Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, అక్టోబర్ 21, 2015

మాతా! త్రిదేవీ! త్రిమూర్త్యాత్మికా!

మిత్రులందఱకు మహర్నవమి శుభాకాంక్షలు!!




శా.
చేతన్ వీణ ధరించి, విద్యలొసఁగన్  శ్రీ వాణివై నిల్చి, స
చ్చేతోమోద విశేష సంపద లిడన్  శ్రీ లక్ష్మివై నిల్చి, యా
చేతోఽoశుల్ మొఱ వెట్ట; శక్తి నిడఁగన్  శ్రీ గౌరివై నిల్చి, స
చ్చైతన్య మ్మిడి, యో త్రిదేవి! యిట విశ్వమ్మున్ దగన్ బ్రోవుమా!!




కం.
వాణీ! వీణా పాణీ!
పాణి స్థిత సకల విభవ  భాస్వ ల్లక్ష్మీ!
ప్రాణేశార్ధాజిర శ
ర్వాణీ! ధీ బల ధనాఢ్య!  వరదాయి! భజే!!



మంగళవారం, అక్టోబర్ 20, 2015

సద్దుల బతుకమ్మా...సల్లంగ జూడమ్మా...!!!

మిత్రులందఱకు బ్రతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!

(తెలంగాణమునం బడతు లందఱు బ్రతుకమ్మ పండుగ నాఁ డెట్టుల బ్రతుకమ్మ నలంకరించి, పూజింతు రనఁగా...)


సీ.
తంగేడు పూవులఁ దాంబాలమునఁ గుండ్ర
.....ముగ నందముగఁ బేర్చి,
మురువు సూపు
వివిధమ్ములగు రంగు
లవి గునుగులఁ జేర్చి,
.....మందార, కట్ల, చే
మంతుల నిడి,
బంతిపూవులు పోఁక
బంతిపూవులు వింత
.....సొబగుల నీనఁగాఁ 
 జూపరులకుఁ
బ్రకృతి సోయగమంతఁ 
 బండువు సేయంగ
.....బ్రతుకమ్మ నడుమ గౌ 
 రమ్మనుంచి,

గీ.
ధగధగలతోడి పట్టుపీ 
 తాంబరములఁ
గట్టుకొనియును మెఱయుచు 
 ఘనముగాను
కనకదుర్గకు లక్ష్మికిఁ 
 గడు ముదమున
వందనము సేసి, యర్చింత్రు 
 పడతులంత!

కం.

బ్రతుకమ్మఁ బట్టుకొనియు వ
నితలందఱు నూరి చివర 
 నిక్కపు భక్త్యు
న్నతి నాడి పాడియును స
న్మతి బ్రతుకమ్మను నిమజ్జ 
 నము సేతురయా!


ఆ.వె.
ముత్తయిదువ లపుడు 
 పూతురు పసుపును
పుస్తెలకును గౌరి  పూజసేసి!
సన్నిహితులు హితులు  సఖులంత కష్టసు
ఖములఁ జెప్పుకొండ్రు  కలిసిన కడ!

తే.గీ.
ఇంటినుండియుఁ దెచ్చిన 
 హితకరమగు
తీపి వస్తువులనుఁ బంచి,  తినియు, మఱల
సద్దులను మూటఁగట్టియు  సంబరమున 
నిండ్లకుం జేరఁ బోదురా  యింతులంత!

కం.

బ్రతుకమ్మ పర్వదినమున
నతి సంతోషమున దుర్గ 
 నవ్యానందాల్
సతులందఱ కిడి, వారలఁ
బతులకుఁ బిల్లలకు స్థిరత 
 బ్రతు కిడుఁ గాతన్!



<||> శుభం భూయాత్ <||>



సోమవారం, అక్టోబర్ 19, 2015

సమస్య: దుస్ససేనుని యర్ధాంగి ద్రుపదతనయ!

తేది: ఆగస్టు 27, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(రాజసూయయాగ సమయాన దుశ్శాసనుని భార్యయు, ద్రౌపదియుఁ గలిసికొని, సంతసించిన ఘట్టము)




దుస్ససేనుని యర్ధాంగి, ద్రుపదతనయ
తోడికోడండ్రు గానఁ, గ్రతువునఁ గాంచి
సంతసించిరి, తాము స్త్రీసహజమైన
పేరఁటమ్మునఁ గలసిన విధమెఱింగి!




ఆదివారం, అక్టోబర్ 18, 2015

సమస్య: ముండను వీక్షించి మగఁడు మోదము నందెన్!

తేది: ఆగస్టు 26, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము




కొండొకఁడు సతీ యుతుఁడై
మెండుగ హరిఁ గొల్చి, "కనక మి"మ్మన, దయ వి
ష్ణుం డిడె! సతిపయిఁ గనక
మ్ముండను వీక్షించి, మగఁడు మోదము నందెన్!!



శనివారం, అక్టోబర్ 17, 2015

అమ్మా! ఆదిపరాశక్తీ! శాంకరీ! నమోఽస్తు తే!




అమ్మ! మనమ్మునందు నిను నండగ నమ్మితి! నమ్ము మమ్మ! మో
హమ్ముఁ బెకల్చి, సన్మనము నందఁగ నిచ్చి, హృదంతరమ్ము శాం
తమ్మున నోలలార్చి, సతతమ్ము దయారస మిమ్ముఁ గూర్చి, నా
కిమ్మహి జన్మ దున్మి, యిఁకఁ గేవల సద్గతి నిమ్మ! యమ్మరో!!



శుక్రవారం, అక్టోబర్ 16, 2015

దత్తపది: పాత్ర-పాత్ర-పాత్రము-పత్రము...అవే అర్థాలతో...భాగవతార్థంలో...తేటగీతి పద్యం....

దాదాపు ఒక నెల రోజుల క్రిందట
మా పాఠశాలలో జీవశాస్త్రమును బోధించు ఉపాధ్యాయులు శ్రీ కె. శ్రీధర్ గారు
కోరి యిచ్చిన దత్తపది:
పాత్ర(=పాత్రధారిత్వము)-పాత్ర(=పళ్ళెరము)-పాత్రము(=యోగ్యము)-పత్రము(=పర్ణము) అను పదములను నిర్దేశితార్థములతో మాత్రమే...
భాగవతార్థంలో...
తేటగీతి పద్యం వ్రాయమనగా..
నేను వ్రాసిన పద్యము


(శ్రీకృష్ణతులాభార ఘట్టము)



ధవునిఁ గొనుగోలు సేయు పాత్రను ధరించి,
తనదు పతినప్డు సత్యయే తపసి పాత్ర
యందిడెఁ! దిరిగి కొన నపహాస్య పాత్ర
య్యె! రుక్మిణి, యిడి పత్ర, మతనిఁ గొనియె!!


గురువారం, అక్టోబర్ 15, 2015

సమస్య: మన్మథుండు హైమవతికి మగఁడు గాదె!

తేది:  ఆగస్టు 11, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము





మగఁడు గద రతీదేవికి మన్మథుండు!
హైమవతికి మగఁడు గాదె హరుఁడు! రమకు
మగఁడు గాదె మురహరుండు! మగఁడు గాదె
వాణికి చతుర్ముఖుండు! వివాద మేల?



బుధవారం, అక్టోబర్ 14, 2015

దత్తపది: లంగా-లుంగీ-చీర-దోవతీ...భారతార్థంలో...నచ్చిన ఛందస్సులో...

తేది: ఆగస్టు 25, 2015 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన 
లంగా-లుంగీ-చీర-దోవతీ ...పదములను
భారతార్థంలో
నచ్చిన ఛందస్సులోవ్రాయమనగా
నేను వ్రాసిన రెండు పద్యములు:


(ఖాండవ వనమును దహించి, మయ విరచిత యింద్ర[ఖాండవ]ప్రస్థముగ నొనర్చిన వృత్తాంతము నిట ననుసంధానించుకొనునది)



మొదటి దత్తపది: కందము:
ఖాండవ తరులం గా లిచి
మెండు బలుం గీ డుఁ ద్రోచి మేలైన భువిన్
గండరగండఁడు చీరఁ 
దండిగ హరి దోవ తీ సెఁ దమ నగరముగన్!!




రెండవ దత్తపది: (పై పద్య భావమునే మత్తేభమునందు):

తరులం గా లిచి ఖాండవానఁ దగ నింద్రప్రస్థమన్ రాజధా
ని రచింపన్ మయు సాయమంది, బలులుం గీ ర్త్యాత్ములున్ రాజ్యపా
లురునై చీరఁ గఁ, బాండునందనుల నాల్గుం దిక్కులం గెల్వఁగన్
బురికొల్పంగను, నశ్వమేధమునకున్ బ్రోత్సాహియై దోవతీ
సి, రణోన్ముఖ్యవిజేతృ భాగ్యమొసఁగెన్ శ్రీకృష్ణుఁడే మాన్యుఁడై!!



మంగళవారం, అక్టోబర్ 13, 2015

సమస్య: పడుచున్నను పెండ్లియాడువారే లేరే?

తేది:  ఆగస్టు 24, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణములు




మొదటి పూరణము:
(అన్ని యుండియు నెంత కాలమైననుం బెండ్లి కుదురని యువకుని మనోగతము)
"గడనము వేలుగ! నేనొ
క్కఁడనే కొడుకునయ! దేవ! కట్నమడుగ! రాఁ
గడఁగియుఁ బడుచులు, సంతస
పడుచున్, ననుఁ బెండ్లియాడువారే లేరే?!"





రెండవ పూరణము:
"పడతులు పుట్టఁగ వలదని
కడుపులు తీయించుకొనుచు ఘనముగఁ బడుచుల్
గొడుకులఁ గందురె? కొందల
పడుచున్నను పెండ్లియాడువారే లేరే?!"



సోమవారం, అక్టోబర్ 12, 2015

సమస్య: కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్!


తేది: ఆగస్టు 23, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



(మాయా ప్రభావమునకు లోనైన రావణుఁడు శివునితోఁ బార్వతి నిమ్మని కోరుట)



మిక్కిలి చొక్కునఁ జిక్కియుఁ
గ్రక్కున ముక్కంటి యింతి కర మందుకొనన్
జక్క నడుగు "దశగళుఁ డను
కుక్కకుఁ" దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్!


ఆదివారం, అక్టోబర్ 11, 2015

సమస్య: బాణమ్ములు గ్రుచ్చుకొనఁగ భామిని మురిసెన్!

తేది: ఆగస్టు 22, 2015నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము




(ప్రియుని పొగడ్తలకుం బొంగిపోవు ప్రియురాలి పరిస్థితినిం దెలుపుట)



"రాణీ! తొలి వలపుల యలి
వేణీ! నీ ప్రణయ వచన వీచిని ననుఁ, బూ
బోణీ! తేల్చుమ" యను మరు
బాణమ్ములు గ్రుచ్చుకొనఁగ, భామిని మురిసెన్!



శనివారం, అక్టోబర్ 10, 2015

సమస్య: శేషమే చాలు నెనలేని శ్రీలు గురియు!

తేది: ఆగస్టు 21, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము




శ్రావణమ్మున శుక్రవారమ్మునాఁటి
శుభఘడియలోన మున్నీటిచూలి, తోయ
జాసన, కమల కరుణా కటాక్ష దృగ్వి
శేషమే చాలు నెనలేని శ్రీలు గురియు!


గురువారం, అక్టోబర్ 08, 2015

సమస్య: అఖిలకవిమాన్యమై యలరారు బూతు!

తేది: ఆగస్టు 20, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము




బూతు పద్యమ్ము లేకున్న రోతురనుచు
సకల జనులను రంజింప శ్రావ్యమయ్యు
నఖిలకవిమాన్యమై యలరారు బూతు
పద్యముల్ కవి చౌడప్ప వ్రాసెఁ, గనుఁడు! 

***          ***          ***

కందపద్యాలఁ బది నీతి కథలుఁ బదియు
బూతులం జెప్పఁగాఁ దానుఁ బూనుకొనియు
సర్వులును మెచ్చ రచియించు చౌడ సుకవి
కఖిలకవిమాన్యమై యలరారు బూతు!




బుధవారం, అక్టోబర్ 07, 2015

సమస్య: భారత యుద్ధమున నయ్యొ పార్థుం డోడెన్!

తేది: ఆగస్టు 20, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



(అశ్వమేధ యాగాశ్వ గ్రహీత బభ్రువాహనుఁ డర్జునుని నిర్జించిన విధమునుం దర్జించుచు ధర్మరాజుతో శ్రీకృష్ణుఁడు పలికిన సందర్భము)



"కోరియుఁ జిత్రాంగదకుఁ గు
మారుఁడు హయముం గొని, పరమాంచితమౌ సౌ
వీరత నర్జునుఁ జంపఁగ,
భారత! యుద్ధమున నయ్యొ పార్థుం డోడెన్!"



మంగళవారం, అక్టోబర్ 06, 2015

సమస్య: కన్నులబ్బెను ఫలమునుఁ గాంచె నెదుట!

తేది: ఆగస్టు 18, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణము శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము





ధౌమ్యుఁ డుపమన్యు గురుభక్తి తత్త్వముఁ గనఁ
గనుఁ బరీక్షించె; నతనికిం గనులు వోయె;
నపుడు గురు వశ్వినులఁ బిల్చినంత; వెసనుఁ
గన్నులబ్బెను! ఫలమునుఁ గాంచె నెదుట!!




ఆదివారం, అక్టోబర్ 04, 2015

సమస్య: చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ!

తేది: జూలై 07, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


["చంద్రహాసుని కథ"నిట ననుసంధానించుకొనునది]


చంద్రహాసునిం దుర్బుద్ధి చంపనెంచి,
"విషము ని"మ్మనె లేఖలో; "విషయ ని"మ్మ
నియును మార్చెను విషయయే రయమునఁ! గన,
చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ!!



శనివారం, అక్టోబర్ 03, 2015

సమస్య: రామకథ విని మురిసెను రాక్షసుండు!

తేది: సెప్టెంబర్ 14, 2015 నాటి శంకరాభరణములోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము




వినయమున రాముఁ జేరి, విభీషణుండు
మిత్రుఁడై భక్తి సేవింప, మిత్రసుతుఁడు
రామకథ నప్డు బహుసుందరముగ వినిచె!
రామకథ విని మురిసెను రాక్షసుండు!!


గురువారం, అక్టోబర్ 01, 2015

సమస్య: భర్తృరహిత సంతుఁ బడసి మురిసె!

తేది: ఆగస్టు 16, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



మత్స్యగంధిఁ గోరి, మౌని పరాశర్యుఁ
డామె కన్నెతనము హతము కాని
వరము నొసఁగి, కలియ, వ్యాసుండు జన్మించె!
భర్తృరహిత, సంతుఁ బడసి, మురిసె!!



బుధవారం, సెప్టెంబర్ 30, 2015

పద్య రచన: అభినవ గిరిధారి!

తేది: ఆగస్టు 16, 2015 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన చిత్రానికి నా పద్య రచనము




గోగణమ్ముఁ గాఁచె గోవర్ధన మ్మెత్తి
ద్వాపరమ్మునందు వ్రజవిభుండు!
వర్షమందు తననె పర్వత ప్రతిమతోఁ
గాఁచెఁ గలియుగానఁ గన నటుండు!!




సోమవారం, సెప్టెంబర్ 28, 2015

సమస్య: రాముఁ డుండు చోటఁ గాముఁ డుండు!

తేది: ఆగస్టు 14, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము





మనసు మనసు కలిసె! మనువాడ మనసయ్యెఁ!
బెద్ద లనుమతింపఁ బ్రేమ యనెడి
విరులుఁ గురిసె! నట్టి ప్రేయసీ హృదయాభి
రాముఁ డుండు చోటఁ గాముఁ డుండు!




ఆదివారం, సెప్టెంబర్ 27, 2015

సమస్య: పసిబాలుఁడు పెండ్లియాడి పడసెఁ గుమారున్!

తేది: ఆగస్టు 12, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



("సిబాల్" అను ఇంటిపేరు గల "శంకర్ సిబాల్" అను యువకుఁడు తాను మెచ్చిన యువతిని వివాహమాడి, కుమారునిం బడసిన వృత్తాంతము)


హసిత వదనుఁడు, వినయుఁడు, వి
కసిత హృదబ్జుండు, ప్రణయ కాంక్షిత వర మా
నసి, వలచిన యువతియె తను
ప, "సిబాలుఁడు" పెండ్లియాడి, పడసెఁ గుమారున్!




శనివారం, సెప్టెంబర్ 26, 2015

సమస్య: శ్రీ రమణీ లలామ నెదఁ జేర్చినవాఁడు శివుండె శంభుఁడే!

తేది: ఆగస్టు 10, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


 




నా మొదటి పూరణము:
మార రిపుండు గోవుగను మారియు, దుగ్ధము నీయకున్నఁ, దా
దారగ చోళభూపతి సుతన్ దగ నెట్టుల పొందునో? కనన్
శౌరికి శ్రీనివాసునకు సాధు జనార్చన వందనాలికై
శ్రీ రమణీ లలామ నెదఁ జేర్చినవాఁడు శివుండు శంభుఁడే!!!


***          ***          ***          ***



నా రెండవ పూరణం:

కూరిమి నా గజాసురుఁడు కోరియు దేవతలన్ మహాపదన్
గూరఁగఁ జేయ, వారు హరు గొబ్బునఁ జేరియు, రక్ష వేడ, నా
గౌరు శిరమ్ముఁ ద్రుంచియుఁ, ద్వగంబరముం గొని, వేగ నిర్వృతి
శ్రీ రమణీ లలామ నెదఁ జేర్చినవాఁడు శివుండె, శంభుఁడే!



శుక్రవారం, సెప్టెంబర్ 25, 2015

సమస్య: బట్టలు లేకుండఁ దిరుగు వాఁడె సుజనుఁడౌ!

తేది: ఆగస్టు 09, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



మట్టిపనిఁ గట్టిపెట్టియు
నట్టులె బట్టలనుఁ గట్టి యట్టిట్టులఁ దా
గట్టులఁ బట్టఁగ మాసిన
బట్టలు లేకుండఁ దిరుగు వాఁడె సుజనుఁడౌ!




గురువారం, సెప్టెంబర్ 24, 2015

సమస్య: పండితుఁ డన నెవఁడు పరమ పామరుఁడు గదా!

తేది: ఆగస్టు 08, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



(పండిత వేషమున నున్న యొక పామరుని మాటల నొక కవి విశ్లేషించుచున్న సందర్భము)


"పాండవు లనఁగాఁ దెలియదె?
దండిగ మంచంపుఁ గోళ్ళ దత్తున మువురం
చుండి"రని, రెండుఁ జూపెడు
పండితుఁ డన నెవఁడు? పరమ పామరుఁడు గదా!




బుధవారం, సెప్టెంబర్ 23, 2015

సమస్య: సంజీవని నంగదుండు సరగునఁ దెచ్చెన్!

తేది: ఆగస్టు 05, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(పింగళి సూరన విరచితమైన ప్రభావతీ ప్రద్యుమ్న కావ్యనాయిక ప్రభావతి. ఆమె తండ్రి వజ్రనాభుఁడు. అతని తమ్ముఁడు సునాభుఁడు. ఆ సునాభుని కూఁతురగు చంద్రవతితో, నామె పెంపుడు చిలుక, యామె ప్రియుఁడగు గదుని వెదుకం బోయి, చిక్కులం దెచ్చుకొనిన విషయమునుం దెలుపుచు, గదుఁడే తన్ను విడిపించినాఁడని నుడివిన సందర్భము)



"మంజువచన! చంద్రవతి! ని
రంజనసఖభటులు పంజరమ్మున నిడ, నా
బంజరమందుం గని, శుక
సంజీవని! నన్ గదుండు సరగునఁ దెచ్చెన్!!"

(...నంగదుండు...> నన్ గదుండు...)



మంగళవారం, సెప్టెంబర్ 22, 2015

సమస్య: భార్య మరణించినంత సంబరము గలిగె!

తేది: ఆగస్టు 05, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము





పరమ గయ్యాళి యైనట్టి పడుచు భార్య
యొక్క సారిగ సౌమ్యయై, నిక్కముగను,
మంచి గుణములతో వెల్గె! మగనికి, "గత
భార్య" మరణించినంత, సంబరము గలిగె!!



సోమవారం, సెప్టెంబర్ 21, 2015

సమస్య: పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చి పుత్రునిఁ గనియెన్!

తేది: ఆగస్టు 03, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము 


(పింగళి సూరన కళాపూర్ణోదయమందుఁ గాళికామాత మహిమ[బ్రహ్మవాక్కు, సరస్వతీవరము]చే సుముఖాసత్తిగ మాఱిన మణిస్తంభుఁడు...మణిస్తంభునిగ మాఱిన సుముఖాసత్తి వలన...గర్భముం దాల్చి, కళాపూర్ణునిం బ్రసవించిన ఘట్టము నిట ననుసంధానించుకొనునది)



తరుణిగ మాఱిన పురుషుఁడు,
పురుషునిగను మాఱినట్టి ముదిత సురతినిన్
మురియఁగఁ; దరుణిగ మాఱిన
పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చి పుత్రునిఁ గనియెన్!



ఆదివారం, సెప్టెంబర్ 20, 2015

సమస్య: ఈఁగ పడిన పాలు హిత మొసంగు!

తేది: ఆగస్టు 02, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము





రోగముక్తుఁడైన భోగికి నీయంగఁ
బుష్టికరమునయ్యు, నిష్టపడెడు,
కమ్మనయ్యు, నొక్క కలశాన, నొక్క గో
వీఁగ, పడిన పాలు, హిత మొసంగు!
(గోవు+ఈఁగ [=గోవు ఈయఁగా], కలశాన-పడిన-పాలు, హిత మొసంగు...నని అన్వయము)





శనివారం, సెప్టెంబర్ 19, 2015

సమస్య: జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్!

తేది: ఆగస్టు 01, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము





(లంఘనమన్న పదమునకున్న నానార్థముల నెఱుఁగమి నేర్పడిన యనర్థము)



జ్వరమునకు లంఘనమ్మే
పరమౌషధ మనఁగ వినియు వైళమ చనియున్
సరసత నెఱుఁగక మూర్ఖుఁడు
జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్!



శుక్రవారం, సెప్టెంబర్ 18, 2015

సమస్య: హరి కరుణా కటాక్షములకై తపియింతురు క్రైస్తవుల్ సదా!

తేది: జులై 31, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము







దరిసెన మందఁ గోరి నిరతమ్మును హిందువు లంద ఱెప్డు శ్రీ
హరి కరుణా కటాక్షములకై తపియింతురు! క్రైస్తవుల్ సదా
యిరవుగ సిల్వఁ దాల్చి ప్రభు యేసునుఁ గొల్తురు! మహ్మదీయులున్
స్థిరత నమాౙుఁ జేసెదరు దీనులఁ బ్రోవ మసీదు లోపలన్!





గురువారం, సెప్టెంబర్ 17, 2015

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః !

సుకవి పండిత మిత్రులకు, బ్లాగు వీక్షకులకు
వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు!



స్వాగత వృత్తము:
శ్రీ గణేశ! ఘన చిత్సుఖ దాతా!
శ్రీ గిరీశ సుత! శ్రేష్ఠ! వరిష్ఠా!
యోగి రాడ్వరద! యోగ విశేషా!
స్వాగత ప్రమథ వర్గ! నమో ఽహమ్! (1)


ప్రమాణి వృత్తము:
గజాననా! ఘనాకృతీ!
ప్రజావళి ప్రమోద! స
ద్ద్విజ స్తుత! స్థిరా! చతు
ర్భుజా! నమో ఽస్తు తే ఽనిశమ్! (2)


ప్రణవ వృత్తము:
హేరంబా! మిత హిత సంతోషా!
గౌరీ నందన! కరి మూర్ధన్యా!
సూరి ప్రాకట శుభ సంశ్లోకా!
భూరి క్షత్ర! విముఖ! వందే ఽహమ్! (3)


శాలినీ వృత్తము:
సారాచారా! నీత సత్పుణ్య దాతా!
పారాశర్యామోద బాష్పోత్సుకా! క్రౌం
చారి భ్రాతా! భూరి సమ్మోద పాత్రా!
ధీర స్తుత్యా! హే ద్విదేహ ప్రభాసా! (4)


వంశస్థము:
నమో నమో విఘ్న వినాశకాయ తే!
నమో విచిత్రాయ! వినాయకాయ తే!
నమః పవిత్రాంచిత నామకాయ తే!
నమో సదాదాన! ఘనాయ తే నమః! (5)


వన మయూరము:
హేరుక! భవాత్మజ! మహేంద్ర నుత గాత్రా!
ధీర! సుముఖ! ప్రముఖ! దివ్య దరహాసా!
ఘోర తర సంసృతి వికూప తరణాప్తా!
చారు రుచి దంత కులిశ ప్రహరణాఢ్యా! (6)


స్రగ్విణీ వృత్తము:
పార్వతీ నందనా! భారతోల్లేఖనా!
సర్వ గర్వాపహా! ఛాత్ర విద్యోదయా!
ఖర్వ విఘ్నోన్నతా! కార్య సిద్ధిప్రదా!
శర్వ పుత్రాగ్రజా! శాంత మూర్తీ! నమః! (7)


ఇంద్ర వంశము:
జీవేశ! సర్వోత్తమ! చేతన ప్రదా!
దేవ స్తుతా! శాంకరి! ధీ విశేష! ది
వ్యా! విశ్వ సంపూజిత! వక్రతుండ! ఢుం
ఠీ! వేద వేద్యా! ఘన తేజ! తే నమః! (8)


భుజంగ ప్రయాతము:
ద్విపాస్య! త్రి ధామ! త్రిధాతు! ప్రసిద్ధా!
సుపర్వ ప్రమోదా! శుభాంగా! వృషాంకా!
కపి త్థాత్త సంపృక్త భుక్త ప్రహృష్టా!
కృపాంభోధి! కుబ్జాకృతీశా! నమస్తే! (9)


(శుభం భూయాత్)




బుధవారం, సెప్టెంబర్ 16, 2015

సమస్య: సతి చావునకునుఁ గతమయె శంకరుఁడు గదా!

తేది: జులై 30, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(ఆర్యసమాజావిష్కృతిచే...సత్యార్థప్రకాశ రచనముచే...దయానంద సరస్వతిగా పేరుగడించిన మూలశంకరుని వృత్తాంతము నిట ననుసంధానించుకొనునది)



యతియయె! సత్యార్థము స
మ్మతితోఁ జెప్పె! ఘన వటుఁడు!మతిమంతుండై
సతత మతి చలిత మోహపు
సతి చావునకునుఁ గతమయె శంకరుఁడు గదా!



ఆదివారం, సెప్టెంబర్ 13, 2015

సమస్య: పాయసమున నుప్పు కలుపఁబడఁ దీయనయౌ!

తేది: జులై 28, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణము శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము





తీయని చక్కెర నిడకయె,
పాయసమున నుప్పు కలుపఁబడఁ, దీయన యౌ
నా?
యశముం గాకయె, యెటు
ధ్యేయమ్మగు నపయశమ్ము, ధీరుల కెపుడున్??




శనివారం, సెప్టెంబర్ 12, 2015

సమస్య: తండ్రు లేవురు గల రండ్రు ధరను బుధులు!

తేది: జులై 27, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు




నా మొదటి పూరణము:
కన్నవాఁ, డుపనేత, శిక్షకుఁడు, నన్న
దాతయుం, భయత్రాతయుఁ దఱచి చూడఁ
దండ్రు లేవురు గల రండ్రు ధరను బుధులు!
శంకరాభరణోత్కృష్ట! శంకరార్య!!




పై పూరణమునందు నాకు ఆధారమైన  శ్లోకమిది:
జనితా చోపనేతా చ, యశ్చ విద్యాం ప్రయచ్ఛతి, |
అన్నదాతా భయత్రాతా, పంచైతే పితరః స్మృతాః ||

***        ***        ***        ***




నా రెండవ పూరణము:
కన్నవాఁడును, నిల్లాలి కన్నతండ్రి,
వడుగుచేసినవాఁడు, గురుఁడును, నన్న
యంచు గణనసేయఁగఁ గొనియాడఁబడెడి
తండ్రు లేవురు గల రండ్రు ధరను బుధులు!


శుక్రవారం, సెప్టెంబర్ 11, 2015

సమస్య: బ్రాహ్మణుండు కాకి పలలముఁ దిను!

తేది: జులై 26, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు (ప్రహేళికా రూపమున) నా పూరణము




విరామచిహ్నముల నుంచకముందు:
కొమ్మనుండుఁ గ్రోఁతి కోరిన సిరులిచ్చు
లచ్చి యేడ్చు శిశువు మెచ్చు మధువు
తేఁటి మంత్రములును దీపింపఁ బఠియించు
బ్రాహ్మణుండు కాకి పలలముఁ దిను!



ఈ దిగువ నున్నది చదవండి:



విరామచిహ్నముల నుంచిన పిదప:
కొమ్మనుండుఁ గ్రోఁతి; కోరిన సిరులిచ్చు
లచ్చి; యేడ్చు శిశువు; మెచ్చు మధువు
తేఁటి; మంత్రములును దీపింపఁ బఠియించు
బ్రాహ్మణుండు; కాకి పలలముఁ దిను!






బుధవారం, సెప్టెంబర్ 09, 2015

సమస్య: రక్తదానమ్ముఁ జేయుట రాక్షసమ్ము!

తేది: జులై 22, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము




ఒకఁ డెయిడ్స్ వ్యాధి పీడిత ప్రకటుఁ డయ్యుఁ
దక్కు వారినిం దనవలెఁ దల్లడిల్లఁ
జేయఁగా నెంచి వైద్యులఁ జీరి తనదు
రక్తదానమ్ముఁ జేయుట రాక్షసమ్ము!



సమస్య: మాధవుఁడు సారథియయె సుయోధనునకు!

తేది: జులై 20, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము





ముందుగనుఁ జూచితంచు గోవిందుఁ డపుడు
కోర్కిఁ దీర్పంగఁ జనె! గొంతి కొమరునకును
మాధవుఁడు సారథియయె! సుయోధనునకు
యాదవుల సైన్య మొసఁగియు హర్షమందె!!




శనివారం, సెప్టెంబర్ 05, 2015

సమస్య: పాపాత్ములె పూజ్యులగు నుపాధ్యాయు లిలన్!

ఉపాధ్యాయ మిత్రులకు, సుకవి మిత్రులకు, బ్లాగు వీక్షకులకు
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!





దీనికి నా పూరణము:

కోపించుచు శిక్షించెడి
పాపాత్ములె పూజ్యులగు నుపాధ్యాయు లిలన్?
దీపించెడి జ్ఞానమ్మును
రూపింపఁగ శాంతి నెంతురు గదా వారల్!


గురువారం, సెప్టెంబర్ 03, 2015

సమస్య: రహమాన్ జేసెనఁట పుష్కర స్నానమ్మున్!

తేది: జులై 19, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము




మహి హిందువైనఁ గృష్ణయ
మహితుం డల్లాకుఁ జేసె మాన్య నమాౙున్!
సహనము మతమునఁ ౙూపుౘు
రహమాన్ జేసెనఁట పుష్కర స్నానమ్మున్!!



బుధవారం, సెప్టెంబర్ 02, 2015

సమస్య: గిరిజాపతి వానరుఁడయి కిచకిచలాడెన్!

తేది: జులై 18, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము




హరి నరునిగ బెరయంగను
హరి హితవరి కరము దనరి హరి హరి యనుచున్
గరువలి వరమున హరుఁ డా
గిరిజాపతి వానరుఁడయి కిచకిచలాడెన్!





మంగళవారం, సెప్టెంబర్ 01, 2015

సమస్య: అరకులోయలోఁ గలదు భద్రాచలమ్ము!

తేది: జులై 17, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము





ధింస నృత్యమ్ముఁ జేయు నాదిమతెగ యట
నరకులోయలోఁ గలదు! భద్రాచలమ్ము
లోన నాదివాసుల నృత్యమే నవకము!
మేడవరపుఁ గోయల నాట్య మెంత ఘనము!!




సోమవారం, ఆగస్టు 31, 2015

సమస్య: గుణ హీనుం డైనవాఁడె గురు వన నొప్పున్!

తేది: జులై 16, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము





ప్రణిధానైశ్వర్యుండున్,
గణనఁ గనిన బ్రహ్మసూత్ర గరిమాది నిమం
త్రణ షట్ఛాస్త్రజ్ఞుఁ, డస
ద్గుణ హీనుం డైనవాఁడె గురు వన నొప్పున్!