ఆదివారం, అక్టోబర్ 25, 2015

సమస్య: ఒకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్!

తేది: ఆగస్టు 31, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా నాలుగు పూరణములు

నా మొదటి పూరణము:





(ఒకానొకప్పుడు మహిషాసుర సంహారమునకై త్ర్యంబా సహిత సురనారీ తేజము దేవిగా మారఁగా, సూర్యచంద్రు లామె నేత్రద్వయముగఁ బ్రకాశించిన సందర్భము)



సకల సుర వధూ తేజ
స్సకలాసుర హంత్రి దేవి చక్షుద్వితయ
ప్రకటీకృత దీప్తులుగా
నొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్!



************************************************
నా రెండవ పూరణము:



(శివుఁడు త్రిపురాసుర సంహారముం జేయుటకుఁ బూనుకొనఁగా భూమి రథముగాను, సూర్యచంద్రులు రథచక్రములుగాను, వేదము లశ్వములుగాను, బ్రహ్మ సారథిగాను, నొప్పిన సందర్భము)




ప్రకట త్రిపురాసుర హిం

సకునకు సారథిగ విధియు, స్యందనమౌ భూ
మికిఁ జక్రద్వయముగఁ దా
మొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్!



***********************************************
నా మూఁడవ పూరణము:


(దేవదానవ యుద్ధమందు రాక్షసులు దేవతల నోడించి యమరావతిని స్వాధీనము జేసికొనఁగ సూర్యచంద్రులతోఁ బాటుగ దేవతలందఱును విష్ణువును శరణు కోరి పలికిన సందర్భము)




వికలాత్ములైన సురలా
యకలంకుని హరినిఁ జేరి యసురుల కృతమున్
సకల మెఱిఁగించుచుండఁగ
నొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్!



*************************************************
నా నాలుగవ పూరణము:




(హిమవంతుఁడు శివపార్వతుల కళ్యాణమునకు దేవతల నాహ్వానింపఁగ సూర్యచంద్రులును వచ్చిన వైనము)




సకలేశుఁడు హరునకుఁ బు
త్రిక గిరిజను నిచ్చి పెండిలిం దగఁ జేయన్
సకల సురలఁ బిలువఁగఁ, దా

మొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్!



************************************************




-:శుభం భూయాత్:-



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి