Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఆగస్టు 31, 2014

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః



స్వాగత వృత్తము:
శ్రీ గణేశ! ఘన చిత్సుఖ దాతా!
శ్రీ గిరీశ సుత! శ్రేష్ఠ! వరిష్ఠా!
యోగి రాడ్వరద! యోగ విశేషా!
స్వాగత ప్రమథ వర్గ! నమో ఽహమ్! (1)

ప్రమాణి వృత్తము:
గజాననా! ఘనాకృతీ!
ప్రజావళి ప్రమోద! స
ద్ద్విజ స్తుత! స్థిరా! చతు
ర్భుజా! నమో ఽస్తు తే ఽనిశమ్! (2)

ప్రణవ వృత్తము:
హేరంబా! మిత హిత సంతోషా!
గౌరీ నందన! కరి మూర్ధన్యా!
సూరి ప్రాకట శుభ సంశ్లోకా!
భూరి క్షత్ర! విముఖ! వందే ఽహమ్! (3)

శాలినీ వృత్తము:
సారాచారా! నీత సత్పుణ్య దాతా!
పారాశర్యామోద బాష్పోత్సుకా! క్రౌం
చారి భ్రాతా! భూరి సమ్మోద పాత్రా!
ధీర స్తుత్యా! హే ద్విదేహ ప్రభాసా! (4)

వంశస్థము:
నమో నమో విఘ్న వినాశకాయ తే!
నమో విచిత్రాయ! వినాయకాయ తే!
నమః పవిత్రాంచిత నామకాయ తే!
నమో సదాదాన! ఘనాయ తే నమః! (5)

వన మయూరము:
హేరుక! భవాత్మజ! మహేంద్ర నుత గాత్రా!
ధీర! సుముఖ! ప్రముఖ! దివ్య దరహాసా!
ఘోర తర సంసృతి వికూప తరణాప్తా!
చారు రుచి దంత కులిశ ప్రహరణాఢ్యా! (6)

స్రగ్విణీ వృత్తము:
పార్వతీ నందనా! భారతోల్లేఖనా!
సర్వ గర్వాపహా! ఛాత్ర విద్యోదయా!
ఖర్వ విఘ్నోన్నతా! కార్య సిద్ధిప్రదా!
శర్వ పుత్రాగ్రజా! శాంత మూర్తీ! నమః! (7)

ఇంద్ర వంశము:
జీవేశ! సర్వోత్తమ! చేతన ప్రదా!
దేవ స్తుతా! శాంకరి! ధీ విశేష! ది
వ్యా! విశ్వ సంపూజిత! వక్రతుండ! ఢుం
ఠీ! వేద వేద్యా! ఘన తేజ! తే నమః! (8)

భుజంగ ప్రయాతము:
ద్విపాస్య! త్రి ధామ! త్రిధాతు! ప్రసిద్ధా!
సుపర్వ ప్రమోదా! శుభాంగా! వృషాంకా!
కపి త్థాత్త సంపృక్త భుక్త ప్రహృష్టా!
కృపాంభోధి! కుబ్జాకృ తీశా! నమస్తే! (9)

(శుభం భూయాత్)

శనివారం, ఆగస్టు 30, 2014

న్యస్తాక్షరి: వినాయక స్తుతి!

తేది: ఆగస్టు 29, 2014 నాటి శంకరాభరణంలోని న్యస్తాక్షరి శీర్షికన ఈయబడిన
అంశం- వినాయక స్తుతి
ఛందస్సు- ఆటవెలది
మొదటిపాదం 1వ అక్షరం ‘వి
రెండవ పాదం 3వ అక్షరం ‘నా
మూడవ పాదం 10వ అక్షరం ‘
నాలుగవ పాదం 12వ అక్షరం ‘

దీనికి నా పూరణము:




విధు రుచి నిభ గాత్ర! విష్ణు! ద్విమాత్రుక!
ప్రార్థనాద్య మంత్ర! పర్శుపాణి!
విశ్వనేత! ఢుంఠి! విఘ్ననాక! శూర్ప
కర్ణ! తే నమోస్తు ఖనక రథి!

శుక్రవారం, ఆగస్టు 29, 2014

సమస్య: అమ్మా యని పిలువఁగానె యాగ్రహమందెన్

తేది: ఆగస్టు 22, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు:


1. వరూధినీ ప్రవరాఖ్యుల సంభాషణము:
అమ్మానిని ప్రవరునిఁ గని
"కొమ్మా నను; సఖిగ నేలుకొ"మ్మని యనఁగా,
నమ్ముదితను "దారినిఁ జూ
పమ్మా!"యని పిలువఁగానె యాగ్రహమందెన్!
2. బావతో మఱఁదలి సరస భాషణము:
బమ్మినిఁ దిమ్మినిఁ జేయుచు
నెమ్మనమునఁ గొంటెకోర్కి నిడి సుబ్బయతో
నమ్మఱఁదలు నగుచును "సు
బ్బమ్మా!"యని పిలువఁగానె యాగ్రహమందెన్!

సమస్య: శేషశయను పూజ సేయరాదు


మిత్రులకు, శ్రేయోఽభిలాషులకు, సుకవి పండిత మిత్రులకు, బ్లాగువీక్షకులకు
వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు!

తేది: ఆగస్టు 21, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:

(హిరణ్యకశిపుఁడు ప్రహ్లాదునకు మనసా, వాచా, కర్మణా హరినామస్మరణము సేయరాదని యుపదేశించు సందర్భము)

రాక్షసేంద్రుఁ డిట్లు ప్రహ్లాదునకుఁ జెప్పె
"హరి యటంచుఁ బలుక కయ్య యెపుడు;
తలఁపవలదు నీవు దనుజాంతకున్ మదిన్;
శేషశయను పూజ సేయరాదు!"

బుధవారం, ఆగస్టు 27, 2014

సమస్య: శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే

తేది: ఆగస్టు 18, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా మూడు పూరణములు:



ఆ కంసుండే యయెనయ
శ్రీకృష్ణుని మేనమామ; శిశుపాలుండే
చేకొనె మిత్తిని దుడుకున,
శ్రీకృష్ణుఁడు నూఱు తప్పు లెంచి వధింపన్! (1)


చేకొని బాలుఁడు వ్రాసెను
"
శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే!"
చీకాకుఁ జెంది గురు "విటు
కాకూడదు, ’బావ’, ’మామ’గా నయ్యె" ననెన్! (2)


ఆ కఱ్ఱి యెవని సఖుఁడయ?
యా కంసుం డతనికేమి యగునో? మడిసెన్
జేకొని యెవఁ డతని వలన?
శ్రీకృష్ణుని, మేనమామ, శిశుపాలుండే! (3)

మంగళవారం, ఆగస్టు 26, 2014

సమస్య: భరతభూమి స్వాతంత్ర్యముఁ బడయలేదు

తేది: ఆగస్టు 15, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



స్వార్థపరులయి పాలకుల్ వఱలు వఱకు,
ధనికులే ధనప్రాప్తినిఁ దనరు వఱకు,
పేద ప్రజల దారిద్ర్యమ్ముఁ బెరుఁగు వఱకు
భరతభూమి స్వాతంత్ర్యముఁ బడయలేదు!


(ఇట్టి యనర్థములున్నవి కనుక, స్వతంత్రముం బొందియున్నను నిజముగఁ జూడ మన మస్వతంత్రులమే యని నా భావన)


సోమవారం, ఆగస్టు 25, 2014

దత్తపది: కలి-పులి-బలి-వెలి...స్వచ్ఛందం...వెన్నెలరేయి వర్ణన

తేది: ఆగస్టు 14, 2014 నాటి శంకరాభరణంలోని
దత్తపది శీర్షికన
కలి-పులి-బలి-వెలి పదములనుపయోగించి
ఇష్టం వచ్చిన ఛందస్సులో
వెన్నెలరేయిని వర్ణించమనగా
నేను రాసిన తేటగీతి



కలిమి లేములు కలిగిన గగనగామి
పులిన తటముల వెన్నెల వెలుఁగుఁ బఱుప,
బలిమినిం బ్రేమికుల కాంక్ష వడిగఁ బెకలి,
వెలికివచ్చెను బరిణయాభీప్సితమయి!

ఆదివారం, ఆగస్టు 24, 2014

సమస్య: అలసట వచ్చె శంకరున కౌదల గంగను మోయ నెప్పుడున్

తేది: ఆగస్టు 13, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము




వెలిఁగెడి తెల్గు పద్దెము నవీన విధమ్మున శీర్షమందునన్
నిలిపెను బ్లాగుగంగ; సురనిర్ఝరి శీర్షముఁ దాల్చు శంకరుం
బొలుపున మోసి మోసి, యశముం దగఁ బొందియు, భార తీవ్రత
న్నలసట వచ్చె శంకరున కౌదల గంగను మోయ నెప్పుడున్!



శనివారం, ఆగస్టు 23, 2014

న్యస్తాక్షరి: సరస్వతీ స్తుతి

తేది: ఆగస్టు 23, 2014 నాటి శంకరాభరణంలో
క్రొత్తగా ప్రారంభించిన న్యస్తాక్షరి శీర్షికన ఈయబడిన
అంశం- సరస్వతీ స్తుతి
ఛందస్సు- తేటగీతి
మొదటిపాదం-మొదటి అక్షరం ‘’,
రెండవ పాదం-మూడవ అక్షరం ‘’,
మూడవ పాదం-తొమ్మిదవ అక్షరం ‘స్వ’,
నాలుగవ పాదం-పన్నెండవ అక్షరం ‘తి


దీనికి నా పూరణము:
కల విద్యాప్రదాత్రి! విశాలనేత్రి!
భ్రమనీలవేణి స్వచ్ఛవర్ణధాత్రి!
బ్రహ్మమానస సత్పుత్రి! స్వర సుగాత్రి!
బ్రాహ్మి! భగవతి! వరద! భారతి నమోఽస్తు!

-:స్వస్తి:-

శుక్రవారం, ఆగస్టు 22, 2014

సమస్య: రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ములఁ గూర్చెన్

తేది: ఆగస్టు 12, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



నెమ్మనమందున నమ్మిన
తమ్మికనుల వేల్పు సమ్మతమ్మునఁ, దనకున్
సొమ్మగు నా తారక మం
త్రమ్మును, త్యాగయ్య గొని, స్వరమ్ములఁ గూర్చెన్!


గురువారం, ఆగస్టు 21, 2014

సమస్య: వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్

తేది: ఆగస్టు 11, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


చేనికి నవసరమయ్యెడి
వానలు చక్కంగఁ గుఱిసి, "ప్రళయకరమ్మౌ,
చేనికి హానికరమ్మౌ
వానలు లేకుండ" మెట్ట వరి ఫలియించెన్!!

బుధవారం, ఆగస్టు 20, 2014

సమస్య: చక్రమ్ములు లేని బండి చకచక సాఁగెన్

తేది: ఆగస్టు 06, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము




వక్రగుణి రావణునిఁ దా
విక్రముఁడై త్రుంచిన రఘువీరుఁ డయోధ్యన్
సక్రియఁ బుష్పకమునఁ జనఁ
జక్రమ్ములు లేని బండి చకచక సాఁగెన్!

సోమవారం, ఆగస్టు 18, 2014

నిషిద్ధాక్షరి: ’ర’కారం వాడకుండా, శివధనుర్భంగ వర్ణన, నచ్చిన ఛందస్సులో

తేది: ఆగస్టు 17, 2014 నాటి శంకరాభరణంలోని నిషిద్ధాక్షరి శీర్షికన ’ర’కారం వాడకుండా, నచ్చిన ఛందస్సులో, శివధనుర్భంగ వర్ణన చేయమనగా, నేను రాసిన తేటగీతి



తునిమి తాటకం, దాపసితోడఁ జనియు,
జనక జనపాలు సభను భస్మాంగు ధనువు
భంజనము సేసి, నయనోత్సవమ్ము సభకొ
సంగి, సీతఁ జేపట్టెఁ గౌసల్యపట్టి!

శుక్రవారం, ఆగస్టు 15, 2014

సమస్య: కరి నెత్తుకుపోయి యెలుక కలుఁగునఁ దినియెన్

తేది: ఆగస్టు 03, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


తరుణి, కొడుకుకయి పిష్టపుఁ
గరిఁ జేయఁగఁ, గొడుకు దాని ఘనముగఁ గొని, వే
గిర మాడి, విడువఁ, బిష్టపుఁ
గరి నెత్తుకుపోయి, యెలుక, కలుఁగునఁ దినియెన్!


మంగళవారం, ఆగస్టు 12, 2014

ఖర పదము పరిగ్రహించి కననగు ముక్తిన్

తేది: జులై 31, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


ధర నుత్తమ భక్తజనులు
స్మరహర, పురహర, మలహర, సర్వేశ్వర, శం
కర, విషధర, హిమకరశే
ఖర పదము పరిగ్రహించి కననగు ముక్తిన్!

సోమవారం, ఆగస్టు 11, 2014

సమస్య: వారకాంతమీఁది వలపు మేలు

తేది: జులై 27, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


’వారకాంత మీఁది వలపు’ మదాంధతన్
గులము, గుణము, ధనము కొల్లఁగొనును!
సకలశుభకరమగు శాంతగుణమ్ము దై
వార, కాంతమీఁది వలపు మేలు!

ఆదివారం, ఆగస్టు 10, 2014

రక్షాబంధన విశిష్టత!

బ్లాగు వీక్షకులకు, సోదరసోదరీమణులకు
రక్షాబంధనదినోత్సవ శుభాకాంక్షలు!



సోదరులకు రక్ష సోదరీ బంధమ్ము
      చిరకాల మిట్టులే స్థిరమగునని,
        అన్నయ్యలకుఁ జెల్లి, అక్క తమ్ముండ్రకుఁ
    గట్టెడి రక్షయే కాచుననియు,
   నమ్మి రక్షాబంధనమ్ము రూపొందించి,
      సంప్రదాయమ్ముఁ బ్రశస్తపఱచి,
           యనుసరించుచు నెప్పు డన్నసెల్లెండ్రును,
      అక్క తమ్ముండ్రును నాచరింపఁ

    లోకమే ప్రేమమయమునై మోకరిల్లు!
  నట్టి ఘనత రక్షాబంధనమున కిడిన
  భారతీయత ఘనముగా భాసమాన
         మయ్యు లోకాన వ్యాపించెనయ్య నేఁడు!!

   -:oOo: శుభం భూయాత్ :oOo:-

సమస్య: బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా

తేది: జులై 26, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


ఇమ్ముగఁ గులికెడి వలపుల
కొమ్మా! నా దరికి రమ్మ! కోరిక నిమ్మా!
తమ్మికనుల చక్కఁదనపు
బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా!

శుక్రవారం, ఆగస్టు 08, 2014

వరలక్ష్మీమాత! మాకు వరముల నిమ్మా!



ధరలోనఁ జల్లఁగా మముఁ
గరుణనుఁ గనుమమ్మ! వెతలు కలుగక యుండన్
సరగునఁ గాపాడుచు నో
వరలక్ష్మీమాత! మాకు వరముల నిమ్మా!

నరులను సురలనుఁ బ్రోచుచుఁ
దరుణముఁ గని రాక పోకఁ దనరించుచు వే
గిరముగఁ గటాక్ష మిడు నో
వరలక్ష్మీమాత! మాకు వరముల నిమ్మా!

సిరులకు నిక్కయి, సతతము
పరమార్థ మ్మిడుచు, జనుల ప్రార్థనములనున్
గరుణనుఁ జేకొని, ప్రోచెడు
వరలక్ష్మీమాత! మాకు వరముల నిమ్మా!

చిరయశము గలుగవలెనని
స్థిరముగ మేమంత నిన్నుఁ జేరి కొలువ
త్వరముగ దరిఁజేర్చియు నిఁక
వరలక్ష్మీమాత! మాకు వరముల నిమ్మా!

వరదాయి! విష్ణువల్లభ!
కరుణామయి! సింధుకన్య! కమలాలయ! సుం
దర దరహాస కటాక్షిణి!
వరలక్ష్మీమాత! మాకు వరముల నిమ్మా!


-oO: శుభం భూయాత్ :Oo-

గురువారం, ఆగస్టు 07, 2014

గురుదేవులు పండిత నేమాని రామజోగి సన్యాసిరావుగారికి నివాళులు...



దివి: ఆగస్టు 07, 2014 నాడు  పూజ్యులు, గురుమూర్తులు, తెలుగు ఆధ్యాత్మరామాయణ కర్త, ప్రముఖ అష్టావధాని, సత్కవి, పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారి యాకస్మిక మరణమునకు విస్మిత వదనుండనై, దుఃఖిత మనస్కుఁడనై , కడసారి వారి పాదపద్మ సంపూజనమునకై యర్పించుకొను పద్యకుసుమము...

సీ.
శంకరాభరణ సత్సాహితీ కవిగణ
    స్ఖాలిత్య సవరణఁ జేసినావు;
స్వయముగా నెన్నియో సత్పూరణమ్ములఁ
    జేసి, కీర్తినిఁ బ్రతిష్ఠించినావు;
తపసివై యష్టావధానమ్ములనుఁ జేసి,
    తెలుఁగు కవుల లోటుఁ దీర్చినావు;
రమణమై యధ్యాత్మ రామాయణమ్మునుఁ
    దెలుఁగు భాషనుఁ దీర్చిదిద్దినావు;
తే.గీ.
ఇట్టి వైశిష్ట్య గురుమూర్తి వీవు మమ్ము
నేఁడు విడనాడి, కైవల్య నిధినిఁ గోరి,
స్వర్గమేగిన నేమాని పండితార్య!
మృడుఁడు మీ యాత్మకిల శాంతి నిడునుఁ గాత!

          -oO: "స్వస్తి" :Oo-

ఆదివారం, ఆగస్టు 03, 2014

సమస్య: కల్లుఁ ద్రాగుమనెను గాంధి జనుల

తేది: జులై 25, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



మద్యపానమందు మదినిఁ జిక్కఁగనీఁక,
పాలుఁ ద్రావఁగాను మేలు కలుగు!
పాలు కొనఁగలేనివారు గంజియు నుప్పు
కల్లుఁ ద్రాగుమనెను గాంధి జనుల!