Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, డిసెంబర్ 05, 2015

సమస్య: రాములందు గొప్ప రాముఁ డతఁడు!

తేది: సెప్టెంబర్ 21, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణములు




నా మొదటి పూరణము:



ఒక సతి యొక మాట యొక బాణ నినదుఁడై
యుండుఁ గాని యొండు నువిదఁ గనఁడు;
రమణిఁ జెఱనుఁ బెట్టు రావణా దీంద్రియా
రాములందు గొప్ప రాముఁ డతఁడు!



***      ***      ***




నా రెండవ పూరణము:



పరశురాముఁడు, మఱి, బలరాముఁడైనచో
జననిఁ జంపువాఁడె! యని విముఖుఁడె!
మాతృహంత క్షాత్రమార్గోత్సృజులగు నా
రాములందు గొప్ప రాముఁ డతఁడు!!

(ఈ పై పూరణలో అన్వయం బాగా లేనందున, దశరథరాముని ప్రస్తావన లేనందున...
దానిని ఈ క్రింది విధంగా సవరిస్తున్నాను)



సవరించిన పూరణము:
పరశురాముఁడు, మఱి, బలరాముఁడైనచో
జననిఁ జంపువాఁడె! యని విముఖుఁడె!
తప్పు లేనివాఁడు దశరథ రాముఁడే!
రాములందు గొప్ప రాముఁ డతఁడు!!



26 కామెంట్‌లు:

  1. మధుసూదన్ గారు...బలరాముడు జనని ని చంపువాడు అది ఎలా అయింది... అలాగే క్షాత్రమార్గోత్సృజులగు అంటే ఏమిటో కొంచెం సెలవివ్వండి

    రిప్లయితొలగించండి
  2. వంశీ గారూ!

    పై మొదటి పాదమునకు రెండవ పాదము సమాధానము.
    పరశురాముఁడు ...జననిఁ జంపువాఁడు; బలరాముఁడు...అని (కురుక్షేత్ర యుద్ధము) విముఖుఁడు. అదే విధముగ...
    మాతృహంత క్షాత్రమార్గోత్సృజులు...
    మాతృహంత...పరశురాముఁడు
    క్షాత్ర మార్గ ఉత్ సృజుఁడు...క్షత్రియ మార్గమైన యుద్ధమును విడచినవాఁడు...బలరాముఁడు
    ఈ ఇద్దరు రాములకన్న గొప్ప రాముఁడు...శ్రీరాముఁడు!

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రులు మధుసూదన్ గారూ,
      మీ పద్యంలో పరశురామ బలరాముల నిద్దరను స్మరించారు. వారిని ప్రథమపాదంలో ప్రస్తావించి ద్వితీయపాదంలో వారి లోపాలను తక్క్రమంలో పేర్కొన్నారు. తృతీయ పాదాంతం‌ నుండి చతుర్థపాదంలోనికి వచ్చిన ప్రస్తావన 'ఆ రాములందు' అని పేర్కొన్న విభక్తి ప్రకారం మీరు స్మరించిన ఇద్దరు రాములయందు అని అర్థం వస్తున్నది కదా అని నా శంక. మీరు దశరథరాముని ప్రస్తావన చేయకుండానే ఆయనను మిగిలిన ఇద్దరికన్నా అన్న అర్థం వచ్చేలా సమర్థంచటం‌జరిగినట్లు తోచదు. ఆలోచించగలరు.

      తొలగించండి
  3. నిజమే శ్యామలరావుగారూ! మూడవ పాదంలో దశరథ రాముని ప్రస్తావన తెస్తే సరిపోతుంది.
    పరశురాముఁడు, మఱి, బలరాముఁడైనచో
    జననిఁ జంపువాఁడె! యని విముఖుఁడె!
    తప్పు లేనివాఁడు దశరథ రాముఁడే!
    రాములందు గొప్ప రాముఁ డతఁడు!!

    ఇప్పుడు సరిపోయినదో లేదో తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రశస్తంగా ఉంది. పనిలో పనిగా ఇతఃపూర్వం ఉన్న కించిత్తు పునరుక్తి కూడా తొలగింది. ముఖ్యంగా పద్యం‌ మరింత సరళంగా హృద్యంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. పద్యం సరళంగా మారింది కాని కాస్త continuity మిస్స్ అయింది అనిపించింది మొదటి 2 పాదలు చివరి 2 పాదాలు మధ్యలొ సన్నటి సూది లాంటి connection మాత్రమే వుంది అనేది నా అభిప్రాయం . నా అన్యభాష వాడుకను క్షమించండి

      తొలగించండి
  4. వంశీ గారూ!

    వారిద్దరూ ఇలాంటివారు. దశరథ రాముడు ఇలాంటివాడు కాడు. కాబట్టి ఇతడు రాములలో గొప్ప రాముడు.

    ఇందులో continuity ఎక్కడ దెబ్బతిన్నదండీ! పరిశీలించండి... తెలపండి.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్షమించాలి...నేను అనుకున్నది వేరు ముందు చేసిన పూరణమునకు దశరథ రాముడు అని జోడించిన తర్వాత వచ్చిన connection చాలా clear గా వుంది అనేదే నా అభిప్రాయము. ఈ విషయములో శ్యామలరావు గారితో ఏకీభవిస్తున్నాను అని చెప్పటమే నా ఉద్దేశము

      తొలగించండి
    2. సంతోషం వంశీగారూ!

      ఇప్పుడు చూడండి. దీనిని పంచపాదిగా మార్చాను.

      పరశురాముఁడు, మఱి, బలరాముఁడైనచో
      జననిఁ జంపువాఁడె! యని విముఖుఁడె!
      తప్పు లేనివాఁడు దశరథ రాముఁడే!
      మాతృహంత క్షాత్రమార్గోత్సృజులగు నా
      రాములందు గొప్ప రాముఁ డతఁడు!!

      దీనిని చూచి మీ అభిప్రాయం తెలపగలరు. స్వస్తి.

      తొలగించండి
    3. మిత్రులు మధుసూదన్ గారూ, రెండు మాటలు. మొదటిది - దయచేసి ఎవరూ‌ నొచ్చుకోకండి - కవిగారు పాఠకులతో చర్చలో కూర్చుని పద్యాన్ని సవరిస్తూ‌ పోతుంటే, పద్యశిల్పమూ‌ పద్యంలో పాకమూ పద్యపుశయ్యా అన్నీ చెడే ప్రమాదాలున్నాయి. (ఈ సాంకేతికాలు కొందరికి అర్థంకాకపోతే మన్నించండి. వాడక తప్పక వాడాను) కాబట్టి పద్యాన్ని ధారలోనే ఉంచండి - ఇంక చెక్కకండి. రెండవసంగతి, మీరు చేసిన ప్రస్తుత మార్పు పంచపది కావటం‌ ఇబ్బంది కాదు కాని మళ్ళీ తుది పాదంలో విభక్తి ఇబ్బందుల్లో‌ పడింది. ఎందు వలన అంటే, 'రాముల కన్న' బదులు 'రాముల యందు' అని ఉండటం కారణంగా అన్వయదోషం‌ కలుగుతున్నదని అనిపిస్తున్నది. 'యందు' అన్న ప్రత్యయం ఎలాగు ఒప్పదో‌ ముందే మనం చర్చించుకున్నాం కాబట్టి మళ్ళా ప్రస్తావించను.

      తొలగించండి
  5. రిప్లయిలు
    1. ఇందులో 4వ పాదం చివర అగు బదులు ఆది వస్తె నూటికి నూరు పాలు స్వచ్చంగ వుంటది. నేను వృత్తి రిత్యా ఇంజినీర్ ను. లాజిక్ మాత్రమే తెలుస్తుంది. మా ఊహ పరిమితం మీ ఊహ అనంతం మొదటి పూరణము లొ రావణుని ఇంద్రియాది రాముడు గ పొల్చడము అధ్భుతము గ వుంది మీ వరకు నా మనసు ఎదగాలని కోరుకుంటున్నాను.

      తొలగించండి
    2. వంశీగారూ! ఆటవెలదిలో పంచపాది వీలుపడదు. మీరన్నట్టుగా ముందు పూరణమును, తరువాతి సవరించిన పూరణమును ఒకచోట చేర్చినట్టయితే ఎంత అనర్థం కలుగుతుందో ప్రయత్నపూర్వకంగా ఈయటం జరిగింది. మీరు స్పందించినా జరిగిన అనర్థాన్ని తెలుసుకోలేకపోయారు. మిత్రులు శ్యామలరావుగారూ, సుకవి మిత్రులు డా.విష్ణునందన్ గారూ జరిగిన ప్రమాదంపై స్పందించారు. అంటే...నా రెండవపూరణలోని మూడవపాదాన్ని తొలగించి, దశరథరాముని ప్రస్తావన తెచ్చిన పూరణ అన్ని విధాలా సరిపోయినా...మీరు పాత connection కోసం ఆరాటపడగా...నేను మీకు అర్థం కావడానికే ఆ పంచపాదిని రాసి, అది సరిగాలేదనిపించాలని అనుకున్నాను. కాని, ఈ లోపున జరుగవలసిన అనర్థం జరిగిపోయింది. పోనీయండి...పంచపాదిలో నాలుగవపాదాన్ని తొలగిస్తేనే బాగున్నట్లుంది కదా మీకు! ఇకపోతే...మీరు చివరగా చెప్పిన సవరణ ప్రకారం నాలుగవ పాదం మార్చినా సరిపోదు. నిజానికి...ఈ నాల్గవపాదమే తీసివేయాలి. ఆటవెలదిలో పంచపాది రాదు. అందుకని మీరు నేను చేసిన దశరథరామునితో చేసిన మూడవపాదముతో కూడిన పూరణమును ఆమోదించగలరు. స్వస్తి.

      తొలగించండి
    3. మొదటగా నేను మిమ్ములను మన్నించమని అడగాలి. కాని అడగను మన్నించకండి.ముందే నేను అది చూడవలిసింది తప్పిదము చూడగానే స్పందించిన మిత్రుల కవితా ప్రేమను చూడగలిగాను నాకునూ కొంత అర్ధం అయ్యింది. Thankyou

      తొలగించండి
  6. సత్కవివరులు - శ్రీ గుండు మధుసూదన్ గారూ, సమస్యకు రెండవ పూరణం వరకు , శ్రీ శ్యామలీయం గారితో ' కొంతవరకూ ' ఏకీభవిస్తూ , మరి రెండు మాటలు. ప్రథమంగా , మొదట సవరించిన పద్యం నిర్దోషమైనది. భావము సుగమం. పద్యం సలక్షణం. కనుక దానికి సవరణలక్కర లేదు.
    రెండవది సమపాదులైన వృత్త రీతులూ , ఇతరేతర తేటగీతులను పాద బాహుళ్యంతో కొనసాగించినటుల - విషమ పాది యైన ఆటవెలదిని ' పంచపాది ' గా మార్చకూడదన్న నియమం మీకు తెలిసినదే ! కనుక ఈ రెండవ సవరణ ఉపసంహరించిన మేలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ విష్ణునందనులకు నమస్కారాలతో - ఆర్యా, మీరు చేసిన సూచనలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా, ఈ విషమపాది నియమం సంగతి చక్కగా ప్రస్తావించారు. ఒక్క ప్రశ్న, రెండేసి పాదాల చొప్పున ఆటవెలదిని పొడిగించుకుంటూ పోవచ్చునా అన్న విషయం వివరించ గోరుతాను. మీకు అభ్యంతరం లేని పక్షంలో, వీలు వెంబడి నా శ్యామలీయం బ్లాగులో 'పాహిరామప్రభో' శీర్షికన వస్తున్న పద్యాలను దయచేసి పరామర్శించ వలసింది. అందరి సౌలభ్యంకోసం ప్రస్తుతం వ్రాస్తున్న విశేషవృత్తాల కోసం ఒక Tab ఉంచాను. విశేషవృత్తాలు . వీలువెంబడి అనేక విశేషవృత్తాలను ఉపయోగించాలని నా ఉద్దేశం. ఇంతకు ముందు సాధారణవృత్తాలలో సుమారు 300 వరకూ పద్యాలు వ్రాసాను ఇదే శీర్షికన. అవి కూడా పునః ప్రచురణ చేస్తాను వీలు వెంబడి.

      తొలగించండి
    2. సుకవివర్యులు డా. విష్ణునందన్ గారూ! మీరు నా బ్లాగులోనికి రావడం నాకు మహద్భాగ్యంగా భావిస్తున్నాను. మీరు చెప్పిన విషయం నూటికి నూరుపాళ్ళూ యథార్థం. నేను వంశీగారికి ప్రయోగపూర్వకంగా తెలుపాలనే అనుకొని ఆ పంచపాది ప్రయోగం చేసి, వారి అభిప్రాయంకోసం చూస్తుండగానే ఈ దోషం మీ దృష్టిలో పడింది. నేను స్పందించడానికి, సవరించడానికి తగిన సమయం లేకపోయినందున ఉదయమే సవరించబడవలసిన పద్యము...ఇప్పటిదాకా సవరణకు నోచుకోకపోవడం దురదృష్టకరం. పాఠశాలకు పోయినదగ్గరనుండి ఇంటికి వచ్చునంతవరకు అంతర్జాలం ఉపయోగించకూడదని (ప్రభుత్వోపాధ్యాయులు మాత్రమే) ఉత్తర్వులు ఉన్నందున నేను సవరించలేకపోయాను. నేను ఉదయం తొమ్మిది గంటలకే వంశీగారికి అలా ఉండడం వల్ల జరిగే అనర్థాన్ని తెలిపి సవరించి ఉంటే, మీవంటివారి దృష్టి ఆ దోషముపై పడకుండేది. తమరు స్పందించి తగిన సూచనలీయడం సంతోషదాయకం. నాలుగవపాదం పరిహరణీయమే. తొలగిస్తున్నాను. ధన్యవాదాలతో....నమస్సులు.
      **********************
      మిత్రులు శ్యామలరావుగారూ, పంచపాదిలో నాలుగవ పాదం ఉండడం వల్ల మీరన్నట్టు విభక్తి సంబంధిత అన్వయ దోషమే కాకుండా విషమపాది నియమ భంగం కూడా కలుగుతుందనే విషయం వంశీగారికి తెలిపే ఉద్దేశంతోనే పంచపాదిని ఉదాహరించి, తదుపరి దానిని వంశీగారితోనే బాగా లేదనిపించి సవరించాలనుకున్నాను. ఫలితం...ఇదీ! స్పందించి వ్యాఖ్య పెట్టినందుకు కృతజ్ఞతలు.
      మరో విషయం....మీరు "విశేషవృత్తాలు" అని లింకును చేర్చారు. దానిని వ్యాఖ్యలలో ఎలా చేర్చవచ్చో సవివరంగా తెలుపగలరు. ధన్యవాదములతో...నమస్సులు.

      తొలగించండి
    3. రెండవసారి చేసిన సవరణను ఉపసంహరించుకొంటూ...మొదటి సవరణనే ఇక్కడ ప్రకటిస్తున్నాను:

      పరశురాముఁడు, మఱి, బలరాముఁడైనచో
      జననిఁ జంపువాఁడె! యని విముఖుఁడె!
      తప్పు లేనివాఁడు దశరథ రాముఁడే!

      రాములందు గొప్ప రాముఁ డతఁడు!!

      స్వస్తి.

      తొలగించండి
  7. మిత్రులు మధుసూదన్ గారూ, మీ‌ ఆంతర్యం గ్రహించలేక పోయినందుకు క్షంతవ్యుడను.
    మీరు లింకును కేవలం text వలె కాకుండా నేను చూపినట్లు click చేయటానికి వీలుగా ఇవ్వంటం సులభమే. వఈ విధానం గమనించండి:
    X a href = "http://syamaliyam.blogspot.in/p/blog-page_3.html" Y విశేషవృత్తాలు X /a Y
    గమనిక: X బదులు < అనీ Y‌ బదులు > అనీ‌ type చేయండి. నేను అలా చేసినట్లైతే పై సమాచారం లింకుగా మారిపోయి మీకు వివరం తెలిసేది కాదు కదా. అందుకే ఇలా చూపవలసి వచ్చింది.

    పైన చూపిన దానిలో "...." అంతా లింకు అడ్రసు. విశేషవృత్తాలు అని వ్రాసాను చూసారా అక్కడ మీరు ఏమి వ్రాయదలచుకున్నారో అది వ్రాయండి. ప్రయత్నించండి సులువే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రులు శ్యామలరావుగారికి ధన్యవాదాలు! ఎంతో అమూల్యమైన సాంకేతికాంశాన్ని నాకందించారు. కృతజ్ఞుడను.

      తొలగించండి
  8. బండిరాముడొకడు బలరాముడొక్కడు
    కండ బలము చూపి కలియబడిరి
    బలము కలిగినట్టి బలరాముడే నెగ్గె
    రాములందు గొప్ప రాముఁ డతఁడు!

    రిప్లయితొలగించండి
  9. బండిరాముడొకడు బలరాముడొక్కడు
    కండ బలము చూపి కలియబడిరి
    బలము కలిగినట్టి బలరాముడే నెగ్గె
    రాములందు గొప్ప రాముఁ డతఁడు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుకవి మిత్రులు కొడవంటి సుబ్రహ్మణ్యం గారూ!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి