Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జులై 31, 2015

సమస్య: సంతాపసభల్ జనులకు సంతస మొసఁగున్!

తేది: జూన్ 26, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము





పంతము నూనియుఁ బగతుఁ డ
నంతునిచేఁ జచ్చినట్టి నరకుఁ దలఁచుచున్
వింతగఁ జేసెడి దానవ
సంతాపసభల్ జనులకు సంతస మొసఁగున్!


గురువారం, జులై 30, 2015

సమస్య: హరుని వక్షస్స్థలమ్మున నమరె లక్ష్మి!!

తేది: జూన్ 25, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము





బ్రహ్మ ముఖమున నమరెను వాణి! హరుని
తలను గంగ, దేహార్ధమం దమరె గౌరి!
శ్రీశు శ్రీవేంకటేశుని జిష్ణుని ముర
హరుని వక్షస్స్థలమ్మున నమరె లక్ష్మి!!




మంగళవారం, జులై 28, 2015

సమస్య: కన్నబిడ్డ కంటఁ గార మిడెను!

తేది: జూన్ 24, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము






దొంగయొకఁడు నింట దోచుకొనంగనుఁ
జూచుచుండ, లేచి, చూచి, తల్లి
కేకవేయ; వాఁడు కినిసి, చంపఁగఁ జూడఁ;
గన్నబిడ్డ, కంటఁ గార మిడెను!!



సోమవారం, జులై 27, 2015

సమస్య: వాన కురియ మురిసెఁ బడకటింట!

తేది: జూన్ 23, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము





క్రొత్తదంపతులకుఁ గొంగ్రొత్తగా శోభ
నమ్ముఁ జేయ నెంచినారు నాఁడు!
జంట, దరికిఁ జేరఁ జనఁగానె, పూవుల
వాన కురియ, మురిసెఁ, బడకటింట!!


ఆదివారం, జులై 26, 2015

పద్యరచన: కారు ముందు కారు...

తేది: జూన్ 23, 2015 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నేను వ్రాసిన పద్యము


[ఈ చిత్రం చైనాలో ఒకానొక సందర్భంలో జరిగినట్టి, ప్రపంచంలోనే రికార్డ్ సృష్టించినట్టి "పెద్ద ట్రాఫిక్ జామ్‍"కు సంబంధించినది(ట!)]



కారుముందు కారు! కారువెనుక కారు!
కారు పార్శ్వములను కార్లె కార్లు!
కార్లు నిండియున్న గమనవేగము మిన్న!
కాని, యాక్సిడెంట్లు కానెకావు!!

శనివారం, జులై 25, 2015

సమస్య: సున్న మిడవె యన్న మేల చుట్టంబునకున్

తేది: జూన్ 21, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు



(శిశుపాలుఁడు దుడుకుతనముతోఁ దన బావ శ్రీకృష్ణునకు వెన్నకు బదులుగ సున్నమిమ్మని తన తల్లితోఁ జెప్పు సందర్భము)

(1)
కన్నఁ డిటు వచ్చి "యత్తా!
వెన్ననుఁ దె" మ్మంచుఁ బల్క, వేగమె "యమ్మా!
వెన్ను నిట బన్నపఱుపఁగ
సున్న మిడవె! యన్న మేల చుట్టంబునకున్?"


***        ***        ***        ***


నా రెండవ పూరణము:

(2)
కన్నము వేసెడి దొంగల
కన్ననుఁ బది రెట్లు చోర కాంక్షిత మతులౌ
నన్నల కిపు డో రమణీ
సున్న మిడవె! యన్నమేల చుట్టంబునకున్?




గురువారం, జులై 23, 2015

దత్తపది: అలి-నోలి-కోలి-మొలి...నచ్చిన ఛందంలో...లలితాదేవి స్తుతి...

ఓం శ్రీ మాత్రేనమః!

మిత్రులు శ్రీ గుండవరము హనుమంత రావు Hanumanth Rao Gundavaram​) గారు
"పద్యామృతం" facebook లో కోరినట్లుగానే...
దత్తపదిలో... అలి-నోలి-కోలి-మొలి...శబ్దముల నుపయోగించి
నచ్చిన ఛందస్సులో
లలితాదేవి స్తుతి పద్యము వ్రాయమనగా
నేను వ్రాసిన ఆటవెలఁది పద్యము



ఆ.వె.:
అలి’కనేత్రి! హే సకల జగత్ప్రసవిత్రి!
సతముఁ గొల్తు ’నోలి’ శైలపుత్రి!
త్రిపురసుందరి! కసరేల’కో? లి’ప్స నా
కీఁ గరుణ రస ’మొలి’కింపు ధాత్రి!!

స్వస్తి.


బుధవారం, జులై 22, 2015

సమస్య: ధర్మజుని తల్లి గాంధారి తాత శకుని!

తేది: జూన్ 20, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు


(కన్నీరుఁ గార్చుచు గాంధారి ధర్మజునితోఁ దన కుమారులఁ గూర్చి పలికిన సందర్భము)

(1)
కంట నీరొల్కఁ బల్కె నక్కడనుఁ జూచి
ధర్మజుని, తల్లి గాంధారి, "తాత! శకుని,
నాదు కొమరుల మనముల నాది నుండి
మార్చివైచెను గాన దుర్మార్గులైరి!"

(తాత! = నాయనా!)

***        ***        ***        ***        ***


(2)
కంకుఁ డని పిల్తు రెవని? నిన్ గన్న దెవరు?
తానె గంతలం గొనె నేరు? తండ్రి తండ్రి
నేమి యనెదరు? కౌరవ హితుఁ డెవండు?
ధర్మజుని-తల్లి-గాంధారి-తాత-శకుని!


మంగళవారం, జులై 21, 2015

సమస్య: లక్ష్మణుఁ డానందమందె లంకకు రాజై!

తేది: జూన్ 18, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు



(రావణ సంహారము పిదప విభీషణుఁడు శ్రీరామునితో భాషించిన సందర్భము)


(1)

"ఈ క్ష్మాజ నిన్నుఁ జేరఁగ
లక్ష్మణుఁ డానందమందె! లంకకు రాజై
యీ క్ష్మాతల మేలుమయా!
సూక్ష్మమిది! యయోధ్యయేల? శూరోత్కృష్టా!!"


***        ***        ***        ***        ***




(సీతారాముల సమాగమమునుం గనిన విభీషణుఁ డానందించిన సందర్భము)

(2)
పక్ష్మలకాకయె సీతయు
నా క్ష్మావరుఁ గన, విభీషణాఖ్య సుగుణుఁడౌ
సూక్ష్మదృ గధిగత వినమిత
లక్ష్మణుఁ డానందమందె, లంకకు రాజై!



సోమవారం, జులై 20, 2015

సమస్య: కన్నులుండి కూడ కాంచలేరు!

తేది: జూన్ 16, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు


(తనకు విశ్వరూపమ్మునుం జూపిన శ్రీకృష్ణుని నర్జునుఁడు నుతించు సందర్భము)

(1)
తల్లి తండ్రి గురువు దైవమ్ము నీవంచు
విశ్వరూప మిపుడు ప్రేమఁ గంటి!
పరుల కీవు నిట్టి భాగ్య మ్మొసంగినఁ
గన్నులుండి కూడ కాంచలేరు!!

***        ***        ***


(కనులముందు జరుగు దుర్మార్గము నెదిరింపనివారు కన్నులుండియు గ్రుడ్డివారే యనుట)

(2)
కనుల యెదుట జరుగు కాకుదనము నెల్లఁ
జూచుచు నెదిరింపఁ జూడకున్నఁ,
జెడును పృచ్ఛసేయఁ గడఁగ కున్నను వారు
కన్నులుండి కూడ కాంచలేరు!




ఆదివారం, జులై 19, 2015

దత్తపది: కాకి-కోయిల-నెమలి-కోడి...(అన్యార్థంలో)...భారతార్థంలో...నచ్చిన ఛందస్సులో...

తేది: జూన్ 17, 2015 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
కాకి-కోయిల-నెమలి-కోడి
పదములను అన్యార్థంలో ఉపయోగిస్తూ
నచ్చిన ఛందస్సులో
భారతార్థంలో
పద్యాన్ని వ్రాయమనగా
నేను వ్రాసిన తేటగీతి పద్యము


(నర్తనశాలకు రమ్మని పిలచిన కీచకునకు సైరంధ్రి సమాధానము)



"నన్ను నేకాకిగా నర్తనంపుశాల
కడకు రమ్మన కోయి! లక్షణ యుతలనుఁ
బిల్వఁ దగునె? మలిన చరితు ల్వచింపఁ,
గులసతుల్ వత్తురే వారి కోడి దరికి?"



శనివారం, జులై 18, 2015

సమస్య: (2) అక్షరములు నేర్చి భిక్ష మెత్తె!

తేది: జూన్ 15, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండవ పూరణము






(బ్రహ్మచర్య దీక్షఁ బూని, గురువుఁ జేరిన శిష్యుఁడు పరావిద్యా సంబంధిత సన్మంత్రాక్షరాలను శ్రద్ధగా నేర్చి, భిక్షాటనకు వెడలిన సందర్భము)




బ్రహ్మచారియై పరావిద్యలను నేర్వ
గురువుఁ జేరి శ్రద్ధ కొనలు సాఁగ
మహితమైన యట్టి మాన్య సన్మంత్రంపు
టక్షరములు నేర్చి, భిక్ష మెత్తె! (2)




శుక్రవారం, జులై 17, 2015

సమస్య: అక్షరములు నేర్చి భిక్షమెత్తె!

తేది: జూన్ 15, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము





అతఁడు పేద; పనియు నతనికి నెవ్వరు
నీయ రైరి! బ్రదుకు నెట్ట నతఁడు
రామ నామ సుధల రమ్యమౌ గేయంపు
టక్షరములు నేర్చి, భిక్షమెత్తె!!



గురువారం, జులై 16, 2015

సమస్య: పసులఁ గొల్చు జనుల భద్ర మమరు!

తేది: జూన్ 12, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము




దైవ చింతనమునఁ దరియింపఁ దపమొన
ర్చియును ఫలము ప్రజల శ్రేయమునకు
వెచ్చపెట్టునట్టి విగత సంసృతులఁ దా
పసులఁ గొల్చు జనుల భద్ర మమరు!



బుధవారం, జులై 15, 2015

సమస్య: గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్!

తేది: జూన్ 14, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



(ఒక చిత్రకారుఁ డణు పరిమితమైన బియ్యపు గింజపై గరుడుని చిత్రమునుం జిత్రింపఁగా దానిని నొక వానపాము గుటుక్కున మ్రింగిన సందర్భము)


బిరుదయుత చిత్రకారుఁడు
హరివాహనము నణు పరిమి తాంచిత గరిమన్
విరచించ, "వ్రీహిబీజపు

గరుడుని" నొక వానపాము గ్రక్కున మ్రింగెన్!



మంగళవారం, జులై 14, 2015

సమస్య: ఇంటికంటె మఠము హిత మొసంగు!

తేది: జూన్ 13, 2015నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము






ఒకటిఁ జెప్ప నింక నొక్కటిఁ దాఁ జేసి,
యెడ్డె మనఁగఁ దెడ్డె మిది యని సతి
మదిని శాంత మెపుడు మాయమ్ము సేయంగ
నింటికంటె మఠము హిత మొసంగు!




ఆదివారం, జులై 12, 2015

సమస్య: కాముకులు పవిత్రు లనుట కల్ల యెటు లగున్?

తేది: జూన్ 10, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



వేమఱు సత్యముఁ బలుకుచు
నీమముతో నీతి పథము నెఱిఁ దప్పని స
త్ప్రేమోత్కృష్టాహింసా
కాముకులు పవిత్రు లనుట కల్ల యెటు లగున్?


శనివారం, జులై 11, 2015

సమస్య: పతి విడనాడిన సతికి శుభమ్ములు గలుగున్! (2)

తేది: జూన్ 09, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా మఱియొక పూరణము



(శ్రీరాముఁడు జనాపవాదభీతిచే సీతాపరిత్యాగముం జేసిన విషయమును యోగదృష్టిచేఁ గనుఁగొనిన వాల్మీకమహాముని తన మనస్సులో ననుకొనిన సందర్భము)



"మతిలేని చాకి వదరఁగ;
మితిలేని వనమ్ములందు మిథిలుని కూఁతున్
గతిలేక విడిచె! నా రఘు
పతి విడనాడిన సతికి, శుభమ్ములు గలుగున్!"




శుక్రవారం, జులై 10, 2015

సమస్య: పతి విడనాడిన సతికి శుభమ్ములు గలుగున్!

తేది: జూన్ 09, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



(పతి విడనాడిన తన సోదరి జ్యేష్ఠాదేవిని లక్ష్మీదేవి యాదరించి గతినిడునని విష్ణువు నారదునితోఁ బలికిన సందర్భము)



"సతియగు జ్యేష్ఠాదేవిని
పతి యుద్దాలకుఁడు విడచి పర సీమఁ జనన్
గతి నిడును లక్ష్మియే! త
త్పతి విడనాడిన సతికి శుభమ్ములు గలుగున్!"

(గమనిక: పద్మపురాణాంతర్గత కార్తీకపురాణ కథయందు సూతమహర్షి తెలిపిన ప్రకారముగ జ్యేష్ఠాదేవి భర్త "ఉద్దాలకుఁడు")





గురువారం, జులై 09, 2015

సమస్య: పగలు ముగిసినంత సెగలు రేఁగె

తేది: జూన్ 08, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



("పగ"లనుఁ దొలఁగించుకొనిన సతులకు సౌఖ్యము లబ్బునని యిటఁ జమత్కరించనైనది)


"పగ"లు తీవ్రమైన బ్రతుకు దుర్భరమౌను!
పగలు ముగిసినంత, "సెగలు రేఁగె"
ననెడు మాట మఱచి, యానందమునఁ దేలి,
సౌఖ్య మనుభవింత్రు సతము సతులు!



మంగళవారం, జులై 07, 2015

సమస్య: కోఁతినిఁ బెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చఁగా!

తేది: జూన్ 07, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

(అంజనా దేవి కేసరిని వివాహమాడిన ఘట్టమునిట ననుసంధానించుకొనునది)

ఉత్పలమాల (షట్పాది):
జాతికి "నొక్క యప్సర"యె, శాపవశమ్మున "నంజనాఖ్య"యై,
కూఁతురుగా జనించె కపి "కుంజర" నామక సౌమనస్వికిన్!
భాతిగఁ బ్రత్యహమ్ము గుణవర్ధని యౌచును నుండ, నొక్కెడన్
గౌతుకమొప్పఁగా సఖులు కూర్మినిె వెన్కొనఁ గాన కేఁగి, తా
భీతిలె హస్తిఁ జూచి! కని వేగమె, "కేసరి" దానిఁ జంప, నా
కోఁతినిఁ బెండ్లియాడె "నొక కోమలి" స్నేహితురాండ్రు మెచ్చఁగా!!




***        ***        ***        ***

శంకరయ్యగారు ఇచ్చిన సమస్య యథాతథముగఁ దీసికొన్నచో :
కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చఁగా!!
దీనినీవిధముగఁ బూరించితిని:


(పరిశీలనా జ్ఞానము చక్కఁగా లేని యొక కోమలి చేష్ట)

"దాతనుఁ బెండ్లి చేసుకొనె" దంచునుఁ బోవుచు దారిఁ దోఁటలోఁ
గాఁతయుఁ గాఁచి, గొప్ప వడగాలికి రాలిన మావికాయలన్,
జూత సుగంధపున్ సొగసు స్రుక్కఁగఁ గాంచియొ, దానిఁ గానలే
కో, తిని, పెండ్లియాడె నొక కోమలి, స్నేహితురాండ్రు మెచ్చఁగా!




సోమవారం, జులై 06, 2015

సమస్య: గీత నిస్సారమని చెప్పెఁ గృష్ణుఁ డౌర!

తేది: జూన్ 06, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(కురుక్షేత్రమందు శ్రీకృష్ణుం డర్జునునకు హితమును బోధించు సందర్భము)


"జనుల కందఱకును బ్రహ్మ సారవంత
మైన గీత గీయఁడు, విను, మాన్యచరిత!
యదియుఁ గౌరవులకుఁ గల నుదుటి పైని
గీత, నిస్సార"మని చెప్పెఁ గృష్ణుఁ డౌర!!



ఆదివారం, జులై 05, 2015

సమస్య: అందఱకును గీడుఁ గల్గు యాగముఁ జేయన్!

తేది: జూన్ 05, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు





(ఉదంకుఁడను మునీంద్రుండు జనమేజయుని సర్పయాగముం జేయుమని ప్రోత్సహించు సందర్భము)





"కొందల మందక కౌరవ!
ముందుగ నీ సర్పయాగమున్ మొదలిడుమా!
మ్రందఁగఁ జేసెడి విషధరు
లందఱకును గీడుఁ గల్గు యాగముఁ జేయన్!!"(1)

***        ***        ***        ***



(అపత్నీకుఁడై శ్రీరాముఁ డశ్వమేధయాగము నారంభించునని తెలిసినంతనే జను లిట్లనుకొనిన సందర్భము)




"ఎందుల కీ విధి దశరథ
నందనుఁడు నజాని యయ్యు నడపును జన్నం?
బిందునఁ బొందెద రశుభము;
లందఱకును గీడు గల్గు, యాగముఁ జేయన్!!" (2)




శనివారం, జులై 04, 2015

సమస్య: కవులు గాంచని వెల్లను రవియె కాంచు!

తేది: జూన్ 04, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము





లోకమంతయుఁ దిరిగి తల్లోక కృతము
లన్నియు నఱయు నట్టి సల్లక్షణమ్ము
ప్రతిదినమ్మునుఁ గవులకు వలను పడదు!
కవులు గాంచని వెల్లను రవియె కాంచు!!




శుక్రవారం, జులై 03, 2015

సమస్య: సోముఁడు నిప్పులను గుఱిసె సూర్యునివలెనే!

తేది: జూన్ 03, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



(సభలో శిశుపాలుఁడు శ్రీకృష్ణు నధిక్షేపించు సందర్భము)



"వేమఱుఁ బొగడఁగనేలా?
ధీమతుఁడా యాదవుండు? దివిజేశుండా?
సేమము కా" దన, యదుకుల
సోముఁడు నిప్పులను గుఱిసె సూర్యునివలెనే!




గురువారం, జులై 02, 2015

సమస్య: గరుడునిఁ గని సంతసించుఁ గద భుజగమ్ముల్!

తేది: జూన్ 02, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము






త్వర నమృత మిడి చెలంగిన
గరుడుని దాస్యమ్ము తొలఁగఁగాఁ గుమిలియు, శ్రీ
హరికిని దాస్యముఁ జేసెడి
గరుడునిఁ గని, సంతసించుఁ గద భుజగమ్ముల్!



బుధవారం, జులై 01, 2015

సమస్య: తప్పు లొప్పు లన్నఁ దప్పు ముప్పు!

తేది: జూన్ 01, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము




(తప్పుచేసిన అక్బరు పాదుషాను గూర్చి బీర్‍బల్ తన మనస్సులో నిట్లు వితర్కించిన సందర్భము)


"తప్పు చేసినట్టి తమ రాజుగారినిఁ 
’దప్పుచేసితి’వని తఱచి యనఁగ 
దండనమ్ము నాకుఁ దప్పదు! కావునఁ 
దప్పు లొప్పు లన్నఁ దప్పు ముప్పు!"