Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, నవంబర్ 28, 2013

పద్య రచన: శ్రీ కృష్ణ దేవరాయలు

తేది: జూలై 06, 2012 నాటి శంకరాభరణంలోని

పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు

నేను రాసిన పద్యములు

సీ.
అష్ట దిగ్గజ కవు లాహ్లాదమును గూర్చ
......భువన విజయ మేలు భూపుఁ డెవఁడు?
ఆముక్త మాల్యద నలవోకగా రచి
......యించి, యాంధ్ర కవుల మించె నెవఁడు?
జాంబవ త్యుద్వాహ సత్యావధూ ప్రీణ
......నముల సంస్కృతమున నడపె నెవఁడు?
దేశ భాషల యందుఁ దెలుఁగు లెస్స యటంచు
......నెలుఁ గెత్తి చాటిన నేత యెవఁడు?

గీ.
అతఁడె మూఱు రాయర గండ; యాంధ్ర భోజ;
సాహితీ సమరాంగణ సార్వభౌమ
బిరుదు లందియు, వెలిఁగిన వీర వరుఁడు;
నతఁడె శ్రీకృష్ణదేవరాయలు ఘనుండు!


కం.
ఇరు ప్రక్కల దేవేరులు
మురిపెముఁ దీర్చంగ నడుమ మోదము తోడన్
వర విగ్రహ రూపెత్తెను
దిరుమల వేంకట నగేశు దేవళ మందున్!


తే.గీ.
తెలుఁగు భాషను సత్కావ్యములును వెలయఁ
గవులఁ బోషించి, మించి, సత్కార మెలమిఁ
జేసి, సభలోనఁ బ్రజల రంజింపఁ జేసి,
కృష్ణ రాయఁడు స్వర్ణ యుగేంద్రుఁ డయ్యె!


మంగళవారం, నవంబర్ 26, 2013

దత్తపది: కరము-భరము-వరము-హరము...భారతార్థం...నచ్చిన ఛందస్సు

తేది: జూలై 12, 2012 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఇచ్చిన
కరము-భరము-వరము-హరము...పదాలనుపయోగించి,
రాయబారానికి పోనున్న కృష్ణునిముందు ద్రౌపది ఆవేదనను గూర్చి,
నచ్చిన ఛందస్సులో పద్యమును రాయమనగా
నేను రాసిన చంపకమాలా వృత్తము




కర మురు వేణి వట్టి, కడు గర్వముతోడుత వల్వ లూడ్చె ని
ర్భరమున; సత్సభాంతరము భగ్గన, సిగ్గఱి కౌరవుల్, రమా
వర! మురహంత! నాకుఁ దలవంపులు సేసిరి! వారి నొంచు మో
హరమును బన్ని, సంధిఁ బరిహార్యము సేయుము! యుద్ధమే తగున్!


సోమవారం, నవంబర్ 25, 2013

సమస్యాపూరణం: పెండ్లి కాని పిల్ల బిడ్డను గనె

తేది: జూలై 13, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా పూరణము

ముని పరాశరుండు మోహియై సత్యవ
తినటఁ గన్నెతనపు స్థితికిఁ జెడని 
గర్భవతిని జేయఁ గనె వ్యాసు; నక్కటా! 
పెండ్లి కాని పిల్ల బిడ్డను గనె!! 


శనివారం, నవంబర్ 23, 2013

విశేష వృత్తము: స్రగ్ధరా వృత్తము - పారిజాతాపహరణ ఘట్టము

తేది: అక్టోబర్ 06, 2012 నాటి శంకరాభరణంలోని
విశేషవృత్తము శీర్షికన నేను రాసిన
స్రగ్ధరా వృత్తము


దేవోద్యానిన్ భటాలుల్, దివి తరులు కనన్, దివ్యవృక్షమ్ముఁ గొంచు
న్వేవేగన్ దాఁ జనంగన్; విదిత తరు లతల్ విష్ణుఁ బ్రార్థించి, "రీవున్
బోవ"ద్దంచున్, బతిన్ వే ముదితలు పిలువన్, బోవు ప్రాణేశు వోలెన్
భావింపంగన్ గుజమ్మున్ బలువిధములుగన్ బారిజాతమ్మునాపెన్!


శుక్రవారం, నవంబర్ 22, 2013

సమస్యాపూరణం: సూత సుతుఁ డర్జునునిఁ జంపి ఖ్యాతిఁ గనెను

తేది:సెప్టెంబర్ 01, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా పూరణము


(తనను పాండవ పక్షమున చేరుమన్నకుంతీదేవితో కర్ణుడు పలికిన సందర్భము)

"తల్లి! నేనొ? యర్జునుఁడొ? యుద్ధమ్మునందు
మిగుల; నేవురు మునుపట్లు మిగులుదు రిఁక!
సూత సుతుఁ డర్జునునిఁ జంపి ఖ్యాతిఁ గనెన
నియొ, యతఁడె కర్ణుఁ జంపె ననియొ? వినుండు!"

గురువారం, నవంబర్ 21, 2013

సమస్యాపూరణం: లవ కుశులనువారు కవలు లక్ష్మణుని సుతుల్

తేది: సెప్టెంబర్ 03, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా పూరణము



అవనీజా రామ సుతులు
లవ కుశులనువారు; కవలు! లక్ష్మణుని సుతుల్
రవిచంద్ర నిభులు లలితులు
నవిచారులు చంద్రకేతు లంగదులు గదా!

సమస్యాపూరణం: పిల్లి మహాగ్రహంబునను బెబ్బులి పై కుఱికెన్ వధింపఁగన్

తేది: సెప్టెంబర్ 26, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నేను రాసిన పూరణం

ఉల్లమెలర్ప రామవిభుఁ డుత్సుకతన్ ఘను వాలిఁ గూల్తు నాన్
దెల్లముఁ జేయ, సూర్య సుతుఁ డిప్పుడ వోయియు వాలిఁ బిల్చుచున్,
జల్లఁ బడంగఁ జిత్త మిటు చయ్యన యుద్ధము సేయు కోర్కి ఱం
పిల్లి, మహాగ్రహంబునను, బెబ్బులి పైకుఱికెన్ వధింపఁగన్!

మంగళవారం, నవంబర్ 19, 2013

సమస్యాపూరణం: దుర్వినయంబునన్ మనసు దోచెడివారు హితైషులే కదా

తేది: సెప్టెంబర్ 14, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నేను రాసిన పూరణము


శర్వుని గొల్చుచున్, సతత సత్య మహింస మనమ్ముఁ బూనియున్,
గర్వ మొకింత లేక, మమకారముఁ జూపుచుఁ, గీర్త్యనిష్టులై,
సర్వ విశిష్ట మూర్తి యుత సత్పరివర్తన ’నేరు’ పూనియుం
దు ర్వినయంబునన్? మనసు దోచెడి, ’వారు’, హితైషులే కదా!

సోమవారం, నవంబర్ 18, 2013

సమస్యాపూరణం: దున్నకు దూడ పుట్టినది దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్

తేది: సెప్టెంబర్ 04, 2012 నాటి శంకరాభరణంలోని

సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా పూరణము

[భూస్వామి, పొలమును దున్నుటకై వేగిరపడు పాలేరుతో, తమ యావు చిన్ని దూడ నీనె నని, పొలమునకు వెళ్ళుట మాని, యావుపాలు పిండుటకై దుత్తను తెమ్మని, మాట తడబాటుతోఁ బురమాయించు సందర్భము]




"అన్న! యిదేమి మాట? మన కన్నముఁ బెట్టెడి తల్లి మేదినిన్,
మిన్నును, నావునున్ మనసు మెచ్చెడి రీతిగఁ జూడు! నిండు చూ, 
లన్నుగ నీనె నీ దెసను! నాదటఁ బోయి, బిరాన భూమినిన్ 
దున్నకు! దూడ పుట్టినది! దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్!"


ఆదివారం, నవంబర్ 17, 2013

సమస్యాపూరణం: పరశురాము నోడించె రావణుఁడు కినిసి

తేది: ఆగస్టు 20, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నేను రాసిన పూరణము


హరుని విల్ ద్రుంచి, "రాముండు" హరిణ నయన
సీతఁ జేపట్టి, హరివిల్లు చేకొనియును,
పరశురాము నోడించె! రావణుఁడు కినిసి,
సీతఁ గొనిపోయి నంతఁ గూల్చెను రణమున!

శనివారం, నవంబర్ 16, 2013

దత్తపది: నన - నీనీ - నును - నేనే...నచ్చిన ఛందస్సు...భారతార్థం

తేదీ: ఆగస్టు 27,2012 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఇచ్చిన
నన-నీనీ-నును-నేనే..శబ్దాలను ఉపయోగిస్తూ, నచ్చిన ఛందస్సులో,
భారతార్థంలో రాయమనగా...నేను రాసిన పద్యాలు


మొదటి పద్యం:
ఉత్పలమాల:
వేదన నంది ద్రౌపది తపించుచు నిట్లనెఁ గృష్ణుఁ జెంత "దా
మోదర! సంధిఁ గోరుచునుఁ 'బోరును వద్ద'నుచుండఁ గంటి, నీ
నీ దృఢ వాక్కు సంధికిని దూరమె? నిక్కము వల్కుము! వారునున్ను, నే
నేదెసఁ బోవఁగా వలయు? నీ విటఁ దెల్పుము కృష్ణ! యిప్పుడున్. 


రెండవ పద్యం:
తేటగీతి:
"ఆననమ్మున దుఃఖమ్ము నగపడకయుఁ
జేతు, మానినీ! నీకున్న చింతఁ దీర్ప,
దుస్ససేను నుక్కడఁగించి, దోర్బలమున
ఱొమ్మునే నేనుఁ జీల్చియు, రుధిర మిడుదు!"

[అరణ్యాజ్ఞాతవాసాలు ముగిసిన తదుపరి భీముఁడు ద్రౌపదితోఁ బలికిన సందర్భము]

శుక్రవారం, నవంబర్ 15, 2013

సమస్యాపూరణం: పొట్టివాని భార్య పొడుగరి యఁట

తేది: ఆగస్టు 19, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నేను రాసిన పూరణం


దుష్ట శిక్షకుండు; శిష్ట రక్షకుఁ డైన
హరియె, వామనావతరణముననొ?
పొట్టి! వాని భార్య పొడుగరి యఁట! లక్ష్మి,
వామనునకుఁ బొడవు భార్య కాదె?

గురువారం, నవంబర్ 14, 2013

సమస్యాపూరణం: నరసింహా నిన్ను నమ్మి నాశనమైతిన్

తేది: ఆగస్టు 18, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నేను రాసిన రెండు పూరణములు




(1వ పూరణ)
(నరసింహుఁడను వాఁడు ఋణము నెగఁగొట్టి పాఱిపోవఁగ, ఋణదాత యాక్రోశించు సందర్భము)

నరసింహ నామకున కొకఁ
డిరవుగ ఋణ మిడఁగ, వాఁడు నెగఁగొట్టి చనన్;
దురపిల్లి పలికె నిట్టుల
"నరసింహా! నిన్ను నమ్మి, నాశనమైతిన్!"

                     
(2వ పూరణ)
(విగ్రహాలను తస్కరించి అమ్మెడు వ్యాపారి, నరసింహస్వామి ప్రతిమను అమ్ముచు, భటులకుఁ జిక్కి, సర్వస్వముఁ గోలుపోయి, వాపోయిన సందర్భము)

"మఱుఁగునఁ బ్రతిమల బేరము
సరగున లాభముల నిడఁగఁ, జక్కఁగ జరిగెన్!
మఱి, నీ ప్రతిమ, యటు లిడెనె?
నరసింహా! నిన్ను నమ్మి, నాశన మైతిన్!"

బుధవారం, నవంబర్ 13, 2013

సమస్యాపూరణం: కమఠమునం జొచ్చి మేలుఁ గనెఁ బథికుఁ డటన్


తేది: ఆగస్టు 16, 2012 నాటి శంకరాభరణంలోని

సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నేను రాసిన రెండు పూరణలు


కమలాక్ష నిభుఁడునౌ గౌ
తమబుద్ధుని నాశ్రయించి, 'దమ్మపదము'నన్
విమలుండుఁ గాఁ దలంచి, యిఁ
క, మఠమునం జొచ్చి, మేలుఁ గనెఁ బథికుఁ డటన్! (1)

విమలాత్ముఁడౌ జినున్ గౌ
తమ బుద్ధుని నాశ్రయించి, 'ధర్మ పథము'నన్
శ్రమణక వృత్తిఁ గొనెడి వే
డ్క, మఠమునం జొచ్చి, మేలుఁ గనెఁ బథికుఁ డటన్! (2)

మంగళవారం, నవంబర్ 12, 2013

సమస్యాపూరణం: చేపల పులు సడిగెరా వశిష్ఠుఁడు ప్రీతిన్


తేది: ఆగస్టు 14, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నేను రాసిన నాలుగు పూరణములు...


(1)
(ఏకాదశి నాఁటి యుపవాస దీక్ష చెడకుండుటకై వశిష్ఠుఁడు పలికిన సందర్భము)

తాపసి కాతిథ్యం బిడఁ
గా, పాఱుం డొకఁడు పిలువఁ గా దనకయె దా
దాపది తప్పించుకొనఁగఁ
జేపల పులుసడిగెరా, వశిష్ఠుఁడు ప్రీతిన్!

(2)
సాపాటున కొక మూఢుఁడు
చేపల పులుసడిగెరా! వశిష్ఠుఁడు ప్రీతిన్
దాపునకుఁ బిల్చి, యాతని
చాపల్యముఁ బోవఁ జేసి, సద్గురు వాయెన్!

(3)
(మిత్రసహుఁడను రాజునింటికి భోజనమునకై వెడలినపుడు వశిష్ఠునిపై నొక దనుజుఁడు మాయఁ బన్నిన సందర్భము)

సాపాటున నర మాంసము,
చేపల పులుసడిగెరా, వశిష్ఠుఁడు ప్రీతిన్!
దాపున నవి కని, వెంటనె
కోపము రా, నపుడు దనుజు ఘోరముఁ దెలిసెన్!

(4)
(పరస్పర శాపకారణమున వశిష్ఠుఁడు ఆడేలుగను, విశ్వామిత్రుండు బకముగను మారి, కలహించు సందర్భము)

దాపున గాధిజుఁ గని, నగి,
చేపల పులుసడిగెరా, వశిష్ఠుఁడు ప్రీతిన్!
'చేపల నీవే తిను'మని
తాపసి యాడేలు కనియెఁ దాఁ దోడేలై!



శనివారం, నవంబర్ 09, 2013

పద్య రచన: వామనావతారము


తేది: ఆగస్టు 19, 2012 నాటి శంకరాభరణంలోని
పద్య రచన శీర్షికన ఇచ్చిన వామనావతార చిత్రమునకు
నేను రాసిన మత్తేభ విక్రీడిత వృత్తము (పంచపాది)

సురలోకాధిపు నింద్రు గెల్చి, యతనిన్ శూన్య స్వరాట్పీఠునిన్
బరువెత్తించిన రాక్షసేంద్రుని బలిన్ బ్రహ్లాద పౌత్రున్ వెసన్
హరి కోరెన్ దగ వామనాఖ్య వటుఁడై త్ర్యంఘ్రి స్థలమ్మీయఁగన్;
వర మీయంగఁ ద్రివిక్రముండయి బలిన్ బాదమ్మునం ద్రొక్కియున్
గరుణించెన్ సుతలాధిపాలునిగఁ; దత్కంజాక్షు నేఁ గొల్చెదన్!

-:శుభం భూయాత్:-

శుక్రవారం, నవంబర్ 08, 2013

పద్య రచన: నృసింహావతారము


తేది: ఆగస్టు 19, 2012 నాటి శంకరాభరణంలోని
పద్య రచన శీర్షికన ఇచ్చిన నృసింహావతార చిత్రమునకు
నేను రాసిన మత్తేభవిక్రీడితము (పంచపాది)

జననీ గర్భిత విష్ణుభక్తిపరుఁడై; సద్వంద్యుఁడై; తండ్రికిన్
దన హృత్స్థేశ్వరుఁడౌ హరిం దెలుపఁగన్, దైత్యేంద్రుఁ డుగ్రుండునై
చని, గర్వమ్మున విష్ణుఁ జూపు మనుచున్, స్తంభమ్మునున్ మోదఁగన్,
వనజాక్షుండు నృసింహ రూపుఁ డయి తత్ప్రహ్లాదుఁ గావంగ, త
ద్దనుజేంద్రున్ జఠరమ్ముఁ జీల్చి యెసఁగెన్; దచ్ఛౌరిఁ గొల్తున్ సదా!

-:శుభం భూయాత్:-


పద్య రచన: వరాహావతారము



తేది: ఆగస్టు 17, 2012 నాటి శంకరాభరణంలోని
పద్య రచన శీర్షికన ఇచ్చిన వరాహావతార చిత్రమునకు
నేను రాసిన మత్తేభవిక్రీడిత వృత్తము...

అల దేవాసుర యుద్ధమందున హిరణ్యాక్షుండు సంక్షుబ్ధ కృ
ద్విలయమ్మున్ సృజియింప నెంచి, యల పృథ్విన్ జుట్టఁగాఁ జుట్టియున్
జలధిన్ ముంచ; వరాహరూపుఁడయి, యా సర్వంసహ న్గాచి , త
త్కలధౌతాక్షు వధించినట్టి హరికిం గైమోడ్పు లందించెదన్!


    -:శుభం భూయాత్:-

బుధవారం, నవంబర్ 06, 2013

పద్య రచన: క్షీర సాగర మథన వృత్తాంతము...


తేది: ఆగస్టు 16, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన కూర్మావతారం చిత్రమునకు నేను రాసిన పద్యములు...
ఆ.వె.
దేవ దానవులును దీవ్రమౌ యుద్ధాన
మరణ మందుచుండ; మాధవునకు
విన్నవించఁగాను విష్ణుండు "క్షీర సా
గర మథనము సేయఁగా వలె" ననె!(1)


తే.గీ.
పాల సంద్రాన మంథర పర్వత మిడి,
వాసుకినిఁ గవ్వమునుగ దేవతలు దాన
వులుఁ జిలుకఁగఁ బూన; మునిఁగి పోవ నదియుఁ;
గలఁతఁ జెంది, హరినిఁ జేరి, తెలుపఁ గాను;(2)

కం.
చిఱు నగవున విష్ణు వపుడు
కరుణను దాఁబేటి మేటిగా మాఱియు, మం
ధరమును వీపున మోయఁగఁ;
దరచిరి యా పాలకడలిఁ ద్వరితోత్సుకతన్!(3)

తే.గీ.
కలశ పాధోధిఁ ద్రచ్చఁగఁ దొలుతఁ బుట్టె
హాలహల; మది దహియింప; నందఱు హరు
శరణ మర్థించి, రప్పుడు శంకరుండు
గరళముం ద్రాగి, యంత శ్రీ కంఠుఁ డయ్యె!(4)

తే.గీ.(పంచపాది)
ముదముతో వారుఁ ద్రచ్చంగ మొదట కామ
ధేను వుదయించఁగ వశిష్ఠుఁ డెలమిఁ గొనియెఁ;
ద్రచ్చ నుచ్చైశ్శ్ర వైరావతములు, కల్ప
వృక్ష మప్సరసల నింద్రుఁ డా క్షణమ్మె
కొనఁగ; లక్ష్మిఁ గౌస్తుభమునుఁ గొనియె హరియు!(5)

కం.
చివరకు సురాసురులు వెను
దవులగఁ గోరిన యమృతము ధన్వంతరియే
ధవళ రుచులుఁ బ్రసరించఁగ
నవు మోమున విష్ణు మ్రోల నప్పుడ యుంచెన్!(6)

ఆ.వె.
దేవ దానవులును దీవ్రమౌ తమితోడ
"మాకు మాక"టంచు మత్సరించి,
వాదు లాడుచుండ వైకుంఠుఁ డప్పుడు
మోహినిగను మాఱి ముందు నిలిచె!(7)

తే.గీ.
వారి కప్పుడు మోహిని పలికె నిట్లు,
"వినుఁడు! నే నీ యమృతమునుఁ బ్రేమ మీఱ
మీకు నందఱకును వంచి, మిమ్ము నమరు
లనుగఁ జేసెద! నాసీను లగుఁడు నిచట!"(8)

కం.
ఇది విన్న దేవ దానవు
"లదియే వర"మనుచు నటులె నటఁ గూర్చుండన్;
సుదతి యమృతము సురల కిడె;
నిది రాహువుఁ గేతువునుఁ గనిరి సురల కిడన్! (9)

ఆ.వె.
కనియు సురల చివరఁ జని, వారు కూర్చుండ;
మోహినియును వంపె మోద మలర!
సూర్య చంద్రు లిదియు సూచించ నా చక్రి,
గొంతు దిగక మునుపె, గొంతుఁ ద్రెంచె!(10)

ఆ.వె.
కంఠమం దమృతము గల రాహు కేతుల
తలలు బ్రతికె! మొండె మిలనుఁ జచ్చె!
గ్రహణ మందు చుండ్రు రాహు కేతువు లెప్డు
శశిని, రవిని! కాని, వశులు కారు! (11)

తే.గీ.
ఇటుల దేవత లమరులై పటు తరముగ
రాక్షసులతోడ యుద్ధమ్ము ప్రబలముగను 
జేసి, దనుజుల నిర్జించి, జేత లైరి;
క్షీర సాగర మథనమ్ము క్షేమ మిడఁగ!! (12)

(ఇది క్షీరసాగరమథన వృత్తాంతము)

       -:శుభం భూయాత్:-

మంగళవారం, నవంబర్ 05, 2013

పద్య రచన: మత్స్యావతారం...


తేది: ఆగస్టు 15, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన మత్స్యావతారం చిత్రానికి నేను రాసిన పద్యాలు...


ప్రథమ కథ (భాగవత పురాణాంతర్గతము):

తే.గీ.
సోమకాసురుఁ డనెడి యసురుఁ డొకండు
నాల్గు వేదమ్ములను దాచె నబ్ధి లోన!
హరియ మత్స్యావతారుఁడై యసురుఁ జంపి,
కాచె వేదమ్ములను; నిల్పె ఘనత భువిని!

ద్వితీయ కథ (మత్స్య పురాణాంతర్గతము):

కం.
వైవస్వత మనువొక దిన
మా విశ్వేశ్వరున కపుడు నర్ఘ్యం బిడఁగన్;
ఠీవిగను మత్స్య మొక్కటి
"కావుమ న"న్నంచుదుమికె కమికిలి లోనన్!(1)

తే.
కరుణతో రాజు దానిని కలశమందు
విడిచె; మఱునాఁడు చేపయుఁ బెరిఁగిపోయి,
"నన్ను రక్షింపు"మని కోర నపుడు నొక్క
నూఁతిలోఁ జేర్చె రాజు సంతోషముగను!(2)

ఆ.వె.
మఱు దినాన మీన మా నూఁతి లోపలఁ
దిరుగ రాక యున్నఁ దిరిగి ప్రభుని
వేడె "మఱల నన్ను వేఱొక్క చోటున
విడువ వలయు"నంచుఁ బ్రేమ తోడ!(3)

కం.
రాజటులె దానిఁ జెఱువున
రాజిలఁగా విడువ,మఱలఁ గ్రక్కునఁ బెరిఁగెన్!
సాజముగ రాజపు డా
యోజన విస్తీర్ణ మత్స్య ముదధిని జేర్చెన్!(4)

ఆ.వె.
చేర్చి యిటులఁ బలికె, "శ్రేష్ఠమౌ మీనమా!
నీవు రాక్షసుఁడవొ, యీశ్వరుఁడవొ
యెఱుఁగఁ జాలఁ జెపుమ, యెవఁడ వీ"వనవుడుఁ
దా జనార్దనుఁడ నటంచుఁ బలికి;(5)

తే.గీ.
"రాజ! నూఱేండ్ల పిదపఁ బ్రళయము వచ్చు;
నట్టిచో సర్వ సత్త్వమ్ము లటులె నాల్గు
వేదములనొక్క నావలోఁ బ్రోది సేసి,
నాదు శృంగానఁ గట్టు మో యనఘ చరిత!"(6)

కం.
అనుచు నదృశ్య మ్మాయెను;
మనువును దానటులె సక్రమమ్ముగఁ జేయన్
ఘనముగను జీవతతి పుడ
మిని వర్ధిలెను; మనువునకు మేనుప్పొంగెన్!(7)

           - :శుభం భూయాత్ :-

సోమవారం, నవంబర్ 04, 2013

దత్తపది: క్రికెట్ - హాకీ - టెన్నిస్ - చెస్...నచ్చిన ఛందస్సులో...భారతార్థంలో...


తేది: అక్టోబర్ 08, 2012 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఇచ్చిన క్రికెట్ - హాకీ - టెన్నిస్ - చెస్...అనే పదాలనుపయోగిస్తూ...నచ్చిన ఛందస్సులో...భారతార్థంలో రాయమనగా...నేను రాసిన తేటగీతి పద్యం...

(కర్ణ వధానంతరం అర్జునుని మదిలో కదలాడిన ఆలోచన)

క్రి కెట్టులుం గలిగెను సంతసమ్ము
కర్ణుఁ డీల్గ!
హా! కీడు వోఁ గంటి జయమె!
యీ ధనుష్కు కం
టె న్నిష్ఠుఁ డేను కానె?
నా మదినిఁ దో
చె సుమ సుగంధమ్ము నేఁడు!!

ఆదివారం, నవంబర్ 03, 2013

విశేష వృత్తము: మేఘవిస్ఫూర్జితము - లక్ష్మీస్తుతి

కవి పండిత వీక్షక మహాశయులకు
దీపావళి పర్వదిన శుభాకాంక్షలు!

తేది: అక్టోబర్ 04, 2012 నాటి శంకరాభరణంలోని
విశేష వృత్తము శీర్షికన ఈయబడిన
మేఘవిస్ఫూర్జిత వృత్తమునందు
నేను రాసిన లక్ష్మీస్తుతి

రమా! లక్ష్మీ! క్షీరాబ్ధ్యధిపతిసుతా! రమ్య! సంస్తుత్య వంద్యా!
నమో దేవీ! సంపత్ప్రద! సుచరితా! నన్ గటాక్షించు తల్లీ!
సమీక్షింతున్ పద్మాసన! సువదనా! సత్యమౌ నాదు భక్తిన్!
క్రమమ్మీవున్ సంపత్కరివియవుటన్ గాంక్షితమ్మీవె మాతా!


  -:శుభం భూయాత్:-

శనివారం, నవంబర్ 02, 2013

సమస్యాపూరణం: మకరినిఁ గాచె శ్రీహరియె మానస మందున సంతసించుచున్



తేది: ఫిబ్రవరి 09, 2013 నాడు వరంగల్లులో జరిగిన సంపూర్ణ భాగవత శతావధానంలో ప్రముఖ శతావధాని శ్రీ కోట వేంకట లక్ష్మీ నరసింహం గారికి నేనిచ్చిన సమస్యకు అవధానిగారి పూరణము మరియు నా పూరణము...

అవధానిగారి పూరణము:
సకలము స్వామి కర్పణము సల్పుచు, గుండెలలోన నిల్పుచున్,
బ్రకటిత భక్తి భావముల పాదము లంటి నమస్కరింపఁగా,
వికృతినిఁ జెంది, శ్రీహరి ప్రవీణతఁ జూపుచు, నంటి రాఁగ లే
మ, కరినిఁ గాచె శ్రీహరియె, మానస మందున సంతసించుచున్!

నా పూరణము:
“అకట! మదీయ హృత్స్థిత మహార్తి విదారక! కావు మయ్య!!”నాన్;

బ్రకటిత భక్తి మెచ్చుచును వచ్చియుఁ, జక్రముచేత నక్రమున్
వికలముఁ జేసి, భక్తునకు వేదన డుల్చియు, నా “గజేంద్ర నా
మ” కరినిఁ గాచె శ్రీహరియె, మానస మందున సంతసించుచున్!

శుక్రవారం, నవంబర్ 01, 2013

పద్య రచన: దశావతార స్తుతి


తేది: ఆగస్టు 26, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన దశావతార చిత్రమునకు నేను రాసిన సీస పద్యము...
సీ.
వేదమ్ములనుఁ గాచి; మేదినీధర మోసి;
......కాశ్యపిన్ ధరియించి; కశిపుఁ జీల్చి;
బలిని ముప్పాదానఁ బాతాళమున కంపి;
......రాజన్యులనుఁ జంపి; రావణుఁ దన
యాశుగమ్మునఁ గూల్చి; యమునను వణికించి;
......కారుణ్యమును నేర్పి; మ్లేచ్ఛుఁ ద్రుంచి;
దుష్టులఁ దునుమాడి; శిష్టులఁ జేకొని;
......పాపులఁ బరిమార్చి; వసుధ నోమి;

గీ.
జన్మ నిచ్చియుఁ, బ్రతికించి, సమయఁ జేయు
మత్స్య, కూర్మ, కిటి, నరసింహ, వటు, పరశు
రామ, రఘురామ,బలరామ, శ్రాంత బుద్ధ,
కల్కి రూపుండునౌ హరిన్, ఘనునిఁ గొలుతు!
       -:శుభం భూయాత్:-