Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జూన్ 20, 2017

త్రిదేవీ స్తుతి



మృగవాహినీ! మహిష మర్దినీ!!
-మధురకవి గుండు మధుసూదన్ (9949184459)

సురనర్తకీ/తరంగక వృత్తము(షట్పాది):

ఇందిరా రమణ సోదరీ! హిమజ! ♦ హిండి! చండి! ఖల శోషిణీ!
నందయంతి! గిరిజా! మదోత్కట! నస్వినీ! దనుజ నాశినీ!
నందితాఖిల సురేంద్ర ముఖ్య! కరుణాంతరంగ! వరదాయినీ!
కందుకాభ పరిపంథి శీర్ష కరఖండితోగ్ర! మృగవాహినీ!
వందితోరుతర భూజనాళి నతభక్తిమస్త! నగనందినీ!
మందయాన! పరమార్థ దాయిని! మః సతీ! మహిష మర్దినీ!


సీ.      ఓంకార రూపిణీ! ♦ యోగీశ తోషిణీ! - దివిజ సంస్తుత గాత్రి! ♦ త్రిపుర హంత్రి!
ఐంకార రూపిణీ! ♦ ఆనంద పోషణీ! - షడ్భుజాయుధ ధాత్రి! ♦ శైల పుత్రి!
హ్రీంకార రూపిణీ! ♦ త్రిపథ సంచారిణీ! - సర్వార్థ దాత్రి! ప్రశస్త గాత్రి!
శ్రీంకార రూపిణీ! ♦ శ్రితజన కళ్యాణి! - దనుజ నాశన కర్త్రి! ♦ తరళ నేత్రి!
గీ.      సర్వ మంత్రాత్మికా! కృపాశరధి! మాత! - సర్వ యంత్రాత్మికా! సర్వశక్తిదాత!
సర్వ తంత్రాత్మికా! మహైశ్వర్య మహిత! - సర్వ లోకేశ్వరీ! తల్లి! ♦ సన్నుతు లివె!!

లక్ష్మీస్తుతి

మేఘవిస్ఫూర్జిత వృత్తము:
రమా! లక్ష్మీ! క్షీరాబ్ధ్యధిపతిసుతా! ♦ రమ్య! సంస్తుత్య వంద్యా!
నమో దేవీ! సంపత్ప్రద! సుచరితా! ♦ నన్ గటాక్షించు మాతా!
సమీక్షింతున్ పద్మాసన! సువదనా! ♦ సత్యమౌ నాదు భక్తిన్!
క్రమమ్మీవున్ సంపత్కరివి యవుటన్గాంక్షితమ్మీవె తల్లీ!!
 సరస్వతీ స్తుతి

కం.     విద్యాధినేత్రి! మాతా! - సద్యః స్ఫురణ ప్రదాత్రి! ♦ శారద! వాణీ!
మద్యోగ్య పద్య ధాత్రీ! - మాద్య న్మంగళ సుగాత్రి! ♦ మాన్య!నమస్తే!

తే.గీ.   సకల విద్యాప్రదాత్రి! విశాలనేత్రి! - భ్రమరనీలవేణి స్వచ్ఛవర్ణధాత్రి!
బ్రహ్మమానస సత్పుత్రి! ♦ స్వర సుగాత్రి! - బ్రాహ్మి! భగవతి! వరద! భారతి నమోఽస్తు!


త్రిమాతృ స్తుతి
శా.      చేతన్ వీణ ధరించి, విద్యలొసఁగన్శ్రీ వాణివై నిల్చి,
చ్చేతోమోద విశేష సంపద లిడన్శ్రీ లక్ష్మివై నిల్చి, యా
చేతోఽoశుల్ మొఱ వెట్ట; శక్తి నిడఁగన్శ్రీ గౌరివై నిల్చి,
చ్చైతన్య మ్మిడి, యో త్రిదేవి! యిట విశ్వమ్మున్ దగన్ బ్రోవుమా!!

కం.     వాణీ! వీణా పాణీ! - పాణి స్థిత సకల విభవభాస్వ ల్లక్ష్మీ
ప్రాణేశార్ధాజిర శ-ర్వాణీ! ధీ బల ధనాఢ్య! ♦ వరదాయి! భజే!!

.      అమ్మ! మనమ్మునందు నినునండగ నమ్మితి! నమ్ము మమ్మ! మో
హమ్ముఁ బెకల్చి, సన్మనమునందఁగ నిచ్చి, హృదంతరమ్ము శాం
తమ్మున నోలలార్చి, సతతమ్ము దయారస మిమ్ముఁ గూర్చి, నా
కిమ్మహి జన్మ దున్మి, యిఁకఁగేవల సద్గతి నిమ్మ! యమ్మరో!!
    
                                          స్వస్తి




19-10-230, రుద్రమనగర్, గవిచర్ల X రోడ్, రంగశాయిపేట, వరంగల్ - 506005

ఆదివారం, జూన్ 18, 2017

నాన్నా....


నాన్నకు నివాళులు...





సీ.
పిల్లలన్నను వేగఁ బెనుమక్కువనుఁ జూపి ప్రేమఁ బంచితివయ్య వేడ్క నీవు;
వరుసగా నేడ్వురు పసిబిడ్డలునుఁ దక్క కుండఁ బోవ మిగులఁ గుమిలి తీవు;
చరమదశను నేను వరసుతాష్టమునిగాఁ బుట్టంగ సంతస మొంది తీవు;
కలుగక కలుగఁగా గారాబమునుఁ జేసి బ్రేమఁ బంచుచు నన్నుఁ బెంచితీవు;


గీ.
నీదు గుణగణమ్ముల నాకు నిచ్చినావు;
నీదు పద్యాభిమానమ్ము నిచ్చినావు;
పంచశతకమ్ములను నాకు పంచవర్ష
ములను నొక్కొక్కటిగ నేర్పి మురిసి నావు!


కం.
దినదిన వృద్ధినిఁ బొందఁగ
ననవరతము విద్య నేర్పి, యభ్యాసముచే
ఘనతను నేనుం బొందఁగఁ
దనిసితివయ తండ్రిగాను ధన్యతఁ గొనుచున్!


ఆ.వె.
పద్యకవిగ నేను పదిమందిలో గొప్ప
పేరు తెచ్చుకొనుటఁ బేర్మిఁ గనక
మునుపె, స్వర్గగమనమును నెంచుకొని నీవు
వెడలినావు తండ్రి, విడచి నన్ను!


శా.
కష్టా లెన్నియొ పొందినావు; సుతు, నన్, గష్టమ్ము లొందింప కే
నిష్ట మ్మెద్దియొ చెప్పఁబోవు మునుపే యిష్టమ్ము లందించి సం
తుష్టుం జేసితి వీవు తండ్రి! ఘన సంతోషమ్ము నీ మున్నె, త్రై
విష్ట్యౌన్నత్య పదమ్ము నందితివి; హృద్వీథిన్ వ్యథన్ బెంచియున్!


ఆ.వె.
నన్నుఁ గరుణఁ జూచి, నన్ వృద్ధి పొందించి,
మంచి జీవితమున మనిచి, నాకు
సుఖము లందఁ జేసి, సూక్తుల్ దగం జెప్పి
నావు తండ్రి! నే ఋణపడితినయ!


ఆదివారం, ఏప్రిల్ 30, 2017

అమరుడవన్నా...విద్యాసాగరన్నా...నీకు జోహార్లు...

నీటిపారుదల రంగ నిపుణులు
తెలంగాణ ముద్దుబిడ్డ
కీర్తిశేషులు
రామరాజు విద్యాసాగర్ రావు గారికి
అశ్రుతర్పణము

Vidyasagar-RAo



నీటి విషయాన జరుగు దుర్నీతినిఁ దెల
గాణ కనులఁ గట్టినయట్లుఁ గాను చూపి
నట్టి యింజనీర్ తెలగాణ కంకితుఁడగు
రామరాజు విద్యాసాగరన్నకశ్రు
తర్పణమ్మందఁజేతును త్వరితముగను!

భౌతికమ్ముగఁ దెలగాణ ప్రజలముందు
నీవు లేకున్నఁ, బారెడి నీటి ధ్వనుల
యందు నీ మాటలు వినెద; మట్లె పొలపుఁ
బచ్చఁదనమందు నీదు రూపముఁ గనెదము!

నీటి విషయాలఁ దెలిపియు, నిప్పు రగులఁ
జేసి, యాంధ్ర నాయకుల దుశ్చేష్టితముల
నెఱుకపఱచియుఁ దెలగాణ నిద్రలేపి
యుద్యమింపఁగఁ జేసితివో మహాత్మ!

కేంద్ర జలసంఘమునను సాంకేతికునిగఁ
బనియుఁ జేసిన యనుభవంబంత మేళ
వించి, సాగునీటినిఁ బంచు విషయమందు
మన తెలంగాణకును జరిగిన దురితము
లిల సహేతుకముగ విమర్శించినావు!

ఆంధ్రజలదోపిడినిఁ దెలంగాణలోని
సకల జనుల కర్థమ్మగు సరళితోడఁ
దెలియఁజేసి, యుద్యమమున స్థిరతమమగు
వెలుఁగు లందఁజేసియు నిట వెలిఁగితివయ!

మన తెలంగాణ యుద్యమ మలిదశ కొక
వైపు జయశంక రింకొకవైపు నీవు
నిలిచి, యుద్యమస్ఫూర్తిని నింపిన ఘన
రాష్ట్ర సాధక యజ్ఞ కర్మఠుఁడవైతి!

"నీరు - నిజములు" పేరిట నిక్కమైన
విషయముల నీవ తెల్పియు, వెంటవెంట
జరుగు పరిణామములఁ దెల్పి, జనుల హృదుల
స్థిరతరమ్మగు స్థానాన స్థిరపడితివి!

"నీరు నిధులు నియామక నియమము" లవి
మన తెలంగాణ యుద్యమమ్మునఁ బునాదు
లయ్య! యిందున నీరమ్మె యత్యవసర
మైన "కాలమ్ము"గా నీకు నమరెనయ్య!!

నీర మీయక కృష్ణమ్మ పారుచున్న,
పఱఁగ గోదారి జలమీక పరుగులిడెడి
యాంధ్ర కుట్రల నెల్లను నందఁజేసి,
ప్రజ యమాయకత్వ సువిదారకుఁడవైతి!

ముఖ్యమంత్రి కేసీయారు ముఖ్యమైన
సలహదారునిగా నుండి, సక్రమమగు
నెన్నొ జల ప్రణాళికలను నెన్నికమెయిఁ
దెలిపి బంగారు తెలగాణఁ దిరపఱచియు
నీరముల సస్యముల నీవె నిలిచితివయ!

ఘనుఁడ! నీటిపారుదలరంగనిపుణుండ!
పుణ్య తెలగాణ తల్లికి ముద్దుబిడ్డ!
జన జల ప్రదాత! జల హృది సంస్థితుండ!
రామరాజ విద్యాసాగరా నమోఽస్తు!

జన్మభూమి నేత్రమ్ముల జాలువారు
బాష్పవారిని నాపఁగఁ బ్రతినఁ బూని,
జీవితమ్మంకితమ్ముగాఁ జేసినట్టి
సుజనసాగర! విద్యన్న! జోతలివిగొ!

నీదు మరణమ్ము తెలగాణ నేల కెపుడుఁ
దీర్చలేనట్టి లోటాయె! తిరముగాను
నీదు చరితమ్ము తెలగాణ నేలయందు
నిలిచి వెలుఁగును, రవిచంద్రు లిల స్థిరముగ
వెలుఁగులనుఁ బ్రసరించుచు వెలయుదాఁక!

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!



బుధవారం, మార్చి 29, 2017

హేవిళంబి వత్సరమా...స్వాగతం!!!

సంబంధిత చిత్రం

వసంతతిలకా వృత్తము:
ఓ హేవిళంబిరొ మహోత్తమ మిట్టి వేళన్
మాహాత్మ్య మొప్పఁగను మాన్యతలన్ గొనన్, మే
మూహించనట్టి గతి మోదము నందఁజేయం
గోహో వసంతతిల కోద్ధృతిఁ జూప రావే!

సుగంధి వృత్తము:
మందమందమౌ సుగంధ మారుతమ్ము వీవఁగా
విందుఁగూర్చు పూవుఁదేనె వేగఁ జేకొనంగ, నా
నందమంది బంభరమ్ము నాట్యమాడి పాడఁగా
సందడింప, హేవిళంబి సంతసానఁ బ్రోచెడిన్!

మత్తకోకిలా వృత్తము:
గున్నమావి పసిండి పిందెలఁ గ్రొత్త కోర్కెల మొగ్గలన్
మిన్నయౌ సొగసుల్ ధరించియు మించినట్టులు పూవులన్
వన్నె చిన్నెల హేవిళంబిటఁ బచ్చ యంద మెలర్ప, సం
పన్నమై సను లేఁజిగుళ్ళను మత్తకోకిల మేసెగా!

ధ్రువకోకిలా వృత్తము:
కనఁగ వేడుచు మించు కోర్కెనుఁ గన్నులకుఁ దా విందొసం
గనుఁ, బసందగు వేపపూఁతల, కమ్ర నింబ తరూత్తమల్,
సునయనమ్ముల వెల్గఁజేసెడు చూతవృక్ష రసాలముల్
వనులఁ గాంచియు సంతసమ్మునఁ బాడెరా ధ్రువకోకిలల్!

మానినీ వృత్తము:
కాననమందు శుకాళి పికాళులు గారవ మొప్ప నగమ్ములపై
మే నలరంగను మేలుకొనంగను మిన్నులు ముట్టెడు మేళములన్
వీనుల విందుగ వీణియ మీట విభిన్న విధమ్ముల వించు నిఁకన్
మానినులున్ విసుమానము హెచ్చ నమంద ముదంబునుఁ బొందిరయా!

మందాక్రాంతా వృత్తము [పంచపాది]:
ప్రొద్దుల్ వోయెన్ బదమనుచుఁ బూఁబోండ్లతోఁ బోరు భర్తల్
ముద్దౌ చేఁతల్ హసనములతో ముచ్చటల్ సెప్పు బాలల్
విద్దెల్ వెల్గన్ విలువ పెరుఁగన్ విద్య బోధించు నొజ్జల్
పద్దెమ్మిందున్ స్వరచితములన్ బండితుల్ వే బఠింపన్
సుద్దుల్ వించున్ సకల జనులున్ జొక్కి రీ హేవిళంబిన్!

మాలినీ వృత్తము:
పలువుఱిట యుగాదిన్ బార్వతీశున్ రమేశున్
నలువ నెపుడుఁ గొల్వన్ నాస్తికత్వ మ్మణంగున్!
కలలు నిజము లౌచున్ గాంక్షితమ్మే ఫలింపన్
విలువలఁ గొన రారే మాలినుల్ హేవిళంబిన్!!

ఉత్పలమాలా వృత్తము:
తీయని చైత్రమాసమున దిక్కుల నామని శోభ వెల్గఁగా,
హాయియు శ్రోత్ర పేయము శుకాళి పికాళుల గానరావముల్
శ్రేయ మొసంగ, నుత్పలము శ్రేష్ఠతరమ్మగు స్వాగతమ్మిడన్,
బాయని పోఁడిమిన్ సతత వందిత రాఁగదె హేవిళంబిరో!

మంగళమహాశ్రీ వృత్తము:
మానిత యుగాది! సుసమంచిత గుణాత్మక విమర్శనము సర్వజనకోటిన్
ధ్యానవహ ధీమహిత దాతృగుణ మాత్మగత దైవకృప రక్షణము సేయన్,
జ్ఞానము భవిష్యము వికాసము ధనాప్తత సుఖాప్తతలు శాంతుల నిడంగన్,
మేనఁ గలుషాలు విడి, మీఱెడి చిరాయు విడు మెప్పుడును మంగళమహాశ్రీ!


స్వస్తి

మధురకవి గుండు మధుసూదన్

సోమవారం, డిసెంబర్ 05, 2016

వరంగల్ అష్టావధాన విశేషాలు



కాకతీయ పద్య కవితా వేదిక మరియు రైజింగ్ సన్ హైస్కూలు యాజమాన్యం వారి సంయుక్త ఆధ్వర్యంలో ది. 4-12-2016 (ఆదివారం) నాడు వరంగల్లులోని రైజింగ్ సన్ హైస్కూలులో కుమారి 'పుల్లాభట్ల నాగశాంతి స్వరూప' గారు అష్టావధానం చేశారు. ఈ కార్యక్రమానికి లయన్ శ్రీ తమ్మెర లక్ష్మీనరసింహ రావు గారు అధ్యక్షత వహించగా, ప్రముఖ అష్టావధాని డా॥ శ్రీ ఇందారపు కిషన్ రావు గారు సమన్వయకర్తగా వ్యవహరించారు. అతిథులుగా శ్రీ ఆరుట్ల భాష్యాచార్య గారు, డా॥ శ్రీ టి. శ్రీరంగస్వామి గారు పాల్గొన్నారు.
అష్టావధానంలోని అన్ని అంశాలను అవధాని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలను అందుకున్నారు.
.
౧) నిషిద్ధాక్షరి - గుండు మధుసూదన్
.
ఓరుగల్లులో పోతన భాగవతావిష్కరణం...
.
అవధాని పూరణ - (కుండలీకరణంలో ఉన్నవి పృచ్ఛకులు గుండు మధుసూదన్ నిషేధించిన అక్షరాలు. x అని ఉన్నచోట పృచ్ఛకులు నిషేధం విధించకుండా అవధాని చిత్తానికి వదిలివేశారని గమనించగలరు.).....
.
(x)శ్రీ(x)క(ర)ళ(య)తో(ప)ని(త)ండి(య)న(య)నీ
పాక(x)ము(x)మే(న)లై(x)స(క)త(త)ంబు భ(స)ళి(ర)యై (x)యె(స)ప్డున్
.
(రెండు పాదాలకు మాత్రమే నిషేధం విధించబడింది)
.
శ్రీకళతో నిండిన నీ
పాకము మేలై సతంబు భళియై యెప్డున్
లోకానికి మేలు కలుగ
శ్రీకారమె భాగవతము చిన్మయ కవిరాట్!
.
౨) సమస్య - జీడికంటి శ్రీనివాస మూర్తి
.
"అవధాన మ్మొక ప్రజ్ఞయౌ ననఁగ నా కాశ్చర్యమౌ సోదరీ"
.
అవధాని పూరణ....
.
వ్యవధానం బిసుమంత లేక యిలలో వర్ధిల్లు సత్క్రీడయై
కవిలోకానికిఁ గాంతు లీను శశియై గంభీర వాగ్బంధమై
యవురా చిత్ర విచిత్ర దీపితములై హ్లాదంబుఁ జేకూర్చు నీ
యవధాన మ్మొక ప్రజ్ఞయౌ ననఁగ నా కాశ్చర్యమౌ సోదరీ!
.
౩) దత్తపది - కంది శంకరయ్య
.
"సీత-కైక-సుమిత్ర-తార" పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో స్వేచ్ఛాచ్ఛందంలో పద్యం చెప్పాలి.
.
అవధాని పూరణ....
.
రాజ్యమునకై కలవరించి రహిని వెలుఁగ
ధరణి వసుమిత్రమై వెల్గు తపనఁ గూడి
కౌరవులె యిసీ తండ్రినిఁ గలఁతఁ బెట్టి
పశుతను వనితా రత్నముఁ బరిభవించె!
.
౪) వర్ణన - పాతూరి రఘురామయ్య
.
భద్రకాళి అమ్మవారి వర్ణన.....
.
అవధాని పూరణ....
.
అల్లాడించితివే సురారుల ననిన్ హాయంచు విశ్వేశ్వరీ
యిల్లాలా శివ వామభాగ నిలయా హేరంభ సంతోషిణీ
ముల్లోకాలకు మూలమైన జననీ మోక్షప్రదా ధీప్రదా
యుల్లంబందున భద్రకాళి యమవై యుత్సాహ మందింపవే!
.
౫) వ్యస్తాక్షరి - బోయినిపల్లి రాధ
.
ధరణి ననేక శిష్యులను దక్షులఁ జేసెడు ప్రాజ్ఞు లిమ్మహిన్.
.
౬) ఆశువు - చేపూరి శ్రీరామ్
.
1. మహాసహస్రావధానులు మీ అవధానాన్ని చూసి మనస్సులలో ఏమనుకొని వుంటారో ఊహించిచెప్పండి.
.
అవధాని పూరణ....
.
దిగ్గజములు నెదుట దిట్టలై యుండఁగా
పద్య పాదములవి పరుగుఁ దీయు
నింత వారి నెల్ల నెంతెంతగాఁ జూపు
వారి దృక్కు నాకు వాక్కు నిడెగ!
.
2. పెద్దనోట్ల రద్దుతో...ప్రజల సహనం...భావి బాగుంటుందని చెప్పండి.
.
అవధాని పూరణ...
.
మంచి ముందుఁ గలదు మదినుంచి మసలుఁడీ
పొంచియున్న చెడునుఁ బోవఁ జేయు
నాశ గలుగువాఁడె యానంద మయుఁడురా
సహన భావ మున్న సాధు సాధు!
.
3. ఈ అవధాన సభా వర్ణన చేయండి.
.
అవధాని పూరణ...
.
ఆఱు నైదుఁ గూడి యానంద మందింప
యత్నములను సలిపె నూత్నముగను
నోరుఁగల్లులోన నుయ్యాల లూపెగా
తెల్గు భాషలోన వెల్గులంద!
.
౭) ఘంటావధానం - యం. వెంకటలక్ష్మి
.
(పృచ్ఛకురాలు చేసిన శబ్దాలను విని అవధాని చెప్పినవి...)
.
1. రాగ మీవె భక్తి రాగ మీవె
2. రాలు పూలు పూసె రంజితముగ
3. బమ్మెర పోతన
.
౮) అప్రస్తుత ప్రశంస - పల్లేరు వీరస్వామి గారు సమర్థవంతంగా నిర్వహించారు.
.
అవధాన సమన్వయ కర్తగా వ్యవహరించిన డా॥ ఇందారపు కిషన్ రావు గారి ఆశీఃపద్యములు:
.
ప్రతిభా నాన్యతో దృష్టః
వ్యుత్పత్తిశ్చ గరీయసి|
శాంతిస్వరూప వాగ్దేవ్యాః
అభ్యాసశ్చాద్భుతః క్రమః||
.
సకల కష్టాంశములు తీర్చె సరసరీతి!
చాలు ప్రశ్నలా యవి, సునామీలు గావ?
అన్నిఁటినిఁ బట్టి పూరించె నద్భుతముగ
నబలయా కాదు నిజముగ సబల యనుము!
.
అవధానానంతరం శ్రీలేఖ సాహితి, వరంగల్ వారు ప్రచురించిన డా॥ పిట్టా సత్యనారాయణ గారి 'బ్రతుకు బాట (పద్య కథాకావ్యము), 'ఆధ్యాత్మిక యోగా - నాడీ నిదానము' అన్న పుస్తకాల ఆవిష్కరణ జరిగింది.
.
స్వస్తి
.

సోమవారం, నవంబర్ 28, 2016

ఆహ్వానము

కాకతీయ పద్య కవితా వేదిక, వరంగల్

అవధాన రాజహంసిని, శతావధాన విశారద
కుమారి పుల్లాభట్ల నాగశాంతి స్వరూప గారిచే
(తెలుగు అధ్యాపకురాలుఆంధ్ర యువతీ సంస్కృత కళాశాలరాజమహేంద్రవరము)

అష్టావధానము

వేదిక : రైజింగ్ సన్ హైస్కూల్, వాసవి కాలనీ రోడ్, కొత్తవాడ, వరంగల్
తేదీ : 04-12-2016 (ఆదివారం); సమయం : ఉదయం 10-00 గం.లకు.

అధ్యక్షులు             : Ln. తమ్మెర లక్ష్మీనరసింహరావు గారు, MJF., T 20 F.,
సమన్వయ కర్త       : డా॥ ఇందారపు కిషన్ రావు గారు, (ప్రముఖ అష్టావధాని)
ముఖ్య అతిథి         : శ్రీ ఆరుట్ల భాష్యాచార్య గారు, (ప్రముఖ పద్యకవి)
విశిష్ట అతిథి          : డా॥ టి. శ్రీరంగస్వామి గారు, (శ్రీలేఖ సాహితి, వరంగల్)

పృచ్ఛకులు
నిషిద్ధాక్షరి                 : శ్రీ గుండు మధుసూదన్ గారు
సమస్య                    : శ్రీ జీడికంటి శ్రీనివాస మూర్తి గారు
దత్తపది                   : శ్రీ కంది శంకరయ్య గారు
వ్యస్తాక్షరి                 : శ్రీమతి బోయినిపల్లి రాధ గారు
వర్ణన                      : డా॥ పాతూరి రఘురామయ్య గారు
ఆశువు                    : శ్రీ చేపూరి శ్రీరామ్ గారు
ఘంటావధానము        : చి॥ యం. వెంకటలక్ష్మి
అప్రస్తుత ప్రసంగము    : డా॥ పల్లేరు వీరస్వామి గారు


అందరూ ఆహ్వానితులే!

ప్రాయోజకులు :
     శ్రీ రామడుగు షణ్ముఖాచారి గారు,       
ప్రిన్సిపాల్, రైజింగ్ సన్ హైస్కూల్, వరంగల్.