Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, అక్టోబర్ 04, 2013

సమస్యాపూరణం: జారుల కృత్యములు మనకు సంతోష మిడున్

కోరియుఁ బ్రహ్లాదాదులు
మీరిన భక్తిని భజించి, మేల్గాంచి, హరిన్
జేరిరి! యాహా! కన, దివి
జారుల కృత్యములు మనకు సంతోష మిడున్! (1)
(దివిజ+అరుల=రాక్షసులగు ప్రహ్లాదుని వంటి వారి)

పోరాని పోకఁ బోయిరి
కారే! కాముని భజించి, కని, శాపములన్
గూరి! రహల్యా తారా
జారుల కృత్యములు మనకు సంతోషమిడున్? !(2)
(వారా కృత్యముల ద్వారమున మేలే చేసిరో, కీడే చేసిరో? ఆ కథ లెఱిఁగిన మనకు విదితమే కదా!)

చారులె రాజుల కన్నులు;
చారులు లేకున్న రాజు ససిఁ గనఁడు భువిన్;
జారులె ముఖ్యులు! కన, భువిఁ
జారుల కృత్యములు మనకు సంతోష మిడున్!! (3)
(భువిన్+చారుల=భువిఁ జారుల)

2 కామెంట్‌లు:

  1. మూడు పూరణలూ వైవిధ్యంగా ఉన్నాయి. మూడవ పూరణలో సరళాన్ని పరుషంగా మార్చి క్రొత్త అర్థాన్ని సాధించిన మీ నైపుణ్యం ప్రశంసనీయం.
    రెండవ పూరణ మూడవ పాదంలో గణదోషం. ‘టు’ వర్ణాన్ని తొలగిస్తే సరిపోతుందనుకుంటాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కంది శంకరయ్యగారూ! రెండవ పూరణ మూడవ పాదంలో టైపాటు వలన గణదోషం ఏర్పడింది. నాటి శంకరాభరణం సమస్యాపూరణలో నా రెండవ పూరణ మీ విధంగా వుంది.

      "పోరాని పోకఁ బోయిరి
      కారే! కాముని భజించి, కని, శాపములన్
      గూరి! రహల్యా తారా
      జారుల కృత్యములు మనకు సంతోషమిడున్!?!?
      (వారా కృత్యముల ద్వారమున మేలే చేసిరో, కీడే చేసిరో? ఆ కథ లెఱిఁగిన మనకు విదితమే కదా!)" యని!

      టైపాటును తెలిపినందుకు ధన్యవాదములు.

      తొలగించండి