Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, అక్టోబర్ 28, 2013

పద్య రచన: గుణనిధి కుబేరునిగ మారిన కథ



తేది: సెప్టెంబర్ 22, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన కుబేరుని చిత్రమునకు నేను రాసిన పద్యములు...

గుణనిధి కుబేరునిగ మారిన కథ (శివపురాణాంతర్గతము)

ప్రథమ జన్మ వృత్తాంతము:

కం.
ధరలోన యజ్ఞదత్తుం
డిరు బుట్టు వొకండు నుండె; నతనికి సుతుఁడొ
క్కరుఁడు గుణనిధి యను నతఁడు
నరయఁగఁ జోరుండు, జారుఁ డతి దుర్హృదుఁడే! (1)

తే.గీ.
ప్రతి దినమ్మును దుర్మార్గ వర్తనుఁడయి,
చెడుగు పనులనుఁ జేయుచుఁ జెలఁగుచుండఁ
దండ్రి సహియింప నోపక తన గృహమును
వీడి పొమ్మని శాసించ, వెడలె నతఁడు! (2)

ఆ.వె.
కూడు, గూడు, కాసుఁ గూడ చేతను లేక
పస్తులుండ, నొకఁడు పాయసమును
నచటి దేవళమున నైవేద్యముగ నిడి,
హరుని మ్రొక్కి, వేడి, యతఁడు వేగ (3)

కం.
గుడి నుండి వెడల, వెంటన
గుడిలోపలి పాయసమును గుటుకున మ్రింగన్,
గుడి బయటి భటు లదియుఁ గని,
కడు వేగిరమునను రాఁగఁ గ్రమ్మె నిరు లటన్ (4)

కం.
నైవేద్యమ్మును మ్రింగిన
యా వైనము కతనఁ గ్రమ్మె నా చీఁకటులున్!
ఠావును విడిచిన గుణనిధి
వేవిధముల వెతలఁ బడియు విగతాసుఁడుఁ గాన్ (5)

ఆ.వె.
అంత శివ భటులును నతనినిఁ గొంపోయి,
శివుని చెంత నుంప, శివుఁడు దయను
నిడియె మఱొక జన్మ; నిష్ఠతో జీవించు
నట్లు వరము నిడియు, నతనిఁ బంపె! (6)

ద్వితీయ జన్మ వృత్తాంతము:

ఆ.వె.
శివుని వరబలమ్ముచేఁ గళింగాధిపుఁ
డగు నరింధమునకు దముఁ డనియెడి
పుత్రుఁగా జనించి, భూమినిఁ బాలించి,
దేవళమ్ముల ఘన దీప పూజ (7)

తే.గీ.
నిత్యమును వెల్గఁజేసి తా నిష్ఠతోడఁ
బూజ సేయుచు; నొకనాఁడు బోయి కాశి,
యచట విశ్వేశునకుఁ బూజలందఁజేసె;
నంత శివపార్వతులు మ్రోల నవతరించ (8)

తే.గీ.
దముఁడు పార్వతీదేవిఁ బ్రథమము గాను
గనియు; సౌందర్య వర్ణనమునటఁ జేయ,
క్రుద్ధ నేత్రయై పార్వతి గుణనిధిఁ గన,
నొక్క కన్ను వ్రక్కలు గాఁగ, నొంటి కంటి (9)

ఆ.వె.
వాఁడు నయ్యె; నంతఁ బార్వతీదేవియు
"నటులఁ జూచినట్టి యతఁ డెవండు?
తెలుపుఁ" డనఁగ, శివుఁడు తెలుపఁగ, గరుణతో
నతని కన్ను మఱల నతని కిడియె! (10)

కం.
చిఱునగవున శివుఁడప్పుడు
కరుణఁ గుబేరాభిధ, నలకాపురి నిడి, యు
త్తర దిక్పతిగ, ధనపతిగ,
మఱి, తన సన్నిహితునిగను మన్ననఁ జేసెన్! (11)

వ.
కుబేరుండంతట నుత్తర దిక్పాలకత్వము నెఱపుచు, నర్హులకు ధనప్రాప్తినిఁ గలిగించుచు, నలకాపురినిఁ బాలించుచు, శివునితో సఖిత్వముఁ బాటించుచు, సుఖంబుండె... (12)

     :కుబేర కథ సమాప్తము:
లోకా స్సమస్తా స్సుఖినో భవన్తు!
      -:శుభం భూయాత్:-

2 కామెంట్‌లు: