Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, ఏప్రిల్ 26, 2014

పద్య రచన: చుక్కల్లో చంద్రుఁడు పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య!

తేది: సెప్టెంబర్ 08, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్యగారి చిత్రమునకు నేను రాసిన పద్యములు


కం.
రేలంగి హాస్య నటునిగఁ
బాలించెను జలనచిత్ర వనిలోనను! దా
నేలిన పాత్రలు పద్మ
శ్రీ లభియింపంగఁ జేసెఁ జిత్రములందున్!(1)

సీ.
బాల్యమ్ములోఁ దండ్రి పలికించె 'హరికథల్'
        'సంగీత' మింపారె సరస భంగి!
మొదట 'నాటక రంగ'మునను 'బృహన్నల'
        లోన స్త్రీ పాత్రలోఁ దా నటించె!
'కృష్ణ తులాభార'కీర్తితుఁడై తాను
        'జలన చిత్రాల'లో నెల కొనియెను!
'గుణ సుందరి కథ'లో గుణము హెచ్చఁగఁ బ్రజల్
        'హాస్య నటుని'గా సమాదరింప;

గీ.
స్థిరత నందియు రేలంగి తీరు మాఱె!
నాయకుని సరసను దా సహాయ నటుని
పాత్ర లెన్నియొ పోషించి, ప్రజల మెప్పు
వడసి, తానెంతొ వెలిఁగి పోవఁగ మొదలిడె!(2)

సీ.
విప్ర నారాయణ, వెలుఁగు నీడలు, దొంగ
        రాముఁడు, మిస్సమ్మ, లవకుశలను;
సత్య హరిశ్చంద్ర, జగదేక వీరుఁడు,
        మాయా బజారులన్ మంచి హాస్య
నటనను బోషించినట్టి రేలంగి తా
        నెంతయో యెదిగెను వింతగాను!
ప్రేక్షకాళిని హాస్యరీతుల మెప్పించి,
        చిత్ర పరిశ్రమన్ జిర యశుఁడయి,

గీ.
నిలిచి, వెలిఁగెను నాతండు! నేఁటి కింక
నతని చిత్రాలు చూచెద ననెడి వార
లెందఱో కలరన వింత యేమి కాదు!
తర తరమ్ము లప్రతిముఁడై తనరె నతఁడు!!
(3)

ఆ.వె.
ప్రియ తముండునైన 'రేలంగి' మాటాడ
నవ్వు పువ్వు ఱువ్వు, ఱివ్వుమనఁగ!
విరియు నెడఁద మనకు 'వేంకట రామయ్య'
పలుకు వినఁగ! నతఁడు వర యుతుండు!!
(4)

కం.
నవ్వుల ఱేఁ డతఁ డెప్పుడు
ఱువ్వు ఛలోక్తులును హాస్య రుచు లందించున్!
దివ్వియ వలె వెలుఁగు నతం
డివ్విధి జన హృదయ వీథిఁ దిరమై భువిలోన్!!
(5)


-:శుభం భూయాత్:-

5 కామెంట్‌లు:

  1. Relangi Venkatramayya was born at Ravulapalem village,Near Tadepalligudem Town, in East Godavari district of A P on 13th of August 1910.He started his professional career as Harikatha Reciter. He developed passion for acting in Stage plays even in female characters. This interest of action in him made him as an assistant to the great Producer/Director C.Pullaiah.Major breakthrough in his film career was with the film “Vindhya Rani” directed by C.Pulliah released in the year 1948. Then came his movie”Keelu Gurram” an A N R Starrer. In the Film “Maya Bazaar” his action as Uttharakumarudu is simply marvelous especially in the song sequence” pamu Oho Sundari Neevanti Divya Swaroopamu Yendendu V...http://thyview.com/names/view/8794

    రిప్లయితొలగించండి
  2. FYI
    Ravulapalem is in east godavari district.
    Tadepalligudem is in west godavari district.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రమా! నేను ఈ సమాచారాన్ని... http://thyview.com/names/view/8794 లింకు నుండి స్వీకరించాను. కాపీ మరియు పేస్ట్ చేశాను...అంతే!

      తొలగించండి
  3. మాయ బజారులో రేలంగి పాత్ర లక్ష్మణ కుమారుడు...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అప్పారావు గారు చెప్పినది కరక్ట్. రేలంగి గారు "మాయాబజార్" లో మాత్రం "లక్ష్మణకుమారుడు" వేషమే. ఆయన "ఉత్తరకుమారుడు" గా వేసినది "నర్తనశాల" సినిమాలో.

      తొలగించండి