Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, నవంబర్ 12, 2013

సమస్యాపూరణం: చేపల పులు సడిగెరా వశిష్ఠుఁడు ప్రీతిన్


తేది: ఆగస్టు 14, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నేను రాసిన నాలుగు పూరణములు...


(1)
(ఏకాదశి నాఁటి యుపవాస దీక్ష చెడకుండుటకై వశిష్ఠుఁడు పలికిన సందర్భము)

తాపసి కాతిథ్యం బిడఁ
గా, పాఱుం డొకఁడు పిలువఁ గా దనకయె దా
దాపది తప్పించుకొనఁగఁ
జేపల పులుసడిగెరా, వశిష్ఠుఁడు ప్రీతిన్!

(2)
సాపాటున కొక మూఢుఁడు
చేపల పులుసడిగెరా! వశిష్ఠుఁడు ప్రీతిన్
దాపునకుఁ బిల్చి, యాతని
చాపల్యముఁ బోవఁ జేసి, సద్గురు వాయెన్!

(3)
(మిత్రసహుఁడను రాజునింటికి భోజనమునకై వెడలినపుడు వశిష్ఠునిపై నొక దనుజుఁడు మాయఁ బన్నిన సందర్భము)

సాపాటున నర మాంసము,
చేపల పులుసడిగెరా, వశిష్ఠుఁడు ప్రీతిన్!
దాపున నవి కని, వెంటనె
కోపము రా, నపుడు దనుజు ఘోరముఁ దెలిసెన్!

(4)
(పరస్పర శాపకారణమున వశిష్ఠుఁడు ఆడేలుగను, విశ్వామిత్రుండు బకముగను మారి, కలహించు సందర్భము)

దాపున గాధిజుఁ గని, నగి,
చేపల పులుసడిగెరా, వశిష్ఠుఁడు ప్రీతిన్!
'చేపల నీవే తిను'మని
తాపసి యాడేలు కనియెఁ దాఁ దోడేలై!



2 కామెంట్‌లు:

  1. మధుసూదన్ గారూ,
    ఒకదానిని మించి ఒకటి అద్భుతమైన పూరణలు. చిత్రాన్ని జోడించడం వన్నె తెచ్చింది. మీకు నా అభినందనలు.
    అన్నట్టు నేను హైదరాబాదులో వృద్ధాశ్రమంలో చేరాను. తెలిసింది కదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు శంకరయ్యగారూ! ఈ మధ్య (రెండు రోజుల నుండి) అనారోగ్య కారణం వల్ల పోస్టులు పెట్టలేకపోయాను. శంకరాభరణంలో కూడా పాల్గొనలేకపోయాను. మీరు హైదరాబాదులో ఎప్పుడు చేరారు? ఆశ్రమంలో చేరవలసినంత అవసరం మే కెందుకు కలిగిందో తెలియదు. మీరు వెళ్ళిపోయినందుకు నాకు బాధగానే ఉంది. అయితే, ఏదో బలీయమైన కారణం ఉండే ఉంటుందని నమ్ముతున్నాను. వివరాలు ఫోన్ ద్వారా తెలుపగలరు. నమస్కారములతో...

      తొలగించండి