మంగళవారం, సెప్టెంబర్ 02, 2014
సమస్య: వల్లకాటిలోఁ బెండ్లి సంబంధ మమరె
తేది: ఆగస్టు 24, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:
పెండ్లి కాకుండ గిట్టిన పిన్నబాలు
నకును, జిల్లేడువృక్షమ్మునకునుఁ బెండ్లి
సేయవలెఁగానఁ, గాటిలోఁ జేయఁబోవ,
వల్లకాటిలోఁ బెండ్లి సంబంధ మమరె!
పద్య రచన: వినాయక చవితి-చంద్రదర్శనము (శమంతకమణి వృత్తాంతము)
తేది: ఆగస్టు 29, 2014 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నేను రాసిన పద్యములు
పార్వతి శాపవృత్తాంతము:
చవితి దినమున నవ్వంగఁ జందమామ,
కొడుకు గణనాథు నుదరమ్ము క్రుమ్మరించె
లోని కుడుముల, నుండ్రాళ్ళ; వానిఁ జూచి,
క్రోధమున శపించెను గౌరి బాధతోడ!
"చవితి దినమున నేవారు చంద్రుని ముఖ
దర్శనము సేతురో వారు తత్క్షణమ్మె
తగని నీలాపనిందల నెగడుదురయ!"
యనఁగ, దేవతల్ ప్రార్థింప వినిచె నిట్లు;
"నాదు తనయునిఁ బూజించి, నాఁడు నక్ష
తలఁ దలపయిఁ జల్లుకొన నిందలు తొలఁగి, శు
భమ్ము లొనఁగూడు" ననుచు శాపావధి నిడ,
నంద ఱానందమందిరి, వందనమిడి!
శ్రీకృష్ణుని చంద్రదర్శనము:
అల వినాయక చవితి సాయంత్రమందుఁ
గృష్ణుఁ డొంటిగఁ దోఁట కేగియు నచటనె
కూర్చొనఁగ రుక్మిణీసతి కూర్మిమీఱ
దుగ్ధపాత్ర నొసఁగఁగ నందునను నతఁడు
చంద్రుఁ బొడఁగాంచినంత సాక్షాత్కరించె
నింద; సత్రాజితుని దమ్మునిం దునిమి, య
తని శమంతకమణిఁ గొనె ననుచు వేగ!
దైవమైననుఁ దలవ్రాఁతఁ దాఁటఁ గలఁడె?
(అది, ప్రసేనుండు ధరియించి యడవి కేగ,
సింగ మొక్కం డతనిఁ జంపి, చెలఁగి కొనఁగ,
జాంబవంతుండు సింహముం జంపి, దానిఁ
దనదు కొమరిత మెడలోనఁ దనర వైచె! )
దానఁ గృష్ణుండు వనికేగి, తఱచి వెదుక,
నొక్కచో జాంబవంతునియొక్క తనయ
జాంబవతి కంఠమందున సౌరభమిడు
నా శమంతకమణిఁ జూచి, యతనితోడ
యుద్ధముం జేసి, యోడించి, యుక్తముగను
జాంబవతితోడి మణిఁగొని, సరగునఁ జని,
యచట సాత్రాజితిం బొంది, యందగించె
విఘ్నపతి చల్లఁగాఁ జూడ వెన్నుఁడంత!
శుభం భూయాత్
ఆదివారం, ఆగస్టు 31, 2014
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
స్వాగత వృత్తము:
శ్రీ గణేశ! ఘన చిత్సుఖ దాతా!
శ్రీ గిరీశ సుత! శ్రేష్ఠ! వరిష్ఠా!
యోగి రాడ్వరద! యోగ విశేషా!
స్వాగత ప్రమథ వర్గ! నమో ఽహమ్! (
1
)
ప్రమాణి వృత్తము:
గజాననా! ఘనాకృతీ!
ప్రజావళి ప్రమోద! స
ద్ద్విజ స్తుత! స్థిరా! చతు
ర్భుజా! నమో ఽస్తు తే ఽనిశమ్! (
2
)
ప్రణవ వృత్తము:
హేరంబా! మిత హిత సంతోషా!
గౌరీ నందన! కరి మూర్ధన్యా!
సూరి ప్రాకట శుభ సంశ్లోకా!
భూరి క్షత్ర! విముఖ! వందే ఽహమ్! (
3
)
శాలినీ వృత్తము:
సారాచారా! నీత సత్పుణ్య దాతా!
పారాశర్యామోద బాష్పోత్సుకా! క్రౌం
చారి భ్రాతా! భూరి సమ్మోద పాత్రా!
ధీర స్తుత్యా! హే ద్విదేహ ప్రభాసా! (
4
)
వంశస్థము:
నమో నమో విఘ్న వినాశకాయ తే!
నమో విచిత్రాయ! వినాయకాయ తే!
నమః పవిత్రాంచిత నామకాయ తే!
నమో సదాదాన! ఘనాయ తే నమః! (
5
)
వన మయూరము:
హేరుక! భవాత్మజ! మహేంద్ర నుత గాత్రా!
ధీర! సుముఖ! ప్రముఖ! దివ్య దరహాసా!
ఘోర తర సంసృతి వికూప తరణాప్తా!
చారు రుచి దంత కులిశ ప్రహరణాఢ్యా! (
6
)
స్రగ్విణీ వృత్తము:
పార్వతీ నందనా! భారతోల్లేఖనా!
సర్వ గర్వాపహా! ఛాత్ర విద్యోదయా!
ఖర్వ విఘ్నోన్నతా! కార్య సిద్ధిప్రదా!
శర్వ పుత్రాగ్రజా! శాంత మూర్తీ! నమః! (
7
)
ఇంద్ర వంశము:
జీవేశ! సర్వోత్తమ! చేతన ప్రదా!
దేవ స్తుతా! శాంకరి! ధీ విశేష! ది
వ్యా! విశ్వ సంపూజిత! వక్రతుండ! ఢుం
ఠీ! వేద వేద్యా! ఘన తేజ! తే నమః! (
8
)
భుజంగ ప్రయాతము:
ద్విపాస్య! త్రి ధామ! త్రిధాతు! ప్రసిద్ధా!
సుపర్వ ప్రమోదా! శుభాంగా! వృషాంకా!
కపి త్థాత్త సంపృక్త భుక్త ప్రహృష్టా!
కృపాంభోధి! కుబ్జాకృ తీశా! నమస్తే! (
9
)
(శుభం భూయాత్)
శనివారం, ఆగస్టు 30, 2014
న్యస్తాక్షరి: వినాయక స్తుతి!
తేది: ఆగస్టు 29, 2014 నాటి శంకరాభరణంలోని
న్యస్తాక్షరి
శీర్షికన ఈయబడిన
అంశం-
వినాయక
స్తుతి
ఛందస్సు-
ఆటవెలది
మొదటిపాదం
1వ అక్షరం ‘
వి
’
రెండవ పాదం
3వ అక్షరం ‘
నా
’
మూడవ పాదం
10వ అక్షరం ‘
య
’
నాలుగవ పాదం
12వ అక్షరం ‘
క
’
దీనికి నా పూరణము:
వి
ధు రుచి నిభ గాత్ర! విష్ణు! ద్విమాత్రుక!
ప్రార్థ
నా
ద్య మంత్ర! పర్శుపాణి!
విశ్వనేత! ఢుంఠి! విఘ్ననా
య
క! శూర్ప
కర్ణ! తే నమో
ఽ
స్తు ఖనక రథి
క
!
శుక్రవారం, ఆగస్టు 29, 2014
సమస్య: అమ్మా యని పిలువఁగానె యాగ్రహమందెన్
తేది: ఆగస్టు 22, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు:
1. వరూధినీ ప్రవరాఖ్యుల సంభాషణము:
అమ్మానిని ప్రవరునిఁ గని
"కొమ్మా నను; సఖిగ నేలుకొ"మ్మని యనఁగా,
నమ్ముదితను "దారినిఁ జూ
పమ్మా!"యని పిలువఁగానె యాగ్రహమందెన్!
2. బావతో మఱఁదలి సరస భాషణము:
బమ్మినిఁ దిమ్మినిఁ జేయుచు
నెమ్మనమునఁ గొంటెకోర్కి నిడి సుబ్బయతో
నమ్మఱఁదలు నగుచును "సు
బ్బమ్మా!"యని పిలువఁగానె యాగ్రహమందెన్!
సమస్య: శేషశయను పూజ సేయరాదు
మిత్రులకు, శ్రేయోఽభిలాషులకు, సుకవి పండిత మిత్రులకు, బ్లాగువీక్షకులకు
వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు!
తేది: ఆగస్టు 21, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:
(హిరణ్యకశిపుఁడు ప్రహ్లాదునకు మనసా, వాచా, కర్మణా హరినామస్మరణము సేయరాదని యుపదేశించు సందర్భము)
రాక్షసేంద్రుఁ డిట్లు ప్రహ్లాదునకుఁ జెప్పె
"హరి యటంచుఁ బలుక కయ్య యెపుడు;
తలఁపవలదు నీవు దనుజాంతకున్ మదిన్;
శేషశయను పూజ సేయరాదు!"
బుధవారం, ఆగస్టు 27, 2014
సమస్య: శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే
తేది: ఆగస్టు 18, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా మూడు పూరణములు:
ఆ కంసుండే యయెనయ
శ్రీకృష్ణుని మేనమామ; శిశుపాలుండే
చేకొనె మిత్తిని దుడుకున,
శ్రీకృష్ణుఁడు నూఱు తప్పు లెంచి వధింపన్! (1)
చేకొని బాలుఁడు వ్రాసెను
"
శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే
!"
చీకాకుఁ జెంది గురు "విటు
కాకూడదు, ’బావ’, ’మామ’గా నయ్యె" ననెన్! (2)
ఆ కఱ్ఱి యెవని సఖుఁడయ?
యా కంసుం డతనికేమి యగునో? మడిసెన్
జేకొని యెవఁ డతని వలన?
శ్రీకృష్ణుని, మేనమామ, శిశుపాలుండే!
(3)
మంగళవారం, ఆగస్టు 26, 2014
సమస్య: భరతభూమి స్వాతంత్ర్యముఁ బడయలేదు
తేది: ఆగస్టు 15, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
స్వార్థపరులయి పాలకుల్ వఱలు వఱకు,
ధనికులే ధనప్రాప్తినిఁ దనరు వఱకు,
పేద ప్రజల దారిద్ర్యమ్ముఁ బెరుఁగు వఱకు
భరతభూమి స్వాతంత్ర్యముఁ బడయలేదు!
(ఇట్టి యనర్థములున్నవి కనుక, స్వతంత్రముం బొందియున్నను నిజముగఁ జూడ మన మస్వతంత్రులమే యని నా భావన)
సోమవారం, ఆగస్టు 25, 2014
దత్తపది: కలి-పులి-బలి-వెలి...స్వచ్ఛందం...వెన్నెలరేయి వర్ణన
తేది: ఆగస్టు 14, 2014 నాటి శంకరాభరణంలోని
దత్తపది శీర్షికన
కలి-పులి-బలి-వెలి పదములనుపయోగించి
ఇష్టం వచ్చిన ఛందస్సులో
వెన్నెలరేయిని వర్ణించమనగా
నేను రాసిన తేటగీతి
కలి
మి లేములు కలిగిన గగనగామి
పులి
న తటముల వెన్నెల వెలుఁగుఁ బఱుప,
బలి
మినిం బ్రేమికుల కాంక్ష వడిగఁ బెకలి,
వెలి
కివచ్చెను బరిణయాభీప్సితమయి!
ఆదివారం, ఆగస్టు 24, 2014
సమస్య: అలసట వచ్చె శంకరున కౌదల గంగను మోయ నెప్పుడున్
తేది: ఆగస్టు 13, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
వెలిఁగెడి తెల్గు పద్దెము నవీన విధమ్మున శీర్షమందునన్
నిలిపెను బ్లాగుగంగ; సురనిర్ఝరి శీర్షముఁ దాల్చు శంకరుం
బొలుపున మోసి మోసి, యశముం దగఁ బొందియు, భార తీవ్రత
న్నలసట వచ్చె శంకరున కౌదల గంగను మోయ నెప్పుడున్!
శనివారం, ఆగస్టు 23, 2014
న్యస్తాక్షరి: సరస్వతీ స్తుతి
తేది: ఆగస్టు 23, 2014 నాటి శంకరాభరణంలో
క్రొత్తగా ప్రారంభించిన
న్యస్తాక్షరి
శీర్షికన ఈయబడిన
అంశం-
సరస్వతీ స్తుతి
ఛందస్సు-
తేటగీతి
మొదటిపాదం-మొదటి అక్షరం ‘
స
’,
రెండవ పాదం-మూడవ అక్షరం ‘
ర
’,
మూడవ పాదం-తొమ్మిదవ అక్షరం ‘
స్వ
’,
నాలుగవ పాదం-పన్నెండవ అక్షరం ‘
తి
’
దీనికి నా పూరణము:
స
కల విద్యాప్రదాత్రి! విశాలనేత్రి!
భ్రమ
ర
నీలవేణి స్వచ్ఛవర్ణధాత్రి!
బ్రహ్మమానస సత్పుత్రి!
స్వ
ర సుగాత్రి!
బ్రాహ్మి! భగవతి! వరద! భార
తి
నమోఽ
స్తు!
-:స్వస్తి:-
శుక్రవారం, ఆగస్టు 22, 2014
సమస్య: రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ములఁ గూర్చెన్
తేది: ఆగస్టు 12, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
నెమ్మనమందున నమ్మిన
తమ్మికనుల వేల్పు సమ్మతమ్మునఁ, దనకున్
సొమ్మగు నా తారక మం
త్రమ్మును, త్యాగయ్య గొని, స్వరమ్ములఁ గూర్చెన్!
గురువారం, ఆగస్టు 21, 2014
సమస్య: వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్
తేది:
ఆగస్టు 11, 2014
నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
చేనికి నవసరమయ్యెడి
వానలు చక్కంగఁ గుఱిసి, "ప్రళయకరమ్మౌ,
చేనికి హానికరమ్మౌ
వానలు లేకుండ" మెట్ట వరి ఫలియించెన్!!
బుధవారం, ఆగస్టు 20, 2014
సమస్య: చక్రమ్ములు లేని బండి చకచక సాఁగెన్
తేది:
ఆగస్టు 06, 2014
నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
వక్రగుణి రావణునిఁ దా
విక్రముఁడై త్రుంచిన రఘువీరుఁ డయోధ్యన్
సక్రియఁ బుష్పకమునఁ జనఁ
జక్రమ్ములు లేని బండి చకచక సాఁగెన్!
సోమవారం, ఆగస్టు 18, 2014
నిషిద్ధాక్షరి: ’ర’కారం వాడకుండా, శివధనుర్భంగ వర్ణన, నచ్చిన ఛందస్సులో
తేది:
ఆగస్టు 17, 2014
నాటి శంకరాభరణంలోని నిషిద్ధాక్షరి శీర్షికన ’ర’కారం వాడకుండా, నచ్చిన ఛందస్సులో, శివధనుర్భంగ వర్ణన చేయమనగా, నేను రాసిన తేటగీతి
తునిమి తాటకం
,
దాపసితోడఁ జనియు,
జనక జనపాలు సభను భస్మాంగు ధనువు
భంజనము సేసి,
నయనోత్సవమ్ము సభకొ
సంగి,
సీతఁ జేపట్టెఁ గౌసల్యపట్టి!
శుక్రవారం, ఆగస్టు 15, 2014
సమస్య: కరి నెత్తుకుపోయి యెలుక కలుఁగునఁ దినియెన్
తేది:
ఆగస్టు 03, 2014
నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
తరుణి, కొడుకుకయి పిష్టపుఁ
గరిఁ జేయఁగఁ, గొడుకు దాని ఘనముగఁ గొని, వే
గిర మాడి, విడువఁ, బిష్టపుఁ
గరి నెత్తుకుపోయి, యెలుక, కలుఁగునఁ దినియెన్!
మంగళవారం, ఆగస్టు 12, 2014
ఖర పదము పరిగ్రహించి కననగు ముక్తిన్
తేది:
జులై 31, 2014
నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
ధర నుత్తమ భక్తజనులు
స్మరహర, పురహర, మలహర, సర్వేశ్వర, శం
కర, విషధర, హిమకరశే
ఖర పదము పరిగ్రహించి కననగు ముక్తిన్!
సోమవారం, ఆగస్టు 11, 2014
సమస్య: వారకాంతమీఁది వలపు మేలు
తేది:
జులై 27, 2014
నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
’వారకాంత మీఁది వలపు’ మదాంధతన్
గులము, గుణము, ధనము కొల్లఁగొనును!
సకలశుభకరమగు శాంతగుణమ్ము దై
వార, కాంతమీఁది వలపు మేలు!
ఆదివారం, ఆగస్టు 10, 2014
రక్షాబంధన విశిష్టత!
బ్లాగు వీక్షకులకు, సోదరసోదరీమణులకు
రక్షాబంధనదినోత్సవ శుభాకాంక్షలు!
సోదరులకు రక్ష సోదరీ బంధమ్ము
చిరకాల మిట్టులే స్థిరమగునని,
అన్నయ్యలకుఁ జెల్లి, అక్క తమ్ముండ్రకుఁ
గట్టెడి రక్షయే కాచుననియు,
నమ్మి రక్షాబంధనమ్ము రూపొందించి,
సంప్రదాయమ్ముఁ బ్రశస్తపఱచి,
యనుసరించుచు నెప్పు డన్నసెల్లెండ్రును,
అక్క తమ్ముండ్రును నాచరింపఁ
లోకమే ప్రేమమయమునై మోకరిల్లు!
నట్టి ఘనత రక్షాబంధనమున కిడిన
భారతీయత ఘనముగా భాసమాన
మయ్యు లోకాన వ్యాపించెనయ్య నేఁడు!!
-:oOo: శుభం భూయాత్ :oOo:-
సమస్య: బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా
తేది:
జులై 26, 2014
నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
ఇమ్ముగఁ గులికెడి వలపుల
కొమ్మా! నా దరికి రమ్మ! కోరిక నిమ్మా!
తమ్మికనుల చక్కఁదనపు
బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా!
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)