మంగళవారం, అక్టోబర్ 22, 2013

పద్య రచన: నైరృతుని పూర్వ జన్మ కథ


తేది: సెప్టెంబర్ 18, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన నిరృతి చిత్రమునకు నేను రాసిన పద్యములు...

ఆ.వె.
వెలసె నిరృతుఁడు మును  బింగాక్షుఁ డను బోయ
యయి యహింసఁ బూని యటవి నుండె!
నతని పిన్న తండ్రి యట బాటసారులఁ
గొల్లకొట్టి ధనము కూడఁబెట్టు!(1)


కం.
ఒకనాఁ డతండు నది పా
యక తెరువరిఁ గొల్లకొట్టె ననుచర యుతుఁడై;
"యకటా! ననుఁ గాపాడుఁడు;
నొకఁడనుఁ గాఁ జూచి వీర లొక్కట నన్నున్ (2)


తే.గీ.
దోచుకొనఁ జూచుచుండిరి; తొందరఁగను
నన్నుఁ గాపాడుఁ"డని నంత, నతని కడకుఁ
జేరి, పింగాక్షుఁ డనియె "నో చిన్నతండ్రి!
బాటసారిని విడు" మని వలుకఁ గానె;(3)


కం.
కోపమున, సఖులుఁ జూడఁగఁ
బాపమ్మని యెంచకుండ బాలునిఁ జంపెన్!
శాపమొ, యనుగ్రహమ్మో?
యా పసివాఁ డట్లు చచ్చి, యల నిరృతుఁ డయెన్!!(4)


తే.గీ.
పరుల కుపకారమునుఁ జేసి స్వర్గతుఁడయి,
పుణ్య వశమున నిరృతిగఁ బుట్టి, యష్ట
దిక్పతులలో నొకండయి, స్థిర యశుఁడయెఁ!
బరుల కుపకారమునుఁ జేయ, భాగ్య మిదియ!!(5)


                -: శుభం భూయాత్ :-

4 కామెంట్‌లు: