Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, మార్చి 31, 2014

పద్య రచన: హరి స్తుతి

కవి పండిత మిత్రులకు, బ్లాగు వీక్షకులకు
జయనామ వత్సర యుగాది శుభాకాంక్షలు!


తేది: ఆగస్టు 09, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యము






శ్రీశా మన్మథతాత శార్ఙ్గి మధుజి చ్ఛ్రీకౌస్తుభాంకా హరీ
దాశార్హా జయ హేమశంఖ మురజి ద్బ్రహ్మేంద్ర సంపూజితా
కేశాఽనంత హిరణ్యగర్భ ధరభృ త్కృష్ణా భవోన్మూలకా
ధీశాలీ గరుడధ్వజా వరద హే దేవాధిదేవా నమ:!


ఆదివారం, మార్చి 30, 2014

ఆహ్వానం

సాహితీమిత్రులందరికీ ఆహ్వానం


రాజకీయ అవకాశవాదాన్ని వస్తువుగా తీసుకొని
గుండెబోయిన శ్రీనివాస్ రాసిన
`వేటు' గేయ కవిత్వ సంకలన ఆవిష్కరణ సభ
ఆదివారం సాయంత్రం 4;30 గంటలకు జరుగుతుంది

చెలిమి సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో
హన్మకొండలోని రాజరాజనరేంద్రాంధ్ర భాషా నిలయంలో

మెట్టు రవీందర్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి
నమస్తే తెలంగాణ సంపాదకులు అల్లం నారాయణ
ఆవిష్కర్తగా హాజరవుతున్నారు

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
కాకతీయ విశ్వ విద్యాలయం తెలుగు విభాగం ప్రొఫెసర్‍
కాత్యాయనీ విద్మహే,


ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు
డా.యం.గంగాధర్‍ లు
వక్తలుగా పాల్గొంటారు

ఇట్లు
చెలిమి సాహిత్య సాంస్కృతిక వేదిక
హన్మకొండ
వరంగల్ జిల్లా

శనివారం, మార్చి 29, 2014

సమస్య: రాలు కరఁగించు నెదను వరాల నిచ్చు

తేది: ఆగస్టు 08, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము




గోపికా లోలుఁడు, యశోద కూర్మి సుతుఁడు
సేయు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ; విని
పించు నట్టి మృదు మధుర వేణు సుస్వ
రాలు, కరఁగించు నెదను; వరాల నిచ్చు!


శుక్రవారం, మార్చి 28, 2014

సమస్య: సిగ్గు లేనివాఁడు శ్రీవిభుండు

తేది: ఆగస్టు 07, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము


"భృగుఁడు తన్నినంత విష్ణుండు కాలొత్తె;
సిగ్గులేనివాఁడు శ్రీవిభుండు;
ఛీ!" యనంగ వలదు! శ్రీశుఁడీ నెపమున
భృగుని కాలి కన్నుఁ బెఱుక నెంచె!

గురువారం, మార్చి 27, 2014

పద్య రచన: ఆధ్యాత్మిక హిందూతేజం...వివేకానందుడు

తేది: ఆగస్టు 07, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు


"ఱాలఁ బూజించు టేల? విగ్రహములందు
దేవుఁ డుండునా?" యనుచు వాదించునట్టి
మూర్ఖుఁ డాళ్వారు రాజుకు మోహ మూడ్చి,
జ్ఞాన మందించినట్టి విజ్ఞాని యతఁడు!

భరత సంస్కృతిఁ బరదేశ వాసులకును
జాటి చెప్పి, మెప్పించిన సాధు వతఁడు;
రామకృష్ణుని ప్రథమ వారసుఁ డతండు;
శిష్యుఁ డిట్లుండునని చాటు శ్రేష్ఠుఁ డతఁడు!

భరత యువకుల దివ్యమౌ భవిత కొఱకు
బోధనలు సల్పి, వెలుఁగొందు బుద్ధుఁ డతఁడు;
హితము వివరించినట్టి నరేంద్రుఁ డతఁడు;
నతులు! ఆ వివేకానందునకు వినతులు!!

బుధవారం, మార్చి 26, 2014

సమస్య: కరము కరము సౌఖ్యకరము సుమ్ము

తేది: ఆగస్టు 05, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము


వరము లిడెడి తల్లి వరలక్ష్మి కరుణించి,
యెల్ల వేళలందు హితముఁ గోరి,
యఖిల జనుల కిడెడు నభయ ముద్రితమైన
కరము, కరము సౌఖ్యకరము సుమ్ము!

మంగళవారం, మార్చి 25, 2014

పద్య రచన: అమర గాయని ఎం. ఎస్. సుబ్బలక్ష్మి

తేది: ఆగస్టు 05, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యము



గొంతు డాఁగిన యమృతమ్ముఁ గురియఁ జేసి,
పండితులఁ బామరులఁ దేల్చె స్వర్గమందు;
మధురయినఁ బుట్టి, వెలిఁగిన మణియునైన
సుప్రభాతంపు వీణియ సుబ్బలక్ష్మి!


సోమవారం, మార్చి 24, 2014

పద్య రచన: వందేఽహం గరుడగమనం!

తేది: ఆగస్టు 04, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు



దేవభాషలో...
వందే విష్ణు మనంత మబ్ధిశయనం వందే ముకుందం హరిం
వందే పంకజనాభ మచ్యుత మజం వందేఽక్షరం మాధవమ్
వందేఽహం మధుసూదనం సువదనం వందే ఖగేంద్రధ్వజం
వందే శ్రీదయితం ద్విజేంద్రగమనం వందే జగన్మోహనమ్!


ఇదియే తెలుగులో...
కొల్తున్ విష్ణు ననంతు నబ్ధిశయనున్ గొల్తున్ ముకుందున్ హరిన్
గొల్తున్ బంకజనాభు నచ్యుతు నజున్ గొ ల్తక్షరున్ మాధవున్
గొల్తున్ నే మధుసూదనున్ సువదనున్ గొల్తున్ ఖగేంద్రధ్వజున్
గొల్తున్ శ్రీదయితున్ ద్విజేంద్రగమనున్ గొల్తున్ జగన్మోహనున్!

స్రగ్ధరావృత్తము(తెలుగు)
కొల్తున్ విష్ణున్ ముకుందున్ గొలుతు మురహరున్ గొల్తు దైత్యారి నీశున్
గొల్గున్ జక్రిన్ ద్రిపాత్తున్ గొలుతును ధ్రువునిన్ గొల్తు నేఁ గైటభారిన్
గొల్తున్ హేమాంగునిన్ నేఁ గొలుతు నమృతదున్ గొల్తుఁ బక్షీంద్రధుర్యున్
గొల్తున్ లక్ష్మీవిభున్ నేఁ గొలుతు హరి నజున్ గొల్తుఁ బంకేరుహాక్షున్!

ఆదివారం, మార్చి 23, 2014

సమస్య: వరుఁ డశుభమును బల్కె వివాహవేళ

తేది: ఆగస్టు 03, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము


(1)
శుభము బల్కెడి వారలు సురలు; మఱి య
శుభము బల్కెడి వార లసురులు; గాన,
దైత్యు లశుభమ్ము బల్కుట ధర్మమనుచు
వరుఁ డశుభమును బల్కె వివాహ వేళ!

(2)
"శుభము బల్కిన నెప్పుడు శుభమె గలుగు;
నాయు రారోగ్య సంపద లమరుచుండుఁ;
గాన, వరుఁడ! శుభము బల్కఁగావలె" నన,
వరుఁడ, శుభమును బల్కె వివాహ వేళ!

శుక్రవారం, మార్చి 21, 2014

పద్య రచన: వరలక్ష్మీ వ్రతమాహాత్మ్య కథ




ఆ.వె. 

సకల దేవతాళి సంస్తుతించుచునుండఁ

జేరి పార్వతియును, జిఱునగవుల
శివుఁడు తనదు భస్మసింహాసనమ్మునఁ
గొలువు దీఱఁ, బతినిఁ గోరెనిట్లు! (1)


ఆ.వె.

“స్వామి! స్త్రీలు సకల సౌఖ్యసౌభాగ్యముల్,

పుత్రపౌత్రవృద్ధిఁ బొందునట్టి
వ్రత మొకండుఁ దెలిపి, వ్రతవిధానమ్మును
జెప్పుమయ్య నాకుఁ జిత్త మలర!” (2)


కం.

సతి కోరఁగ విని, శివుఁడును

హిత మిత వాక్యముల ననియె, “హే పార్వతి! నీ
వతి వినయమునను గోరితి;
కుతూహల మ్మెసఁగ వినుము కోరిక తీఱన్! (3)


తే.గీ. 

మగధదేశానఁ గుండిన మనెడి పట్ట

ణమున నొక ద్విజ, ‘చారుమతి’, మతి దధిజ,
పద్మ పదపద్మ సక్త సద్భక్తి హృదయ,
ఘన పతివ్రత, సద్వంద్య కలదు; వినుము! (4)


కం.

ఒకనాఁడు స్వప్నమందున

సకల ధనము లొసఁగు తల్లి, సాక్షా ద్రమయే
ప్రకటిత మాయెను సరగున
వికసిత కరుణా హృదబ్జ విలసితమణియై! (5)


తే.గీ. 

“చారుమతి! నన్నుఁ బూజింపు, శ్రావణమునఁ

బౌర్ణమికి ముందునన్ శుక్రవారమందు!
సకల సౌభాగ్య సంతాన సౌఖ్యతతులఁ
గూర్చుదానను నమ్ముమో గుణవిశాల!” (6)


ఆ.వె. 

అనుచుఁ బలికి మాయమాయె నా మాతయ;

చారుమతియు లేచి, సంతసించి, 
“వరము లొసఁగు తల్లి! వరలక్ష్మి! కరుణించి, 
మమ్ముఁ బ్రోవు మమ్మ! నెమ్మి నిమ్మ! (7)


కం. 

హే మాతా! సంపత్కరి!

శ్రీ! మా! నారాయ ణీంది! సింధుజ! లక్ష్మీ!
నేమమున నిన్నుఁ గొలుతును;
నీ మనమున మమ్ముఁ గరుణ నెసఁగఁగ గనుమా!” (8)


తే.గీ. 

అనుచుఁ బరిపరి విధముల వినుతి సేసి,

పతికి, నత్తమామలకును నతివ తెలుప;
సంతసమ్మున విని, వారు సమ్మతించి, 
“వ్రతము సలుపంగ వలె” నని పలికి రపుడు! (9)


కం. 

ఇది విన్న యూరి సుదతులు

ముదమున మది మెచ్చి యంతఁ బున్నమి మున్నై
యెదురుపడు శుక్రవారము
గదురన్ శ్రావణమునందు ఘనమగు వేడ్కన్! (10)


తే.గీ. 

“పద్మకరి! సర్వలోకైకవంద్య! లక్ష్మి! 

దేవి! నారాయణప్రి యాబ్ధిజ నమామి”
నుచు వారలు చారుమతిని గలసియుఁ
జేరి వరలక్ష్మి పూజను జేసి రపుడు. (11)


తే.గీ. 

తొలి ప్రదక్షిణచే నందియలును మ్రోగె;

మలి ప్రదక్షిణఁ గంకణములు మెఱసెను;
కడ ప్రదక్షిణ సర్వాంగ ఘటిత భూష
ణ యుతలైరి! సంపదలె యందఱి గృహాల!! (12)


తే.గీ. 

పఱఁగ వరలక్ష్మి కరుణించి పడతులకును

సంపదలు ధాన్య సౌఖ్య సత్సంతతులను,
నాయురారోగ్య భోగ్య సన్మాన్యములను
దగఁ బ్రసాదించె! వ్రత ఫలితమ్ము దక్కె!! (13)


కం. 

సతి వింటివె యీ కథ! నే

సతి పతు లిది విన్నఁ గాని, చదివిన, లక్ష్మీ
సతి, తా నొసఁగును సకలము,
లతి శుభముల నిచ్చుఁ గాత, యనవరతమ్మున్! (14) 




(ఇది శ్రీ వరలక్ష్మీ వ్రతమాహాత్మ్య కథ)

-:o:శుభం భూయాత్:o:-



సమస్య: అన్న చావునకు నిమిత్తమయ్యె ననుజ

తేది: ఆగస్టు 02, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము

(శూర్పణఖ వృత్తాంతము)

కామ వాంఛను దరిఁజేరి, రాముఁ గోర,
"లక్ష్మణుఁడు దీర్చు"ననఁ, బోవ, లక్ష్మణుండు
ముకు సెవులుఁ గోయఁ, బౌలస్త్యు మ్రోలఁ జెప్పి,
యన్న చావునకు నిమిత్తమయ్యె ననుజ!

గురువారం, మార్చి 20, 2014

సమస్య: పాలు గాంచి పిల్లి పాఱిపోయె

తేది: జూలై30, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము


పాలు, పెరుఁగు, వెన్న భయము లేకయె తిన,
నింటి కాఁపు, పిల్లి యెంతయు భయ
మందు విగ్గు స్వశిరమందుఁ దాల్చ నా జుల
పాలు గాంచి, పిల్లి పాఱి పోయె!

బుధవారం, మార్చి 19, 2014

సమస్య: రాముఁ డనఁగను సాక్షాత్తు రావణుండె

తేది: మార్చి 19, 2014 నాటి శంకరాభరణములోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము



దానవేంద్రుఁడు,కైకసీ సూనుఁడతఁడు;
జానకీహర్త, వేదవిజ్ఞానయుతుఁడు;
సోమభక్తుఁడు,మండోదరీమనోఽభి
రాముఁ డనఁగను సాక్షాత్తు రావణుండె!

సమస్య: కుచముఁ గోసె మగఁడు కూర కొఱకు



తేది: జూలై 29, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నాపూరణము




స్వక రుచ్యము రసమౌటన్,
సకలముఁ దా సిద్ధ పఱచి, సంతోషమునన్
లికుచముఁ గోసె మగఁడు, కూ
ర కొఱకుఁ
 గాకయు, స్వకేష్ట రసముం జేయన్!

(లికుచము=గౙనిమ్మ)

సోమవారం, మార్చి 17, 2014

సమస్య: పాండవులకు శ్రీకృష్ణుఁడు వైరియగును

తేది: జూలై 28, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము


కౌరవులు కీడు సేసి రేవారలకును?
పాండుపుత్రులఁ బ్రోచిన వాఁడెవండు?
పాము, ముంగిసకునుఁ జూడ నేమి యగును?
పాండవులకు; శ్రీకృష్ణుఁడు; వైరియగును!

శనివారం, మార్చి 15, 2014

సమస్య: వరలక్ష్మీ వ్రతముఁ జేయవలదంద్రు బుధుల్

తేది: జూలై 27, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నేను రాసిన పూరణము





సరవిని విధవలును, స్వయం

వరము జరుగనట్టి పిన్న పడుచు, లుదక్యల్,
పురుటింటివా, రశౌచులు
వరలక్ష్మీ వ్రతముఁ జేయవలదంద్రు బుధుల్!

శుక్రవారం, మార్చి 14, 2014

సమస్య: కాకర పూపూచి నిమ్మకాయలు కాచెన్

తేది: జూలై 26, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము.




సోఁకెనని చీడ నిమ్మకుఁ
గాకరకును గీట నాశకమ్మగు మందున్
జే కొని చిమ్మఁగ నప్పుడు
కాకర పూ పూచి, నిమ్మకాయలు కాచెన్!

బుధవారం, మార్చి 12, 2014

సమస్య: విషము సేవింప నాయువు పెరుగునయ్య

తేది: జూలై 25, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము.


(క్షీరసాగర మథనమందు మొదట హాలాహల ముద్భవించి, లోకముల దహించునపుడు,
దేవదానవులు శివుని శరణు వేడి, పలికిన సందర్భము)



పాల సంద్రమ్ముఁ ద్రచ్చంగఁ బ్రథమముగను
హాలహల ముద్భవించెను; హరుఁడ! నీవు
విషము సేవింప; నాయువు పెరుగు నయ్య
దేవ దానవ తతులకు; దీన బంధు!

సోమవారం, మార్చి 10, 2014

పద్య రచన: పరమపద సోపాన పటము

తేది: జూలై 25, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు.



కం.
నిముసమునఁ బాము దిను, మఱు
నిముసము నిచ్చెనల నెక్కు నిక్కపుఁ గ్రీడన్,
శ్రమపడి యాడుచు నుండఁ, బ
రమపద సోపాన పటము రాగిలు చుండున్! (1)

కం.
సుమతులకు నాట యందున
సమ మగు నిశ్శ్రేణితతులు, సర్ప కబళముల్!
కుమతులను బాము మ్రింగును;
గమనింపఁగ నిచ్చెనలు 'న'కారమ్మె యగున్! (2)

తే.గీ.
హితుల 'వైకుంఠ పాళి' సహిష్ణుతఁ గని,
యాడ, వైకుంఠుఁ డెప్పుడు నైక్య మంద
నీయఁ, డెంతయును ఘన పరీక్ష సేసి,
పిదప నెగ్గించి, తన దరికి వేగఁ జేర్చు! (3)

ఆ.వె.
పిల్ల లాడు నాట, పెద్ద లాడెడి యాట,
నిచ్చెనలును పాము లిచ్చి పుచ్చు!
వారి వారి కర్మ పరిపాకమునుఁ బట్టి
ముందు వెనుకలుగను మోక్ష మొదవు!! (4)


-:శుభం భూయాత్:-


శుక్రవారం, మార్చి 07, 2014

సమస్య: మగనిఁ దూలనాడి మాన్య యయ్యె

తేది: జూలై 24, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము.


విష్ణు వక్షమందు భృగువు తన్నంగనె,
కాలి కెంత నొప్పి కలిగె నంచుఁ
గాలి నొత్త; లక్ష్మి కలఁత చెందియుఁ దాను
మగనిఁ దూలనాడి, మాన్య యయ్యె!

గురువారం, మార్చి 06, 2014

పద్య రచన: ధన్య సంగీత సమ్రాట్టు "త్యాగరాజు"

తేది: జూలై 24, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు.


సీ.
ఘనతరాంచితమైన కర్ణాట సంగీత 
      వాగ్గేయకార సత్ప్రణతుఁ డయ్యె;
చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటి నాఁడు
      రాఘవోత్తమ కృతి ప్రవరుఁ డయ్యె;
నిధికన్న రాము సన్నిధి చాల సుఖమంచు
      శరభోజి ధన తిరస్కారుఁ డయ్యె;
వేన వేలుగఁ గృతు ల్వెలయించి దేశాన
      సంగీత లోక ప్రశస్తుఁ డయ్యె;
గీ.
ఆతఁడే 'జగదానంద' జాతకుండు;
'కనకనరుచిరా' కృతి దివ్యకారకుండు;
రఘు కులాన్వయు సద్భక్తి లబ్ధ యశుఁడు;
ధన్య సంగీత సమ్రాట్టు "త్యాగరాజు"!

సుగంధి:
'ఎందఱో, మహానుభావు లెందఱో' యటంచుఁ దా
విందుగన్ గృతుల్ రచించి విన్నవించి, రామునిన్
డెందమందు నిల్పు భక్తుఁడే స్వరాట్టు గాను ని
ల్చెం దగ న్మహోన్నతి న్వరించెఁ ద్యాగరాజిలన్!

-:శుభం భూయాత్:-

బుధవారం, మార్చి 05, 2014

సమస్య: మునిని సంహరించె ననిల సుతుఁడు

తేది: జూలై 23, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము.


రావణుండుఁ బనుప రాక్షస మాయచేఁ
గాలనేమి మాఱెఁ గపట మునిగ;
ధాన్యమాలి వలన ధౌర్త్యమ్ము గ్రహియించి,
మునిని సంహరించె ననిల సుతుఁడు!

మంగళవారం, మార్చి 04, 2014

సమస్య: రామునివెంట రాముఁ గని రాముని సంఘము సంతసించుచున్

తేది: జూలై 22, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము.


ఓమగ జన్నమా యసుర యూధముఁ గూల్పఁగఁ దాటకన్మహో
ద్దామతరాశుగమ్మున యథార్థను యక్షిణిగా నొనర్ప నా
రామ గతార్త సుప్తశిల, రమ్య నహల్యగ మార్చఁ గన్నులా
రా "ముని"వెంట రాముఁ గనిరా "మునిసంఘము" సంతసించుచున్!

సోమవారం, మార్చి 03, 2014

సమస్య: ఆంగ్లభాషయుండ నాంధ్రమేల

తేది: జూలై 21, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నేను రాసిన పూరణము.


అమృత తుల్యమైన యపురూప కావ్యాని
కాంధ్ర భాష యుండ, నాంగ్ల మేల?
మృత సమమ్ము మమ్మి మేని రోఁతఁ బొగడ
నాంగ్ల భాష యుండ, నాంధ్ర మేల?

ఆదివారం, మార్చి 02, 2014

పద్య రచన: తాంబూలము (అణా అసలు కథ)

తేది: జూలై 21, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు.



కం.
ధారానగరమునందు ను
దారులు భవభూతి, కాళిదాసు లిరువు రా
దారి నడువంగఁ జని యటఁ
గోరియుఁ దాంబూల మపుడు గూరిమితోడన్.

తే.గీ.
కనిరి తాంబూలరాగాధరను వితర్ది;
నామె తారుణ్యభరయౌట, నటకు నేఁగి,
"తూర్ణమే తెమ్ము చూర్ణమ్ము పూర్ణచంద్ర
వదన!" యని భవభూతియుఁ బలుకఁగానె.

ఆ.వె.
కాళిదాసు పలికె “కర్ణాంతకీర్ణలో
చన విశాల! తెమ్ము స్వర్ణవర్ణ
పర్ణములను! నీకు బహుశుభాశీస్సులు!
వేఁగఁ బోయి రమ్ము, వేచియుంటి!”

ఆ.వె.
అనఁగ లోని కేఁగి యాపడతియు నప్డు
పసిఁడిఁ దమలపాకు లెసఁగుచుండఁ
దెల్లనైన సున్న ముల్లసిల్లుచునుండఁ
దీసికొనియు వచ్చె దీక్షతోడ!

తే.గీ.
ముందు గోరిన యా భవభూతి విడచి
కాళిదాసుకు నిచ్చెను కాంక్ష దీర!
నపుడు భవభూతియును కారణ మ్మడుగఁగ,
వనిత బదులిచ్చెఁ గారణమును కవికిని!

కం.
"వినుఁ డార్యా! లోకమునం
జనురీతిని నే నడచితి! సైరింపుఁడు నన్!
బెను రొక్కము లిచ్చినవా
రినె మెచ్చును లోక మెపుడు శ్రేష్ఠ నిజమిదే!

ఆ.వె.
నీవు మూఁడణాలు, నితఁడును నైదణా
లిచ్చిరయ్య నాకు నిచ్చగలిగి,
యెక్కుడైన ధనము నిచ్చిన యీతని
కాంక్షఁ దీర్ప ముందుగా నిడితిని!"

కం.
ఆమాట విన్న యిద్దఱు
నేమాటనుఁ బలుకలేక నెఱజాణ కటన్
సేమమ్ము గల్గు ననియును
నీమముతో వెడలి రపుడు నెమ్మన మలరన్!

-:శుభం భూయాత్:-