Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, మే 07, 2014

పద్య రచన: విఘ్నేశ్వర స్తుతి!

తేది: సెప్టెంబర్ 19, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు



శా.
హే విఘ్నేశ! గజాస్య! లంబ జఠరా! హేరంబ! భాండోదరా!
హే విశ్వగ్దృశ! మంగళస్వర! సఖా! హే బ్రహ్మచారీ! కృతీ!
హే విష్ణు! ప్రభు! విశ్వనేత్ర! వరదా! హే జిష్ణు! సర్వాత్మకా!
హే విద్యా ధన శక్తి యుక్తి మహితా! హే సుప్రదీపా నమ:!! (1)


తే.గీ.
ఏకవింశతి పత్రాల నెలమి నునిచి,
స్వాదు ఫలములు, పుష్పాల సరము లిచ్చి,
పంచభక్ష్య, పాయసముల భక్తి నిడియు,
నర్చ సేతుము విఘ్నేశ, యాదుకొనుము! (2)


ఆ.వె.
ప్రతిదినమ్ము మేము ప్రార్థింతు మో యయ్య!
విఘ్నములనుఁ ద్రోల వినతి సేతు;
రుగ్మతలనుఁ బాపి, ప్రోవు మో విఘ్నేశ!
భక్తితోడ నీకుఁ బ్రణతు లిడుదు! (3)


కం.
నీ పాద ధ్యానముచే
మా పాపమ్ములను డుల్చు మహితాత్ముఁడవే!
హే పార్వ తీశ నందన!
యీ పర్వ దినమ్ము నందు నీకిడుదు నతుల్! (4)


చక్రవాకము:
వరగజాస్య! విఘ్నహంత్రి! భానుతేజ! సౌఖ్యదా!
ధరనిభోదరా! విచిత్ర! దంతివక్త్ర! శాంకరీ!
సురనరాది సేవితాంఘ్రి! శూర్పకర్ణ! హేరుకా!
కరిపలాద గర్వహారి! కావుమయ్య మమ్మిఁకన్!! (5)



-:శుభం భూయాత్:-



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి