Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జనవరి 11, 2024

శ్రీయశస్వినీ! (పద్య దశకము)

 

శ్రీయశస్వినీ! (పద్య దశకము)


శ్రీకరి! చంద్ర సోదరి! విశిష్ట శుభంకరి! సత్కృపాకరీ!
ప్రాకట శుక్ల వస్త్ర ధరి! భాగ్యకరీ! మదన ప్రసత్వరీ!
లోక ప్రమోదకారి! యెదలో నిను నిల్పి, స్మరించువారికిన్
శోక విమోచనమ్ము నిడి, చూడవె చల్లఁగ శ్రీయశస్వినీ! 1

శ్రీసతి! శాంకరీ! విజయ! శీతనగాత్మజ! సింహవాహినీ!
వాసవ పద్మసంభవ ప్రశస్త సుపర్వ మనోజ్ఞ సంస్తుతుల్
హాస విలాస యుక్తముగ నందియు, నా మహిషాసురున్ మదిన్
రోసిలి, త్రుంచి, లోకములఁ బ్రోచితి వమ్మరొ శ్రీయశస్వినీ! 2

శ్రీ ధవళాంగి! శారద! విరించి మనోహరి! శాబ్ది! భారతీ!
శోధిత సర్వశాస్త్రవర శోభిని! బ్రాహ్మి! సనాతనీ! వెసన్
మేధ ననుగ్రహించి, మము మిన్నలఁ జేసి, కృపాబ్ధిఁ దేర్చి, వా
గ్యోధత నిచ్చి, పద్యములఁ గూర్మిని నిల్వుమ శ్రీయశస్వినీ! 3

రవిశశివహ్నినేత్ర! ఘనరత్నవిభాసితకుండలాంచితా!
ధ్రువపదసన్నిధానవరతూర్ణప్రదాత! దురాత్మఘాతితా!
నవవిధభాసితోజ్జ్వలఘనస్థిరరూప! సుమంగళాంఘ్రి! వి
ప్లవముల మాన్చి, మాకు ఘన లక్ష్మము లీయుమ శ్రీయశస్వినీ! 4

భక్తుల కొంగు బంగరుగఁ బద్మినివై విలసిల్లి, లోని మా
శక్తినిఁ బెంచి, ధైర్యమిడి, చక్కని త్రోవనుఁ జూపి, యుక్తమౌ
యుక్తినిఁ బెంచి, మానసపు టూహల నిల్చి, రహించి, పాపని
ర్ముక్తులఁ జేయుమమ్మ మము మోక్షము నిచ్చియు శ్రీయశస్వినీ! 5

నిగమ గతస్థ సారమిడి, స్నిగ్ధయశో విభవమ్ము లిచ్చుచున్,
జగతి పునీతయై నెగడఁ, జల్లని చూపుల మమ్ముఁ గాంచుచుం,
బగఱయె నెయ్యులౌనటుల మార్చుచు, నెప్పుడు నీ ధరన్ మమున్
సుగతులఁ జేయు మమ్మరొ విశుద్ధదయామయి శ్రీయశస్వినీ! 6

అక్షయ వత్సలత్వమున నమ్మవునై కృపఁ జూచి, నిచ్చలున్
సాక్షివి నీవ యౌచు, మనసా వచసా కృతియందు నిల్చి, ప్ర
త్యక్ష మనోజ్ఞ సత్కృతుల నన్నియుఁ జేయఁగఁ బ్రోత్సహించుచున్,
రక్షగ నుండుమమ్మ మముఁ గ్రక్కునఁ బ్రోచుచు శ్రీయశస్వినీ! 7

ఎల్లెడలందు నీ భువిని హెచ్చిన స్వార్థముఁ ద్రుంచి, సర్వహృ
త్ఫుల్లసరోరుహమ్ములను భూతదయన్ జొనిపించి, శాంతిమై
యుల్లములందు నుల్లసము నొద్దికగాఁ గలిగించి, మమ్ము రం
జిల్లఁగఁజేయుమమ్మ ఘనజీవన మిచ్చియు శ్రీయశస్వినీ! 8

నీమముతోడఁ బుట్టువిడి, నేలకుఁ బంచిన బ్రహ్మ యుక్తినిం,
గామిత సంస్థితిన్ నడిపి, కాచెడి విష్ణుని దివ్య శక్తినిన్,
సోమ కిరీట ధారియగు సోముని సద్విలయంపు రక్తినిం
బ్రేమముతో నొసంగి, మము రేవగ లోమవె శ్రీయశస్వినీ! 9

కలమునఁ గ్రొత్త భావనల కైతల నింపి, గ్రథింప నిచ్చి, నా
విలువనుఁ బెంచి, సన్మతిని వేగమె నా కిడి, మద్గృహమ్మునం
గలిమినిఁ బెంచి, మల్లిఖిత కావ్య సుముద్రణ మీ వొనర్చియున్,
బలము నొసంగవే జనని! ప్రాజ్ఞుల మ్రోలను శ్రీయశస్వినీ! 10

స్వస్తి

రచన:
’మధురకవి’ గుండు మధుసూదన్,
విశ్రాంత తెలుఁగు స్కూల్ అసిస్టెంటు,
శేషాద్రిహిల్స్, రంగశాయిపేఁట,
వరంగల్లు - 506005.