Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జులై 07, 2015

సమస్య: కోఁతినిఁ బెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చఁగా!

తేది: జూన్ 07, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

(అంజనా దేవి కేసరిని వివాహమాడిన ఘట్టమునిట ననుసంధానించుకొనునది)

ఉత్పలమాల (షట్పాది):
జాతికి "నొక్క యప్సర"యె, శాపవశమ్మున "నంజనాఖ్య"యై,
కూఁతురుగా జనించె కపి "కుంజర" నామక సౌమనస్వికిన్!
భాతిగఁ బ్రత్యహమ్ము గుణవర్ధని యౌచును నుండ, నొక్కెడన్
గౌతుకమొప్పఁగా సఖులు కూర్మినిె వెన్కొనఁ గాన కేఁగి, తా
భీతిలె హస్తిఁ జూచి! కని వేగమె, "కేసరి" దానిఁ జంప, నా
కోఁతినిఁ బెండ్లియాడె "నొక కోమలి" స్నేహితురాండ్రు మెచ్చఁగా!!




***        ***        ***        ***

శంకరయ్యగారు ఇచ్చిన సమస్య యథాతథముగఁ దీసికొన్నచో :
కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చఁగా!!
దీనినీవిధముగఁ బూరించితిని:


(పరిశీలనా జ్ఞానము చక్కఁగా లేని యొక కోమలి చేష్ట)

"దాతనుఁ బెండ్లి చేసుకొనె" దంచునుఁ బోవుచు దారిఁ దోఁటలోఁ
గాఁతయుఁ గాఁచి, గొప్ప వడగాలికి రాలిన మావికాయలన్,
జూత సుగంధపున్ సొగసు స్రుక్కఁగఁ గాంచియొ, దానిఁ గానలే
కో, తిని, పెండ్లియాడె నొక కోమలి, స్నేహితురాండ్రు మెచ్చఁగా!




2 కామెంట్‌లు:

  1. pellillalo vivaaham munduini mithaayi tinipistaaru. aa ardhamlo pando, jilebiyo, pootareko tini.....ani oka pedda manishi ee samasyanu poorinchaaru

    రిప్లయితొలగించండి
  2. vruttanti.blogspot.comగారూ! నిజానికి రెండవపూరణమున సమస్యాపాదమునందు దోషమున్నది. మీరు మొదటిదానితోఁ బోల్చి చూస్తే తెలుస్తుంది.

    "కోఁతినిన్ + పెండ్లియాడె..కోఁతినిఁ బెండ్లియాడె" అనవలెను. మఱొక్కటి..."కోఁతి" పదమునకు "క్రోఁతి" అనే రూపాంతరము కూడ కలదు. అప్పుడు మఱొకవిధంగా పూరించాలి. మొదటి పూరణమును ఈ రెండు పదములూ ప్రభావపఱచలేవు. ఇకపోతే...

    మీరన్నట్టుగా...ఏ పూఁతఱేకో తిని...అనడానికి ఇక్కడ అవకాశములేదు. కోఁతినిన్ + పెండ్లియాడె...అనడం వల్ల...పూఁతఱేకో...అంటూ...తినిన్ పెండ్లియాడె...అనలేము...తిని, పెండ్లియాడె..అంటేనే సరిపోతుంది. కాని సమస్యలోనే దోషము ఉన్నది. కాబట్టి దానిని మొదటి పూరణలోవలె సమస్యా పాదమును సవరించుకొని పూరించడం జరిగింది. రెండవది...కేవలము సమస్య నిచ్చిన వారిని సంతృప్తి పఱచుటకు మాత్రమే పూరించుట జరిగినది.

    స్పందించి వ్యాఖ్య పెట్టినందుకు ధన్యవాదములు. స్వస్తి.

    రిప్లయితొలగించండి