మ.
జనియించెన్ జనగామ మండల ఖిలాషాపూరు గ్రామమ్మునన్
సనయుండున్ జన మాన్య రూపుఁడగుచున్ సర్వాయిపాపన్న గౌడ్
వినయంబొప్పఁగ దుష్టపాలకుల దుర్భేద్యంపు దుర్మార్గముం
దునుమాడెన్ ఘన సత్యకోప బలిమిన్ దోర్దండ శౌర్యుండునై!
మ.కో.
చిన్ననాఁటనె నాయకత్వపు శ్రేష్ఠ లక్షణ యుక్తుఁడై,
మన్ననల్ గొనుచున్, సఖీజన మండనుండయి, వెల్గి, పా
పన్న జాగిరుదార్ నవాబుల పన్నులన్ నిరసించి, యా
పన్నులం దగఁ గావ నిల్చెను భవ్యభద్రనగాభుఁడై!
ఉ.
పేదల పెన్నిధానమయి, ప్రీతి జనమ్ములఁ బ్రోచుచున్, సదా
మోద సురూపుఁడై, ప్రభుత మూర్ఖపుఁ బాలన ధిక్కరించుచున్;
ఖేదము రూపుమాపఁగ సుకీర్తితుఁడై, జనసైన్యశిక్షణా
మోదపరుండునై యెదిగెఁ బోరున శాత్రవ భంజకుండుగా!
చం.
జడియక రాత్రులందుఁ జని, జాగిరుదారులఁ గొల్లగొట్టి, తాఁ
దడయక పేదవారలకు దానినిఁ బంచ, గ్రహించి, యా దొరల్
పొడఁ గని, బంది సేయఁగను, పొంగుచు బంధిత మిత్రవర్గమున్
విడువక, వారి శృంఖలల ఫెళ్ళునఁ ద్రెంచియుఁ బాపఁ డాదటం,
బొడమె హృదంతరాళములఁ బూజితుఁడై! వినుతింతుఁ దద్ఘనున్!
🙏స్వస్తి🙏
✍️రచన:
"మధురకవి" గుండు మధుసూదన్,
వరంగల్లు.