Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, డిసెంబర్ 05, 2016

వరంగల్ అష్టావధాన విశేషాలు



కాకతీయ పద్య కవితా వేదిక మరియు రైజింగ్ సన్ హైస్కూలు యాజమాన్యం వారి సంయుక్త ఆధ్వర్యంలో ది. 4-12-2016 (ఆదివారం) నాడు వరంగల్లులోని రైజింగ్ సన్ హైస్కూలులో కుమారి 'పుల్లాభట్ల నాగశాంతి స్వరూప' గారు అష్టావధానం చేశారు. ఈ కార్యక్రమానికి లయన్ శ్రీ తమ్మెర లక్ష్మీనరసింహ రావు గారు అధ్యక్షత వహించగా, ప్రముఖ అష్టావధాని డా॥ శ్రీ ఇందారపు కిషన్ రావు గారు సమన్వయకర్తగా వ్యవహరించారు. అతిథులుగా శ్రీ ఆరుట్ల భాష్యాచార్య గారు, డా॥ శ్రీ టి. శ్రీరంగస్వామి గారు పాల్గొన్నారు.
అష్టావధానంలోని అన్ని అంశాలను అవధాని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలను అందుకున్నారు.
.
౧) నిషిద్ధాక్షరి - గుండు మధుసూదన్
.
ఓరుగల్లులో పోతన భాగవతావిష్కరణం...
.
అవధాని పూరణ - (కుండలీకరణంలో ఉన్నవి పృచ్ఛకులు గుండు మధుసూదన్ నిషేధించిన అక్షరాలు. x అని ఉన్నచోట పృచ్ఛకులు నిషేధం విధించకుండా అవధాని చిత్తానికి వదిలివేశారని గమనించగలరు.).....
.
(x)శ్రీ(x)క(ర)ళ(య)తో(ప)ని(త)ండి(య)న(య)నీ
పాక(x)ము(x)మే(న)లై(x)స(క)త(త)ంబు భ(స)ళి(ర)యై (x)యె(స)ప్డున్
.
(రెండు పాదాలకు మాత్రమే నిషేధం విధించబడింది)
.
శ్రీకళతో నిండిన నీ
పాకము మేలై సతంబు భళియై యెప్డున్
లోకానికి మేలు కలుగ
శ్రీకారమె భాగవతము చిన్మయ కవిరాట్!
.
౨) సమస్య - జీడికంటి శ్రీనివాస మూర్తి
.
"అవధాన మ్మొక ప్రజ్ఞయౌ ననఁగ నా కాశ్చర్యమౌ సోదరీ"
.
అవధాని పూరణ....
.
వ్యవధానం బిసుమంత లేక యిలలో వర్ధిల్లు సత్క్రీడయై
కవిలోకానికిఁ గాంతు లీను శశియై గంభీర వాగ్బంధమై
యవురా చిత్ర విచిత్ర దీపితములై హ్లాదంబుఁ జేకూర్చు నీ
యవధాన మ్మొక ప్రజ్ఞయౌ ననఁగ నా కాశ్చర్యమౌ సోదరీ!
.
౩) దత్తపది - కంది శంకరయ్య
.
"సీత-కైక-సుమిత్ర-తార" పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో స్వేచ్ఛాచ్ఛందంలో పద్యం చెప్పాలి.
.
అవధాని పూరణ....
.
రాజ్యమునకై కలవరించి రహిని వెలుఁగ
ధరణి వసుమిత్రమై వెల్గు తపనఁ గూడి
కౌరవులె యిసీ తండ్రినిఁ గలఁతఁ బెట్టి
పశుతను వనితా రత్నముఁ బరిభవించె!
.
౪) వర్ణన - పాతూరి రఘురామయ్య
.
భద్రకాళి అమ్మవారి వర్ణన.....
.
అవధాని పూరణ....
.
అల్లాడించితివే సురారుల ననిన్ హాయంచు విశ్వేశ్వరీ
యిల్లాలా శివ వామభాగ నిలయా హేరంభ సంతోషిణీ
ముల్లోకాలకు మూలమైన జననీ మోక్షప్రదా ధీప్రదా
యుల్లంబందున భద్రకాళి యమవై యుత్సాహ మందింపవే!
.
౫) వ్యస్తాక్షరి - బోయినిపల్లి రాధ
.
ధరణి ననేక శిష్యులను దక్షులఁ జేసెడు ప్రాజ్ఞు లిమ్మహిన్.
.
౬) ఆశువు - చేపూరి శ్రీరామ్
.
1. మహాసహస్రావధానులు మీ అవధానాన్ని చూసి మనస్సులలో ఏమనుకొని వుంటారో ఊహించిచెప్పండి.
.
అవధాని పూరణ....
.
దిగ్గజములు నెదుట దిట్టలై యుండఁగా
పద్య పాదములవి పరుగుఁ దీయు
నింత వారి నెల్ల నెంతెంతగాఁ జూపు
వారి దృక్కు నాకు వాక్కు నిడెగ!
.
2. పెద్దనోట్ల రద్దుతో...ప్రజల సహనం...భావి బాగుంటుందని చెప్పండి.
.
అవధాని పూరణ...
.
మంచి ముందుఁ గలదు మదినుంచి మసలుఁడీ
పొంచియున్న చెడునుఁ బోవఁ జేయు
నాశ గలుగువాఁడె యానంద మయుఁడురా
సహన భావ మున్న సాధు సాధు!
.
3. ఈ అవధాన సభా వర్ణన చేయండి.
.
అవధాని పూరణ...
.
ఆఱు నైదుఁ గూడి యానంద మందింప
యత్నములను సలిపె నూత్నముగను
నోరుఁగల్లులోన నుయ్యాల లూపెగా
తెల్గు భాషలోన వెల్గులంద!
.
౭) ఘంటావధానం - యం. వెంకటలక్ష్మి
.
(పృచ్ఛకురాలు చేసిన శబ్దాలను విని అవధాని చెప్పినవి...)
.
1. రాగ మీవె భక్తి రాగ మీవె
2. రాలు పూలు పూసె రంజితముగ
3. బమ్మెర పోతన
.
౮) అప్రస్తుత ప్రశంస - పల్లేరు వీరస్వామి గారు సమర్థవంతంగా నిర్వహించారు.
.
అవధాన సమన్వయ కర్తగా వ్యవహరించిన డా॥ ఇందారపు కిషన్ రావు గారి ఆశీఃపద్యములు:
.
ప్రతిభా నాన్యతో దృష్టః
వ్యుత్పత్తిశ్చ గరీయసి|
శాంతిస్వరూప వాగ్దేవ్యాః
అభ్యాసశ్చాద్భుతః క్రమః||
.
సకల కష్టాంశములు తీర్చె సరసరీతి!
చాలు ప్రశ్నలా యవి, సునామీలు గావ?
అన్నిఁటినిఁ బట్టి పూరించె నద్భుతముగ
నబలయా కాదు నిజముగ సబల యనుము!
.
అవధానానంతరం శ్రీలేఖ సాహితి, వరంగల్ వారు ప్రచురించిన డా॥ పిట్టా సత్యనారాయణ గారి 'బ్రతుకు బాట (పద్య కథాకావ్యము), 'ఆధ్యాత్మిక యోగా - నాడీ నిదానము' అన్న పుస్తకాల ఆవిష్కరణ జరిగింది.
.
స్వస్తి
.

సోమవారం, నవంబర్ 28, 2016

ఆహ్వానము

కాకతీయ పద్య కవితా వేదిక, వరంగల్

అవధాన రాజహంసిని, శతావధాన విశారద
కుమారి పుల్లాభట్ల నాగశాంతి స్వరూప గారిచే
(తెలుగు అధ్యాపకురాలుఆంధ్ర యువతీ సంస్కృత కళాశాలరాజమహేంద్రవరము)

అష్టావధానము

వేదిక : రైజింగ్ సన్ హైస్కూల్, వాసవి కాలనీ రోడ్, కొత్తవాడ, వరంగల్
తేదీ : 04-12-2016 (ఆదివారం); సమయం : ఉదయం 10-00 గం.లకు.

అధ్యక్షులు             : Ln. తమ్మెర లక్ష్మీనరసింహరావు గారు, MJF., T 20 F.,
సమన్వయ కర్త       : డా॥ ఇందారపు కిషన్ రావు గారు, (ప్రముఖ అష్టావధాని)
ముఖ్య అతిథి         : శ్రీ ఆరుట్ల భాష్యాచార్య గారు, (ప్రముఖ పద్యకవి)
విశిష్ట అతిథి          : డా॥ టి. శ్రీరంగస్వామి గారు, (శ్రీలేఖ సాహితి, వరంగల్)

పృచ్ఛకులు
నిషిద్ధాక్షరి                 : శ్రీ గుండు మధుసూదన్ గారు
సమస్య                    : శ్రీ జీడికంటి శ్రీనివాస మూర్తి గారు
దత్తపది                   : శ్రీ కంది శంకరయ్య గారు
వ్యస్తాక్షరి                 : శ్రీమతి బోయినిపల్లి రాధ గారు
వర్ణన                      : డా॥ పాతూరి రఘురామయ్య గారు
ఆశువు                    : శ్రీ చేపూరి శ్రీరామ్ గారు
ఘంటావధానము        : చి॥ యం. వెంకటలక్ష్మి
అప్రస్తుత ప్రసంగము    : డా॥ పల్లేరు వీరస్వామి గారు


అందరూ ఆహ్వానితులే!

ప్రాయోజకులు :
     శ్రీ రామడుగు షణ్ముఖాచారి గారు,       
ప్రిన్సిపాల్, రైజింగ్ సన్ హైస్కూల్, వరంగల్.


ఆదివారం, అక్టోబర్ 30, 2016

నరకాసుర సంహారము - దీపావళి [పద్యకథ]

దీపావళి శుభాకాంక్షలు కోసం చిత్ర ఫలితం

images of the death of narakasura by satya కోసం చిత్ర ఫలితం


అల హిరణ్యాక్ష సంహార కలన వసుధ
నోమిన హరిసాంగత్యాన భూమి కపుడు
కడుపు పండఁగ నరకునిఁ గనియు నతని
కిడెను ప్రాగ్జ్యోతిషపురము నుడుగరగను!

బాణు స్నేహాన నతఁడు దుర్వర్తనుఁడయి
దుష్కృతమ్ములఁ జేయుచు దుండగమున
మునుల బాధించుచుండెను ఘనుఁడ నంచుఁ
దనను మ్రొక్కంగఁ గోరుచుఁ దఱుముచుండి!

ఒక్కనాఁడు వసిష్ఠుండు మ్రొక్కుటకయి
యరిగెఁ బ్రాగ్జ్యోతిషంపుఁ గామాఖ్య దేవి
మందిరమునకు; నంత భూమాత సూనుఁ
డాలయమ్మును మూసినయంత మౌని;

"ఓరి మదగర్వమున రేఁగి యుర్వియందు
సజ్జనుల పరిభవమున సంతసమునుఁ
బొందుచుంటివి కావునఁ బొందెదవుర
మృతిని త్వజ్జన్మ కర్తయౌ పితరువలన!"

శాపమును విని నరకుండు జడిసి నలువ
కయి తపమ్మొనరించి యా కమలజుని ప్ర
సన్నుఁ గావించి దేవ రాక్షసుల చేత
మరణ మందకుండఁగ ఘన వరముఁ బొందె!

తద్వర జనిత గర్వ విస్తారుఁడయ్యు
దేవతల జయించియును, యతీశ్వరులకు
బాధ లిడి, షోడశ సహస్ర భామినులను
బంధితులఁ జేసి, చెలరేఁగె భయము లేక!

మునులు దేవతల్ హరికిని మొఱలు వెట్టి
నరకుఁ జంపి, బాధలఁ దీర్ప వర మడిగిరి!
సత్వరముగ శ్రీకృష్ణుండు సమరమందు
నరకుఁ జంపంగఁ బూని తా నరుగుచుండ;

అపుడు సాత్రాజితియె తోడ నరుగుఁదెంతు
ననుచు వేడి శ్రీకృష్ణుని ననుసరించి
వెడలె యుద్ధమ్మునకుఁ దాను వీరవనిత
పగిది వీరత్వ మెల్లెడఁ బల్లవింప!

అపుడు వెన్నుండు గరుడుని నాత్మఁ దలఁప,
నెదుట నిలఁబడ, సతితోడ నెక్కి తాను
వెడలి ప్రాగ్జ్యోతిషమునకు వీఁకతోడ,
నరకు రావించె ననిసేయ నచటి కపుడు!

ఆగ్రహోదగ్రుఁడై వాఁ డహంకరించి,
యగ్గిపైగుగ్గిలము వేయ భగ్గుమనెడి
రీతి నేతెంచి మార్కొని కృష్ణునపుడు,
పలువిధమ్ముల బాణాలు వదలి యెగసె !

కృష్ణుఁ డంతట నస్త్రశస్త్రోష్ణ సహిత
యుద్ధవిక్రమోర్జిత సుబలోన్నతుఁడయి
నరకుఁ దాఁకెను సత్య తననుఁ గనంగ
విశ్వమోహన రూపాన విహసితుఁడయి!

కాల్బలములు కరులు తురగములు తేరు
లన్ని ఖండతుండమ్ములు నయ్యె నంత
నరకుఁ డొక సాయకము వేయ నందసుతుని
తలకుఁ దాఁకియు మూర్ఛిల్లె దానవారి!

సత్యభామయె పృథ్వ్యంశ జనిత యగుట
కతనఁ జక్రియే మాయా ప్రకాశకుఁ డయి
మూర్ఛ నటియించె! భర్త సమ్మూర్ఛితుఁడయి
నంత సేదఁదేఱిచి సత్య యనికిఁ బూని!

ఒక్క కంటను హరిని నింకొక్క కంట
వైరిఁ జూచుచు శృంగార వీరములును
స్నేహ రోషాలు ముఖమునఁ జిందులాడ
ధనువు నంది విజృంభించెఁ ద్వరఁగ సత్య!

రోష రోహిత సందీప్త లోచనయయి,
నరకు సరకు సేయక, వేసి శరములెన్నొ,
కలఁత వడఁజేయఁగాఁ బ్రతీకార ముడిగి,
వాఁడె యప్రతిభుండయి వఱలె శిలగ!

అంతఁ జక్రియుఁ జక్రమ్ము హస్తమునను
గొనియు భూసుతుఁ దలఁ దెగఁ గొని నిలువఁగఁ,
గనిన సత్య మూర్ఛిల్ల, భూకాంత పొడమి,
కొమరుఁ జంపిన పతిఁగని, నుడివె నిట్లు;

"స్వజుని దుష్కృతాల్ సైరించి, వాని చరిత
జనులు చెప్పుకొనఁగఁ జిరస్థాయిగాను
నిల్పు మో దేవ!" యన, హరి "నేఁటి నుండి
జనులు "నరక చతుర్దశి" జరుపుకొండ్రు!

వాఁడు ప్రాచీదిశోదయ ప్రభల నాపి,
లోకులను జీఁకటినిఁ ద్రోచి, శోకమిడెను;
గాన, నేఁడు దీపమ్ముల ఘనముగాను
పూన్చి "దీపావళీ పర్వము" జరిపెదరు!

ఇట్లె ప్రతియేఁట లోకులు హితకరముగ
నాశ్వయుజ కృష్ణపక్షంపు టమవస తిథి
దీపము ల్వెలిఁగించి యీ దిశలు వెలుఁగఁ
గాను దీపావళియె వెల్గుఁ గరువుదీఱ!"

అనఁగఁ బృథ్వి యంతర్హిత యగుడు, సత్య
మూర్ఛఁ దేఱియు మగని నెమ్మోముఁ గనుచు,
విజయ కాంతులు ముఖమున వెల్లివిఱియ,
స్వీయ నగరికిఁ జనెఁ గుజద్విషునితోడ!

ఫలశ్రుతి:
"నరక సంహార కథ" వినినం జదివిన
జనుల కెపు డాయురారోగ్య సంపదలును
కీర్తి సౌఖ్యము లొనఁగూడి, క్షేమముగను
జీవితము వెల్గుఁ గావుత శ్రీధరు కృప!

ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు



ఆదివారం, అక్టోబర్ 02, 2016

హే మహాత్మ! మహోన్నతా!

మిత్రులందఱకు గాంధీ జయంతి శుభాకాంక్షలు!



మత్తకోకిల:
హే మహాత్మ! మహోన్నతా! ఘన ♦ హేమ భూమి ఫలప్రదా!
రామభక్త! స్వరాజ్య కాముక! ♦ గ్రామ వృద్ధి కృతేప్సితా!
ధీమతా! లవణోద్యమ వ్రత! ♦ దేశభక్తి ప్రచారకా!
క్షేమ దాయక! నీచ హేయక!! ♦ శిష్ట కీర్తిత నాయకా!! (1)



తేటగీతి:
శ్వేతముఖులను ద్రోలంగఁ ♦ జేసితయ్య
యెన్నియో యుద్యమమ్ముల ♦ నిచట నీవు!
పేదలకు లేని వస్త్రాలు ♦ వీడి నీవు
ముతుక దోవతి కండువల్ ♦ ముఱిసినావు!! (2)



ఆటవెలది:
కరమునందుఁ గఱ్ఱ; ♦ కాళ్ళకుఁ జెప్పులు;
పుట్ట గోచి; యొల్లె ♦ భుజము పైని;
రొండిని గడియార♦ముండ శోభిల్లుచు,
దేశభక్తి నిడిన ♦ దేశికుఁడవు! (3)



చంపకమాల(పంచపాది):
“కుల మత వర్గ జాతి మన♦కున్న తిరోగమనంపు గోడలే;
యిల నివి యున్న, యున్నతియె ♦ యెందును నుండక, భ్రష్టమౌదు; మే
విలువలు లేక, యొండొరు ల♦భీప్సితముల్ దెగటార్చి, శత్రులై
నిలుతురు; కొట్టుకొందు; రివి ♦ నీచములయ్య; త్యజింప మేలొగిన్
గలుగు” నటంచు బోధనలఁ ♦ గాచితివే మన భారతీయులన్! (4)



కందము:
దండమయా గాంధీజీ!
దండమయా బాపు! నీకు ♦ దండము నేతా!
దండము మోహనదాసా!
దండమయా కర్మచంద్ర! ♦ దండములయ్యా!! (5)


-:శుభం భూయాత్:-

ఆదివారం, సెప్టెంబర్ 18, 2016

సమస్య: తన ప్రాణమ్మును హరించె స్తన్యం బీయన్

image of sri krishna killed pootana కోసం చిత్ర ఫలితం




సమస్య: తన ప్రాణమ్మును హరించె స్తన్యం బీయన్

వనజోదరుఁ డా కృష్ణుఁడు
ఘనముగఁ జనుఁబాలు ద్రావఁగాఁ బూని వెసన్
దనుజ వనిత యగు నా పూ
తన ప్రాణమ్మును హరించె స్తన్యం బీయన్!


స్వస్తి


బుధవారం, సెప్టెంబర్ 14, 2016

కవయిత్రి మొల్ల

image of poet molla కోసం చిత్ర ఫలితం


శ్రీరాముని చరితమునుం
దా రంజిల్లుచు రచించె ధర విలసిల్లన్!
బేరిమిఁ గవీశు లందఱ
మీఱిన సంతసమునఁ దేల్చి మెప్పులు గొనియెన్!!


కుమ్మరి కులమునఁ బుట్టియుఁ
గ్రమ్మఱి రఘురాము నెడలఁ గదలని భక్తిన్
గమ్మని రామాయణమునుఁ
గిమ్మని పరులెంచకుండఁ గెరలి రచించెన్!


గోపవరపు శివభక్తుని
పాపగ జన్మించి, రామభక్తి మనమునన్
జేఁపఁగ, నమృతపు ధారలఁ
దాపముఁ బోఁగొట్టు రచనఁ దా నిడి, మురిసెన్!


మల్లెల పరిమళ మిచ్చియు
నెల్లఱ హృదయముల భక్తి నెంతయు నిండన్
సల్లలిత పద సుమమ్ముల
నల్లెను రామాయణకథ నందఱు మెచ్చన్!


ఏ విద్యఁ దాను నెఱుఁగక
భావించుచు మదిని రామభద్రుని నెపుడున్
దా వనితయు నయ్యును నెద
లో వఱలెడు లలిత కథను లోకమున కిడెన్!


అహరహము లలిత పదములు
సహజ కవిత్వమయి మొల్ల స్వాంతమున వెసన్
విహరించుచుండ, ఘనుఁడగు
మహనీయ గుణాభిరాము మహిమ వెలార్చెన్!


ధనమాశింపక; రాజుల
కును నంకిత మీయక; తన కోమల కవితన్
దనివినిఁ బొందుచు శ్రీ రా
మున కిడెనయ యాతుకూరి మొల్లయె భక్తిన్!


ఆ రాముఁడె చెప్పింపఁగ
నీ రామాయణము వ్రాసి యీ జనములకున్
సారపు మోక్షము నిడ సం
సారమ్మున రామనామ సారముఁ బంచెన్!


శ్రీకంఠ మల్లికార్జునుఁ
డే కృపఁ గవితా వరము నిడెను! శ్రీ రాముం
డే కమనీయ కథామృత
మే కురిపింపంగఁ జేసె మేనుప్పొంగన్!


శ్రీ వాల్మీకపుఁ గథలును
నీ వసుధను వినఁగవచ్చు నితరపు గాథల్
కావలసిన రీతిఁ గొనియు
నీ విధి కృతి నిడిన మొల్ల కిడుదు నమమ్ముల్!!


స్వస్తి


ఆదివారం, సెప్టెంబర్ 11, 2016

సుమధురగాయని...ఎం. ఎస్. సుబ్బలక్ష్మి!



గొంతు డాఁగిన యమృతమ్ముఁ గుఱియఁజేసి,
పండితులఁ బామరులఁ దేల్చె స్వర్గమందు;
మధురయినఁ బుట్టి, వెలిఁగిన మణియునైన
సుప్రభాతంపు వీణియ సుబ్బలక్ష్మి! 1

పలుకఁగ మధురై షణ్ముఖ వడివు సుబ్బ
లక్ష్మి, మల్లియలు విరిసి రమణఁ గూర్చుఁ;
బాడుచోఁ దేనియలు జాలువారుచుండు;
నామె దివినుండి దిగివచ్చెననుట నిజము! 2

భారతీయతకే తాను ప్రతినిధియయ!
యొంటిపైఁ బట్టుచీరయు నుండ; నుదుట
నెఱ్ఱనౌ కుంకుమపుబొట్టు నిలిచియుండ;
చేతులకు నిండ గాజులు చిందులాడ; 3

కండ్లనిండుగ కాటుక ఘనత నిడఁగఁ;
గొప్పునిండుగ మల్లెలఁ గూర్చి, చేతఁ
దంబురఁ గొని సంగీత సదస్సునందుఁ
బాట పాడ నారంభింపఁ బలువిధములఁ 4

బదికి మించిన భాషల వఱలుఁ గృతులుఁ,
గీర్తనలును, శాస్త్రీయ సంగీత, లలిత
పదములును, భజనలు, జానపదముల నిఁక
నామె పాడుచో నగుపించు నమ్మవారె!! 5

శ్రోత లా గాన లహరిలోఁ జొక్కి, సోలి,
తలలనూఁచియు, మెత్తురు తఱచి తఱచి!
సుబ్బలక్ష్మియే యున్నచో సురలకు సుధ
యబ్బకయె, గానసుధయె లభ్యమ్మగునయ!! 6

దేశమున, విదేశాలలో దివ్యమైన
గానసుధలఁ బంచియుఁ దాను ఘనముగాను
భరతదేశంపుఁ గీర్తిఁ బ్రపంచమందుఁ
జాటి, పఱచె సంగీతంపు ఝరుల గములు !! 7

అటులె చలనచిత్రాలలో నతులితమగు
పాత్రలెన్నియో పోషించి, ప్రతిభఁ జూపి,
యెన్నియో పురస్కారాల, నెన్నొ బహుమ
తులఁ, బ్రతిష్ఠల నంది వెల్గులఁ గనెనయ! 8

సుప్రభాతాలు, గీతాలు, సుందరమగు
దేవతా స్తోత్రములు, పెక్కు దివ్యమైన
కృతులు సంగీత ఝరులునై కెరలి జనుల
మదిని నానంద లోకాలఁ గదలఁ జేయు!! 9

ఈ ప్రపంచమ్ము నిలుచును నెంత దనుక,
నంత దాఁక నిలిచియుండు నామె గాన
సుధలు, కీర్తులు, బిరుదు! లీ విధముగాను
స్వర్గమందునుఁ దానెయై వఱలుచుండు!! 10


స్వస్తి

గురువారం, సెప్టెంబర్ 08, 2016

గురు యోగ్యత

line art images sarvepalli radhakrishna కోసం చిత్ర ఫలితం

అజ్ఞత యనెడి చీఁకట్ల నన్ని తనదు
జ్ఞాన దీపమ్ముచేఁ బాఱఁ జఱచుచుఁ దన
విద్యనంతయు నందించి వెలుఁగఁజేయు
నతఁడె గురు పదమ్మునకు యోగ్యతనుఁ బొందు! 1

ప్రేమతో విద్య నేర్పియు, వినయ మిచ్చి,
స్నేహశీలియై, లోకానఁ జెడును దెలిపి,
బాలకుల మేలుఁ గోరుచు, బ్రతుక నేర్పు
నతఁడె గురు పదమ్మునకు యోగ్యతనుఁ బొందు! 2

పుస్తకమ్మునఁ గల విద్య మస్తకమున
కెక్కున ట్లుదాహరణాల నెన్నియేనిఁ
జూపి, విసుఁగుఁ జెందక తానె సులువు నేర్పు
నతఁడె గురు పదమ్మునకు యోగ్యతనుఁ బొందు! 3

విద్య నేర్పుచుఁ, బిల్లలన్ బిడ్డలుగను
భావనము సేసి, కోపమ్ము వదలి, యెపుడు
ప్రేమతో బోధనము సేయు ప్రియతముఁడగు
నతఁడె గురు పదమ్మునకు యోగ్యతనుఁ బొందు! 4

నిత్య పుస్తక పఠనమ్ము నెంచి, జ్ఞాన
దానమునుఁ జేయునట్టి విద్యార్థి యగుచు
వఱలి తా మిన్నయై వెల్గుఁ బంచుచుండు
నతఁడె గురు పదమ్మునకు యోగ్యతనుఁ బొందు! 5

సమయపాలనఁ బాటించి, చక్కనైన
బోధనము సేసి, విద్యార్థి ముఖమునందు
వింత కాంతులఁ జిలికించి, సంతసించు
నతఁడె గురు పదమ్మునకు యోగ్యతనుఁ బొందు! 6

సద్గుణమ్ముల రాశియై, సహజమైన
వాక్చమత్కృతిచే నెప్డు బాలలకును
మార్గదర్శియై వర్తించి, మంచి నొసఁగు
నతఁడె గురు పదమ్మునకు యోగ్యతనుఁ బొందు! 7

తల్లి వలె లాలనము సేసి, తండ్రి వలెనుఁ
గష్టములఁ బాపి, వైద్యుని కరణినిఁ దగఁ
జెడు తలఁపులను రోగాల వెడలఁ జేయు
నతఁడె గురు పదమ్మునకు యోగ్యతనుఁ బొందు! 8

మంచి మార్గాన నడచుచు, మదిని నెపుడు
ద్వేషమునుఁ బొందక, విషమ స్థితులయందు
నేర్పుగాఁ బరిష్కారంపుఁ గూర్పుసేయు
నతఁడె గురు పదమ్మునకు యోగ్యతనుఁ బొందు! 9

పెద్దలకు గౌరవమ్మిడి, పిన్నల యెడ
వత్సలతఁ జూపి, యధికార వర్గము నెడ
వినయ వర్తనచే మెప్పుఁ బెల్లుగఁ గొను
నతఁడె గురు పదమ్మునకు యోగ్యతనుఁ బొందు! 10

స్వస్తి

సోమవారం, ఆగస్టు 15, 2016

సాహితి సవ్వడి (పద్యాల సవ్వడి) వారి ఇ పేపర్‌లో నా పరిచయం



"సాహితీ సవ్యసాచి" గుండు మధుసూదన్

వరంగల్: ప్రముఖ పద్యకవి, రచయిత గుండు మధుసూదన్


వరంగల్ జిల్లాలోని గిర్మాజీపేట గ్రామంలో గుండు మల్లికాంబ, రామస్వామి లకు అష్టమ సంతానంగా జన్మించిన గుండు మధుసూదన్ పద్యకవిగా తెలుగు సాహితీలోకంలో సుపరిచితులు. ఒకవైపు అధ్యాపకులుగా విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతూనే, మరోవైపు తన ప్రవృత్తి అయిన పద్య సాహిత్యంలో అనేక ప్రక్రియల్లో రచనలు చేస్తూ, ఇప్పటివరకు దాదాపు రెండువేలకు పైగ పద్యాలు రాసిన తాను, అనేక అంతర్జాల బ్లాగుల్లోనూ, వాట్సప్, ఫేస్ బుక్ తదితర వేదికల్లో అనేక రచనలు చేస్తూనే, ఇంకెందరికో మార్గదర్శనం చేస్తున్న గుండు మధుసూదన్ గారికి చిత్రలేఖనంలో కూడా ప్రవేశముంది. పాటలుకూడా పాడతారు. తెలుగు సాహితీ ప్రపంచంలో భాష మనుగడకోసం నిరంతరం కృషిచేసే "సాహితీ సవ్యసాచి", మన తెలంగాణతల్లి ముద్దుబిడ్డ గుండు మధుసూదన్.

మధుసూదనుని కలంనుండి జాలువారిన రచనలు:
1. వేయికి పైగా పద్యరూప సన్మాన పత్రములు
2. సూక్తి ముక్తావళులు (పద్యాలు)
3. "హరి" శతకము, "తెలుగు బాల" శతకము
4. పెక్కు దేవతా స్తుతులు, ఖండ కావ్యాలు
5. వేయికిపైగా సమస్యాపూరణలు, దత్తపదులు, నిషిద్ధాక్షరులు, న్యస్తాక్షరులు, వర్ణనలు, మొ.,
6. బాలల నీతి పద్య కథలు (సులభ శైలిలో)


సన్మానాలు - పురస్కారాలు:
1. ఆంధ్ర పద్య కవితా సదస్సు, శ్రీలేఖ సాహితి, సహృదయ సాహితి వారలచే పద్యకవిగా సన్మానం.
2. రాష్ట్రభాషోపాధ్యాయ సంస్థ, బహుజన ఉపాధ్యాయ సంఘం వారలచే జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం.
3. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన "పద్య తెలంగానం" లో పద్య కవిగా సన్మానం.
4. అయుత కవితా యజ్ఞంలో వేయికి పైగా పద్య కవితలను ప్రకటించినందుకు "తెలుగు కవితా వైభవం, హైదరాబాదు" వారిచే "సహస్ర కవి భూషణ" మొ. బిరుద ప్రదానం, సన్మానం.
5. పోతన జయంత్యుత్సవాల సందర్భంగా "తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారిచే ఓరుగల్లు పద్యకవిగా బమ్మెర గ్రామంలో సన్మానం.
6. "పద్యాల సవ్వడి" లో పద్యాలతో సాహితి సవ్వడి చేస్తున్న మధురకవి గుండు మధుసూదన్ గారు "గురజాడ ఫౌండేషన్, అమెరికా" వారి "తెలుగు కవిత పురస్కారం-2016" కు ఎంపికైనారు.


-చిన్ననాటి నుంచే తెలుగు సాహిత్యం పైన మక్కువ
-వృత్తి అధ్యాపకుడు -ప్రవృత్తి సాహిత్యం
-రెండు వేలకు పైగా పద్య రచనలు
-ఎన్నో పురస్కారాలు, బిరుదులు

పద్యం ద్వారానే తెలుగు భాషకు పునర్వైభవం: మధురకవి గుండు మధుసూదన్
తెలుగుభాషకు పునర్వైభవం తెలుగు పద్యం ద్వారానే సాధ్యమవుతుంది. మన తెలుగు మృతభాషగా మారకూడదంటే...పద్యాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి. తెలుగు పద్యం రక్షింపబడితేనే, తెలుగుభాష రక్షింపబడుతుంది. సాంప్రదాయికమైన తెలుగుభాష పద్యాలలోనే ఉంది. కాబట్టి ప్రతి తెలుగువాడూ పద్యాన్ని రాయాలి, ఆదరించాలి, పద్యం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలి.
స్వస్తి

బుధవారం, ఆగస్టు 10, 2016

బాలల నీతి పద్య కథలు: మంత్రి తెలివి



ఒక్క రాజుగారికిఁ బల్వు రూడిగీండ్రు
కలరు సేవల నొనరింపఁగాను మిగుల!
నందఱును నమ్మకము గలయట్టి వారె!
రాజుకొఱకు కష్టములందు వ్రాలువారె!! 01

ఒక్క దినమున రాజు శుద్ధోదగాహ
మునుఁ జలుపఁగం జనుచుఁ దన ముద్రిక నొక
స్వర్ణ పేటిక యందున భద్రముగను
నుంచి స్నానమ్ముకై సనె నంచితముగ! 02

రాజు స్నానమాడియు వచ్చి రభసముగను
ముద్దుటుంగరమునుఁ దాల్చఁబోవఁ, బెట్టె
నుంగరము మాయమాయె! వరాంగుళీయ
కమ్ము కానుపించని కారణమ్మదేమొ?  03

తనదు పెండ్లినాఁటి బటువు; ఘనమగు నుడు
గరయునైనట్టి యయ్యది కానఁబడక
యుండఁగా నెవ్వ రూరక యుందు రయ్య?
రాజు వేగమే మంత్రిని రమ్మనమనె! 04

మంత్రి వచ్చిన తోడనే మన్ననమునఁ
గూరుచుండంగఁజేసియుఁ గూర్మిమీఱ
జరిగినట్టి వృత్తాంతమ్ము సాంతముగను
దెలిపి, దొంగనుఁ బట్టించు వలనుఁ గోరె! 05

మంత్రి యెంతయు యోచించి, మంచివార
లైన సేవకులకుఁ గీడునైన నీయ
కుండ దొంగనుఁ బట్టంగఁ గోరిక మెయి
నొక్క యాలోచనము సేసె నక్కజముగ! 06

యోచనము సేసి యిట్లనె "నోయి రాజ!
సేవకులఁ బిలిపింపుఁడు శీఘ్రముగను!
వారితో మాటలాడి నేఁ జోరునిఁ దగఁ
బట్టుకొందును తప్పక పార్థివ వర!" 07

వెంటనే రాజు వారలఁ బిల్వనంప,
వార లందఱు వచ్చిరి పరుగుతోడ!
మంత్రి వారికి నొకకొన్ని మంత్రపూత
మైన పుడుకల నిడి పల్కె మానితముగ! 08

"సేవకోత్తములార! విశిష్టమైన
యీ పుడుకలను మీరలు హితముఁ గోరి
చేత ధరియించి దైవమున్ స్థిరముగాను
ప్రార్థనము సేసి నా కిండు రాణమీఱ! 09

ఇవియ మాహాత్మ్యమున్నట్టియవియ కాన,
చోరహస్తంపుఁ బుడుక యించుక పెరుఁగును!
కాన, దొంగ తప్పక దొరుకంగఁ బట్టు
మార్గ మిద్దియ యగు! మీకు మంచి జరుగు!!" 10

అనఁగ విన్న చోరుఁడు శీఘ్ర మతని చేతఁ
గల పుడుకను దా నొకయించుక విఱిచి వెసఁ
జేత ధరియించి దైవమున్ స్థిరముగాను
ప్రార్థనము సేసియు మరలి వచ్చెనపుడు! 11

అంత మంత్రియు నందఱి హస్తములను
గల పుడుకలఁ బరీక్షించి, కడను నున్న
సేవకుని పుల్లనుం బరీక్షించఁగానె
యించుకయ తగ్గియుం గానుపించె నదియె! 12

వెంటనే మంత్రి యతఁడె తా వెదకుచున్న
దొంగ యని గుర్తెఱింగియుఁ దొందరించి,
పట్టి బంధించి, చెఱలోనఁ బెట్టెనపుడు!
యుక్తిచేఁ గార్యముల్ దీరు నుత్తమముగ!! 13

స్వస్తి


సోమవారం, ఆగస్టు 08, 2016

బాలల నీతి పద్య కథలు: తొందరపాటు...


ఒక్క యూరను బ్రాహ్మణుం డొకఁడు గలఁ డ
తండు విష్ణుశర్మాభిధఁ దనరుచుండు!
నతని భార్యయె యన్నపూర్ణమ్మయనఁగఁ
బేరునకుఁ దగు గుణముచే వెలుఁగుచుండు!! 1

ఆమె ప్రేమతో వేసెడి యన్నపు మెతు
కులనుఁ దిని యొక్క ముంగిస కూర్మితోడ
నిల్లుఁ గాఁచుచు నుండును నెల్ల వేళ
లందు ఫణులు రాకుండ సురక్షితముగ! 2

ఒక్క దినమున బాపఁడు ప్రక్క యూర
జరుగు బ్రహ్మోత్సవములకుఁ జనఁగ నటులె
యతని భార్యయుఁ దమ పుత్రు నచటి తొట్టె
లో నిదురపుచ్చి నీటికై తానునుఁ జనె! 3

వార లేఁగుటఁ గాంచి సర్పరిపు వంత
నింటిలోనికి నేఁగి తా హితముఁ గనఁగఁ
గాఁపు గాయుచుండఁగ నొక్క కాళ మచటి
త్రాటిపై నుండి యుయ్యేల దరికి వచ్చె! 4

పామునుం గాంచి ముంగిస పరుగునఁ జని,
తొట్టెపైఁకి లంఘించియు దిట్టతనము
తోడ దానితో వడిగఁ బోరాడి దాని
ఖండములుగఁ జేసియుఁ జంపె ఘనత మెఱయ! 5

పేరునకు ముంగిసయె కాని, ప్రేమమునకు
మనుజు కన్నను నెక్కుడౌ మాన్యయదియె!
మేలు మఱచి కీడొనరించు కూళకన్నఁ
గొలఁది మేల్ గృతజ్ఞ యగు నకులము మిన్న! 6

అహిరిపువు సర్పముంజంపి యచటనె తన
ఘనతఁ జూపింప వేచియుండిన క్షణమున
నీరముం దెచ్చు గేహిని నినదము విని
పరుగు పరుగున నెదురేఁగెఁ బ్రమదమునను! 7

నోట రక్తమ్ము కాఱ సంతోషముగను
నెదురయిన ముంగినిం గని ముదిత యపుడు
తనదు కొమరునిఁ జంపె నటనుచుఁ దలఁచి
చేర రాఁగానె తన బిందెచేతఁ జంపె! 8

చంపి లోనికి నేఁగి తా సత్వరముగ
నూయెలను గల పుత్రుని డాయఁగఁ జని
సుఖముగా నిద్ర పోయెడి సుతునిఁ గాంచి
క్రింద ముక్కలై యున్నట్టి దృంభువుఁ గనె! 9

కనిన యంత ముంగిస యొనర్చిన కృతమ్ము
సర్వ మవగతమ్మాయెఁ బ్రశస్తమైన
త్యాగముం గని దుఃఖించెఁ దానొనర్చి
నట్టి ద్రోహమ్ముఁ దలఁచియుఁ దుట్టతుదకు! 10

చూచితిరె మీరు మేల్గూర్చుచుండు జనులఁ
దొందరించియుఁ గీడునుఁ బొందఁజేయు
మౌఢ్యమందించెఁ గద దుఃఖ మాఢ్యులకును!
వలదు, దొసఁ గిడు తొందరపాటు వలదు!! 11

స్వస్తి


శనివారం, జులై 23, 2016

సోమవారం, జులై 18, 2016

సహజకవి బమ్మెర పోతన


[పోతన 534వ జయంత్యుత్సవాల సందర్భంగా బమ్మెర గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారు ఏర్పాటుచేసిన కవిసమ్మేళనంలో నేను రచించి, పఠించిన పద్యములు]


కం.
శ్రీరామాజ్ఞప్తకథా
భార! భవహరాప్త కృత్య! భాగవతాఖ్యో
ద్ధారాంచిత శబ్దాలం
కార యుత పురాణకర్త! కవి పోతన్నా! 1


సీ.
కాకతీయుల యోరుగల్లున విలసిల్లు బమ్మెర గ్రామానఁ బ్రభవమంది;
పిన్ననాఁటనె రంగ వీక్షిత భాగవతమును వ్రాసెదనని తల్లికి నని;
జనని యాశీర్వచ స్సత్త్వమ్ముచే వెల్గి, సహజకవిత్వ విశారదుఁడయి;
భాగవతముఁ దెల్గువారల కిడఁగాను తెనిఁగింప సమకట్టి, తేజమెసఁగ,
గీ.
హరికథా మహత్త్వవిశిష్ట చరితములను భక్తిభావసమంచితాసక్తి మెఱయ,
ద్వాదశస్కంధయుక్త సత్ప్రకర వర సమేతను లిఖించె బమ్మెర పోతసుకవి! 2


ఉ.
కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేడ్చునట్టి యా
హాటకగర్భురాణికిని "నాఁకఁటికిం గొనిపోయి యల్ల క
ర్ణాట కిరాట కీచకుల కమ్మ" నటంచుఁ ద్రిశుద్ధిగన్ వెసన్
మాట యొసంగినాఁడవయ మాన్యుఁడ! బమ్మెర పోత సత్కవీ! 3


మ.
భళిరా సత్కవి పోతరా డ్విదిత శబ్దవ్యాప్త సమ్మోహకా!
గళితాఘాద్రి మహాంధ్రభాగవత నిర్ఘాతా! ప్రసిద్ధాంశ స
న్మిళితానేక సమస్త పుణ్య సుకథా నిశ్శ్రేయస ప్రాప్త! ని
ర్దళితోత్కృష్టతరానయప్రకర! సర్వామోద సంధాయకా! 4


చం.
నవవిధ భక్తి మార్గముల నవ్యవిధమ్మున వ్రాసినావు భా
గవత పురాణమున్ విమల కమ్రసుశబ్దయుతార్థ పద్య సం
రవముల శింజినుల్ మొరయ రమ్యతరాంచిత ముక్తి యుక్తమై
శివకర సత్య సుందర వశీకరణమ్ముగ భక్తపోతనా! 5


స్వస్తి


శనివారం, జులై 16, 2016

ఆహ్వానము!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో
డా. వీరమళ్ళ సోమదేవరాజు కళాక్షేత్రందక్షిణ అయోధ్య (వల్మిడి) అభివృద్ధి సంస్థ అధ్వరంలో

బమ్మెర పోతన 534వ జయంత్యుత్సవాలు
వరంగల్ జిల్లాబమ్మెర గ్రామంలో

జులై 17, 18 ఆదిసోమవారాలలో నిర్వహింపబడును.
ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమయ్యే
వివిధ ఆధ్యాత్మికసాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా

ది. 17-7-2016 (ఆదివారం) సాయంత్రం 5 గం. నుండి

కవి సమ్మేళనం

ఏర్పాటు చేయబడింది.

అందరూ ఆహ్వానితులే!


శుక్రవారం, జులై 08, 2016

అష్టావధానము - ఆహ్వానము



కాకతీయ పద్య కవితా వేదిక
_____________________వరంగల్_____________________

ప్రముఖ శతావధాని
డా. జి. యం. రామశర్మ గారిచే
(రిటైర్డ్ ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల)

-: అష్టావధానము :-

వేదిక:
శ్రీ రాజరాజనరేంద్రాంధ్రభాషా నిలయము, హనుమకొండ

తేది: 09—7-2016 (శనివారం), సమయం: సా. 05-00 గం.లకు

సంచాలకులు:                    శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర బాబు
(ప్రధాన కార్యదర్శి, సహృదయ)

           ముఖ్యాతిథి:                                 సహస్ర పద్య కంఠీరవ శ్రీ చిక్కా రామదాసు
                                       (వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు సాహిత్య కళాపీఠం, హైదరాబాద్)

           విశిష్టాతిథి:                        శ్రీ డా. టి. శ్రీరంగస్వామి
              (శ్రీలేఖ సాహితి, వరంగల్)

పృచ్ఛకులు:
నిషిద్ధాక్షరి: శ్రీమాన్ ఆరుట్ల భాష్యాచార్య
దత్తపది: శ్రీ కంది శంకరయ్య
సమస్యాపూరణం: శ్రీ జీడికంటి శ్రీనివాసమూర్తి
వర్ణన: శ్రీ గుండు మధుసూదన్
ఆశువు: శ్రీ డా. యన్.వి.యన్. చారి
పురాణపఠనం: శ్రీ కుందావజ్ఝల కృష్ణమూర్తి
అంత్యాక్షరి: శ్రీ ఆడెపు చంద్రమౌళి
అప్రస్తుత ప్రశంస: శ్రీ డా. సముద్రాల శ్రీనివాసాచార్య
పద్యానికి వాయిద్యం: శ్రీ మఠం శంకర్‍జీ మహబూబ్‍నగర్


అందరూ ఆహ్వానితులే


జీడికంటి శ్రీనివాసమూర్తి                                     చేపూరి శ్రీరాం
                 అధ్యక్షులు                                                                     ప్రధాన కార్యదర్శి