Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జూన్ 26, 2016

బాలల నీతి పద్య కథలు: మేఁకపోతు గాంభీర్యం




ఒక్క మేఁకల కాపరి యొక్కనాఁడు
తనదు మేఁకల మందఁ గాననమునందు
మేపి, మాపటి వేళకు మేఁకలఁ గొని
పోవుచుండఁగ, నొక కొన్ని పోటి పడెను! 01

"నేను ముం"దన, "నేను ముం", "దేను ముంద"
టంచు మేఁకపోతులు గొన్ని యఱచుచు, మును
ముందు కుఱుకంగ, నొక మేఁకపోతు దారి
తప్పి, యడవిలోనికిఁ జని, తల్లడిల్లె! 02

అటవిలోఁ దిరుగాడుచు, నట నొక గుహ
కానుపింపఁగ, నందు వేగముగఁ జనియు,
విశ్రమించఁగ "సంతోష వేశ్మ మిదియ"
యనుచుఁ బొంగుచు హాయినిఁ గొని శయించె! 03

ఒక్క సింహము మేఁతకై యెక్కడెక్క
డో గమించియు, వేఁటాడి, వేగ రాక,
మాపటికి వచ్చి, గుహ చెంత మందహాస
మునను గర్జించ, మేఁకయు విని, హరిఁ గనె! 04

బయటి నుండియు వచ్చెడి పచ్చకనుల
మెకముఁ గని, మేఁక భయపడె మిక్కుటముగ!
సటల మెకము, బిలమ్మున ఛాగముఁ గన
కయె, మెఱయు నేత్రములఁ గాంచి కలవర పడి; 05

"గహ్వరమ్మున మెక మెదో కల" దనుచునుఁ,
గేసరియె భయమున లోని కేఁగ జడిసి,
బయటనే యుండె, నుదయాన బాగుగాను
దానిఁ గని, స్నేహమును జేయఁ గాను కోరి! 06

తెల్లవాఱుచుండఁగ మేఁక తెలివితోడ
నప్పుడే మేలుకొని చూచినటులఁ గనుచు,
"నెవఁడ వీ?" వన, సింహమ్ము "నేను సింహ
మునయ! మీ రెవ్వ?" రని యనె బుగులుతోడ! 07

దాని ప్రశ్నకు బదులీక, దానిఁ గనుచు,
"నోహొ! సింహానివే! నేను నోగిరమున
వేయి యేన్గుల, నొక నూఱు బెబ్బులులనుఁ
జంపి తింటిని! నా ప్రతిజ్ఞ యిదె వినుము! 08

ఒక్క సింహమ్మునుం జంపి, మెక్కు దనుక
నాదు గడ్డమ్మునుం దీయ నంచుఁ బ్రతినఁ
బూని యుంటిని! నేఁ డీవు పొసఁగితి విటు!
నిను వధించియు, నా గడ్డము నిఁకఁ దీతు!" 09

అనుచుఁ దల మోరగించియుఁ, దన గభీర
ముఖమునుం ద్రిప్పుచునుఁ, దన ముందు గాళ్ళు
రెంటినిం బైఁకి నెత్తియుఁ ద్రెళ్ళ నుఱుక;
సింహ మంతట భయపడి, చెలఁగి, పాఱె! 10

ఇట్టి యవకాశమునకయి యెదురుచూచు
మేఁక, "బ్రతుకు జీవుడ!" యని, మిక్కుటమగు
సంతసము నొంది, యింటికి సాఁగిపోయె!
"బలము లేకున్నచో, బుద్ధి బలమె ప్రోచు!!" 11


స్వస్తి

3 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి


  2. బుద్ధి గలవానికి తెలియు
    అద్దరి సింహమును మేక ఆపిన తీరుల్
    హద్దులు లేవుగ జీవన
    సుద్దులు నేర్వన్ జిలేబి సూక్ష్మము గనుమా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు జిలేబి గారూ! అభినందనలు!

      ముద్దుగఁ బద్దెము నిత్తఱిఁ
      జద్దినిఁ దిన్నటు జిలేబి చల్లఁగ వ్రాసెన్
      సుద్దులు చక్కఁగఁ జెప్పుచు
      నద్దిర యిది బల్ పసందు నయ్యెను నాకున్!

      తొలగించండి