Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, మార్చి 02, 2014

పద్య రచన: తాంబూలము (అణా అసలు కథ)

తేది: జూలై 21, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు.



కం.
ధారానగరమునందు ను
దారులు భవభూతి, కాళిదాసు లిరువు రా
దారి నడువంగఁ జని యటఁ
గోరియుఁ దాంబూల మపుడు గూరిమితోడన్.

తే.గీ.
కనిరి తాంబూలరాగాధరను వితర్ది;
నామె తారుణ్యభరయౌట, నటకు నేఁగి,
"తూర్ణమే తెమ్ము చూర్ణమ్ము పూర్ణచంద్ర
వదన!" యని భవభూతియుఁ బలుకఁగానె.

ఆ.వె.
కాళిదాసు పలికె “కర్ణాంతకీర్ణలో
చన విశాల! తెమ్ము స్వర్ణవర్ణ
పర్ణములను! నీకు బహుశుభాశీస్సులు!
వేఁగఁ బోయి రమ్ము, వేచియుంటి!”

ఆ.వె.
అనఁగ లోని కేఁగి యాపడతియు నప్డు
పసిఁడిఁ దమలపాకు లెసఁగుచుండఁ
దెల్లనైన సున్న ముల్లసిల్లుచునుండఁ
దీసికొనియు వచ్చె దీక్షతోడ!

తే.గీ.
ముందు గోరిన యా భవభూతి విడచి
కాళిదాసుకు నిచ్చెను కాంక్ష దీర!
నపుడు భవభూతియును కారణ మ్మడుగఁగ,
వనిత బదులిచ్చెఁ గారణమును కవికిని!

కం.
"వినుఁ డార్యా! లోకమునం
జనురీతిని నే నడచితి! సైరింపుఁడు నన్!
బెను రొక్కము లిచ్చినవా
రినె మెచ్చును లోక మెపుడు శ్రేష్ఠ నిజమిదే!

ఆ.వె.
నీవు మూఁడణాలు, నితఁడును నైదణా
లిచ్చిరయ్య నాకు నిచ్చగలిగి,
యెక్కుడైన ధనము నిచ్చిన యీతని
కాంక్షఁ దీర్ప ముందుగా నిడితిని!"

కం.
ఆమాట విన్న యిద్దఱు
నేమాటనుఁ బలుకలేక నెఱజాణ కటన్
సేమమ్ము గల్గు ననియును
నీమముతో వెడలి రపుడు నెమ్మన మలరన్!

-:శుభం భూయాత్:-

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి