Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, సెప్టెంబర్ 30, 2013

సమస్య: అప్పు లేనివాఁడె యధముఁడు గద

తేది:27-09-2013 నాటి శంకరాభరణంలో నా పూరణ...

వానఁ గుఱిపించిన పిదప నుఱుకులు పరుగులతోఁ జనుచున్న మేఘుని మాటలు...

జలములన్ని కుఱిసి, యిలఁ దడిపియు నేను
సలిలములను నింప సాగరమున
కేఁగుచుంటి నిపుడు నెంతయుఁ దపనతో!
నప్పు లేనివాఁడె యధముఁడు గద!!

పద్య రచన: దొంగల ముఠా

తేదీ.27.09.2013 నాటి శంకరాభరణం: పద్య రచనలో నేను రాసిన పద్యం.

నమ్మినట్టి జనుల నట్టేట ముంచియుఁ
గోట్లు కోట్లు ధనముఁ గొల్లఁగొట్టి,
దోచుకొనెడివారె దొరలయ్య! యీనాఁడు
నాయకులయిరి యిల నయరహితులు!!

శుక్రవారం, సెప్టెంబర్ 27, 2013

సమస్య: రోఁకటిపో టౌషధము శిరోవేదనకున్



శిరోవేదనచే విసిగి వేసారిన యొకఁడు విధిలేక పలికిన సందర్భము...

"లోకము నందలి మందులు
చేకొని పెక్కులుగ వేయఁ జిత్రము, పోదే
నాకీ తలనొప్పి! యిఁకన్
రోఁకటిపో టౌషధము శిరోవేదనకున్!!"

పద్య రచన: పోస్టుకార్డు





"నేను నిచ్చట క్షేమమ్ము! నీవు బాగె?
యుభయ కుశలోపరి; యిఁక వ్రాయునది యేమ
నఁగ" యటంచును వ్రాసి, పద్నాలు గేండ్లు
నాయె నో మిత్ర, పోస్టు కార్డ్ వేయఁగాను!! 

బుధవారం, సెప్టెంబర్ 25, 2013

సమస్య: గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్


మతి మెచ్చఁ ద్రిపిటక, సుసం
హిత, సమ్య ఙ్మార్గము లిడి, మిక్కిలి కరుణన్
హిత మొనఁగూర్చిన శరణా
గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్!

(సుగతుఁడు=బుద్ధుఁడు)

పద్య రచన: కారాగారము



1. కంచెర్ల గోపన్నను సంబోధించుచు....

కారాగారమె గోప
న్నా! రామ సుగుణ విశేష నామ జపముచే
నారామమయ్యెఁ గాదా!
ధీరా! దాశరథి శతక దివ్య కృతీశా! (1)


 2. నెహ్రూను సంస్మరించుచు...
కారాగారస్థుఁడు నె
హ్రూ రచియించె నఁటఁ బెక్కులుగఁ బుస్తకముల్!
కారాగార మనంగ న
పారమయిన బుద్ధికుశల వర్ధిత గృహమే!! (2)

మంగళవారం, సెప్టెంబర్ 24, 2013

సాహితీ మధువనం: "ససేమిరా" కథ

విశ్వాస ఘాతుకుఁడు!

విజయ పాలుఁడు యువరాజు వేఁటకుఁ జని,
యటవిలో దారి తప్పంగ నపుడు సింహ
మొకటి తఱిమె! దాపున నున్న యొక్క వృక్ష
మెక్కఁగాఁ దరుశాఖపై నొక్క యెలుఁ గ
భయము నిచ్చి కాపాడెను వానినపుడు! (1)

సింహ మచ్చటనే యుండె స్థిరముగాను!
రాత్రి యయ్యెను, నిద్రించె ప్రాణి తతియు!
నెలుఁగు నాతనినిం గోరె నిదుర వోవ
తనదు తొడపైని నప్పుడు దయను బూని! (2)

ఎలుఁగు కోరిక తలఁదాల్చి, హితుఁ డటంచుఁ
బల్కి, నిదురించ; సింహమ్ము పడఁగఁ ద్రోయు
మంచు భల్లూకమును గోరె! మానవుని పయి
ద్రోహ చింత లేని యెలుఁగు త్రోయ ననియె! (3)

అర్ధ రాత్రము దాఁటిన యపుడు రాకు
మారుఁడును లేచి, యెలుఁగు నీ మాఱు నిద్ర
వోవఁ గోరఁగాఁ దొడపైని బోయె నిదుర;
సింహ మప్పుడు పడఁ ద్రోయు చింతన నిడె! (4)

విశ్వాసము నిడి యెలుఁ గట
నాశ్వాసముఁ గొని శయింప, నప్పుడు శంకన్,
విశ్వాస ఘాతుకుండై
నశ్వర మిత్రతనుఁ ద్రోయ, నది శపియించెన్! (5)

“నీదు కృతము నేఁడు నీచమై, ద్రోహమై,
మచ్చఁ దెచ్చెనోయి మానవతకు!
కాన, నెపుడు నీవు పూని యున్మాది యా
త్ర సలుపుము “ససేమిరా” యనుచును!” (6)

అని శపించియుఁ దన దారిఁ జనియె నెలుఁగు;
రాకుమారుండును “ససేమిరా” యటంచుఁ
బిచ్చివాని పగిదిఁ బ్రలపించుచుఁ దన
యిల్లుఁ జేరంగఁ జనె పౌరుఁ డెవఁడొ చేర్చ! (7)

తన కుమారుని దుఃస్థితిఁ దలఁచి తండ్రి
కుమిలిపోవుచు దుఃఖించి, గుణ యుతుఁడగు
మంత్రిఁ గోరంగ నాతండు మానితముగ,
దివ్య దృష్టినిఁ జూచి, చింతించి, పలికె! (8)

“సకల సద్భావ వర్ధిత సాధువులను
వంచనము సేయఁగను నేరుపగునె నీకు?
నమ్మి తొడపైని నిద్రించునట్టివానిఁ
జంపఁ బౌరుషమ్మగునె, నీచమ్ముఁ గాక?”
యనఁగ ’సేమిరా’ యంచును ననఁగ సాఁగె! (9)

“సేతుయుత వారిధిని, జాహ్నవీ తురీయ
సంగమముఁ జూడఁగా బ్రహ్మ సంహృతిస్థ
పాతకము సమయును! మిత్ర ఘాతుక మెటు
సమసి పోవును, దద్దర్శనమున నిచట?”
ననఁగను ’మిరా’ యటంచును ననఁగ సాఁగె! (10)

“మిత్రఘాతి, కృతఘ్నుండు, మేదినిఁ గల
యట్టి విశ్వాస ఘాతుకుం డను త్రయమ్ము,
తరణి శీతకరాదు లెందాఁక స్థిరులొ,
యంత దాఁక నరకమున నడలుచుం” డ్ర
నంగ ’రా’ యంచు మఱి మఱి యనఁగ సాఁగె! (11)

“రాజ! నీసుతుఁ బాప విరహితుఁ జేయఁ
గోర్కి కలదేని శీఘ్రమే కూర్మి మీఱ
దేవ భూదేవులును గురుదేవులకును
దానధర్మాదులనుఁ జేయఁగావలె నయ!”
యనఁగ విజయ పాలుఁడు మాఱె మునుపటి వలె! (12)


-: ఇది “ససేమిరా” కథ :-
శుభం భూయాత్

పద్య రచన: కరివేఁపాకు



సకల శాకములందునఁ జాల రుచినిఁ
గలుగఁ జేయును కరివేఁప ఘనముగాను!
కాని, కూర నుండియు నేఱి, దాని మనము
పాఱవేతుము, దుష్టుల నేఱినట్లు!!

సమస్య: సంతస మొసంగు మనకెల్లఁ జావు కబురు


ద్వారకలో నిద్దఱు గోపాలకులు సంభాషించుకొనుచున్న సందర్భము...

"వెడలి రయ్య సత్యాకృష్ణు లెడఁదఁ బూని,
దుష్ట నరకాసురుని, లోక దురిత కరుని
నడఁచఁగను, లోక కళ్యాణ మిడఁగ! నపుడు
సంతస మొసంగు మనకెల్లఁ జావు కబురు!!"

సోమవారం, సెప్టెంబర్ 23, 2013

పద్య రచన: దోమ


దోమయ చిన్నది యైనను
గోముఖ శార్దూలము వలె కొంపలు ముంచున్!
దోమతెఱలున్న రోగము
లేమియుఁ దరిఁ జేరలేవు లీలగ నైనన్!

సమస్య: ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుఁడు పుట్టెన్


కుట్లిడి రమణీయమ్మౌ
చెట్లు పువులు పిట్టలు విలసిల్లెడు చీరల్
పుట్లుగ నమ్మి, పిదప, పని
ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుఁడు పుట్టెన్!

ఆదివారం, సెప్టెంబర్ 22, 2013

సమస్య: జింకను గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్


దుర్గాదేవి నబల యను తృణీకార భావనచే నని సేయ నుంకించిన మహిషుని నా మాత పాఱఁద్రోలిన ఘట్టము...

జంకువిడి, దుర్గ, మహిషుని
సంకటమునఁ ద్రోయ; వాఁడు శక్తి నశింపన్,
గొంకుఁ గొని పాఱెఁ! జిత్రము!
జింకను గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్!!

శనివారం, సెప్టెంబర్ 21, 2013

పద్య రచన: జూదము


ధర్మజుఁడు జూదమాడియుఁ దనదు రాజ్య
సంపదలఁ గోలుపోయి, విచార పడక,
యపుడు నారణ్యవాస గతాత్ముఁ  డయ్యు,
ద్రౌపదినిఁ, దమ్ములనుఁ గూడి, తరలె నయ్య!

సమస్య: దనుజులు హరి భజనఁ జేయు ధన్యులు సుమతుల్



నారదుఁడు ధర్మజునితోఁ బలికిన సందర్భము...

విను, ధర్మరాజ! కన, భవ
దనుజులు హరి భజనఁ జేయు ధన్యులు, సుమతుల్,
ఘనతర ధీగుణ యుతులున్,
వనజాక్ష విశిష్ట చరణ వందన నిరతుల్!

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2013

పద్య రచన: ఋణానుబంధం

ఏ ఋణము కారణముగానొ యిట్టి బంధ
ములిలఁ గలుగును; పసులు, సుతులును, బత్ని,
గృహ మటంచు! ఋణమ్ము తీఱిన తఱి వెసఁ
దొలఁగి పోవును! గావున దుఃఖ మేల?

(ఋణానుబంధ రూపేణ, పశుపత్నీసుతాలయాః|
ఋణక్షయే క్షయం యాంతి, కా తత్ర పరిదేవనా||)

సమస్య: శిష్టజనాళి మెచ్చెదరె శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్


దుష్టు దురాత్ము రావణుని దూషిత కర్ముని, ధర్మమార్గులౌ
శిష్టజనాళి మెచ్చెదరె, శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్
హృష్ట హృదబ్జమందు ఘనరీతిని నిల్పి భజించి కొల్చి సం
తుష్టునిఁ జేయు వస్తుతతిఁ దోరముగా నిడి మెచ్చునట్లుగన్?

గురువారం, సెప్టెంబర్ 19, 2013

పద్య రచన: శబ్ద కాలుష్యము


పట్టణముల ధ్వనికలుషిత
ఘట్టములే యెట్టి చోటఁ గాంచిన మిగులన్
గట్టలుగను వ్యాపించియు
మట్టియె మిగులంగఁ జేయు మార్గమె యెసఁగెన్!

సమస్య: పుస్తకములఁ జదువువాని బుద్ధి నశించున్

నా మొదటి పూరణము:
శాస్తోల్లేఖిత సుకృతి ప్ర
శస్త శుభ విశిష్ట నీతి శాస్త్ర విముఖుఁడై;
యస్తుతిపాత్ర, దురితకర
పుస్తకములఁ జదువువాని బుద్ధి నశించున్! (1)

నా రెండవ పూరణము:
శస్తగుణోపేత ప్రభా
వాస్తోతు స్తూయమాన భవనుతి విముఖ
న్యస్త విదూషిత కవికృత
పుస్తకములఁ జదువువాని బుద్ధి నశించున్! (2)

బుధవారం, సెప్టెంబర్ 18, 2013

మాయాచిత్రం

కన్నులను మాయచేసే చిత్రం

పద్య రచన: గణేశ నిమజ్జనం


శ్రీగణనాథునిఁ గొలిచితి
మేగఁగ వలె స్వీయనిలయ మిప్పుడటంచున్
వేగమె నిమజ్జనమ్మును
సాగరమునఁ జేయఁ గోరి సాఁగ నిడి రటన్!