Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, నవంబర్ 29, 2015

సమస్య: వాసుదేవునిఁ గంసుఁడు పట్టి చంపె!

తేది: నవంబర్ 29, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము 


(దేవకీదేవి కన్న యెనమండ్రు సంతానమందు నార్వురనుం గంసుఁడు చంప, సప్తమ గర్భము పతనమై యాదిశేషుని యంశయగు సంకర్షణునిగ [బలరాముఁడు] రోహిణీగర్భగతుఁడాయె, నష్టమ గర్భము శ్రీకృష్ణుఁడని తెలియునది)



తననుఁ జంపెడి శిశువునుఁ దానె చంపఁ
గోరి,  దేవకి కన్నట్టి కూర్మి సుతుల
నార్వుర వసుదేవుఁడిడఁగ, నందియుఁ, బ్రతి
వాసుదేవునిఁ గంసుఁడు పట్టి చంపె! (1)


************************************************************


మరణ భయమునఁ గ్రుద్ధుఁడై  వరుసఁగఁ బ్రతి
వాసుదేవునిఁ గంసుఁడు పట్టి చంపె!
యోగమాయయుఁ దర్జించె "నొక్క బాలుఁ
డంతమొందింప వ్రేపల్లియనుఁ గలఁ" డని! (2)





6 కామెంట్‌లు:

  1. మధుసూదన్ గారు.. మొదటి పూరణము లో కూర్మి, నంది పదముల వాడుక ఎలా వచ్చింది వాటి అర్ధము ఎమిటో తెలుపండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 1. "కూర్మి సుతులు" అన్న పదబంధం (యొక్క షష్టీరూపం) మొదటి పద్యంలో ఉంది. కూర్మిసుతులు అంటే ప్రియమైన బిడ్డలు అనే అర్థం. కూర్మి అనేది కూరిమి (ప్రేమ) అన్న పదానికి పొట్టిరూపం. ఈ కూర్మి అనే పదాన్ని కూర్మ (తాబేలు) అన్న దానితో తికమక పడవద్దండి.

      2. "వసుదేవుఁడిడఁగ నంది" అన్నది విసంధిగా "వసుదేవుఁడిడఁగన్ అంది" అని తెలుసుకోవాలి. ఇక్కడ అంది అంటే "అందుకొని" అని అర్థం. ఇక్కడ "అంది" అన్న పదం పదాదిని సంధికార్యం కావటంతో 'నంది' అన్నట్లు కనిపిస్తోంది కాని ఇక్కడ 'నంది' ఏదీ లేదు.

      తొలగించండి
    2. శ్యామలీయం గారు..కూరిమి అంటే స్నేహం ప్రేమ అనే అర్ధాలు వస్తాయని ముందు చదివాను కాని ఈ రూపము లో నాకర్ధం కాలేదు..మరచిన తెలుగును గుర్తు చెసుకునే త్రోవలొ నేను వున్నాను విశదీకరించినందుకు ధన్యవాదాలు. అలగే మీ పేరు చాలా కొత్తగా వుంది. చాలా సంతోషం

      తొలగించండి
  2. స్పందించి తమ సందేహములను వెలిబుచ్చిన వంశీకృష్ణగారికి, నేను సకాలమున స్పందింపమి, తగిన విధముగ సందేహ నివృత్తి చేసిన సుకవి మిత్రులు శ్రీ తాడిగడప శ్యామలరావు (శ్యామలీయం) గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  3. వంశీకృష్ణగారూ! శ్యామలీయం అనునది శ్రీ తాడిగడప శ్యామలరావు గారి బ్లాగు పేరు. మీరు తప్పక చూడవలసిన బ్లాగు. దాని చిరునామా: www.shyamaliyam.blogspot.com

    స్వస్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బ్లాగు చిరునామాలో h లేదు. చిరునామా: http://syamaliyam.blogspot.in/ చివరన in బదులు com అని ఉంచినా ఫరవాలేదు.
      మధుసూధన్ గారూ, మీ అభిమానానికి అనేక ధన్యవాదాలు

      తొలగించండి