సోమవారం, జులై 18, 2016

సహజకవి బమ్మెర పోతన


[పోతన 534వ జయంత్యుత్సవాల సందర్భంగా బమ్మెర గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారు ఏర్పాటుచేసిన కవిసమ్మేళనంలో నేను రచించి, పఠించిన పద్యములు]


కం.
శ్రీరామాజ్ఞప్తకథా
భార! భవహరాప్త కృత్య! భాగవతాఖ్యో
ద్ధారాంచిత శబ్దాలం
కార యుత పురాణకర్త! కవి పోతన్నా! 1


సీ.
కాకతీయుల యోరుగల్లున విలసిల్లు బమ్మెర గ్రామానఁ బ్రభవమంది;
పిన్ననాఁటనె రంగ వీక్షిత భాగవతమును వ్రాసెదనని తల్లికి నని;
జనని యాశీర్వచ స్సత్త్వమ్ముచే వెల్గి, సహజకవిత్వ విశారదుఁడయి;
భాగవతముఁ దెల్గువారల కిడఁగాను తెనిఁగింప సమకట్టి, తేజమెసఁగ,
గీ.
హరికథా మహత్త్వవిశిష్ట చరితములను భక్తిభావసమంచితాసక్తి మెఱయ,
ద్వాదశస్కంధయుక్త సత్ప్రకర వర సమేతను లిఖించె బమ్మెర పోతసుకవి! 2


ఉ.
కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేడ్చునట్టి యా
హాటకగర్భురాణికిని "నాఁకఁటికిం గొనిపోయి యల్ల క
ర్ణాట కిరాట కీచకుల కమ్మ" నటంచుఁ ద్రిశుద్ధిగన్ వెసన్
మాట యొసంగినాఁడవయ మాన్యుఁడ! బమ్మెర పోత సత్కవీ! 3


మ.
భళిరా సత్కవి పోతరా డ్విదిత శబ్దవ్యాప్త సమ్మోహకా!
గళితాఘాద్రి మహాంధ్రభాగవత నిర్ఘాతా! ప్రసిద్ధాంశ స
న్మిళితానేక సమస్త పుణ్య సుకథా నిశ్శ్రేయస ప్రాప్త! ని
ర్దళితోత్కృష్టతరానయప్రకర! సర్వామోద సంధాయకా! 4


చం.
నవవిధ భక్తి మార్గముల నవ్యవిధమ్మున వ్రాసినావు భా
గవత పురాణమున్ విమల కమ్రసుశబ్దయుతార్థ పద్య సం
రవముల శింజినుల్ మొరయ రమ్యతరాంచిత ముక్తి యుక్తమై
శివకర సత్య సుందర వశీకరణమ్ముగ భక్తపోతనా! 5


స్వస్తి


4 కామెంట్‌లు:



  1. మధుసూధన వారు !

    నమో నమః !


    మధుసూధనకవి రాయా !
    సుధయొప్పెను పోతన కవి సుమధుర పదముల్ !
    కుదిరెను చక్కగ మీ పద
    మధురిమ నతని సరిజోదు మన్నన నిచ్చెన్ !

    జిలేబి"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలండీ జిలేబీ గారూ!

      మీ యాదరపూర్వకమగు
      శ్రేయాంచిత పద్యము ననుఁ బ్రీతునిఁ జేసెన్!
      మీ యాప్యాయత కే నే
      మీయను? పద్యమ్ముఁ దప్ప! యివె ధన్యోక్తుల్!

      తొలగించండి
  2. పోతనామాత్యు నున్నతి బొగిడి పొగిడి
    మధుర కవి గారి కాంక్ష యేమాత్రమున్ను
    దీరినటు గాను పించదు , వారి ఘనత
    నెంత కీర్యించినను గాని సుంత యగును .

    రిప్లయితొలగించండి