Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఏప్రిల్ 16, 2015

దత్తపది: మామ-అత్త-బావ-వదిన...భారతార్థంలో...నచ్చిన ఛందం...

తేది: నవంబర్ 17, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన
మామ - అత్త - బావ - వదిన....పదాలను ఇచ్చి
స్వార్థంలో ఉపయోగించకుండా
భారతార్థంలో
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన రెండు తేటగీతులు మఱియు ఒక చంపకమాల పద్యము


నా మొదటి పూరణము:




(కురుసభలో్ శ్రీకృష్ణుఁడు ధృతరాష్ట్రునితోఁ బలికిన సందర్భము)

"మామ! మామకోక్త విషయమై త్వదీయ
సుతులు బంధింప నాయత్తకృతులునైరి!
కాన, మిముఁ బావనులఁ జేయు క్రమములోని
దీ విరాడ్రూపముఁ గనవ! దినకరసమ!"




నా రెండవ పూరణము:




(శ్రీకృష్ణుఁ డర్జునుని యుద్ధమునకై పురికొల్పు సందర్భము)

"చూపుమా మహాశౌర్యప్రతాపములను!
యుద్ధమాయత్తమాయె, నో యిద్ధచరిత!
బాడబావహ్నికీలోగ్రభాసమాన!
నీవ దినమణి సుతునోర్చ నెగడు యశము!"




నా మూఁడవ పూరణము:




(సంజయుఁడు ధృతరాష్ట్రునకు కురుక్షేత్రమందు యుద్ధమెటుల జరుగుచున్నదో వివరించు సందర్భము)

ఇది వినుమా మహోగ్రతర హింస్ర యుతాంచిత హేతివాదరల్
కదనమునందుఁ ద్రుంచ క్షతగాత్ర విరోధి గతాత్త రోషముల్
వదన సరోవరాంబక వివర్ణ సమాక్రమితమ్మయెన్ బయిన్
జదలది యెఱ్ఱఁబాఱినది సాంధ్యనుఁ బావనమౌ దివిప్రసా
ద దినపరాస్తతావదినదర్శితమయ్యెను సంగరమ్మునన్!




బుధవారం, ఏప్రిల్ 15, 2015

సమస్య: ఛంద మెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్

తేది: నవంబర్ 16, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణములు:



నా ప్రథమ పూరణము:



(చిత్రకారుఁ డొకఁడు తన నేర్పునుపయోగించి శార్దూల చిత్రమునుం జిత్తరువున వ్రాసిన సందర్భము)

అందముగనుఁ జిత్తరువున
సుందరుఁడగు చిత్రకార సుకరుం డొకఁడున్
డెందమున సంతసించుచు
ఛంద మెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్!!




నా ద్వితీయ పూరణము:




(ఒక యాంగ్లేయ బాలకుఁడు తెలుఁగున "శార్దూలము" అనెడి పదమును వ్రాయఁబ్రయత్నించు సందర్భము)

అందముగ నాంగ్ల బాలుఁడు
విందుగఁ దెలుఁగుననుఁ దాను వింత యెసఁగఁగన్
బొందిక పదముల లేఖన
ఛంద మెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్!



మంగళవారం, ఏప్రిల్ 14, 2015

సమస్య: బాలల దినోత్సవము పెద్దవారి వేడ్క

తేది: నవంబర్ 14, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:







పిల్ల లందఱిలోన నా బిడ్డఁ డొకఁడె
వెలిఁగిపోవంగ వలెనని ప్రీతితోడఁ
గాంచెదరు తల్లిదండ్రులు! కనుకనె యగు
బాలల దినోత్సవము పెద్దవారి వేడ్క!!





ఆదివారం, ఏప్రిల్ 12, 2015

నిషిద్ధాక్షరి: రేఫము, శకటరేఫము నిషిద్ధము...రామాయణ ప్రాశస్త్య వర్ణన...తేటగీతి పద్యంలో...

తేది: నవంబర్ 13, 2014 నాటి శంకరాభరణంలోని నిషిద్ధాక్షరి శీర్షికన ఈయబడిన
అంశం- రామాయణ ప్రాశస్త్యము
నిషిద్ధాక్షరములు - రేఫము, శకటరేఫము (ర,ఱ లు)
ఛందస్సు - తేటగీత
దీనికి నా రెండు పూరణములు:






(1)
తపసి వాల్మీకి లిఖిత సత్కావ్యనేత,
సీతతో, లక్ష్మణునితో వసింప నడవి,
దశముఖుఁడు సీతఁ గొంపోవ, స్పశముఁ జేసి,
వాని వధియించి, చెలిఁగొని, పావనుఁడయె!



(2)
పుట్టపుట్టువు కన్నట్టి పొత్తపుఁ బతి
జన్నమునుఁ గాచి, విల్తున్మి, జానకి మను
వాడి, వనికేగి, యిల్లాలి బందెవట్టు
వాని నొంచి, గేహినిఁ గొని, పావనుఁడయె!




శనివారం, ఏప్రిల్ 11, 2015

సమస్య: తులువను దండించువాఁడు దుర్మార్గుఁ డగున్

తేది: నవంబర్ 12, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము




(1)
ౘలమరియు బాలిశుండగు
తులువను సరిచేయఁగాను దొలియత్నమునున్
బలిమినిఁ బూనఁగ, నెట్టులఁ
దులువను దండించువాఁడు దుర్మార్గుఁ డగున్?


(2)
కలహించి కుత్సితముచే
విలువలఁ గోల్పోయి మెలఁగు పిశునుని చేష్టన్
నిలువరము చేయఁగను నా
తులువను దండించు! వాఁడు దుర్మార్గుఁ డగున్!!


శుక్రవారం, ఏప్రిల్ 10, 2015

దత్తపది: శవము-పాడె-కాడు-చితి...జన్మదిన వర్ణన...నచ్చిన పద్యం...

తేది: నవంబర్ 11, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన
శవము - పాడె - కాడు - చితి
పదాలను ఉపయోగిస్తూ
జన్మదినోత్సవాన్ని వర్ణిస్తూ
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన తేటగీతి పద్యములు





(1)
కేశవ మురజి న్మాధవ కృష్ణ చక్రి
యనుచు హరిభక్తి జలధిలో మునిఁగి పాడె
నాదు చెలికాఁడు జన్మదినమ్మునాఁడు
మురిసి హరిఁజూచి తిరునామమును ధరించి!

(2)
కేశవ! ముకుంద! మధురిపు! శ్రీశ! చక్రి!
నన్నుఁ గాపాడెదవటంచు సన్నుతింతు!
కరుణ తొలుకాడునటుల నన్ గాంచ, విమల
మతిని జన్మదినమున నెంచితిర నిన్ను!!


గురువారం, ఏప్రిల్ 09, 2015

సమస్య: గాడిద పాదములఁ బట్టె గజకర్ణుఁ డహో

తేది: నవంబర్ 10, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:





వేడి గజకర్ణనాముఁడు
తోడెవ్వఁడు లేకయె సనె దొంగిలు కొఱకై!
గాడిద యఱవఁగ; "వ"ద్దని,
గాడిద పాదములఁ బట్టె గజకర్ణుఁ డహో!!




బుధవారం, ఏప్రిల్ 08, 2015

న్యస్తాక్షరి: పాదాద్యక్షరాలుగా రా-మా-రా-వు...రావణుని పాత్రలో ఎన్.టి.రామారావు వర్ణన...ఆటవెలఁది పద్యం...

తేదిః నవంబర్ 09, 2014 నాటి శంకరాభరణంలోని న్యస్తాక్షరి శీర్షికన
ఆటవెలఁది పద్యమందలి నాలుగు పాదాలలో
మొదటి అక్షరాలుగా వరుసగా ‘రా - మా - రా - వు’ ఉండాలని,
అంశం- రావణుని పాత్రలో ఎన్.టి.రామారావును వర్ణించాలనగా
నేను వ్రాసిన రెండు పూరణములు





(1)
రావణుండు యన్‍టి రాముండు నటనతో
మా మనమ్ములందు మహితుఁ డాయె!
రాముఁడైన నతఁడె! రావణుం డతఁడె! భా
వుకుఁ డెవం డతనినిఁ బోలువాఁడు?



(2)
రావణుండ శివుఁడ రాముఁడ కర్ణుఁడ
మాధవుండ భీష్మ మఱియుఁ గృష్ణ
రాయఁడవన నీవెరా! నటరత్నుఁడ
వు గదర! ఘనుఁడవగు ముఖ్యమంత్రి!!



మంగళవారం, ఏప్రిల్ 07, 2015

సమస్య: హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా

తేది: నవంబర్ 08, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:





స్మరణ సుకీర్తన శ్రవణ సఖ్య నివేదన సేవ నార్చనా
పరతను దాసులై యెపుడు వందనమున్ దగఁ జేయుచున్ హరిన్
నిరతము హృత్సరోజమున నిల్పక, నిత్యము హృత్స్థయౌ మనో
హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా!




సోమవారం, ఏప్రిల్ 06, 2015

నిషిద్ధాక్షరి: పవర్గాక్షర నిషేధం...పద్మవ్యూహంలో అభిమన్యుఁడు...నచ్చిన ఛందం...

తేది: నవంబర్ 07, 2014 నాటి శంకరాభరణంలోని నిషిద్ధాక్షరి శీర్షికన ఈయబడిన
అంశం- పద్మవ్యూహంలో అభిమన్యుఁడు
నిషిద్ధాక్షరాలు - పవర్గాక్షరాలు (ప,ఫ,బ,భ,మ)
ఛందస్సు - నచ్చిన ఛందంలో
పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన శార్దూలవిక్రీడిత వృత్తము




(కౌరవులు పద్మవ్య్హూహమం దభిమన్యుని కుటిల తంత్రముతో సంహరించిన ఘటనకు విస్మయము చెందిన పాండవసేన మనోవేదన)



శార్దూలవిక్రీడితము:
"చక్రవ్యూహ సువేశితుం దతధనుర్జ్యాసక్త నారాచ ధా
రాక్రాంతాంచిత శత్రు నిర్జిత యతద్ద్రాఘిష్ఠ సన్నద్ధ యు
ద్ధ క్రీడావిహరద్ఘనవ్రతయుతుం దచ్ఛౌరి స్వస్రీయుఁడౌ
నా క్రీడిద్రుహుఁ గౌరవుల్ గుటిల తంత్రానన్విఘాతింతురా?"






ఆదివారం, ఏప్రిల్ 05, 2015

సమస్య: పున్నమి వెన్నెలయె వేఁడిఁ బుట్టించె శివా

తేది:  నవంబర్ 06, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణములు:



మిన్నగ నుండఁగ నెంచిన
నిన్నటి తెలగాణ రాష్ట్ర నిశ్చిత బడ్జె
ట్టెన్నఁగ నాయకులకు నీ
పున్నమి వెన్నెలయె వేఁడిఁ బుట్టించె శివా! (1)




(ఒక యువకుని స్వగతము)

"అన్నుల మిన్నల హొయళులఁ
గన్నులఁ జూడంగ, మదినిఁ గాంక్షలు హెచ్చెన్!
మిన్నంటె విరహతాపము!!
పున్నమి వెన్నెలయె వేఁడిఁ బుట్టించె శివా!!!" (2)




మూఁడవ పూరణము:

ౙన్నపుగొంగవు! నీకున్
గన్నయె నగ్గియు! మహేశ కరుణించుము! నీ
మిన్నంటు రూక్షవీక్షకుఁ
బున్నమి వెన్నెలయె వేఁడిఁ బుట్టించె శివా!! (3)


మంగళవారం, మార్చి 31, 2015

దత్తపది: అసి-కసి-నుసి-మసి...కార్తికపౌర్ణమి వర్ణన...నచ్చిన ఛందస్సులో...

తేది: నవంబర్ 05, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన
అసి - కసి - నుసి - మసి
పదాలను ఉపయోగిస్తూ
కార్తిక పూర్ణిమను గురించి
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన కందపద్యం



కం.
అసియాడు మేఘములఁ గని
కసి
మసఁగుచుఁ జంద్రుఁ డెలమిఁ గార్తికమునఁ దా
ను సి
గపువయి హరుని దయను
మసి
చేసెను జీఁకటులను మహిఁ బౌర్ణమినిన్!


ఆదివారం, మార్చి 29, 2015

సమస్య: వార్ధకమ్మునఁ గావలెఁ బడుచు భార్య

తేది: నవంబర్ 04, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:



("ఈ నవయౌవనంపు హేమంతమ్మునను నాకుఁ బెండ్లి యింకనుం గాలేదు గదా!"యని యొక యువకుఁడు తపించుచున్న సందర్భము)



ఇరువదొక్కేఁడు నేగె! నభీప్సితమ్ముఁ
దీరదాయె! నా పెండ్లి కా దింత దాఁక!
రేఁగె మదిఁ గోర్కె! యీ పంచ త్రింశతియు న
వార్ధకమ్మునఁ గావలెఁ బడుచు భార్య!


(పంచత్రింశతియు-నవ = 35 + 9 = 44 ఏండ్లు;
అర్ధకమ్మున = సగము వయస్సున = 44 ఏండ్లలో సగము = 22 ఏండ్ల వయస్సున)



శనివారం, మార్చి 07, 2015

న్యస్తాక్షరి: ప్రతిపాదాద్యక్షరాలుగా వి-శ్వ-రూ-ప...ఆటవెలఁది పద్యంలో...కురుసభలో శ్రీకృష్ణ విశ్వరూప ప్రదర్శనం...

తేది: నవంబర్ 03, 2014 నాటి శంకరాభరణంలోని న్యస్తాక్షరి శీర్షికన ఈయబడిన
అంశం- కురుసభలో కృష్ణుఁడు విశ్వరూపాన్ని ప్రదర్శించుట
ఛందస్సు- ఆటవెలఁది
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలుగా వరుసగా
‘వి - శ్వ - రూ - ప’ అని ఉండాలనగా
నేను వ్రాసిన పద్యము:




వినయ మెసఁగఁ జేరి వృష్ణియు సరగున
శ్వశురు సభను గురులు బాంధవులకు
రూఢిఁ దనదు విశ్వరూపమ్మునుం జూపి
రమపదముఁ జేరు పథముఁ దెలిపె!




శుక్రవారం, మార్చి 06, 2015

సమస్య: దీపముఁ బెట్టంగఁ దగును తెలవాఱంగన్

తేది: నవంబర్ 02, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:






చూపరి సూర్యుఁడు జనులకుఁ
దాపపుఁ దిమిరమ్ముఁ బాప ధవళిత కరుఁడై
తూపగు నిరులకు నిఁక త
ద్దీపముఁ బెట్టంగఁ దగును తెలవాఱంగన్!


బుధవారం, ఫిబ్రవరి 25, 2015

నిషిద్ధాక్షరి: కవర్గాక్షర నిషేధం...కాకాసురవృత్తాంతం...నచ్చిన ఛందస్సులో...

తేది: నవంబర్ 01, 2014 నాటి శంకరాభరణంలోని
నిషిద్ధాక్షరి శీర్షికన
కవర్గాక్షరాలు లేకుండా
కాకాసుర వృత్తాంతాన్ని గురించి
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన తేటగీతిమాలిక...


దుష్ట వాయస రూప దైత్యుండు మైథి
లిని వ్యధితఁ జేయ, రాముండు వ్రీతి దర్భఁ
జేత నంది బ్రహ్మాస్త్రముం బూత మంత్ర
సహితనున్ విడువ, నదియు సాల్వుఁ జంప
వెంటఁబడఁ బరువెత్తుచు భీతిఁ ద్రిభువ
నమ్ములను సంచరించుచు "నన్నుఁ బ్రోవు"
మంచుఁ బిలువ, నెవ్వండు నోమను, దరిఁ జనఁ
దెంపు సేయనుఁ బుయిలోడఁ, దెలిసి వాఁడు
మఱలి శ్రీరాము "శరణ మి"మ్మనుచు వేడ,
"దానిని మఱలింపను నసాధ్య"మ్మటంచు,
నతని దేహాంశ మిచ్చిన నదియు శాంతిఁ
బొందునన, నేత్రమును నిచ్చి, పోయినాఁడు,
తనదు తప్పును మన్నింపు మనుచు వేడి!!

(ఇది కాకాసురవృత్తాంతము)

శుభం భూయాత్


మంగళవారం, ఫిబ్రవరి 24, 2015

సమస్య: రాముండిటు రమ్మటంచు రాధనుఁ బిలిచెన్

తేది: అక్టోబర్ 31, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము.



సోమనిభ వక్త్ర వల్లవ
భామలతో రాసకేళి వదలి వినీల
శ్యాముఁడు రాధాహృదయా
రాముం "డిటు ర" మ్మటంచు, రాధనుఁ బిలిచెన్!


గురువారం, డిసెంబర్ 25, 2014

దత్తపది: యేసు-చర్చి-సిలువ-మేరీ...మతసామరస్యం...నచ్చిన పద్యం...

క్రైస్తవ సోదరులందరికీ
క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు!

తేది: డిసెంబర్ 25, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
యేసు - చర్చి - సిలువ - మేరీ

పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
మతసామరస్యం గురించి
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను రాసిన తేటగీతి పద్యం:





సమతయే సుఖశాంతులు మమత లొసఁగు
ననియ చర్చిలు మతపెద్దలంద ఱిటులె
యెపుడు నడువ, భాసిలు వక్తలే యగుదురు!
పర మత జన మే రీఢయు ౙరుప దెపుడు!!
(చర్చిలు=చర్చింౘు, రీఢ=అవమానము, తిరస్కారము)



బుధవారం, డిసెంబర్ 24, 2014

దత్తపది: తీపి - కారము - పులుపు - చేదు....భారతార్థంలో...నచ్చిన ఛందం...

తేది: అక్టోబర్ 30, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
తీపి - కారము - పులుపు - చేదు
పదాలను ఉపయోగిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన తేటగీతి పద్యము:



(ఉపపాండవులనుం జంపిన యశ్వత్థామనుఁ జంపెదనని యర్జునుఁడు శపథముఁ జేయు సందర్భము)

"ౘంపితీపిల్లలను నీవు సంతసమునఁ;
గోరి యుపపాండవుల కపకారము నిడి
నట్టి పాపులు పుడమి నుండంగఁ ౙనదు!
త్రుటిని నిను నాదు శరముచేఁ దునిమివైతు!!"



సోమవారం, డిసెంబర్ 08, 2014

న్యస్తాక్షరి: త్యా-గ-రా-జు...శాంతము లేక సౌఖ్యము లేదు...ఆటవెలదిపద్యంలో...

తేది: అక్టోబర్ 28, 2014 నాటి శంకరాభరణంలోని న్యస్తాక్షరి శీర్షికన ఈయబడిన
అంశం- శాంతము లేక సౌఖ్యము లేదు
ఛందస్సు- ఆటవెలఁది
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలుగా వరుసగా ‘త్యా - - రా - జు’ ఉండాలనగా
నేను రాసిన ఆటవెలది



త్యాగరాౙు సెప్పె  నానాఁడు "శాంతమ్ముఁ
నక సౌఖ్య మెౘటఁ  గన"రటంౘు;
రామునకును నిదె ని  రంతర వినతి యౌఁ
ౙుమ్ము కనఁగ లోక  సూత్ర మగుౘు!