Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, మే 10, 2014

పద్య రచన: దుష్యంతునకు శకుంతల లేఖ...

తేది: సెప్టెంబర్ 24, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు


మ.
“అనివార్యమ్మయి యా శకుంతలను దుష్యంతుండు కళ్యాణమై
చనఁగన్ బోవుచు ముద్రికం దొడిగి, యా సత్యాత్మకుం డెంతకున్
దన దారం బిలువంగ రాఁ డిటకు! లేదా యేమి రాగమ్ము నా
తనికిన్? బూనెనొ కిన్క యెట్టి కతనో? ధర్మమ్ము కాదిద్దియున్!” (1)


తే.గీ.(పంచపాది)
వనిని యనసూయయుం బ్రియంవదయు నిట్లు
పలుకుచుండఁగ వినియు నా వన్య రమణి
యగు శకుంతల కినుకతో ననియె "నేమె!
నా విభుఁడు మాట తప్పక నన్ను వేగ
పురికి రప్పించు నిజముగాఁ! బొండు పొండు! (2)


కం.
అని తరిమి యా శకుంతల
తన నాథునిఁ దలఁచి, సుంత తాప మధికమై;
మనమునఁ గల దు:ఖమ్మును
గనిపింపఁగ నీయకుండఁ గణ్వుని కుటిలోన్. (3)


ఆ.వె.
చని యట మఱి యుండఁ జాలక బయటకు
వచ్చి యేడ్చుచుండఁ బరుగు తోడఁ
జెలియు వచ్చి, యడుగఁ జింతను దిగమ్రింగి,
"లేఖ వ్రాతు నిపుడు, ఱిచ్చ యేల? (4)


కం.
కమ్మను దె"మ్మని యమ్ముది
తమ్మెయి నమ్మంగఁ బలుకఁ, దాఁ దెచ్చి యిడన్;
గమ్మ పయి వ్రాసె నెద్దియొ
యమ్ముని పట్టి యటఁ దన్మయాంచిత హృదియై! (5)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి