్:-


ఆదివారం, ఏప్రిల్ 24, 2016

దత్తపది: ఆవు-మేక-కుక్క-పిల్లి...కురుసభలో ద్రౌపది...తేటగీతిలో...


కురుసభలో ద్రౌపది



దత్తపది:-
ఆవు-మేక-కుక్క-పిల్లి...పదముల నుపయోగించి భారతార్థమునం జెప్పిన తేటగీతి పద్యము...



తే.గీ.
ఆవురుమని ద్రోవది కృష్ణు నపుడు పిలువ;
శీఘ్రమే కన్నఁ డత్తఱిఁ  జీర లిచ్చె!
కౌరవుల కుక్కడంపఁగ  గాడ్పుపట్టి
"ప్రతిన" ఱంపిల్లినది యా సభాంతరమున!!



-:శుభం భూయాత్:-



శనివారం, ఏప్రిల్ 23, 2016

నిండు మనమ్ము....!


ఉ.
“నిండుమనంబు నవ్యనవనీతసమానము పల్కు దారుణా
ఖండలశస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్క మీ
రెండును రాజులందు విపరీతము గావున విప్రుఁ డోపు నో
పం డతిశాంతుఁ డయ్యు నరపాలుఁడు శాపము గ్రమ్మఱింపఁగన్”

>>>నన్నయ గారి పై పద్యము యొక్క భావమే...
.......నేను రచించిన తేటగీతిలో...

తే.గీ.
భూసురుని యెద మిసిమియౌ! బాస కఱకు!
కాన, శాప మిడియుఁ ద్రిప్పఁ  గలఁ డతండు!
భూవరున కిది విపరీతము నగుఁ గాన,
శాప మిడియునుఁ ద్రిప్పంగఁ  జాలఁ డితఁడు!!

-:శుభం భూయాత్:-


శుక్రవారం, ఏప్రిల్ 22, 2016

క్షీరసాగర మథన వృత్తాంతము




ఆ.వె.
దేవ దానవులును ♦ దీవ్రమౌ యుద్ధాన
మరణ మందుచుండ; ♦ మాధవునకు
విన్నవించఁగాను ♦ విష్ణుండు "క్షీర సా
గర మథనము సేయఁ♦గా వలె" ననె! (1)

తే.గీ.
పాల సంద్రాన మంథర ♦ పర్వత మిడి,
వాసుకినిఁ గవ్వమునుగ దే♦వతలు దాన
వులుఁ జిలుకఁగఁ బూన; మునిఁగి♦పోవ నదియుఁ;
గలఁతఁ జెంది, హరినిఁ జేరి, ♦ తెలుపఁ గాను; (2)

కం.
చిఱు నగవున విష్ణు వపుడు
కరుణను దాఁబేటి మేటి♦గా మాఱియు, మం
ధరమును వీపున మోయఁగఁ;
దరచిరి యా పాలకడలిఁ ♦ ద్వరితోత్సుకతన్! (3)

తే.గీ.
కలశ పాధోధిఁ ద్రచ్చఁగఁ ♦ దొలుతఁ బుట్టె
హాలహల; మది దహియింప; ♦ నందఱు హరు
శరణ మర్థించి; రప్పుడు ♦ శంకరుండు
గరళముం ద్రాగి, యంత శ్రీ♦కంఠుఁ డయ్యె! (4)

తే.గీ.(పంచపాది)
ముదముతో వారుఁ ద్రచ్చంగ ♦ మొదట కామ
ధేను వుదయించఁగ వశిష్ఠుఁ ♦ డెలమిఁ గొనియెఁ;
ద్రచ్చ నుచ్చైశ్శ్ర వైరావ♦తములు, కల్ప
వృక్ష మప్సరసల నింద్రుఁ ♦ డా క్షణమ్మె
కొనఁగ; లక్ష్మిఁ గౌస్తుభమునుఁ ♦ గొనియె హరియు! (5)

కం.
చివరకు సురాసురులు వెను
దవులఁగఁ గోరిన యమృతము ♦ ధన్వంతరియే
ధవళ రుచులుఁ బ్రసరించఁగ
నవు మోమున విష్ణు మ్రోల ♦ నప్పుడ యుంచెన్! (6)

ఆ.వె.
దేవ దానవులును ♦ దీవ్రమౌ తమితోడ
"మాకు మాక"టంచు ♦ మత్సరించి,
వాదు లాడుచుండ ♦ వైకుంఠుఁ డప్పుడు
మోహినిగను మాఱి ♦ ముందు నిలిచె! (7)

తే.గీ.
వారి కప్పుడు మోహిని ♦ పలికె నిట్లు,
"వినుఁడు! నే నీ యమృతమునుఁ ♦ బ్రేమ మీఱ
మీకు నందఱకును వంచి, ♦ మిమ్ము నమరు
లనుగఁ జేసెద! నాసీను ♦ లగుఁడు నిచట!" (8)

కం.
ఇది విన్న దేవ దానవు
"లదియే వర"మనుచు నటులె ♦ నటఁ గూర్చుండన్;
సుదతి యమృతము సురల కిడె;
నిది రాహువుఁ గేతువునుఁ గ♦నిరి సురల కిడన్! (9)

ఆ.వె.
కనియు సురల చివరఁ ♦ జని, వారు కూర్చుండ;
మోహినియును వంపె ♦ మోద మలర!
సూర్య చంద్రు లిదియు ♦ సూచించ నా చక్రి,
గొంతు దిగక మునుపె, ♦ గొంతుఁ ద్రెంచె! (10)

ఆ.వె.
కంఠమం దమృతము ♦ గల రాహు కేతుల
తలలు బ్రతికె! మొండె ♦ మిలనుఁ జచ్చె!
గ్రహణమందుచుంద్రు ♦ రాహు కేతువు లెప్డు
శశిని, రవినిఁ! గాని, ♦ వశులు కారు! (11)

తే.గీ.
ఇటుల దేవత లమరులై ♦ హితము నెంచి,
రాక్షసులతోడ యుద్ధమ్ము ♦ ప్రబలముగనుఁ
జేసి, దనుజుల నిర్జించి, ♦ జేత లైరి;
క్షీర సాగర మథనమ్ము ♦ క్షేమ మిడఁగ!! (12)



(ఇది క్షీరసాగరమథన వృత్తాంతము)

-:శుభం భూయాత్:-


గురువారం, ఏప్రిల్ 21, 2016

హనుమద్విజయము!



చంపకమాలిక:
జలధిని దాఁటి, యా సురసఁ  జప్పునఁ దాఁ దెగటార్చి, లంకిణిన్
బొలియిడి, లంకఁ జొచ్చి, భువిపుత్రినిఁ గాంచియు, నుంగ్ర మా సుకో
మలి కిడి, వృక్షవాటికను  మాపి, దశాస్యసుతద్వయమ్ముఁ ద్రె
క్కలిగొని, బమ్మయమ్ము తనుఁ  గట్టఁగ బంధితుఁడయ్యు, రావణున్
గలిసి, రఘూత్తమున్ బొగడి,  కాల్చియు లంకనుఁ, జేరి రామునిన్,
నెలతుక వర్తమానమిడి,  నెయ్యపుఁ గాన్కను ముట్టఁజెప్పి, ధీ
బలుఁడగు రామమూర్తికిఁ గృపాళునకుం గలిగించి తృప్తినిన్,
వలచె మహత్త్వమా యెడను  వాయుసుతుం డట రామబంటుగన్!

*శుభంభూయాత్*

బుధవారం, ఏప్రిల్ 20, 2016

మద్విరచిత హరి శతకము

నేను అయుత కవితా యజ్ఞమునఁ బ్రకటించిన 
హరి శతకము


ఓం నమో భగవతే వాసుదేవాయ



శ్రీకైవల్య పదముఁ గొన
నీకయి విరచించి నాదు ♦ నేరుపు మీఱన్
శ్రీకర శుభకర గురు కరు
ణాకర వర కంద శతము ♦ నర్పింతు హరీ! (01)


శ్రీలక్ష్మీశా! వినుమయ!
నీ లీలలు కనఁగ వినఁగ ♦ నెద పొంగునయా!
నాలోని మోహ మార్చియు;
నీలో ననుఁ గలుపుకొనియు ♦ నెమ్మి నిడు హరీ! (02)


నిరతము నీధ్యానమ్మే;
సరగున ననుఁ బ్రోచి, నేను ♦ సంబరపడఁగన్,
విరివిగ జ్ఞానము నీయుము!
హరియించుము మనములోని ♦ యజ్ఞతను హరీ! (03)


నిను ధ్యానించెడు పట్టునఁ
బెను యోచన లెపుడు ముసర, ♦ వెఱచు మనమునున్
గనియునుఁ, జిత్త స్థైర్య
మ్మునుఁ బెంచుము, దేవదేవ! ♦ ముదమునను హరీ! (04)


పూజలు సేయఁగ, పలువిధ
పూజాద్రవ్యమ్ములేవి ♦ పొనరించియు నే
నీఁ జాలనయ్య! మనమను
పూజాకుసుమమ్ముఁ గొనుము! ♦ పురుషవర! హరీ! (05)


దేవాధిదేవ! నిన్నును
నా వాఁడ వటంచు నమ్మి, ♦ నా మనమున నిన్
భావించి కొలుతునయ్యా!
దీవన లీయంగ రమ్ము! ♦ ద్విజశకట! హరీ! (06)


స్తోత్ర మ్మిడ మంత్రము లే
మాత్ర మ్మే నెఱుఁగనయ్య ♦ మాధవ! కరుణన్
బాత్రత నెఱిఁగియు, నన్నున్
బుత్రునిగా నెంచి, వేగఁ ♦ బ్రోవుమయ హరీ! (07)


సన్మాన్యము లే మిడుదునొ,
చిన్మూర్తీ! యెఱుఁగు దీవు ♦ సేవింపఁగ నిన్!
మన్మనమున నిలుపుకొనుటె
సన్మాన్యము కాదె! యీశ! ♦ చక్రధర! హరీ! (08)


చేతను గవ్వయు లేదయ!
చూత మనఁ, బవిత్ర ధనము ♦ చోద్యమ్మె, భువిన్
జూతుమె? పవిత్రమగు నా
చేతమ్మునుఁ గొనుము వేగ ♦ శ్రీనాథ హరీ! (09)


కుల గోత్ర వంశ ఘనతనుఁ
దెలుపఁగ నున్నతుఁడఁ గాను! ♦ దీనుఁడ నయ్యా!
విలువలఁ జూడఁగ నెందునఁ
గలవో నీ వెఱుఁగ లేవె? ♦ కమలాక్ష హరీ! (10)


చదువుల సారము నెఱుఁగను
గదయా! వేదమున నిన్నుఁ ♦ గను మంత్రములన్
జదువఁగ లేనయ! సార
మ్మిదె కొనుమయ నా పలుకుల ♦ నెంచుచును హరీ! (11)


నీ లీల లద్భుతమ్ములు!
బాలుఁడ నీ ముందు నేను! ♦ వరదుఁడ వీవే!
లీలా మానుష విగ్రహ!
నాలోఁ గల వెతల డుల్చి ♦ ననుఁ గావు హరీ! (12)


కరి మొఱ విని కాచితివఁట,
"పరమేశా! కావు" మంచుఁ ♦ బ్రార్థింపంగన్;
పరిపరి విధముల నుతు లిడఁ,
గరివరదా! వేగ నన్నుఁ ♦ గావు మయ హరీ! (13)


ఓపిక నే పుణ్యములను
గోపిక లటఁ జేసినారొ? ♦ గొబ్బున వారిన్
దాపముఁ దీరిచి యెదలో
దీపించుచు నర్తనములఁ ♦ దేల్చితివి హరీ! (14)


మాయలఁ దెలియని బేలయు
నా యమ్మ యశోద కట్టె ♦ నా ఱోట నినున్!
మాయలఁ దెలియని నా మది
నో యయ బంధితుఁడ వగుమ! ♦ యురగశయ! హరీ! (15)


యుక్తియె లేదయ; నినుఁ గన
శక్తియు లేదయ్య; చేరఁ ♦ జాలను రక్తిన్;
భక్తసులభ నినుఁ గొలిచెద
భక్తిని! ముక్తి నిడు మయ్య ♦ పరమేశ! హరీ! (16)


దైత్యాంతక! నిను నే సా
హిత్యాత్మక పద్యము లిడి ♦ హితమతిఁ గొలువన్;
సత్యాత్మ నిడియుఁ బ్రోచుచు
నిత్యము మద్దురిత కృతుల ♦ నిర్జించు హరీ! (17)


లోకమ్మునఁ బాపమ్ములు
చేకొని యొనరించుచుండ్రి ♦ శిక్షాభయమున్
లేకయె! వారల మనమున
నే కపటము దొరలకుండ ♦ నియమించు హరీ! (18)


కడలినిఁ గడఁచి, సురస మద
మడఁచియు, లంకిణినిఁ గూల్చి, ♦ మైథిలిఁ గనియున్
దొడ విడి, లంకనుఁ గాలిచి
యడరిన హనుమయ్య భక్తి ♦ నందించు హరీ! (19)


బాలునిఁ గని దయ లేకయె
కాలుండయె కనక కశిప ♦ కల్మాషుఁడు తాన్!
బాలునిఁ గాఁచెడి నృహరివె!
యేలయ ననుఁ గావ రావు ♦ హిత మిడియు హరీ! (20)


కమలేక్షణ! హృదయేశ్వరి
కమలను హృత్కమలమందు ♦ కాంక్ష నిడియు నీ
విమలాత్మనుఁ బ్రకటించితి!
రమేశ! నా హృదయమందు ♦ రంజిలుము హరీ! (21)


నినుఁ దలఁచిన శ్రమ తొలఁగును;
నినుఁ దలఁచిన పనులు జరుగు; ♦ నిధులును గలుగున్;
నినుఁ దలఁప ముదము; కావున,
నినుఁ దలఁచెడు మనము నిమ్ము ♦ నిత్యమును హరీ! (22)


రవి చంద్రులు నేత్రములై
యవిరళముగ వెలుఁగఁ జేయు♦నయ లోకములన్!
కవిలోక వంద్య! నా మది
నవిరళముగ వెలుఁగఁ జేయు♦మయ వరద! హరీ! (23)


గురు పదముల ధ్యానించినఁ
దొలఁగును నజ్ఞాన తిమిర ♦ దోషమ్ము వెసన్!
గురువులకే గురుఁడవయా!
సరగున జ్ఞానమ్ము నిమ్ము ♦ సత్కృపను హరీ! (24)


సురలనుఁ గాఁచి, యసురులనుఁ
బరిమార్చియు, వేగ లోక ♦ పరితోష మిడన్
బరికీర్తితుండ వీవే!
సురేశ వాణీశ వంద్య! ♦ శుభకారి హరీ! (25)


బల ముడిగి నృపులుఁ గన, హరు
విలు విఱిచియు, జనక సుతనుఁ ♦ బెండ్లాడ, వెసన్
బలవంతుఁడవని లోకము
పలుమఱుఁ బొగడెఁ గద! నాకు ♦ బలమీవె హరీ! (26)


వశ ముడిగి నిన్నుఁ దెగడిన
శిశుపాలుని దోష శతము ♦ సీమను దాఁటన్
భృశమే ఖండించితివయ
శిశుపాలుని శిరము! చక్రి! ♦ చిద్రూప! హరీ! (27)


పాపి దశాస్యుఁడు సీతను
పాపముఁ దలఁపక హరించి ♦ బంధించఁగ నా
పాపినిఁ ద్రుంచితి! లోకులఁ
బాపాత్ముల వశము నుండి ♦ పాలింపు హరీ! (28)


ధనమున్నవారలందఱు
ధనగర్వముచేత రేఁగి, ♦ ధనహీనులనున్
"దీనులు, హీను" లనుచు నవ
మాన మిడఁగ, వేగ వారి ♦ మద ముడుపు హరీ! (29)


నీ పాద ధూళి చేతనె
శాపావధిఁ గనె నహల్య! ♦ సరి యా పదముల్
కాపాడఁ గడిగె గుహుఁ! డా
నీ పదముఁ గడిగెద నేత్ర ♦ నీరమిడి హరీ! (30)


వచ్చితి వ్రేపల్లెకు; నటఁ
జొచ్చితి గోపకుల యింటఁ ♦ జుఱ్ఱఁగఁ బాలన్;
గ్రుచ్చితి దనుజుల నెల్లను;
మెచ్చితి పదునారు వేల ♦ మెలఁతుకల హరీ! (31)


శ్రుతులం గాఁచితి; గిరి మో
సితి; కనకాక్షుని కనక క♦శిపు నొంచి; బలిన్
క్షితి నడఁచి; నృపుల వంచి; ప
దితలల దొరఁ ద్రుంచి; గీతఁ ♦ దెల్పితివి హరీ! (32)


శూలి ధను ర్భేదక! వన
పాల దనుజ నాశక! నయ♦బాహ్య దశాస్యో
న్మూలక! సవిధ స్థిత భూ
పాలక! కృత రామరాజ్య! ♦ పద్మాక్ష! హరీ! (33)


పుట్టితివి దేవకికి; మఱి,
మెట్టితివి యశోద యింట ♦ మేలుం గూర్పన్;
గొట్టితివి రక్కసుల నిల;
మొట్టితివయ ఖలునిఁ గంసు ♦ మోదమున హరీ!(34)


తాపసులనుఁ దాపసివయి;
భూపతులను నృపుఁడవయి; ఋ♦భువుల ఋభుఁడవై;
గోపాలక! భూగోవును
నేపారఁగఁ గాఁచి తీవు! ♦ హేమాంగ! హరీ! (35)


దేవముని నారదుం డొక
దేవ విరిని నిడఁగ, నీవు ♦ దేవేరి కిడన్,
దేవా! సత్యయె యలుఁగన్,
దేవేంద్రు గెలిచి, కుజమునె ♦ తెచ్చితివి హరీ! (36)


సుర లసురు లమృతమునకయి
ధరాధరము పాలకడలిఁ ♦ ద్రచ్చఁగ మునుఁగన్
ద్వర కూర్మమవై నీవటఁ
గరుణను మంధరము మోసి, ♦ గతి నిడితి హరీ! (37)


భువి నసురుం డడవికిఁ జని,
భవునిఁ గూర్చి తపము సేసి, ♦ భస్మాసురుఁడై,
శివునే పరీక్ష సేయఁగ,
నువు మోహినివయ్యు వాని ♦ నొంచితివి హరీ! (38)


అమృతము సురాసురులు గొని,
తముఁ దామే పోరుచుండఁ, ♦ దగ మోహినివై
యమృతముఁ బంచితి సురలకు!
విమతుల మృతి కెఱఁగఁ జేయ ♦ వినయాన హరీ! (39)


నిరతము నిన్నును నందఱు
"సరసిజనయనా! ముకుంద! ♦ సర్వేశ! యతీ!
స్మరగురు! మధుసూదన! జిన!
మురహర!" యనుచును స్మరింత్రు ♦ మోక్ష మిడ హరీ! (40)


"వినఁ డితఁ" డని మాత యపుడు
నినుఁ ఱోటికిఁ గట్టివేయ, ♦ నీడ్చుచు, మద్దుల్
గని, నడుమన నునిచి, తిగువ
ను, ననిమిషులు శాపము విడ, ♦ నుతు లిడిరి హరీ! (41)


ఎంగిలి పండ్లను నీకిడి
వంగిన మనమునను నిన్ను ♦ భక్తి నుతింపన్
బొంగియుఁ గాఁచితి శబరిని
హంగుగ మోక్షమ్ము నిడియు ♦ యజ్ఞేశ హరీ! (42)


పిడికెడు నటుకుల రుచిఁ గొని,
యిడియును నైశ్వర్యములను; ♦ హితునిఁ గుచేలున్
విడిపోని బంధమునఁ బ్రే
ముడిచే సేవల నొనర్చి ♦ మురిసితివి హరీ! (43)


భువనేశ! దైత్యనాశా!
భవ నాశక! పద్మనాభ! వరద! పరేశా!
స్తవనీయ! హృషీకేశా!
త్రివిక్రమా! శ్రీశ! నాకు ♦ దిక్కీవె హరీ! (44)


అరమరిక లేలనయ్యా
కరుణాకర! నన్నుఁ గావ? ♦ కైమోడ్చితి; నా
పరదైవ మీవె యంటిని;
పరమాత్మా! వేగ రమ్ము ♦ వరమిడఁగ హరీ! (45)


త్రికరణ శుద్ధిగ నీ గుణ
నికర పదచ్ఛాయలోన ♦ నివసించినచో
నకళంక జీవనస్థితి
సుకరమ్మై చేరు సకల ♦ శుభములును హరీ! (46)


ఒకఁడుండు లేమిఁ గుములుచు;
నొకఁడుండును కలిమియందు ♦ నొందుచు సుఖముల్;
సుకరముగఁ దెలియ నీ స్థితి
ప్రకటితమగుఁ బూర్వజన్మ ♦ వాసనల హరీ! (47)


నీ లీలఁ దెలియలేకయె
కూలి వెతల; జతనములనుఁ ♦ గొనమయ నిచ్చల్;
గాలిని దీపము నిడెదము;
మేలు నిడెడి నిన్నుఁ దలఁప ♦ మిఁక నోమ హరీ! (48)


నినుఁ గొల్వ గుడినిఁ గట్టఁగ
ధనమునుఁ గూర్చుకొనియు, సర♦దారుని సుంక
మ్మునుఁ గొని, వెఱవక, భద్రా
ద్రిని గోపన్నయె సృజించెఁ ♦ దిరముగను హరీ! (49)


త్యాగయ్య హృదయమందున
రాగమ్మునఁ గీర్తనమున ♦ రాముని వయ్యున్
దాగి గెలిపించితయ్యా
త్యాగమునకు నిలయునిగను ♦ ధరలోన హరీ! (50)


ధరఁ బ్రహ్లాదునిఁ గావఁగ
వర కరుణా వీక్షణములఁ ♦ బ్రసరింపంగన్
గరము విలంబముఁ జేసియు;
నరసింహుఁడవయ్యుఁ గాచి♦నాఁడవయ హరీ! (51)


లక్షించి కౌరవులు ఘన
శిక్షను నిడఁ బాండవులనుఁ ♦ జేరంగనుఁ గో
పాక్షుని దుర్వాసుఁ బనుప
నక్షయపాత్ర మెతుకుఁ దిని ♦ యరసితివి హరీ! (52)


త్రిపురాసుర సంహార
మ్మపుడా శివునకును నీవు ♦ నస్త్రమ్ముగనై
త్రిపురములఁ గాల్చినాఁడవు
విపుల యుద్ధమందు నిలిచి ♦ వెలుఁగొంది హరీ! (53)


ముని కృతమున సిరి కోప
మ్మునుఁ గొని వెడలఁగను నీవు ♦ పుట్టం జొరఁగన్
గని, హర చతురానను లట
వనమున గో వత్సము లయి ♦ పాలిడిరి హరీ! (54)


నిను మనమున నిలుపుకొనియు
వినుతింతునుఁ బద్దెములను ♦ విశ్వేశ్వర నన్
గనుమయ కటాక్షముల వే
గను ననుఁ బ్రోవుమ రమేశ! ♦ కరుణాత్మ! హరీ! (55)


దండమయా జగదీశ్వర!
దండమయా నీరజాక్ష! ♦ దండము శౌరీ!
దండమయా దనుజాంతక!
దండమయా వేదవేద్య! ♦ దండ మిదె హరీ! (56)


నా కష్టములనుఁ బాపుచు
లోకేశా! శాంతి నిడుము! ♦ లోకము నందున్
నా కిష్టమైన దైవమ!
నా కిలఁ బరమార్థ మిమ్ము ♦ ననుఁ గనుచు హరీ! (57)


లోకమ్మును సృజియించుచు;
లోకముఁ బాలింప జనుల♦లో వెలుఁగుచు; నీ
లోకమును లయ మొనర్చుచు;
లోక మ్మీ వగుదు గాదె ♦ లోకేశ! హరీ! (58)


ఆ రంతిదేవుఁ డెప్పుడు
కోరిన యాచకుల కెపుడు ♦ కూరిమి నిడుచున్
ధీరుండై మోక్షముఁ గొనె!
నారాయణ! ధర్మబుద్ధి ♦ నా కిడుము హరీ! (59)


జనకుని యానతిఁ దాల్చియు
జననిం బరిమార్చి తండ్రి ♦ సంతోషపడన్
జననిం బ్రతికించితి వయ
ఘనకుఠార! పరశురామ! ♦ కావుమయ హరీ! (60)


నీ మహిమలఁ గనుఁగొనఁగను
బ్రేముడి మన మంత నిండు ♦ శ్రీలక్ష్మీశా!
నేమమున నిన్నుఁ గొల్చితి
నా మనమున నిలువు మయ్య ♦ ననుఁ గావ హరీ! (61)


భవ సాగరమున మునిఁగియు
నవయుచు మే ముంటి మయ్య ♦ నరక మ్మిదియే!
నవనీత హృదయ! నన్నిఁక
భువినిం దప్పించి దివికిఁ ♦ బో విడుము హరీ! (62)


చేసెడిది తామె యనుచును
జేసెడి కర్మముల గొప్పఁ ♦ జేఁజేతఁ బ్రజల్
వాసిగఁ జెప్పుచు నుందురు!
చేసెద వీ వంచుఁ దెలివిఁ ♦ జేకొనరు హరీ! (63)


శివునాజ్ఞ లేక చీమయె
భువిఁ గుట్ట దటంచు నెఱిఁగి ♦ ముఱియుదుము! కనన్
భువి నీ యానతి నన్ని, య
భవ! నడువఁగఁ, బాపపుణ్య♦పరు లెవరు హరీ? (64)


పుట్టించితి మనుజునిగను
మెట్టించితి మనుజులందు ♦ మిన్నగ నన్నున్
గిట్టించఁగానుఁ దృప్తిగఁ
గట్టెదుటనుఁ గానుపించి ♦ కావుమయ హరీ! (65)


జీవాంతర్హృదయమ్మునఁ
దావక ప్రేమామృత మిడఁ ♦ దరితీపేలా?
జీవాత్మనుఁ బరమాత్మయె
కావఁగ వలెఁ గాదె, చూపి ♦ కనికరము, హరీ! (66)


నా దైవమ! నా ప్రాణమ!
వేదాదుల యందు నీవె ♦ విదితుఁడ వనఁగన్;
వేదాంత వేద్య! నేనే
వేద మ్మెది యెఱుఁగ నయ్య ♦ ప్రియ వరద హరీ! (67)


నే నింతవాఁడ నంచును
దానయి చెప్పుకొనుచుండుఁ ♦ దఱచియు నరుఁడున్!
తానెట్లు గొప్పవాఁడో
తానెఱుఁగునె, నీ మహిమలఁ ♦ దలఁపకయె, హరీ? (68)


పలు మతములఁ; బలు కులములఁ;
బలు భాషల, దేశములనుఁ; ♦ బలు వ్యవహృతులన్;
బలు మనముల దీపించుచు
నిలిచియు దైవ మ్మొకండె ♦ నివసించు హరీ! (69)


గోవింద! నీదు నామము
భావింప మనమ్మునందు ♦ భాసిలుచు వెసన్
బావన మొనరించును రా
జీవము పరిమళముఁ జిమ్ము ♦ చెన్నుగను హరీ! (70)


పిలిచినఁ బలుకఁగ లేదని
కలవర మందుచును జనులు ♦ గడఁగియు నెంతే
నలిఁగియు దైవమె లేఁడని
పలు విధములఁ బలుకకుండ ♦ పలుకుమయ హరీ! (71)


నాలోని పద్య విద్యకు
నాలంబన మీవె దేవ! ♦ నా మనమున నీ
జాలము లలిత గతుల పద
జాలము నర్తింపఁ జేసె! ♦ సత్య మిది హరీ! (72)


సర్వముఁ గాంతువు నీవే;
సర్వలోక వినుత! నిన్ను ♦ శరణంటినయా!
సర్వాంతర్యామీ! నా
గర్వమ్మునుఁ బరిహరింపఁ ♦ గనుమయ్య హరీ! (73)


మోసముఁ జేసెడు వారల
దోసములను బయటపెట్టి ♦ దుర్జన కృతమున్
వేసమ్ము తోడఁ దెలిపియు
దాసోఽహమ్మనెడు నటులఁ ♦ దరువిడుము హరీ! (74)


పొత్తముల వెలుఁగు విద్యయుఁ
జిత్తమునను వెలుఁగు జ్ఞాన ♦ శేషము త్వద్వా
గ్దత్తము కాదే! యిఁక నే
నిత్తును నా హృదయ కుసుమ ♦ మిదె కొనుము హరీ! (75)


మనుజులలో మనుజుఁడవై;
దనుజుల నిల రూపుమాపి, ♦ దశరథ రాముం
డను పేరఁ బరఁగి, కపికుల
ఘనుఁ గాఁచితి వాలిఁ జంపి ♦ కరుణాఢ్య హరీ! (76)


ఖగపతిని వాహనముగ; భు
జగపతి నొక తల్పముగను ♦ సరగునఁ గొనియున్
జగముల నేలెడి పతివై
యుగయుగముల వెలుఁగుచుంటి♦వోయయ్య హరీ! (77)


దుష్టులఁ దునుమాడి ధరను
శిష్టుల రక్షించి శమము ♦ స్థిరపఱచి వెసన్
గష్టమ్ములఁ దొలఁగించియు
నిష్టమ్ములఁ గూర్తువయ్య ♦ నేమమున హరీ! (78)


ఉత్కృష్ట చరిత! నిన్నిఁక
సత్కృతులం దొనరఁజేయు ♦ సన్నుతి, గుణ సం
పత్కర వర కరుణాది ర
సోత్కరమై వెలుఁగఁ జేయు ♦ సుగుణుఁడవు హరీ! (79)


నారదునకు సంసారపుఁ
గోరిక నిడఁ దానె తెలిసి♦కొనియునుఁ దా సం
సారము వ్యర్థమ్మను వ్యా
హారమ్మును మాను మహిమ ♦ యది నీదె హరీ! (80)


పదునాఱువేల గోపిక
లొదవిరి శృంగార భక్తి♦లోన మునిఁగియున్
సదయన్ నీ సహచరులుగ
మెదలుట నీ మహిమ కాదె ♦ మితముగను హరీ! (81)


నీరేజ పత్రములపై
నీరపుఁ గణ మెవ్విధమున ♦ నిలువదొ, ఘన సం
సారపు సాగరమున న
న్నారీతిని నంటకుండ ♦ నడిపించు హరీ! (82)


బాల్యమున మహిమఁ జూపియు
మాల్యమ్మునుఁ గొంటివయ్య ♦ మాన్య హితుల సౌ
శీల్యపు టటుకులఁ గొని కై
వల్య మిడితి నన్ను నటులె ♦ పాలింపు హరీ! (83)


అజ్ఞానము కనుఁ గప్పఁగ
విజ్ఞతతో నిన్నుఁ జూచు ♦ వెరవుఁ గనక నా
ప్రజ్ఞయె యడుగంటెను నీ
యాజ్ఞ నిడియుఁ బ్రోవుమయ్య ♦ హర్షమున హరీ! (84)


ఈ మనుజుల యాచింపఁగ
నీమము విడి చులకనఁ గని ♦ నిరసింతురనన్;
వామన! యా బలి నడిగితి
వేమయ్యా చులకనైతి♦వే యచట హరీ? (85)


హరి నామ స్మరణముచే
హరియింతువు దురితములను ♦ నర్థిఁ దలంపన్
సిరులనుఁ గోరను; మోక్షపు
సిరుల నిడియుఁ బ్రోవుమయ్య ♦ శీఘ్రముగ హరీ! (86)


అండజ వాహన! పాపపుఁ
గొండల గూల్చియును మాకుఁ ♦ గూరిమితో నా
ఖండల వైభవ మిడఁగను
దండ మిడెద నయ్య నీకు ♦ దయఁ గనఁగ హరీ! (87)


మత్స్యావతారము:
సోమకుఁడు వేదములఁ గొని
తామసియై సంద్రమందు ♦ దాచఁగ ఝషమై
సోమకునిఁ ద్రుంచి వేదము
లోమియు నబ్జజున కిడిన ♦ ప్రోడవయ హరీ! (88)


కూర్మావతారము:
అమృతముఁ గొనఁగను రాక్షసు
లమరులుఁ ద్రచ్చంగ మంధ♦రము మునుఁగఁగఁ గూ
ర్మమవై గిరిని ధరించియు
నమృతము నిడితివయ నీవు ♦ నమరులకు హరీ! (89)


వరాహావతారము:
భూమినిఁ గనకాక్షుండే
తామసమునఁ జాపఁ జుట్టి ♦ దభ్రమున నిడన్
నేమమున ఘృష్టివై యా
హేమాక్షుం జంపి కాఁచి ♦ తీ భువిని హరీ! (90)


నృసింహావతారము:
బాల ప్రహ్లాదుం డటఁ
గ్రాలుచు నిను భక్తిఁ జూపఁ♦గాను కశిపుఁడే
తాళక కంబముఁ గొట్టఁగ
లీల నృహరివయ్యుఁ గశిపుఁ ♦ ద్రెంచితివి హరీ! (91)


వామనావతారము:
పదములు రెంటిని భువి దివిఁ
బదరి కొనియు బలిని మఱొక ♦ పాదమ్ము నెటన్
గదియింతన; బలి యిడఁ దల;
సదయ నిడితి నిమ్నలోక ♦ స్వామ్యమును హరీ! (92)


పరశురామావతారము:
ధర నిరువదియొక మాఱును
బఱఁగ నృప తతిఁ బరిమార్చి ♦ వసుధ ననృపగాన్
వర పితృతర్పణ మిడితివి
పరశుధరా పరశురామ ♦ పరమేశ హరీ! (93)


శ్రీరామావతారము:
యతిఁ గావఁగఁ దాటకఁ జం
పితి; ఱాతిని నాతిఁ జేసి, ♦ వే హరువిలుఁ ద్రుం
చితి; కీశుఁ బ్రోచి, రావణు
హతమార్చియు సీతఁ గొంటి♦వయ రామ! హరీ! (94)


శ్రీకృష్ణావతారము:
చెఱసాలఁ బుట్టి, గోకుల
మురుగతిఁ జని, రక్కసులనుఁ ♦ బొరిగొని, గిరినిన్
ధరియించి, కంసుఁ జంపియు,
దరుణులఁ బదునాఱువేలఁ ♦ దగఁ గొంటి హరీ! (95)


(పౌరాణిక) బుద్ధావతారము:
బుద్ధుఁడవయి త్రిపురాసుర
శుద్ధ సతుల గురుఁడవయ్యుఁ ♦ జూడఁగ మాయా
బద్ధ రతికేళిఁ దేల్చిన
తద్ధర్మోజ్ఝితులఁ గాల్చు ♦ దహనాస్త్ర హరీ! (96)


(లౌకిక) బుద్ధావతారము:
క్షితి సుఖములు నరుల కశా
శ్వతము లటం చెఱిఁగి లోక ♦ పరమార్థద శా
శ్వత వర సత్య జ్ఞానో
ర్జిత బుద్ధుఁడవై సుబోధ ♦ లిడితివయ హరీ! (97)


కల్క్యవతారము:
నరజాతి సంకరమ్మును
బరిమార్పఁగ గుఱ్ఱ మెక్కి ♦ పాపము డుల్పన్
ద్వర దుష్టుల శిక్షించుచుఁ
బఱఁగను శిష్టులనుఁ బ్రోతు♦వయ కల్కి! హరీ! (98)


తొడఁగియు వారధిఁ గట్టఁగ
సడిచేఁ గపివరులుఁ గొండ♦చఱియలు వేయన్
వడి భక్తి నుడుత సాయ
మ్మిడి రామాంగుళిఁ ద్రిరేఖ ♦ నిలఁ గొనెను హరీ! (99)


లక్ష్మీశ! కరుణచే నిట
సూక్ష్మమ్మగు మోక్ష మెంచి ♦ చూడుము మము నీ
లక్ష్మకృత వీక్షచేతను
నీ క్ష్మాతలి కన్న మిన్న ♦ నిడఁగాను హరీ! (100)


దగ్గఱి చుట్టమె శబరియు
నిగ్గగు నెంగిలి ఫలముల ♦ నిడె భుజియింపన్?
దగ్గఱి బంధువె గుహుఁడును
డగ్గఱి నీ పాదములనుఁ ♦ దగఁ గడిగె హరీ? (101)

ఓం నమో భగవతే వాసుదేవాయ


స్వస్తి

శుక్రవారం, ఏప్రిల్ 08, 2016

నవ యుగాదీ...దుర్ముఖీ...స్వాగతం...!!!

మిత్రులందఱకు నవ్య త్రిలింగ వత్సరాది శుభాకాంక్షలు!!!



శార్దూలము (పంచపాది):
స్వస్తిశ్రీ నవ దుర్ముఖీ! శుభద! సత్సంపత్కరీ! వత్సరీ!
అస్తోకోజ్జ్వల దివ్య నవ్య భవితాహార్య ప్రభావోదరీ!
ప్రస్తుత్యాధిక ముఖ్య కావ్య లహరీ!  వాణీ శివానీ రమో
పాస్తిత్యంకిత ధాత శంభు బలివిధ్వం సీద్ధ భద్రంకరీ!
ప్రస్తావింతును నేఁడు మా కొసఁగు మీ  పర్వాన సర్వోన్నతుల్!! 1

తే.గీ.
ఈ యుగాది దినాన నేనేమి వ్రాఁతు?
పర్వమన మది మెదలు నింబామ్రతరులు;
శుకపికమ్ముల రవము; కింశుక సుమాలు;
కొదమ తేఁటుల నృత్యాలు,  పదములన్ని!! 2



తే.గీ.
జనము పెరిఁగియు, వనము  భోజనము సేసి,
ప్రకృతి శోభలఁ గసితీఱ  వికృతపఱచి,
నగరములఁ బెంచి, నవయుగ  నాగరకులయి,
యెదిగి పోయితి మందు రిదేమి మాయొ? 3



తే.గీ.
కుహుకుహూ రావముల తోడఁ  గోకిలమ్మ
చిగురుటాకుల ముక్కునఁ  జేర్చుకొనుచు,
"రార, వాసంతుఁడా, రార,  రమ్ము రమ్మ"
టంచు ముదముతోఁ బిలిచెనే  యంగలార్చి? 4



తే.గీ.
కిలకిలా రావముల తోడఁ  గీరములును
దోర పండ్లను దినుచునుఁ  దోరముగనుఁ
జెట్ల పుట్టల గుట్టలఁ  జేరఁ బిలిచి
మాటలాడెనే సంతస  మంది నేఁడు? 5



తే.గీ.
దూరముగ నున్న కొండపైఁ  దోచి, నిత్య
మగ్ని కీలలఁ దలఁపించు  నట్టి వైన
మోదుగుల పూఁత లీనాఁడు  మోము దాచి,
పాఱిపోసాఁగె వేగాన  వనము విడచి!! 6



తే.గీ.
పూవుఁ దోటలఁ దిరుగాడి,  పుప్పొడులను
మేనికినిఁ బూసికొనుచును  మేలమాడి,
యాడి పాడెడి తుమ్మెద  లేడఁ బోయె?
నవియె పూఁ దేనె లేకయే  యలిగెనేమొ!! 7



తే.గీ.
పూర్వ మున్నట్టి ప్రకృతి యబ్బురముగాను
మాయమాయెను; మనిషియు  మాఱిపోయె;
మాయమాయెను సంస్కృతి;  మాయమాయెఁ
బండుగల తీరు తెన్నులు  భారతమున! 8



తే.గీ.
మార్పు రావలె నేఁడైన  మనిషిలోన;
సంస్కృతుల్ సంప్రదాయాల  సంస్కరించి,
ప్రకృతిఁ బూజించి, మనమునఁ  బరవశించు
దినము దుర్ముఖీ యీయవే  ఘనముగాను! 9

ఉత్పలమాల:
జీవులకెల్ల సౌఖ్యములు,  క్షేమము శాంతి శుభాది వైభవాల్,
జీవన మిచ్చి, ప్రోచి, విరచించిన ధాన్య ధనాది సంపదల్
దీవన తోడుతన్ మనిచి,  తృప్తియు, తోషణ సమ్ముదమ్ము, ప
ర్యావరణమ్ముఁ గూడ కడు  రమ్యత నీయవె మాకు దుర్ముఖీ! 10





-:శుభం భూయాత్:-