Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, అక్టోబర్ 02, 2019

మరుగునపడిన మహావీరుడు - లాల్ బహాదూర్ శాస్త్రి

మిత్రులందఱకు
స్వర్గీయ లాల్ బహాదూర్ శాస్త్రి జయంతి
శుభాకాంక్షలు!
hd image of lal bahadur shastri కోసం చిత్ర ఫలితం

భరత చరితమ్మునందున వరయుతమగు
వీరతను పతాకస్థాయిఁ జేరనిడిన
వీరవరుఁడైన లాల్ బహాదూరు శాస్త్రి
మఱుఁగుపడినట్టి యొకగొప్ప మానిక మయ!

ఉత్తరప్రదేశమ్మున నుదయమంది
చిన్ననాఁటఁ దండ్రియె కీర్తిశేషుఁడగుడు
మేనమామల యింటను బానిస వలె
నొక యనాథ పగిదిని జీవికఁ గొనెనయ!

చదువుకొనుటకై తాను దినదిన మొక్క
నదిని రెండుమాఱులు నీఁది మదినిఁ గుంది
చదువు సాఁగించి విద్యలో నెదుగఁగాను
మక్కువనుఁ జూపినట్టి సామాన్యుఁడతఁడు!

గాంధిమార్గమ్మునకును నాకర్షితుఁడయి,
తనదు సిద్ధాంతములనెప్డు తప్పకుండ,
కులమతాతీతుఁడుగఁ దనకున్న యింటి
పేరుఁ బేర్కొనకున్నట్టి విజ్ఞుఁడతఁడు!

నిజమునకు శాస్త్రి యనునది నిరుడు చదువు
కొన్న కాశి విద్యాపీఠ గురుతరమగు
పట్టయే గాని, యది కులవాచి గాదు!
పిదప గృహనామముగ నది యొదవెనయ్య!

తాను స్వాతంత్ర్యసమరానఁ బూని పాలుఁ
గొనియుఁ జెఱనుండియునుఁ జదువును విడచిన
యట్టి త్యాగియుఁ దానయ్యు నా పిదపను
దనదు చదువును సాఁగించి ఘన యశుఁడయె!

ఎఱ్ఱకోటపై మన జెండ నెగురవేయఁ
జనఁగను బ్రిటిషువార లాపినతఱి తను
వారి కాళ్ళసందున నుండి దూరి యేఁగి
భరత కేతనోన్నయ దేశభక్తిఁ జాటె!

భరత దేశమ్మునకు స్వేచ్ఛదొఱకిన తఱి
యెన్నియో పదవులనుఁ జేకొన్నఁ గాని,
గర్వముం జూపఁ బోక నిగర్వియయ్యు
నెహ్రు పిదపఁ బ్రధానిగా నెఱపెఁ బదవి!

రైల్వె మంత్రిగా నుండ వఱలిన గొప్ప
దగు ప్రమాదమ్మునకును బాధ్యత వహించి
పదవికిని రాజినామాయె పఱఁగఁజేసి,
యదియ తనదు వైఫల్యమటంచు నుడివె!

కార్యదక్షత, ధైర్యమ్ము, ఘనగుణయుత
నైతికత, సత్యపాలన, నవ్య గరిమ,
జై జవాన్ జై కిసాన్ సుఘోషణము లతని
మాన్యునిం జేసి దివ్య సన్మాన మిడెను!

ఉన్నతమ్మైన పదవినిం గొన్నయతఁడు
చిన్న యింటినిఁ గూడ నార్జింపకునికి,
తన నిరాడంబరత్వమ్ము జనమునకునుఁ
జాటి నిలిపెను నేతగ సాదరమున!

నీతియును నిజాయితి గల నియమయుతుఁడు
సోవియట్ భూమి దౌత్య సంస్తుతుల నొంది
నట్టి సమయాన హృచ్ఛూల నంది, పిదప
స్వర్గతుండయ్యు సుజన హృచ్ఛయుఁడునయ్యె!

ఇట్టి మహనీయుఁడైనట్టి హితవరుండు
జనమనమ్ముల వెలుఁగుచు సతత మిలను
బాగుపఱుపంగఁ దలఁచెనో పఱఁగ నతని
నాదు మనమునఁ దలఁతు వినమ్రుఁడనయి!

స్వస్తి


2 కామెంట్‌లు:

  1. పద్యాలు బాగున్నాయి. అయితే రైలు ప్రమాదం జరిగితే రాజీనామా చేయడం సరికాదు. ఎక్కడలోపముందో గుర్తించి పునరావృతం కాకుండా చూడాలి. అది బాధ్యత తీసుకున్నట్టు అవుతుంది. రాజీనామాలు చేస్తూ పోతే ఎలా.

    రిప్లయితొలగించండి
  2. ప్రమాదం జరిగేది ముందుగా మనం తెలుసుకోలేముగదా! ప్రమాదం జరిగింది. దానిని పునరావృతం కాకుండా చూచుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయడంతోపాటుగా, దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు!ఈకాలంలో ఎందరున్నారండీ ఇలాంటివారు? బాధ్యతను గుర్తించడంతోపాటుగా ఇలాంటి సంఘటనలు పునరావృతంకాకుండా తగు జాగ్రత్తలు సూచించిన తర్వాతనే రాజీనామా చేసిన త్యాగమూర్తి ఆయన!
    స్పందించి అభినందనలు తెల్పిన మీకు మనఃపూర్వక ధన్యవాదాలండీ!

    రిప్లయితొలగించండి